WFTW Body: 

దేవుడు కనికర(కరుణా) సంపన్నుడు (ఎఫెసీ 2:4). మనం మార్పుచెందినప్పుడు ఎదుర్కొన్న మొట్టమొదటి దైవిక స్వభావం ఆయన కనికరం. మనము కూడా దైవిక స్వభావంలో పాలుపొందినట్లయితే, ఇతరులు మనల్ని ఎదుర్కొన్నప్పుడు దానినే మొదటిగా గుర్తిస్తారు.

నరకంలో మరియు మన శరీరంలో కనికరం లేదు. సాధారణంగా మన శరీరం ఇతరులపట్ల కఠినంగా ఉంటుంది. అలా కఠినంగా ఉండటం దైవికమైన తీవ్రతలో ఒక భాగమని మనల్ని మనం సులువుగా మోసం చేసుకోవచ్చు. పాపం చేసే మోసం అలాంటిది.

ఇప్పుడు మనం పరలోకంలోకి చూడగలిగినట్లయితే, దేవుడు ఇతరులను నిరంతరం క్షమిస్తున్నాడని కనుగొంటాము. ఈ లోకంలోని ప్రతి మూలనుండి విశ్వాసులు మరియు అవిశ్వాసులు వారి పాపములు, ఓటముల నిమిత్తం మొరపెట్టువారందరిని క్షమిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడు -రోజులో 24 గంటలు క్షమిస్తునే ఉన్నాడు. కొందరు 1000వ సారి చేసిన పాపానికి క్షమాపణ అడగవచ్చు. అయినప్పటికీ ఆయన క్షమిస్తాడు, ఎందుకంటే అది ఆయన స్వభావం. అదేవిధంగా మనం కూడా ఇతరులను క్షమించాలని యేసుప్రభువు చెప్పారు (మత్తయి 18:35).

మన సహోదరులను రోజులో ఏడుసార్లు క్షమించాలని యేసుప్రభువు చెప్పారు (లూకా 17:4). ఒక రోజు 12 గంటలుగా పరిగణించబడింది. దీని అర్థం ఏమిటంటే, నీ సహోదరుడు ఒక ఉదయం 6 గంటలకు నీకు వ్యతిరేకంగా పాపం చేసి, 7 గంటలకు నిన్ను క్షమించమని అడిగినట్లయితే. నీవు అతణ్ణి క్షమించాలి. అదే పాపాన్ని 8 గంటలకు నీకు వ్యతిరేకంగా చేసి, 9 గంటలకు నిన్ను క్షమించమని అడిగినట్లయితే. నీవు అతణ్ణి మరల క్షమించాలి. 10 గంటలకు మూడవసారి అదే పాపాన్ని చేసి, 11 గంటలకు నిన్ను క్షమించమని అడిగినట్లయితే. నీవు అతణ్ణి క్షమించాలి. అదే పాపాన్ని మరల 12, 2, 4 గంటలకు చేసి, ప్రతిసారి ఒక గంట తర్వాత నీదగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినట్లయితే, ఈ రోజు అతణ్ణి ఎన్నిసార్లు క్షమించానన్నది లెక్కించుకోకుండా నీవు అతణ్ణి క్షమించాలి. అక్షరానుసారంగా ఆలోచించే కొందరు, ఏడుసార్ల వరకు లెక్కించమని యేసుప్రభువు చెప్పెనని చెప్పుదురు. అదే విషయాన్ని పేతురు ఒకసారి యేసుప్రభువుకు చెప్పాడు, అప్పుడు యేసుప్రభువు 490సార్ల వరకు తన సహోదరుని క్షమించమని చెప్పారు (మత్తయి 18:21,22).

దేవుని స్వభావం ఆవిధంగానే ఉన్నది. కొత్తనిబంధనలో శుభవార్త ఏమిటంటే, మనం ఆ స్వభావంలో పాలుపొందవచ్చు. దానిలో పాలుపొందటంకంటే, దాని గూర్చి మాట్లాడటం ఎంతో సులువు. అది మనందరికి అనుభవపూర్వకంగా తెలుసు. కాని "దేవుని రాజ్యం మాటలతో కాక శక్తితోనే ఉన్నది" (1కొరింథీ 4:20).

మన ద్వారా క్రీస్తు మహిమ, అనేక అద్భుత సత్యాలను, సిద్ధాంతాలను నోటితో చెప్పుట ద్వారా కాక, దేవుని ప్రేమను ఇతరులకు ప్రత్యక్షపరచటం ద్వారా ప్రజ్వరిల్లుతుంది.