WFTW Body: 

ఒకరినొకరు క్షమించుట గురించి చూద్దాం. తన్నుతాను ఉపేక్షించుకున్న వాడెవడూ ఎప్పుడూ ఎవరిమీద నిష్టూరమును కాని, కక్షను కాని ఉంచుకొనడు లేక క్షమించలేకుండా ఉండడు. 'స్వయం' అనేది ఎక్కడైతే ఇంకా హృదయాలలో సింహాసనముపై ఉంటుందో అక్కడ పగ ఉంటుంది.

తన యజమాని ద్వారా చాలా క్షమించబడిన ఒక దాసుడు, అతనికి కొద్దిగా బాకీ ఉన్న వేరొక దాసుని అతడు క్షమించలేని ఉపమానమును ఒకసారి యేసుప్రభువు చెప్పారు. అందులో ఆ యజమానుడు జరిగినది విని కనికరము లేని ఆ దాసుని శిక్షించుటకు బాధించు వారికి అప్పగించెను. అదేవిధంగా, 'మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును' అని యేసుప్రభువు చెప్పెను (మత్తయి 18:35). బాధించువారికి శిక్షింపబడుటకు అప్పగించుట అనేది ఒకరు ఏవిధముగా అర్థం చేసుకున్ననూ, తమ తోటి విశ్వాసుల యెడల క్షమింపలేని వైఖరి కలిగియుండుట లేక క్షమింపలేని ఆత్మ కలిగి ఉండు వారి విషయములో ఆ విధంగా తప్పక జరుగునని యేసుప్రభువు చెప్పారు. క్షమించుట అనేది హృదయపూర్వకముగా ఉండవలెనన్న విషయమును యేసుప్రభువు నొక్కి చెప్పెనని గమనించండి. వేరే విధముగా చెప్పాలంటే అది తప్పక హృదయపూర్వకముగా ఉండవలెను. అంతే తప్ప బాహ్యమైనటువంటి మొక్కుబడిగా ఉండకూడదు. నీ హృదయములో నిష్టూరమును ఉంచుకొని ఒకడిని క్షమించానని చెప్పుట అర్థము లేనిది.

మనం దేవుని ప్రేమయొక్క నియమమును మీరినట్లయితే, మనం క్రీస్తు శరీరం యొక్క పనికి ఆటంకముగా ఉందుము. అయితే అంత మాత్రమే కాదు. మనకు మనం కూడా హాని చేసుకొందుము. డా|| యస్.ఐ. మెక్‍మిలన్, "నన్ ఆఫ్ దీజ్ డిసీజెస్" అను పుస్తకములో ఈ విధముగా చెప్పాడు, "నేను ఒకనిని ద్వేషించుట ప్రారంభించగానే నేను అతనికి బానిసనవుదును. అతడు నా ఆలోచనలను కూడా అదుపు చేస్తూ ఉండినందున నేను నా పనియందు ఆనందించలేను. ఒత్తిడికి సంబంధించిన ఎన్నో హార్మోన్లను నా కోపం నా శరీరములో ఉత్పత్తి చేయును గనుక కొద్ది గంటలు పని చేసిన వెంటనే నేను అలసిపోవుదును. నేను ఇంతకు మునుపు సంతోషముతో చేయు పని ఇప్పుడు చాకిరీగా మారినది. చివరకు సెలవులు కూడా సంతోషాన్ని ఇచ్చుట మానివేసాయి. నేను ద్వేషించే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళినను నన్ను వెంటాడుతున్నాడు. నా మనస్సు అతడి క్రూరమైన పట్టునుండి తప్పించుకొనలేక పోవుచుండెను".

దాచబడిన కక్షలు, నిష్టురము ఈనాడు లోకమంతా అనేకమంది క్రైస్తవుల మరియు క్రైస్తవ పనివారి యొక్క సమర్థతను మరియు శారీరక ఆరోగ్యమును కూడా పాడుచేస్తున్నాయి.

సహవాసమును పునరుద్ధరించుటలో మనమే మొదట అడుగు వేయవలెనని యేసుప్రభువు బోధించారు, చివరకు ఒక సహోదరుడు మనం అతడిని బాధపరచామని (సరిగ్గా లేక తప్పుగా) అనుకొనినప్పటికీ.

"నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచి పెట్టి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము" (మత్తయి 5:23,24).

అదే విధముగా "మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును" (మార్కు 11:25) అని యేసుప్రభువు చెప్పెను.

అన్ని పరిస్థితులలో మనలను మనం ఉపేక్షించుకొని, మన గర్వమును మనం అణగద్రొక్కుకొని, ఎక్కడైతే సహవాసం విరిగిపోయెనో అక్కడ తిరిగి సహవాసం కట్టుటకు "రెండవ మైలు" వెళ్ళుటకు యేసుప్రభువు మనలను పిలుచుచున్నాడు. కొన్ని సమయాలలో, తిరిగి సంబంధము ఏర్పరచుకొను విషయములో మనమెంత ప్రయత్నించినను, ఒక సహోదరుడు కఠినమైన, క్షమించలేనటువంటి వైఖరిని కలిగియుండవచ్చును. కాని మన ప్రయత్నం మనం చేసినప్పుడు దేవుని యెదుట మన బాధ్యతను నెరవేర్చినట్లే.

మనకు మరియు ఆయన శరీరములో ఏ ఒక్క సభ్యునికి మధ్య సమస్యలు పరిష్కరింపబడకుండా ఉండి, మనం తిరిగి సంబంధము నెలకొల్పబడుటకు ప్రయత్నము చేయకుండా ఉండినట్లయితే, దేవుడు మనయొక్క ఆరాధనను, సేవను, ఆయనకు అర్పించే దేనిని అంగీకరించడు అని యేసుప్రభువు మాటలు స్పష్టపరచుచున్నవి. ఎంతమంది క్రైస్తవులు యేసుప్రభువు యొక్క మాటలను తీవ్రముగా తీసుకొనుచున్నారని నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోవుదును. అనేకులు దేవుని ఆజ్ఞలను తేలికగా తీసుకొందురు. తద్వారా క్రీస్తు శరీరములోనికి మరణమును తీసుకువచ్చుదురు.

క్షమించుటకు ఉండిన మరొక కారణము "సాతాను చేత మోసపోకుండా ఉండటం" అని పౌలు చెప్పాడు (2కొరింథీ 2:11).