WFTW Body: 

సాతాను భయమును కలిగించేవాడిగా ఉన్నాడు. పాపమును వ్యతిరేకించినట్లే ప్రభువైన యేసు భయమును వ్యతిరేకించాడు. "పాపము చేయకుడని" ప్రభువైన యేసు చెప్పినట్లే, "భయపడకుడి" అని ఆయన ప్రజలతో అనేక సార్లు చెప్పాడు. ప్రజలు పాపములో జీవించుటను వ్యతిరేకించినట్లే ప్రభువైన యేసు ప్రజలు భయపడుతూ జీవించుటను వ్యతిరేకించారు. మనము ప్రభువులో విశ్వాసము ఉంచియున్నాము గనుక మనము భయపడము. ఒకవేళ మనము అనుకొనని రీతిగా భయపడినను లేక చింతించినను వెంటనే మనము దేవుని యెదుట మన భయము ఒప్పుకొని మరియు ఆయన మనలను కాపాడతాడని విశ్వసించాలి.

దేవునియొక్క పరిచర్యను సాతాను అనేకవిధములుగా ఎదురిస్తాడు. కాని ఆయన పిల్లలయొక్క ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. కొన్ని దయ్యములు ప్రార్థన మరియు ఉపవాసముల ద్వారా వెళ్ళగొట్టగలమని ప్రభువైనయేసు చెప్పారు. అనగా మనము ఉపవాసముండి ప్రార్థించనట్లయితే, కొన్ని దయ్యములు అక్కడే ఉండి దేవుని యొక్క పరిచర్యను ఆటంకపరుస్తాయి. భూమిమీద తన పరిచర్య చేయుటకు దేవుడు క్రీస్తు శరీరమైయున్న మన మీద ఆధారపడును ఇది మనకు ఒక్క గొప్ప ధన్యత మాత్రమే కాదు ఒక గొప్ప బాధ్యత కూడా. అంధకార శక్తులు సంఘానికి వ్యతిరేకముగా నిలువలేవని ప్రభువు వాగ్ధానము చేసియున్నాడు.

ప్రపంచములో క్రైస్తవ వ్యతిరేక శక్తులు పనిచేయుచున్నవి. అయితే దేవుడు మనకు భయపడే ఆత్మను ఇవ్వలేదు. ఆయనను ఘనపరుచు వారిని ఆయన ఘనపరచును. కాబట్టి మనము ఎప్పుడైనను భయముచేత చలించకూడదు. ఆ సమయములో సహాయముకొరకు దావీదు, సౌలు యొక్క కవచమును తిరస్కరించినట్లే మనము కూడా మనుష్యుల మీద ఆధారపడము. దావీదు ప్రభువు నామములో ఆత్మీయ ఆయుధములను ఉపయోగించి గొల్యాతును జయించాడు. మన ఆయుధములు కూడా ఆత్మ సంబంధమైనవి (2కొరంథీ 10:4). మరియు నిశ్చయముగా మనము ఎల్లప్పుడూ జయించెదము.

"తోడెళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపునట్లుగా" మనలను ఈ దుష్టలోకమునకు పంపుచున్నానని ప్రభువైనయేసు చెప్పారు. అంతేకాదు మనము "పాములవలె వివేకులైయుండవలెనని" అదే వచనములో ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 10:16).

మనము సమస్త జనులను శిష్యులుగా చేయడానికి వెళ్ళినయెడల, పరలోకమందును భూమిమీదను సర్వాధికారము కలిగిన ప్రభువు ఎల్లప్పుడూ మనతో ఉండి మరియు ఆయన మన పక్షముగా తన అధికారమును ఉపయోగిస్తానని వాగ్ధానము చేసియున్నాడు (మత్తయి 28:19, 20). ఆయన మనతో ఉంటే చాలును. ఆయన మన పక్షమున ఉండగా ప్రపంచమంతయు మనలను వ్యతిరేకించినను మనము ఎదుర్కొనగలము.

"మీ హృదయములు కలవరపడుటకును మరియు కలత చెందుటకును అవకాశమియ్యకుడి మరియు మీరు భయాక్రాంతులు అగుటకును బెదిరిపోవుటకును పిరికివారుగా ఉండుటకును అనుమతించవద్దు" (యోహాను 14:27 యాంప్లిఫైడ్ బైబిల్ తర్జుమా).

దేవుని వాక్యము మనకు ఈ విధముగా ఆజ్ఞాపించుచున్నది "అనేకులు భయపడినట్లు మీరు భయపడకుడి. పరలోకమందున్న ప్రభువుకు తప్ప ఎవరికైనను దేనికైనను మీరు భయపడకుడి, మీరు దేవునికి భయపడినట్లయితే, మరి దేనికిని భయపడవలసిన అవసరంలేదు. ఆయనే స్వయముగా మీ భద్రతయైయుండును" (యెషయా 8:12-14 లివింగ్ బైబిల్ తర్జుమా).

"నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను" కాబట్టి మనము ధైర్యముగా ఇట్లు చెప్పగలము "ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు?". "యేసుక్రీస్తు నిన్న, నేడు యుగయుగముల వరకును ఒక్కటే రీతిగా ఉన్నాడు" (హెబ్రీ 13:5-8).

భయము విషయములో రెండు విషయములను జ్ఞాపకముంచుకోవాలి.

1. మనము ఎప్పుడైనను భయముతో కాక దేవునియందు విశ్వాసముతో ఏ నిర్ణయము అయినా తీసుకోవాలి.

2. భయము సాతాను యొక్క ఆయుధమై యున్నది. కాబట్టి మనలను భయపెట్టే లేక బెదురించు వారందరు సాతానుతో సహవాసము చేయుచున్నారు (అది వారికి తెలియనప్పటికి). కాబట్టి మనము ఎవరిమీదను ఆ ఆయుధమును ఉపయోగించకూడదు (ఎఫెసీ 6:10 మరియు 2తిమోతి 1:7).

ఇతరులు మనకు చేసే కీడుద్వారా దేవుడు మనకు ఆయన వాక్యముమీద నూతన ప్రత్యక్షతను ఇచ్చి మరియు మరొకరీతిగా మనము అనుభవించలేని ఆయన కృపను నూతనముగా అనుభవించేటట్లు చేస్తాడు.

"మనము పోరాడునది శరీరులతో కాదుకాని ప్రధానులతోను, అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము" అని దేవుని వాక్యము చెప్పుచున్నది (ఎఫెసీ 6:12). నేను సాతాను శక్తులతో పోరాడాలంటే మనుష్యులతో ఎన్నటికి పోరాడకూడదని ప్రభువు నాతో చెప్పాడు.

పాతనిబంధనలో ఇశ్రాయేలీయులు మనుష్యులతో పోరాడారు. కాని క్రొత్తనిబంధనలో మనము మనుష్యులతో ఎన్నటికీ పోరాడకూడదు, కేవలం సాతాను మరియు అతని దూతలతో పోరాడాలి. ప్రభువైన యేసు మనకు ఈ విషయములో మాదిరి చూపించాడు. చాలామంది విశ్వాసులు వారి భార్యలతోను, భర్తలతోను, ఇరుగుపొరుగువారితోను మరియు ఇతర విశ్వాసులతోను మొదలగు వారితో పోట్లాడుట వలన సాతానును జయించలేక పోవుచున్నారు.

భవిష్యత్తులో నీవు ఏమనుష్యునితోను పోరాడకుండునట్లు నిర్ణయించుకొనినట్లయితే అప్పుడు సాతానుతో సరియైన విధముగా పోరాడగలవు. దేవుని మార్గములను మనము నిజముగా వెంబడించినయెడల సాతానుని మరియు అతని కుయుక్తులను అన్ని సమయములలో జయించుచూ జయజీవితము జీవించగలము.