WFTW Body: 

నిరీక్షణ

కృప, సాత్వికము, దీనాత్మను కలిగియుండుట మరియు జయించుట మొదలగు వాటివలే "నిరీక్షణ" అనునది కొత్తనిబంధన పదం. కొద్దిమంది విశ్వాసులు మాత్రమే నిరీక్షణ గురించి ఎక్కువగా ఆలోచించెదరు. కాని అకరాధిపట్టిక(కన్‍కార్డెన్స్) ద్వారా దీనిని ధ్యానించుట మంచిది.

దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడెదమని రోమా 5:2-4 చెప్పుచున్నది. శ్రమలు ఓర్పును కలుగజేయును. గనుక శ్రమలయందును అతిశయపడెదము. ఆవిధముగా నిరీక్షణ కలుగును. గతములో దేవుడు మనలో మార్పును కలుగజేసినరీతిగా రాబోయే కాలములో ఆ మార్పును సంపూర్ణముగా కలుగజేయును.

భవిష్యత్తును గూర్చిన నిరీక్షణతో మనలను నింపవలెనని దేవుడు కోరుచున్నాడు. మన చుట్టుప్రక్కల ఉన్నవారివలె మనము నిరాశ నిస్పృహలతో భవిష్యత్తును ఎదుర్కొనము. మనలో ఈ సత్కార్యమును ఆరంభించినవాడు, దానిని సంపూర్ణముగా చేయునని ఎంతో నిరీక్షణ కలిగియున్నాము (ఫిలిప్పీ 1:6). నిరీక్షణద్వారా నిరాశను జయించెదము.

నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినదానిని గట్టిగా పట్టుకొనెదము (హెబ్రీ 10:23). అనగా మనము ఇప్పుడు ఓడిపోయినప్పటికిని, దేవుడు వాగ్దానము చేసిన రీతిగా నిశ్చయముగా ఆయన మనకు జయమిచ్చునని మన నోటితో ధైర్యముగా ఒప్పుకొనవలెను. నిరీక్షణను బట్టి మనము సంతోషించెదము. దేవుడు వారికి చేసిన దానిని బట్టి సాధారణముగా విశ్వాసులు కృతజ్ఞత చెల్లించెదరు. కాని దేవుడు మనకు చేయబోవుచున్న దానిని గురించి కూడా నిరీక్షణ కలిగి సంతోషించెదము.

కీర్తన 1:3లో అతడు చేయునదంతయు సఫలమగునని వాగ్దానము ఉన్నది. మనయెడల ఇదియే దేవుని చిత్తము మరియు క్రీస్తులో దీనిని జ్యేష్ఠత్వపు హక్కుగా పొందవలెను.

సంతోషము

"ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు"(కీర్తన 16:11). గనుక మనలోనుండి సంతోషము ప్రవహించుటయే దేవుని సన్నిధిలో ఉన్నామనుటకు ఋజువు. నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మలో ఆనందమైయున్న దేవునిరాజ్యము మన హృదయములలోనికి వచ్చియున్నదని దీనిద్వారా తెలుసుకొనెదము (రోమా 14:17). నీతిని ప్రేమించి మరియు దుర్నీతిని ద్వేషించువారి మీద ఆనందతైలాభిషేకము ఉండును. కనుక మనము పాపమును ద్వేషించి మరియు నీతిని ప్రేమించిన యెడల ఆ సంతోషము మనలో ఉండును (హెబ్రీ 1:9). ప్రభువునందు ఆనందించుటయే ఎల్లప్పుడు మీ బలమైయుండును గాక (నెహెమ్యా 8:10). సంతోషము, శోధనను పోరాడుటను సులభము చేయును.

రెండు కారణములను బట్టి నానావిధ శోధనలు వచ్చినప్పటికిని ఆనందించుమని యాకోబు చెప్పుచున్నాడు (యాకోబు 1:1-4). (1) మనలో ఉన్న విశ్వాసము నిజమైనదా కాదా అని తెలుసుకొనెదము (అనగా మనవద్ద ఉన్న బంగారము నిజమైనదా లేదా నకిలీదా అని మనము కనుకొనుట ద్వారా మనము బీదవారమైయుండి ధనవంతులమని మోసపోము). (2) మన ఓర్పు పరిపూర్ణమగును. అప్పుడు మనము ఏ విషయములోను కొదువలేనివారమై సంపూర్ణులమగుదుము.

మనకు వచ్చుచున్న శోధనలను మనము ఆనందముగా ఎదుర్కొనుచున్నయెడల, అద్భుతమైన ఫలితములను పొందెదము. విశ్వాసులు వృధాగా శోధనలలో గుండా వెళ్ళుచున్నారు. వారు ఆనందించుటకు బదులుగా ఫిర్యాదు చేయుచు సణుగుచున్నారు. గనుక ఆ శ్రమల ద్వారా ధనవంతులు కాలేకపోవుచున్నారు.