ఈనాడు క్రైస్తవులు అనేక విషయాల్లో పాత నిబంధన క్రింద జీవిస్తున్నారు. పెంతెకోస్తు రోజున కొత్త నిబంధన స్థాపింపబడిందనే విషయాన్ని వారు ఇంకా గుర్తెరుగలేదు. అది ఎలా ఉంటుందంటే 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకోలేనట్లుగా ఉంటుంది. ఆ విషయం తెలియని వ్యక్తిని మీరు ఒకసారి ఊహించగలరా? క్రైస్తవులు పాత నిబంధన క్రింద జీవించుట కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది.
అనేక విషయాల్లో చాలామంది క్రైస్తవులు పాత నిబంధన కింద జీవిస్తున్నారు. పాత నిబంధనలో కేవలం మీ పాపములు క్షమింపబడగలవు (103వ కీర్తన). కొత్త నిబంధనలో, పాపము మీ మీద ప్రభుత్వము చేయదని రోమా 6:14 చెప్తుంది. ప్రజలు పాపంపై జయమును కాకుండా కేవలం పాప క్షమాపణ మాత్రమే పొందినట్లయితే వారు పాత నిబంధన క్రింద జీవిస్తున్నారు. పాత నిబంధనలో ఒక్క శరీరముగా కలిసి పనిచేయని సమాజం ఉంది. ఈనాటి సంఘం ఒక్క శరీరంగా కలిసి పని చేయనట్లయితే అది కేవలం ఒక పాత నిబంధన సమాజం అని రుజువుపరుస్తుంది. దశమభాగం ఇవ్వడాన్ని నొక్కి చెప్పినప్పుడు, అది కూడా పాత నిబంధనకు సంబంధించినదే.
ఈనాటి క్రైస్తవంలో మనం చుస్తున్న దశమభాగం పూర్తిగా పాత నిబంధన సంబంధమైనది. కాబట్టి కొత్త నిబంధన యొక్క ఇచ్చుటను గూర్చిన నియమాలను మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో నీవు కచ్చితంగా 10 శాతాన్ని చెల్లించాలి అనే నియమమేది లేదు. దశమభాగం గూర్చిన చివరి ఆజ్ఞ పాత నిబంధన మలాకీ పుస్తకంలో కనపడుతుంది. మత్తయి 23లో యేసు దీనిని ప్రస్తావించినప్పుడు ఆయన పాత నిబంధన క్రింద ఉన్న పరిసయ్యులు మరియు యూదా ప్రజలకే దాన్ని చెప్తున్నాడు. పెంతెకోస్తు రోజున కొత్త నిబంధన స్థాపించబడింది. దాని తర్వాత దశమభాగాలు చెల్లించమని ఒక్క ఆజ్ఞ కూడా లేదు. దశమభాగం గురించి అసలు ప్రస్తావనే లేదు.
హెబ్రీ పత్రికలో అబ్రహాము మెల్కీసెదెకుకు 10 శాతాన్ని ఇచ్చాడు అనే విషయం అస్పష్టంగా చెప్పబడింది. అయితే అబ్రహాము ఎటువంటి చట్టాన్ని వెంబడించడం లేదు. అతను తనకు ఎంత ఇష్టం ఉంటే అంత ఇచ్చి ఉండేవాడు. అయితే అతను 10 శాతం యాదృచ్ఛికంగా ఇచ్చాడు. అతను ఎటువంటి చట్టాన్ని వెంబడించడం లేదు. ఒకవేళ ఆ విధంగా ఇవ్వనట్లయితే పాపం చేసి ఉండేవాడు కాదు.
కొత్త నిబంధనలో ఇచ్చుటకు సంబంధించిన నియమాలు ఏమిటంటే - రహస్యంగా ఇవ్వాలి (మత్తయి 6:1-4), సంతోషంగా ఇవ్వాలి (2కొరంథీ 9:7), మరియు నీ సంపాదనకు తగినట్లుగా ఇవ్వాలి (1కొరంథీ 16:2). నీవు ఎంత ఇవ్వాలనే నియమమేమి లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు ఇవ్వవచ్చు. నీకు అధికంగా కలిగినట్లయితే, నీకు అధికంగా మిగులు ఉన్నట్లయితే నీవు ఎక్కువగా ఇవ్వవచ్చు. నీకు అంతగా లేనట్లయితే నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. అది ఫర్వాలేదు, దేవుడు కోటీశ్వరుడు ఆయనకు ఇవ్వడం వలన తన పిల్లలు శ్రమపడాలని ఎప్పుడూ కోరుకోడు.
ఈ నియమాలను మీరు అర్థం చేసుకోనట్లయితే అనేకమంది పాస్టర్లు మరియు బోధకులు ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి మీరు ఇచ్చినప్పుడు రహస్యంగా ఇవ్వాలి. ఏ సంఘమైన మీరు ఇచ్చే దాన్ని బహిరంగ పరచునట్లు చేస్తున్నట్లయితే మత్తయి 6:1-4 వచనాలలోని దేవుని వాక్యానికి అవిధేయత చూపించమని మిమ్మల్ని అడుగుతున్నట్లే. సాధ్యమైనంత వరకు మనం ఇచ్చే ప్రతిదీ, రహస్యంగా స్వచ్ఛందంగా మరియు సంతోషంతో ఉండాలి.
ఆ కారణం చేతనే నేను ప్రజల ముందు ఒక సంచిని పెట్టడాన్ని నమ్మను, అప్పుడు వారు సంతోషంతో గాక బలవంతంగా ఇవ్వవలసి వస్తుంది. వారి పక్కన కూర్చున్నవారు, వారు ఇస్తున్నప్పుడు చూస్తున్నారు గనుక రహస్యంగా ఇచ్చే అవకాశం కూడా లేదు. వారు స్వచ్ఛందంగా రహస్యంగా సంతోషంతో మరియు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ఇవ్వగలుగునట్లు సంఘ భవనంలో ఎక్కడో ఒకచోట ఒక కానుకల డబ్బా పెట్టడం ఈ విధంగా చేయుటకు ఒక మార్గం. కేవలం కొన్ని సంఘాలు మాత్రమే దీనిని అభ్యసిస్తాయి ఎందుకంటే అనేకమంది క్రైస్తవ బోధకులలో మరియు అనేక క్రైస్తవ సంఘాలలో ఎంతో ధనాపేక్ష ఉంది.
మత్తయి 5:20 వచనాన్ని జ్ఞాపముంచుకోండి, ‘మీ నీతి శాస్త్రుల నీతికంటే మరియు పరిసయ్యుల నీతికంటే అధికంగా ఉండాలి’ అనే ఈ మాట మిగిలిన కొండమీది ప్రసంగానికి ఒక శీర్షిక వంటిది. మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించుటకు ఏ విషయాలలో మన నీతి పరిసయ్యుల మరియు శాస్త్రుల నీతికంటే అధికం కావాలో ఆ ప్రసంగంలో చూస్తాం.
ఇచ్చే విషయంలో, వారు ఇస్తున్నామని ఇతరులు తెలుసుకోవాలని కోరుకునే పరిసయ్యులు మరియు వేషధారుల వైఖరికి మన వైఖరి భిన్నంగా ఉండాలని యేసు చెప్పారు. మనుషుల ఎదుట మీ నీతిని అభ్యసించుట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అది ప్రాధమికమైన నియమం. ప్రజలు చూసే విధంగా దానిని చేయకూడదని యేసు చెప్పారు.
కొన్నిసార్లు ఇతరులు ఈ విషయాలను గమనించడాన్ని మనం నివారించలేము, ఒకవేళ అనుకోకుండా ఇతరులకు తెలిసినా, లేదా దానిని నివారించడానికి మార్గం లేకపోయినా మనం అపరాధభావంతో బాధపడాల్సిన అవసరం లేదు, కానీ మనం వీటిని మనుష్యులు గమనించాలని చేయము. ఉద్దేశ్యం అదే. లేనట్లయితే పరలోకమందున్న మీ తండ్రినుండి మీకు ఎటువంటి ప్రతిఫలము ఉండదు. ఈ వచనాన్ని అనుసరించి ప్రభువు యొక్క పని కోసం ఇచ్చిన అనేకులు పరలోకంలో ఎటువంటి బహుమతి పొందరు, ఎందుకంటే వారు ఎంత ఇచ్చామనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు.
నీవు రహస్యంగా ఇచ్చినట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన అద్భుతమైన బహుమతి ఇది. ఈ ఆజ్ఞకు మనం ఇక్కడ లోబడినట్లయితే ఒకానొక రోజు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు త్యాగపూర్వకంగా మరియు రహస్యంగా ఇచ్చిన వారందరికీ కూడా గొప్ప బహుమతి ఉంటుంది