WFTW Body: 

లూకా 22:31వ వచనములో యేసు ప్రభువు, ముందు పొంచి ఉన్న ప్రమాదము గూర్చి పేతురును హెచ్చరిక చేయుట చదివెదము. ఆయన "సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను".

పేతురు తప్పిపోవుటను అనుమతించుటలో దేవునికి ఒక ఉద్దేశ్యమున్నది. పేతురును జల్లించుటయే ఆ ఉద్దేశ్యము. పేతురును పూర్తిగా నాశనము చేయవలెనని సాతాను అనుకొనెను, కాని అట్లు చేయుటకు దేవుడు అనుమతించలేదు. మనకుండిన సామర్థ్యము కంటే ఎక్కువగా శోధించుటకు గాని పరీక్షించుటకుగాని దేవుడు అనుమతినివ్వరు (1 కొరింథీ 10:13). ఆ విధముగా పేతురును జల్లించుటకు సాతానుకు అనుమతి ఇవ్వబడినది. పేతురు తప్పిపోవుట ద్వారా తన జీవితములో నుండిన చాలా పొట్టు నుండి శుభ్రపరచబడెను. "మనము తప్పిపోవుటలో దేవునికుండిన నిజమైన ఉద్దేశ్యము అదియే". మన జీవితములలో నుండి పొట్టు తీసివేయబడడము మంచిది కాదా? తప్పనిసరిగా మంచిదే. ఒక రైతు ధాన్యమును పండించిన తరువాత వాటిని ఉపయోగించుకొనుటకు ముందు వాటిని జల్లించవలసియున్నది. అప్పుడే వాటినుండి పొట్టు తీసివేయబడును.

మన జీవితాలలో నుండి పొట్టును తీసివేయుటకు దేవుడు సాతానును ఉపయోగించుకొనును. మనము పలుమార్లు తప్పుటకు అనుమతినిచ్చుట ద్వారా దేవుడు ఆశ్చర్యకరంగా ఈ పనిని నెరవేర్చును. ఆ ఉద్దేశ్యము నెరవేరుటకు పేతురు విషయంలో దేవుడు సాతానును ఉపయోగించుకొనెను. మన జీవితంలో కూడా ఆ ఉద్దేశ్యము నెరవేరుటకు తనను ఉపయోగించుకొనును. మనందరిలో చాలా పొట్టు ఉంది- గర్వము అనే పొట్టు, మనమీద మనకుండిన నమ్మకము మరియు స్వనీతి అనే పొట్టు, మనలోనున్న పొట్టును పూర్తిగా తీసివేయుటకు దేవుడు సాతానుని ఉపయోగించుకొని మనలను మరలా, మరలా పడిపోవునట్లుగా చేయును.

నీ జీవితములో ఈ ఉద్దేశ్యము దేవుడు నెరవేరుస్తున్నారా? లేదా? అనేది నీ ఒక్కడికే తెలియును. అయితే ఆ పొట్టు తీసివేయబడుచున్నట్లయితే, నీవు ఇంకను దీనుడుగా మరియు తక్కువ స్వనీతి పరుడుగా అగుదువు. అంతేకాక తప్పిపోయిన ఇతరులను నీవు చులకనగా చూడవు. ఎవ్వరికంటే నీవు గొప్పవాడివిగా అనుకొనవు.

మనలను పలుమార్లు తప్పిపోవునట్లు చేయుట ద్వారా, దేవుడు మనలో పొట్టును తీసివేయుటకు సాతానుకు అనుమతి నిచ్చును. కనుక తప్పినప్పుడు దానిని బట్టి నీవు నిరుత్సాహపడవద్దు. నీవు ఇంకను దేవుని చేతిలోనే ఉన్నావు. నీవు పలుమార్లు తప్పిపోవుట ద్వారా ఒక గొప్ప మహిమకరమైన ఉద్దేశ్యము నెరవేరును. అయితే దేవుని ప్రేమయందు నీకుండిన విశ్వాసము అటువంటి సమయాల్లో తప్పిపోకూడదు. యేసు ప్రభువు పేతురు విషయంలో అదే ప్రార్థించారు, ఈ రోజు మన కోసం కూడా ఆయన అదే ప్రార్థిస్తున్నారు. మనము తప్పిపోకూడదని ప్రార్థించుట లేదు కాని, మనము అట్టడుగుచేరి పోయినా, దేవుని ప్రేమయందు మనకుండిన నమ్మకము కదలనిదై ఉండాలని ఆయన ప్రార్థించుచున్నారు.

అనేకమార్లు తప్పిపోయిన అనుభవాల ద్వారానే మనము చివరకు "ఏమీలేని(సున్నా) స్థితికి" వచ్చెదము. అది నిజముగా మన విరిగిన స్థితియైయుండును. ఎప్పుడైతే పేతురు అటువంటి స్థితికి వచ్చెనో, అప్పుడు ఆయన రెండవసారి మార్పు చెందిన స్థితికి వచ్చెను (లూకా 22:32). అతడు ఒక్కమారుగా వెనుకకు తిరిగెను. యేసు ప్రభువు పేతురు కొరకు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చినదనుటకు ఋజువు పేతురు అట్టడుగునకు పడిపోయినా అతడు వెనుకకు తిరుగుటలో కనబడుతుంది. అతడు అక్కడనే పడినచోటునే ఉండిపోయి నిరుత్సాహపడలేదు. అతడి యొక్క విశ్వాసమును విడచిపెట్టలేదు. అతడు తిరిగి లేచెను. తరువాత దేవుడు అతడు ఎంతో దూరము వెళ్ళునట్లు చేసెను. కాని పేతురు త్రాడు చివరకు వచ్చినప్పుడు, దేవుడు ఆయనను పైకి లాగెను.

దేవుని బిడ్డగా ఉండుట అద్భుతమైన విషయము. దేవుడు మనలను పట్టుకొనినప్పుడు, మనలను కాపాడుటకు మన చుట్టూ ఒక త్రాడును ఉంచును. ఆ త్రాడు ఎంతో వదులుగా ఉండుట చేత, నీవు అనేక వేలసార్లు జారిపోవచ్చును, పడిపోవచ్చును. చివరకు దేవుని నుండి దూరముగా జరిగిపోవచ్చును. కాని ఒక రోజు నీవు ఆ త్రాడు చివరకు చేరుకొందువు. అప్పుడు తిరిగి నిన్ను ఆయన దగ్గరకు లాగుకొనును. అయితే ఆ సమయములో ఆ త్రాడును తెగగొట్టుకొని పారిపోయే నిర్ణయము నీవు తీసుకొనవచ్చును. లేక దేవుని యొక్క కనికరమును బట్టి దు:ఖపడి విరువబడి తిరిగి ఆయన యొద్దకు వచ్చుటకు నీవు ఎంచుకోవచ్చును. పేతురు అదే చేశాడు. అతడు ఏడ్చి తిరిగి ప్రభువు యొద్దకు వచ్చాడు. కాని ఇస్కరియోతు యూదా అది చేయలేదు. తన జీవితముపై దేవుని అధికారమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, ఆ త్రాడును త్రెంపుకొని శాశ్వతముగా దూరమైపోయాడు. కాని నీవు పేతురు చేసినట్లుగా చేయుదువని నేను నమ్ముతున్నాను.

యేసు పేతురుతో "నీ మనస్సు తిరిగినప్పుడు నీ సహోదరులను బలపర్చుము" అని చెప్పెను. "మనమెప్పుడైతే విరుగగొట్టబడుదుమో అప్పుడే మనము ఇతరులను బలపర్చగలము". పేతురు ఎప్పుడైతే బలహీనుడుగా అయి విరుగగొట్టబడెనో అప్పుడే అతడు నిజముగా బలవంతుడయ్యెను. తన సహోదరులను, సహోదరీలను బలపర్చగలిగేటంతటి బలవంతుడయ్యెను. పేతురు యొక్క తప్పిపోయిన అనుభవము ద్వారానే ఆత్మచేత నింపబడిన పరిచర్యకు ఆయన సిద్ధపడెను. ఆయన ఈ తప్పిపోయిన అనుభవము లేకుండానే పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే, పెంతెకోస్తు దినాన ఆయన నిలువబడినప్పుడు ఎప్పుడూ తప్పిపోనటువంటి గర్విష్టియైన ఒకనిగా నిలువబడి ఆయన ముందు నిలువబడిన పాపులను తృణీకార భావముతో ఎంతో క్రింద నున్నవారుగా చూచి ఉండేవాడు. అలా అయినట్లయితే దేవుడు ఆయనకు విరోధిగా అయ్యిండేవాడు. ఎందుకనగా "దేవుడు అహంకారులను ఎదిరించి, దీనులకు కృపనిచ్చును" (1 పేతురు 5:5).

పేతురు విషయంలో దేవుడు ఏమి ఉద్దేశించెనో అది నెరవేరుటకు ముందు పేతురు కూడా అటువంటి "ఏమీలేని(సున్నా) స్థితికి" రావలసియున్నది. ఒకమారు మనము అటువంటి అడుగునకు వెళ్ళినట్లయితే ఇంకా అటువంటి స్థితిలో ఉన్న వారిని మనము చులకనగా చూడము. అప్పటి నుండి మనము పాపులను లేక విశ్వాసములో నుండి పడిపోయిన విశ్వాసులను లేక పడిపోయిన క్రైస్తవ నాయకులను చులకనగా చూడము. ఒక సమయములో మనము ఎలా తప్పిపోతిమో తెలియుట చేత, పాపముపై మనము పొందిన విజయాన్ని బట్టి మనము గర్వించము. అందుచేతనే పేతురు ఇతర క్రైస్తవులను ఈ విధముగా హెచ్చరించుచున్నాడు. మీ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని ఎప్పటికీ మరచిపోవద్దు (2 పేతురు 1:9). ఒకవేళ అలా మరచిపోయినట్లయితే, అట్టివారు గ్రుడ్డివారును, దూరదృష్టిలేని వారును అగుదురని పేతురు హెచ్చరించెను. నాకు అన్ని సమయములలో పరలోకపు విలువలను, నిత్యమైన విలువలను, మరియు ఎంతో దూరంగా చూడగలిగేటటువంటి దృష్టి కావాలని కోరుకుంటున్నాను. నేనేప్పుడూ గ్రుడ్డివానిగాగాని హ్రస్వదృష్టి కలవానిగాగాని ఉండాలని అనుకోవడం లేదు.