WFTW Body: 

యేసు శిష్యుడు మనుష్యులకు లేదా పరిస్థితులకు భయపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

నా ఇంటి ముందు గదిలో పెద్ద అక్షరాలతో వ్రేలాడుతూ ఉన్న ఒక వాక్యము ఉంది, "నీవు దేవునికి భయపడితే, ఇక దేనికి భయపడనవసరము లేదు". ఇది యెషయా 8:12,13 వాక్యభాగానికి ఆంగ్ల లివింగ్‌ బైబిలు తర్జుమా. గత 25 సంవత్సరాలుగా ఆ వాక్యము నాకు గొప్ప సహాయముగా ఉంది.

భయము విషయములో నేను ప్రభువు దగ్గర నేర్చుకున్న కొన్ని సత్యాలను మీతో పంచుకుంటాను.

మొట్టమొదటిదిగా, సాతాను ప్రధాన ఆయుధాల్లో "భయం" అనేది ఒకటి అని నేర్చుకున్నాను.

రెండవదిగా, ఆయా సమయాల్లో నాకు భయం కలిగినప్పుడల్లా నేను ఖండింపబడినట్టుగా భావించనవసరం లేదని నేర్చుకున్నాను, ఎందుకంటే నేను ఇంకా శరీరములోనే జీవిస్తున్నాను. ఈ విషయంలో మనము వాస్తవికంగానూ, యదార్థతతోనూ ఉండాలి. ఆయా సమయాల్లో "తన లోపల భయములు" కలిగినట్లు అపొస్తలుడైన పౌలు ఎంతో యదార్థముగా ఒప్పుకున్నాడు (2 కొరింథీ 7:5).

మూడవదిగా, (ఇది అతి ముఖ్యమైనది) నాలో భయములన్నప్పటికీ వాటి ఆధారంగా నేనెప్పుడూ నిర్ణయము తీసుకోకూడదని నేర్చుకున్నాను. నా నిర్ణయాలు ఎల్లప్పుడూ "దేవుని యందలి విశ్వాసము"పై ఆధారపడి ఉండాలి - ఇది భయానికి సరిగ్గా వ్యతిరేకము. ఇప్పటికి, ఎన్నో సంవత్సరాల నుండి నేను ఆ విధంగా బ్రతుకుటకు కోరుకున్నాను. దేవుడు ఎంతగానో సహాయము చేసి నన్ను ప్రోత్సహించాడు.

"భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి" అని యేసు ప్రభువు పదే పదే ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది.

"పాపము చేయకుము, పాపము చేయకుము, పాపము చేయకుము" అంటూ నొక్కిచెప్పిన మరో నూతన నిబంధన పదమువంటి ప్రాధాన్యత దీనికి ఉంది.

పాపమునకు, భయమునకు యేసు ఎల్లప్పుడూ వ్యతిరేకియే. దేవునికి తప్ప మరెవ్వరికీ భయపడవద్దని ఆయన మనకు చెప్పాడు (మత్తయి 10:28). ఇది మనము నేర్చుకోవలసిన అతి ముఖ్యపాఠము, ఎందుకంటే ఒక యేసుశిష్యుడు ఎన్నడూ భయమును బట్టి ఏ నిర్ణయమూ తీసుకొనకూడదు.

అనేక సంవత్సరాలుగా మా ఇంట్లో నా గదిలో వ్రేలాడుతున్న మరో వాక్యము గలతీ 1:10 "నేను మనుషులను సంతోష పెట్టగోరుతున్నానా, అయితే నేను క్రీస్తు పరిచారకుడుగా ఉండనేరను".

నీవు మనుష్యులను సంతోష పెట్టాలని ఆశిస్తే ఎన్నటికీ ప్రభువు సేవకునిగా ఉండలేవు. నేను చెబుతున్నాను, మనుష్యులను సంతోష పెట్టుటకు చూచుట మానుకోవడం అంత సులువు కాదు.

ఎవరైనా ఒక వ్యక్తిని మెప్పించకపోతే అతడు నీకు హాని చేస్తాడేమోననే భయం నీలో ఉన్నప్పుడు నీవు అతన్ని సంతోషపెట్టుటకు ఎల్లప్పుడు ప్రయత్నిస్తావు. అలాంటప్పుడు నీవు ఎన్నడూ దేవుని సేవకుడివి కాలేవు. భయపడి ఎప్పుడైనా ఏదైనా నీవు చేస్తున్నట్లుయితే నిన్ను నడిపిస్తున్నవాడు సాతానుడే కానీ దేవుడుకాడు అని నీవు నిశ్చయించు కొనవచ్చు.

మనము మనగతజీవితాలను చూచుకుంటే భయపడి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఆ నిర్ణయాలన్నింటిలోనూ మనల్ని నడిపించింది దేవుడు కాదు. అటువంటి కొన్ని నిర్ణయాల పర్యవసానము అంత తీవ్రమైన విషయము కాకపోవచ్చు. అయితే మనము దేవుని నుండి శ్రేష్టమైన దానిని పోగొట్టుకున్నాము. భవిష్యత్తులో మనము భిన్నంగా వ్యవహరించాలి.

మనము మానవ మాత్రులము కాబట్టి భయపడుట స్వాభావికమే. ఉదాహరణకు, ఇప్పుడు నీవు కూర్చున్నచోట అకస్మాత్తుగా ఒక త్రాచుపాము కనబడితే సహజంగానే నీవు భయంతో లేచి దుముకుతావు, నీ శరీరంలో రక్తప్రసరణవేగము పుంజుకుంటుంది. అది సహజ సిద్ధము, కానీ నీవు వెళ్ళిన ప్రతిచోట పాము ఉంటుందనే భయంతో నీవు జీవించవు.

మనము ఎవ్వరికీ భయపడి బ్రతకకూడదు.

మనుష్యులకు గానీ, సాతానుకు గానీ భయపడి మనము నిర్ణయములు తీసుకోకూడదు. మనము తీసుకునే ప్రతి నిర్ణయము దేవునియందలి భయము, పరలోకపు తండ్రి మీద మన పరిపూర్ణమైన విశ్వాసముపై ఆధారపడి ఉండాలి. అప్పుడే మనము పరిశుద్ధాత్మచేత నడిపింపబడుతున్నామనే నిశ్చయత కలిగియుంటాము.

ప్రభువును సేవిస్తున్న మనందరికీ హెబ్రీ 13:6 అతి ప్రాముఖ్యమైన వచనము, "ప్రభువు మనకు సహాయకుడని మనము ధైర్యముగా చెబుతున్నాము, మనము భయపడము. మానవుడు మనకేమి చేయగలడు?"

దీనిని మనము నమ్మితే, ఇది మన జీవితములలోకి గొప్ప అధికారము తెచ్చిపెట్టగలదు. మనము మనుషులకు భయపడుటను బట్టి, వారిని సంతోషపెట్టి మెప్పించుటకు ప్రయత్నించుటను బట్టి, వారి ముందర మనలను మనము సమర్థించుకొనుటను బట్టి సాతాను మనలో నుండి ఆత్మీయ అధికారమును చాలా మట్టుకు హరించుకుపోయాడు. ఈ వైఖరులను మనము సమూలముగా నశింపజేయాలి.