WFTW Body: 

ప్రభుయేసువలె మనలను మార్చవలెనని దేవుడు గురిగా కలిగియున్నాడు. ఈ విషయమును గూర్చి మూడు వచనములు ఉన్నవి.

1) రోమా 8:28,29 ఈ గురిని మనము చేరుటకు మన తండ్రి బాహ్యముగా సమస్తమును సమకూర్చి జరిగించును.

2) 2కొరింథీ 3:18 ఈ గురిని మనము చేరుటకు అంతరంగములో పరిశుద్ధాత్మతో నింపబడెదము.

3) 1యోహాను 3:3 క్రీస్తుయొక్క రెండవ రాకడ గురించిన నిరీక్షణ కలిగిన వారందరూ ఈ గురియొద్దకే పరుగెత్తెదరు.

మనము క్రీస్తుతో కూడా మృతిపొందిన యెడల, నిశ్చయముగా నిత్యము ఆయనతో జీవించెదము. మనకు దేవుని యెడల విశ్వాసమున్న యెడల, క్రీస్తుయొక్క మరణానుభవము అనగా స్వచిత్తమునకు (సొంత సుఖమును కోరుట, ఘనతను కోరుట మొదలగునవి) చనిపోవుటకు అంగీకారము తెలిపెదము. దేవుడు అనుమతించిన పరిస్థితులన్నిటిలో మనము మరణానుభవములో ఉన్నయెడల, భ్రష్టుపట్టిన ఆదాము జీవమునకు బదులుగా దేవుని జీవమును మనకు అనుగ్రహించును.

మన తల్లిదండ్రుల ద్వారా మనము పొందిన జీవముకంటే ప్రభువైనయేసు ద్వారా పొందే పునరుత్థానము ఎంతో ఎంతో శ్రేష్టమైనది. కాని మనము యేసుయొక్క జీవమును పొందుటకు ముందుగా ఆదాము యొక్క జీవమును మరణమునకు అప్పగించవలెను (2తిమోతి 2:1; 2కొరింథీ 4:10). దానిని ఒక బిక్షగాడి గిన్నెలో ఉన్న కొన్ని నాణెములకు బదులుగా దేవుడు అనేక లక్షల రూపాయలు ఇచ్చునట్లు ఉండెను. ఒక బుద్ధిహీనుడు మాత్రమే దీనిని విసర్జించును. కాని లోకమంతయు అటువంటి బుద్ధిహీనులతో నిండియున్నది. కాబట్టి వారికున్న కొద్ది నాణెములను పట్టుకొని (ఆదాము యొక్క భ్రష్టజీవము) వారికొచ్చిన శోధనల ద్వారా ఆత్మీయముగా దేవుని స్వభావములో పాలుపొందుచూ ధనవంతులగుటకు బదులుగా వారు ఆవిధముగానే వారి జీవితమును ముగించెదరు. మనలో ఉన్న దురాశలు మోసపూరితమని బైబిలు చెప్పుచున్నది (ఎఫెసీ 4:22), ఎందుకంటే మనము వాటి ద్వారా సంతోషపడెదమని అవి మనలను మోసపరచును.

మనము చిన్న పొరపాట్లు చేసినప్పటికిని మనలను గద్దించుట, శిక్షించుట అను రెండు గుర్తులను దేవుని ప్రేమలో చూచెదము (హెబ్రీ 12:5-8; ప్రకటన 3:19). అనగా ఆయన మనలను కుమారులుగా చూచుచున్నాడు. మనము ఈ గురియొద్దకు చేరుకొనవలెనని కోరినప్పుడు దేవుడు కూడా మనము యేసువలె మార్పుచెందుటకు మనలో పనిచేయును.

మన పూర్ణ హృదయముతో ఆయనను వెదికినప్పుడు మాత్రమే మన జీవితములో ఆయన తన ప్రణాళికను నెరవేర్చును (యిర్మీయా 29:11-13). మనదేవుడు ఆసక్తితో వెదకువారికి ఫలమిచ్చు దేవుడు (హెబ్రీ 11:6). కాబట్టి మీరు ఇప్పటినుండి ఆయనను ఆసక్తితో వెదకవలెను.