వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

లేవీయకాండము దేవుని పరిశుద్ధతను గూర్చి చెప్పే పుస్తకము. ఈ పుస్తకమంతటి యొక్క ముఖ్య నేపథ్యము పరిశుద్ధతయైయున్నది. పరిశుద్ధత అనే మాటంటే అనేకమంది విశ్వాసులకు భయము. కాని మనము దేవుని వాక్యము యొక్క ప్రమాణాలను ధైర్యముగా ప్రకటించాలి - ఎందుకంటే అవన్నియు వాస్తవమైనవి మరియు పొందుకోదగినవి. పరిశుద్ధత అనేది దేవుని స్వభావము. దేవుడు మనకు ఇచ్చే ఆత్మ పరిశుద్ధఆత్మ. యెషయా దేవుని దర్శనం పొందినప్పుడు ఆయనను ఆయనపరిశుద్ధతలో తననుతాను ఒక అపవిత్రునిగా చూచుకున్నాడు.

పరిశుద్ధత ఆరోగ్యం వంటిది. పరిపూర్ణ ఆరోగ్యం గురించి వర్తమానాలు వినడానికి మీలో ఎంతమంది భయపడతారు? మనం మంచి ఆరోగ్యమంటే భయపడతామా? లేదు. అయితే మన శరీర ఆరోగ్యం కంటే ముఖ్యమైన ఆత్మీయ ఆరోగ్యం విషయంలో మనం పరిపూర్ణత అంటే ఎందుకు భయపడాలి? పాపము వ్యాధి వంటిది. దాన్ని మనం లేవియకాండంలో చూస్తాము. ప్రభువు ఇక్కడ పరిశుద్ధతకు సంబంధించి మరియు ఆరోగ్యానికి సంబంధించిన నియమాలను ఇస్తున్నాడు. ఇవి రెండూ సమానమైనవే - ఒకటి ఆత్మకు మరొకటి శరీరానికి సంబంధించినవి. శరీరానికి పరిశుద్ధతను మనం ఆరోగ్యమని పిలుస్తాము అలాగే శరీరానికి ఆరోగ్యమనియు మరియు ఆత్మకు పరిశుద్ధతనియు పిలుస్తాము.

గనుక పరిశుద్ధత అంటే మనకున్న భయాన్ని మనము పోగొట్టుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యముకంటే సంపూర్ణ పరిశుద్ధతను కోరుకునే స్థాయికి మనం చేరుకోవాలి. మన శరీరాలలో మనం అన్ని వ్యాధులనుండి ఎలా విడిపించబడాలనుకుంటామో మనలను అపవిత్రపరిచే పాపమంతటినుండి విడిపించబడటానికి మనము ఆశపడాలి. మనము వ్యాధిని సహించనట్లే పాపమును సహించకూడదు. మురికి తలంపులను సహించడం కుష్టువ్యాధిని లేక క్షయవ్యాధిని సహించినట్లే. కోపమును సమర్థించుకొని అది నా బలహీనత లేక అది నా స్వభావము అని మనలను మనము సమర్థించుకొనుట మన శరీరములో ఎయిడ్స్ వ్యాధిని లేక క్యాన్సర్ వ్యాధిని సహించినట్లే. పాపము మరియు రోగము చాలా సమానమైనవి.

ఉదాహరణకు లేవీయకాండములో కుష్టువ్యాధి లేక అటువంటి చర్మపు వ్యాధులున్న వారితో ఎలా వ్యవహరించాలో దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. అది ఈ పుస్తకములో పాపమునకు సాదృశ్యము మరియు ఇక్కడ ఇవ్వబడిన నియమములు పాపముతో ఎలా వ్యవహరించాలో అన్న విషయానికి సంబంధించినవి. 'పరిశుద్ధత' లేక 'పరిశుద్ధమైన' అనే మాటలు ఈ పుస్తకములో దాదాపు వంద సార్లు వస్తాయి. ఈ పుస్తకము యొక్క ముఖ్య నేపథ్యము ఇదేనన్న విషయాన్ని ఇది నొక్కి చెప్తుంది. వందసార్లు పరిశుద్ధత అనే మాట ఉంటే అది నిశ్చయముగా ముఖ్యమైన పుస్తకమే.

పరిశుద్ధత మరియు ఆరోగ్యమునకు సంబంధించిన నియమాలతో కూడిన అనేక అధ్యాయాలు ఇక్కడ మనకున్నాయి. ఇవన్నియు ఒకవ్యక్తి జీవితము యొక్క అతి చిన్న వివరాలలో దేవుని అత్యాసక్తిని కనుపరచుచున్నవి. దేవుడు మన జీవితాల యొక్క చిన్న చిన్న వివరాలలో ఆసక్తి కలిగియుండడని మనమనుకుంటాము. కాని లేవియకాండములో దేవుడు ప్రతి చిన్న విషయమందు ఆసక్తి కలిగియున్నాడని నేను కనుగొన్నాను. ఒక బల్లి వంట పాత్రలో పడినప్పుడు ఇశ్రాయేలీయులు ఏమి చేయాలో వారితో చెప్పబడెను. బల్లి పడిన ఆ మట్టి పాత్రను పగుల గొట్టబడవలెను. దానిలోని అంటువ్యాధిని మరణమును కలుగజేయవచ్చు గనుక దానిని తినకూడదు (11:33). వారు అపవిత్రపరచబడినప్పుడు వారు ఎలా స్నానం చేయాలో కూడా దేవుడు వారితో చెప్పారు. వారు పారునీటిలో స్నానం చేయవలెను (15:13). వారు అపవిత్రపరచబడినప్పుడు వారి బట్టలు కూడా ఉదుకుకోవలెనని వారితో చెప్పాడు (15:5, 7 మరియు 17వ అధ్యాయము). దేవుడు తన ప్రజల యెడల తీసుకున్న జాగ్రత్తకు ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. నీవు తినే ఆహారములో నీ పరిశుభ్రతలో, నీవు చేయు స్నానములో నీ బట్టలు క్రమముగా ఉదుకుకొనుటలో దేవుడు ఆసక్తి కలిగియున్నాడని నీవెప్పుడైనా ఊహించావా? ఇటువంటి వాటి గురించి చదవడానికి చాలా ఉత్సాహంగా ఉంది. లేవీయకాండము విసుకుపుట్టించేదని ఎవరన్నారు?

ఈ పుస్తకములో లైంగిక పవిత్రత గురించి మరియు ఇంకెన్నో ఆసక్తికరమైన అంశాల గురించి వ్రాయబడియున్నవి. దేవుడు అహరోనుతో "మీరు ప్రత్యక్షగుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షరసమునేకాని మద్యమునేగాని త్రాగకూడదు. మీరు ప్రతిష్టింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైన దానినుండి పవిత్రమైన దానిని వేరుచేయుటకును, యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ" అని చెప్పాడు. వారి శరీరాలను అపవిత్రపరిచే దేనిని వారు తినకూడదని త్రాగకూడదని దేవుడు నాయకులతో చెప్తున్నాడు. నాయకులుగా వారి ప్రవర్తనలో వారు ఉత్తమమైన వారిగా ఉండవలెను.

దేవుడు 11వ అధ్యాయములో వారితో పవిత్రమైన మరియు అపవిత్రమైన జీవుల గురించి వారు ఏ జీవులను తినవచ్చునో ఏ జీవులను తినకూడదో చెప్పెను. ఈ వాక్యభాగము నుండి నేను నేర్చుకునేదేమిటంటే దేవుడు మన ఆహార అలవాట్లయందు కూడా ఆసక్తి కలిగియున్నాడు. మనము ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల కలిగియుండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని బైబిలు 1కొరంథి 10:31లో చెప్తుంది. లేవీయకాండములో తినుట త్రాగుట గురించి ఉన్న ముఖ్య సందేశమేమిటంటే "నీ శరీరానికి మంచిదికాని దేనిని నీవు తినవద్దు, త్రాగవద్దు". ఈ రోజున దేవుని పిల్లలు తినే అనేక చిరుతిండ్ల(చెత్త తిండి) గురించి దేవుడు అదే మాటను చెప్తున్నాడు.

ఇక్కడ ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నవి. ఉదాహరణకు 11:13లో "వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులగొట్టవలెను" మరియు 11:34లో "తినదగిన ఆహారమంతటిలో దేనిమిద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగినయే పానీయమును అపవిత్రము". ఆయన ఇక్కడ ఇశ్రాయేలీయులతో ఆరోగ్యకరమైన అలవాట్లను పరిశుభ్రమైన జీవన విధానమును కలిగియుండుమని చెప్తున్నాడు. మనము ఆరోగ్య సూత్రాలను ఉల్లఘించిన తరువాత జబ్బుపడి "ప్రభువా, నన్ను స్వస్థపరచు" అని ప్రార్థన చేయలేము. అది బుద్ధిహీనత. దేవుడు చేసిన ఆరోగ్య సూత్రాలను నీవు ఉల్లంఘిస్తే నీకు రోగం వచ్చినప్పుడు నిన్ను తప్ప నీవు ఎవరినీ నిందించలేవు. "నీవు నా ఆజ్ఞలను గైకొంటే నేను నిన్ను స్వస్థపరచువానిగా ఉంటాను" అని దేవుడు నిర్గమకాండము 15:26లో చెప్పడం మనం చూచాము. దేవుడు స్వస్థతకంటే మెరుగైన ఆరోగ్యము అనే వరాన్ని ఇవ్వాలనుకొంటున్నాడు. కాని మనం శరీరము కొరకు ఆయన చేసిన నియమాలను మనము పాటించాలి. "నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవలెను" అని మనము 11:44లో చదువుతాము.

ఈ వచనాన్ని 1పేతురు 1:16లో ఉటంకించాడు "మనలను పిలచిన వాడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై యుండవలెను".

పరిశుద్ధత మరియు పరిశుభ్రత లేవీయకాండము యొక్క రెండు ముఖ్య నేపథ్యములు.