వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము సంఘము శిష్యులు
WFTW Body: 

గొప్ప పనిని నెరవేర్చే విషయంలో సమతుల్యతను తీసుకురావడమే నా హృదయంపై ఉన్న భారం. యేసు ఈ భూమిని విడిచిపెట్టడానికి ముందు తన శిష్యులకు ఇచ్చిన "గొప్ప పని" అని పిలువబడే దానిని నెరవేర్చడం ఎంత ముఖ్యమో క్రైస్తవులందరికీ తెలుసు.

ఆ గొప్ప పని యొక్క మొదటి భాగం మార్కు 16:15 లో ఉంది, "మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును". ఈ గొప్ప పనిలో మరొక భాగం ఉంది -ఆ మిగిలిన సగం మత్తయి 28:18-20లో వివరించబడింది. అక్కడ యేసు ఇలా చెప్పాడు, "పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నాను".

నేను తిరిగి జన్మించినప్పటి నుండి గత 52 సంవత్సరాలలో క్రైస్తవ లోకాన్ని -- తిరిగి జన్మించిన క్రైస్తవులను, క్రైస్తవ మిషన్లను మరియు క్రైస్తవ సంఘాలను గమనించాను, చాలా మంది క్రైస్తవులు గొప్ప పనిలో మార్కు 16:15 అంశాన్నే నొక్కిచెప్తునట్లు నేను కనుగొన్నాను. చాలా తక్కువ మంది మిగిలిన సగం, మత్తయి 28:19 నొక్కి చెప్తున్నారు. నా అంచనా ఏమిటంటే, 99% మంది మార్కు 16:15ని తమ ప్రాథమిక దృష్టిగా మార్చుకున్నారు, అయితే కేవలం 1% మంది మాత్రమే మత్తయి 28:19-20కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక దృష్టాంతంగా దాన్ని చెప్పాలంటే, వంద మంది వ్యక్తులు ఒక మొద్దును తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది, మొద్దు ఒక చివర 99 మంది వ్యక్తులు పట్టుకొనగా మరొక చివర ఒక వ్యక్తి మాత్రమే ఉండి ఆ చివరను పట్టుకోవడానికి కష్టపడుతున్నాడు. నేను ఆ విధంగా చూస్తున్నాను.

కాబట్టి, ప్రభువు నాకు వరాన్ని ఇచ్చి నేను వాక్యాన్ని బోధించడం ప్రారంభించినప్పుడు ఆ గొప్ప పనిలో ఇతర కోణాన్ని నొక్కి చెప్పడం ప్రభువు నాకు ఇచ్చిన పని అని నేను కనుగొన్నాను, ఇది దాదాపు 1% మాత్రమే నెరవేరుతోంది, నిజానికి 50-50గా సమతుల్యత ఉండాలి. గొప్ప పని యొక్క మొదటి భాగం సువార్తీకరణ అని మనకు తెలుసు. దీనిని సాధారణంగా మిషనరీ పని అని పిలుస్తారు మరియు తరచుగా చేరుకోని ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. ఈ చేరుకోని ప్రాంతాలకు సువార్త సందేశాన్ని తీసుకువెళ్లడం చాలా అవసరం (మనిషి పాపంలో ఉన్నాడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు, క్రీస్తు లోక పాపాల కోసం మరణించాడు, తండ్రియొద్దకు ఏకైక మార్గం ఆయనే, క్రీస్తు మృతులలోనుండి లేచాడు, ఆయనను విశ్వసించి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడతాడు మరియు నమ్మని వానికి శిక్షవిధించబడుతుంది).

అయితే అది అక్కడితో ఆగిపోవాలని ప్రభువు కోరుకున్నాడా? ఒక వ్యక్తి విశ్వసించి, తాను పాపి అనే వాస్తవాన్ని అంగీకరించి, క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన తర్వాత, ఇక అంతేనా? అస్సలు కాదు. మత్తయి 28:19లో, అన్ని దేశాలకు వెళ్లి శిష్యులను చేయమని ఆయన మనలను కోరుతున్నాడు.

మొదటి సారి ఈ పని విన్న తొలి అపొస్తలులకు "శిష్యులు" అంటే ఏమిటో వారి మనస్సులలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే యేసు వారికి లూకా 14లో దానిని చాలా స్పష్టంగా వివరించాడు. మనం లూకా 14:25లో చదివినట్లుగా, యేసు పెద్ద సంఖ్యలో ప్రజలు తనతో రావడం చూసి ఆయన ఎవరితోనైనా చెప్పని కొన్ని కఠినమైన మాటలను చెప్పాడు.

రాబోయే కొద్ది వారాల్లో, ఈ "శిష్యత్వపు షరతుల"లో ప్రతి ఒక్కదాని గురించి లోతుగా పరిశీలిద్దాము. యేసు నిర్వచించినట్లుగా మనం శిష్యరికంలోకి వచ్చామా? గొప్ప పనిలో మరియు యేసు శిష్యత్వానికి ప్రాధాన్యత ఇవ్వడంపై మన అవగాహనలో మనకు సరైన సమతుల్యత ఉందా? అని మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది.