WFTW Body: 

నిర్గమకాండము 15వ అధ్యాయము ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించుటతో మొదలై వారు ఆయనకు వ్యతిరేకంగా సణగడంతో ముగుస్తుంది. ఈ క్రమము అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల చేత మరలా మరలా పునరావృత్తం అవుతుంది. ఎక్కువమంది విశ్వాసుల యొక్క జీవితాలకు, నిరంతరం పైకి క్రిందికి వెళ్లే గణితశాస్త్రంలో ఉన్న "సైన్ వేవ్" ఖచ్చితమైన ఉదాహరణ. వారికి కావలసింది దొరికినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారు దొరకనప్పుడు ఫిర్యాదులు చేస్తారు సమస్య తీరినప్పుడు మరలా దేవునికి వందనాలు చెప్తారు సమస్య వచ్చినప్పుడు మరలా సందేహిస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల వలె ఎక్కువమంది విశ్వాసులు విశ్వాసము వలన కాక వెలుచూపు వలన జీవిస్తారు. ఆదివారం ఉదయం కూటములలో వారు దేవుణ్ణి పెద్ద స్వరముతో కొన్నిసార్లు అన్య భాషలలో స్తుతిస్తారు. కానీ ఆదివారం మధ్యాహ్నం నుండి వారి మాతృభాషలో వారి మాటలు వేరే విధంగా ఉంటాయి. అవి వారి ఇంటి వద్ద మరియు వారు పని చేసే స్థలములో కోపంతో సణుగుడుతో ఫిర్యాదులతో కూడి ఉంటాయి. తరువాత ఆదివారం మరల వారు దేవుని స్తుతించడం మొదలుపెడతారు.

తరువాత మరలా అదే తంతు!! దేవుడు క్రొత్త నిబంధనలో ఉన్న తన పిల్లలు ఇలా జీవించాలని ఖచ్చితంగా ఉద్దేశించలేదు. ఒక వ్యక్తికి అన్యభాషల వరమును ఇచ్చే పరిశుద్ధాత్ముడు అతని మాతృభాషలో కూడా అతని మాటలను అదుపులో పెట్టలేడా? ఆయన నిశ్చయంగా పెట్టగలడు. "ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి సమస్తమును గూర్చి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి" అని బైబిల్ చెప్తుంది (ఫిలిప్పీ 4:4; ఎఫెసీ 5:20).

క్రొత్త నిబంధనలో అన్నివేళలా అదే మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది. కానీ అలా చేయాలంటే మనం విశ్వాసం వలన జీవించాలి. మనము ఎదుర్కోబోయే ప్రతి సమస్యకు దేవుడు అప్పటికే ఒక పరిష్కారాన్ని యోచించాడని మనం నమ్మాలి.

ఇశ్రాయేలీయులు మోషేకు ఫిర్యాదు చేసినప్పుడు అతడు ప్రభువుకు మొర పెట్టగా "సమస్యకు పరిష్కారము మీ ముందే ఉంది" అని ప్రభువు చెప్పాడు (25వ వచనం). ప్రభువు అతనికి ఓ చెట్టును చూపించగా మోషే చెట్టును నరికి నీళ్లలో వేయగా ఆ నీళ్లు మధురములాయెను.

ఆ చెట్టును అరణ్యంలో నాటింది ఎవరు? ఎవరైనా మనిషా లేక దేవుడా? నిస్సందేహంగా దేవుడే! మనుషులు అరణ్యంలో చెట్లను నాటరు. దేవుడు బహుశా 100 సంవత్సరాల క్రితం ఆ చెట్టును మారాయొద్ద నాటి ఉంటాడు. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత ఆయన పిల్లలు మారా వద్దకు వచ్చి దాని నీళ్ళు చేదుగా ఉన్నాయని వారు చూస్తారని ఆయనకు తెలుసు. కనుక వారి సమస్యకు పరిష్కారమును నిజానికి 100 సంవత్సరాల ముందే ఆయన యోచించాడు. నీవు సమస్యలను ఎదుర్కోవడానికి ఎంతో కాలం ముందే దేవుడు నీ సమస్యలన్నీటికి కూడా పరిష్కారములను యోచించాడని నీవు గ్రహిస్తున్నావా?

విశ్వాసము వలన నడవడం అంటే దాన్ని నమ్మడమే. దేవుని ఆశ్చర్యపరిచే ఏ సమస్య ఈ రోజున అకస్మాత్తుగా తలెత్తదు. అపవాది మన కొరకు సిద్ధపరిచే సమస్యలను దేవుడు ముందుగా తెలుసుకోవడమే కాకుండా వాటన్నిటి కొరకు ఆయన ముందుగానే పరిష్కారాన్ని సిద్ధపరిచాడు కనుక ధైర్యముగా నీవు ప్రతి సమస్యను ఎదుర్కోవచ్చును.

ఒక విశ్వాసిగా 56 ఏళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొన్నాక నేను ఇది నిజమని సాక్ష్యం ఇవ్వగలను. దేవుడు ఒక పరిష్కారమును యోచించని సమస్యను నేనెప్పుడూ ఎదుర్కోలేదు! నేను నా జీవితంలో మారాల యొద్దకు వచ్చే ఎంతో కాలముందే ఆ నీళ్లను మధురంగా చేయడానికి కావలసిన చెట్ల కొరకు విత్తనాలు నాటాడు. మన కొరకు "ఎల్లప్పుడూ మౌనంగా ప్రేమతో యోచించే"(జెఫన్యా 3:17 వివరణ) అద్భుతమైన ప్రియమైన తండ్రి యందు విశ్వాసము కలిగి నడవమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. అప్పుడు మీరు నిరంతరం మీ సమస్యలన్నిటినీ జయిస్తారు. మీ నోట నుండి దేవునికి కృతజ్ఞతా స్తుతులు తప్ప ఇంకెప్పుడూ ఫిర్యాదులు లేక సణుగుడు లేక కోపముతో కూడిన మాటలు రావు.