WFTW Body: 

మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెదకుతు మరియు దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలని కోరుకుంటే, మీ జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరకుండా ఏదీ ఆపలేదు, ఎందుకంటే భూమిపై ఉన్న అధికారం అంతా మన ప్రభువు చేతుల్లో ఉంది. యేసు పిలాతు ముందు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశాడు:

(1) "నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు కాబట్టి నేను భూసంబంధమైన వాటి కోసం పోరాడను" (యోహాను 18:36).

(2) "నాపై ప్రయోగించడానికి నా తండ్రి నిన్ను అనుమతించినది తప్ప నాపై నీకు ఏ అధికారం ఉండదు" (యోహాను 19:11).

ప్రభువుకు మంచి సాక్షిగా ఉండమని పౌలు తిమోతికి చెప్పినప్పుడు, ఈ రెండంతల ఒప్పుకోలును గుర్తు చేశాడు (1 తిమోతి 6:13, 14).

కష్టమైన పరిస్థితులు మరియు కష్టమైన వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు నేను దేవునికి మరియు సాతానుకు మరియు ప్రజలకు చేసిన ఒప్పుకోలు ఇదే.

మీ జీవితంలో ఎటువంటి విగ్రహం లేనప్పుడు మాత్రమే మీరు ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉండగలరు. మంచి ఉద్యోగాలు, ఇళ్లు మరియు భూసంబంధమైన సౌకర్యాలు చాలా మంది క్రైస్తవులకు విగ్రహాలుగా మారాయి. అది చెక్క లేదా రాతి విగ్రహాన్ని పూజించడం వంటిదే! కానీ చాలా మంది క్రైస్తవులు దీనిని గుర్తించరు. దేవుడు ఇచ్చే ఆత్మీయ వరాలు కూడా (పరిచర్య లాంటివి) అబ్రాహాముకు ఇస్సాకువలె విగ్రహంగా మారవచ్చు. దేవుడే మనకు సర్వస్వం అయినప్పుడు, మన హృదయాల నుండి మనం నిజంగా "ప్రభువా, భూమిపై నీవు తప్ప నేను కోరుకునేది ఏదీ లేదు మరియు ఎవ్వరూ లేరు" అని ప్రభువుతో చెప్పగలిగితే (కీర్తనలు 73:25), అప్పుడు మాత్రమే మనం విగ్రహారాధన నుండి విముక్తి పొందామని చెప్పగలము మరియు ప్రభువును ఆరాధించడం ప్రారంభిస్తాము. మీరందరూ ప్రతి విగ్రహాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని నేను ప్రార్థిస్తున్నాను.

మన నమ్మకం, విశ్వాసం ఎల్లప్పుడూ దేవునిపై మాత్రమే ఉండాలి, మనుషులపై ఎప్పుడూ ఉండకూడదు. లేనట్లయితే యిర్మీయా 17:5, 6లో చెప్పబడినట్లు మనం శపించబడి వాడిపోతాము: "ప్రభువు ఇలా అంటున్నాడు, 'మనుష్యులను విశ్వసించి శరీరులను తన బలంగా చేసుకుని తన హృదయం ప్రభువు నుండి దూరపరచుకొన్న వ్యక్తి శాపగ్రస్తుడు. ఎందుకంటే అతను ఎడారిలో పొదలా ఉంటాడు మరియు శ్రేయస్సు వచ్చినప్పుడు అతడు చూడడు, కానీ అరణ్యంలోని రాతి భూమిలో నివసిస్తాడు'".

మన నిజమైన సంపద డబ్బు లేదా ఆస్తిలో లెక్కించబడదు, కానీ వైఫల్యాలు మరియు లోతైన పరీక్షల ద్వారా వచ్చే ప్రభువును గూర్చిన జ్ఞానంలో ఉంది. యిర్మియా 9:23, 24 (ఆంగ్ల లివింగ్ తర్జుమా) ఇలా చెప్తుంది: "జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, పరాక్రమవంతుడు తన శక్తిలో, లేదా ధనవంతుడు తన సంపదలో అతిశయింపకూడదు. అతిశయించువాడు ఈ విషయంలో మాత్రమే అతిశయించాలి: స్థిరమైన ప్రేమగల ప్రభువును నేనే అని, అలా ఉండటంలో నేను ఆనందిస్తానని వారు నిజంగా తెలుసుకొని అర్థంచేసుకొనుటలోనే అతిశయించాలి". అంతిమంగా దానికే విలువ ఉంటుంది. దానితో పోలిస్తే ప్రపంచంలో సాధించిన ప్రతిదీ చెత్తతో సమానం. ఆ సత్యాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత జ్ఞానవంతులం అవుతాం.