వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము అన్వేషకుడు
WFTW Body: 

ఈ రోజుల్లో అనేకమంది విశ్వాసులు తమ సొంత మత శాఖలతో విసికిపోయి, ఒక కొత్త నిబంధన సంఘమును వెదకుట కొరకు వాటిని విడిచిపెట్టుచున్నారు. "కొత్త నిబంధన సంఘములు" అని చెప్పుకొనే అనేకమైన గుంపులు కూడా ఉన్నవి. కాని ఒక క్రొత్త నిబంధన సంఘమును మనము ఎలా గుర్తుపట్టగలము? అది నిశ్చయముగా దాని కూడికల యొక్క క్రమమును బట్టికాదు. ఒక శక్తివంతమైన సంఘములో మనముచూచే క్రమములో అనేకమైన వాటిని అనుకరించినప్పటికీ, మనము ఒక శక్తివంతమైన సంఘము కాకపోవుట సాధ్యమే.

మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారము వంటి దానినే సరిగ్గా ఫిలిష్తీయులు కట్టుట సాధ్యమే ఎందుకనగా, దాని వివరములన్నియు నిర్గమకాండములో స్పష్టముగా ఇవ్వబడినవి. కాని ఆ ప్రత్యక్షపు గుడారమునకు సంబంధించిన ఒక్క విషయమును ఎవరు అనుకరింపలేకపోయి యుండేవారు - అది ప్రత్యక్షపు గుడారము మీద నిలిచిన దేవుని మహిమయను అగ్ని. అరణ్యములో ఆ ఒక్క విశేషమైన గుర్తుచేత దేవుని నివాసస్థలము గుర్తింపబడెను. అది లేకుండా ఆ ప్రత్యక్షపు గుడారము, ఒక ఖాళీ గుల్లగా నుండును. తరువాత సొలొమోను సమయములో ప్రత్యక్షపు గుడారము యొక్క స్థానములో దేవాలయము వచ్చినప్పుడు దేవుని మహిమ దానిని నింపెను. కాని తరువాత, ఇశ్రాయేలు దిగజారినప్పుడు, ఆ మహిమ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయెను (యెహెజ్కేలు 10:4,18,19). అప్పుడు ఆ ఆలయము ఒక ఖాళీ గుల్లగా మారెను. ఈ రోజున అనేక సంఘముల విషయంలో కూడా అదే జరుగుచున్నది.

క్రొత్త నిబంధన సంఘమునకు ఉన్న ఒక గుర్తు దాని మధ్యలో ఉన్న దేవుని సన్నిధి. ఒక సంఘకూడికలో ప్రవచనాత్మ శక్తివంతముగా ఉన్నప్పుడు, ఆ కూడికకు వచ్చువారు సాగిలపడి, "దేవుడు అక్కడ ఉన్నాడని అంగీకరించుదురు" (1కొరంథీ 14:24,25). యేసు సంఘములో ప్రవచనాత్మకముగా మాట్లాడినప్పుడు, ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళే ఇద్దరి శిష్యుల హృదయాలు యేసు వారితో మాట్లాడినప్పుడు మండినట్లు మన హృదయాలు కూడా మండును (లూకా 24:32). దేవుడు దహించు అగ్నియై యున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుటకు ఒక పొదలోకి దిగివచ్చినప్పుడు, ఆ పొద మండెను మరియు ఏ పురుగు దానిలో జీవించగలిగియుండలేక పోయెను. సరిగ్గా అదే విధముగా, ఈ రోజున శక్తివంతమైన మండే దేవుని సన్నిధి ఉన్న చోట ఏ పాపము దాగి బయటపడకుండా ఉండలేదు. అటువంటి సంఘము మాత్రమే ఒక క్రొత్త నిబంధన సంఘము. యేసుని నేత్రములు అగ్ని జ్వాలలవలె ఉన్నవి (ప్రకటన 1:14). మరియు ఆయన కట్టుచున్న సంఘములన్నిటిలో ఆయన నిరంతరము పాపమును, మానవ ఆచారాలను పరిసయ్యుల బోధను వెదకుచు బయటపెట్టుచున్నాడు.

పరలోక రాజ్యమునకు ప్రధానమైన తాళపుచెవి ఆత్మ విషయమైన దీనత్వము (మత్తయి 5:3). ఇది లేకుండా మనము క్రొత్త నిబంధన సంఘమును కట్టలేము. ఆత్మ విషయమై దీనులుగా ఉండుట అంటే, మన అవసరతను గుర్తించుచు దేవుని యెదుట విరగగొట్టబడియుండుట, ఎందుకనగా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మనము కూడా పరిపూర్ణులుగా ఉండుటకు మనము ఒక గొప్ప తీవ్రమైన వాంఛను కలిగియున్నాము. "విరిగిన హృదయముగల వారికి యెహోవా ఆసన్నుడు" (కీర్తనలు 34:18). ఆయన సమీపముగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి పరలోకపు అగ్నిని మన హృదయాలలోకి తీసుకొనివచ్చి మనమెక్కడికి వెళ్ళినను మన ద్వారా ఇతరులకు దానిని తెచ్చును.

దేవుని సన్నిధి అగ్నివలె మండుచున్న యెరుషలేములోని శక్తివంతమైన క్రొత్త నిబంధన సంఘములో అననీయ సప్పీరా చేరినప్పుడు ఘోరమైన తప్పిదము చేసిరి (అపొ.కా. 5వ అధ్యాయము). వారుగనుక తరువాతి సంవత్సరాలలో కొరంథులో ఉన్న సంఘములో నున్నయెడల వారు దీర్ఘాయుషు గల జీవితాలను జీవించియుండెవారు. అననీయ అక్కడ ఒక సంఘపెద్ద కూడా అయ్యిండెడివాడు - ఎందుకనగా కొరింథులో ఉన్న సంఘము ఒక శరీరానుసారమైన మృతమైన సంఘము గనుక. కాని యెరుషలేములోనున్న మండుచుండే క్రొత్త నిబంధన సంఘములో, ఈ దంపతులు మనుగడ సాగించలేకపోయిరి. ఏ క్రొత్త నిబంధన సంఘములోనైనా వేషధారణలో జీవించే వారిని దేవుడు బయటపెట్టి తీసివేయును.

ఇంటి యొద్ద లేక మనము పనిచేయు స్థలములో మన జీవితాలలో దేవునిని అవమానపరచేది ఏదైనా ఉన్న యెడల, మనము ఒక నిజమైన క్రొత్త నిబంధన సంఘము యొక్క సభ్యులుగా ఉన్న యెడల మనము ఒక గొప్ప ప్రమాదములో ఉన్నాము. మీ జీవితములో మీ ప్రధాన గురి దేవుని మహిమను వెదకుట కాక, మీ కొరకో మీ కుటుంబము కొరకో ఏదోఒకటి కోరుకొనుట అయితే, దేవుని సన్నిధి శక్తివంతముగా ఉండి ఆయన వాక్యము శక్తివంతముగా ప్రకటింపబడు క్రొత్తనిబంధన సంఘమును మీరు విడిచిపెట్టుట ఎంతో మెరుగైనది. మీరు ఒక మృతమైన సంఘములో చేరుట మీకు మంచిది. అప్పుడు కనీసము, అననీయ సప్పీరాల వలే కాక మీరు దీర్ఘకాలము జీవించెదరు!.

తమ్మును తాము "క్రొత్త నిబంధన సంఘాలు" అని పిలచుకొనే అనేకమైన సంఘాలు ఈనాడు కలవు. కాని అవి (అంతరించి పోయిన) ఒక మృతమైన డోడో పక్షివలే నున్నవి. పేరులో ఏమిలేదు. ప్రశ్న ఏమిటంటే అక్కడ పరిసయ్యులు, వేషదారులు సుఖంగా జీవించగలరా లేక వారు బయటపెట్టబడి అభ్యంతరపడి వెళ్ళిపొవుదురా అన్నది. ఒక క్రొత్త నిబంధన సంఘములో అనేకులు వాక్య ప్రకటన వలన అభ్యంతరపడి సంఘమును విడిచిపెట్టుదురు. "ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు" అని యెరూషలేములోని సంఘము గురించి వ్రాయబడినది (అపొ.కా. 5:13).

పెద్దలుగా మన కోరిక యేసు కొరకు శిష్యులను చేయుటకాక మన సంఖ్యలను పెంచుటకొనుట అయినయెడల, మన సంఘాలలో మనము పరిసయ్యులను మరియు వేషధారులను పోగుచేసుకొనెదము. ఒక సంఘములో యేసు యొక్క సన్నిధి బలముగా ఉన్నయెడల, దానిలో ఉన్న శిష్యులు ఆయన మహిమను చూచుటకు ప్రాముఖ్యతనిచ్చెదరు. మనము నిజముగా తిరిగిలేచిన ప్రభువు యొక్క మహిమను చూచామనుటకు ఋజువేమిటంటే, భూసంబంధమైన విషయాలు (సుఖము, ఘనత, ధనము వంటిని) మన కళ్ళకు మసకగా కనిపించి ఒకప్పుడు వాటి కొరకు మనకున్న ఆకర్షణను కోల్పోవును. ఒక క్రొత్త నిబంధన సంఘములో ఒక శక్తివంతమైన వాక్య ప్రకటన కాక, వాక్యము యొక్క సజీవమైన మాదిరులు కూడా ఉండును. దేవుని కొరకు ఇతరులపై ప్రభావము చూపునది క్రొత్త సిద్ధాంతము కాదు గాని పరిశుద్ధమైన జీవితములు. క్రొత్త నిబంధన సేవకులు కేవలము ఇతరులకు బోధించుట మాత్రమే కాక, వారిని తమ మాదిరిని అనుసరించమని ఆహ్వానించెదరు (1కొరంథీ 11:1).

మన మాదిరి యోగ్యమైనది కానప్పుడు మనము దుఃఖపడవలెను. మనము ప్రజలను తాజాగాలేని, అభిషేకములేని వర్తమానములతో విసిగించినప్పుడు, సిగ్గుతో మన తలను దించుకోవలెను. మనము యేసును వెంబడించిన యెడల చల్లగాగాని లేక పరిసయ్యులవలేగాని మారుట అసాధ్యము. మనము మాట్లాడుటకు కేవలము కలలు దర్శనాలను మాత్రమే కలిగియుండి, ప్రజలకు ఆహారమిచ్చుటకు ప్రభువు యొద్దనుండి ఏ మాటలేనియెడల మనము యేసుకు చాలా దూరముగా ఉన్నాము. మనము దేవునికొరకు మండుచున్నయెడల, ప్రజలను విసిగించుట అసాధ్యము.

ఆయనకు అన్నిటిలోను ప్రాముఖ్యము కలుగునిమిత్తము యేసు మృతులలోనుండి లేపబడెను (కొలస్స 1:18). దీనిని వారి ఆశయముగా కలిగిన వారందరికీ దేవుడు పూర్తిగా మద్దతిచ్చును. దీని అర్థమేమిటంటే మనము మన స్వంత ప్రణాళికలను హక్కులను విడిచిపెట్టి మనము ఏమిచేయవలెనో, మన డబ్బును సమయమును ఎలా ఉపయోగించవలెనో యేసు మనకు చెప్పుటకు అనుమతించెదము. జీవితములో ఇది మీ ఏకైక ఆశయమైతే మీరుండు స్థలములో క్రొత్త నిబంధన సంఘము కట్టుటకు దేవుడు మిమ్మును వాడుకొనునని మీరు నిశ్చయముగా నమ్మవచ్చును.

తాము ఆయన నామమును ఉచ్ఛరించినందున యేసు తమ మధ్య ఉన్నాడని అనేకులు చెప్పుకొందురు. కాని వారు తమ్మునుతాము మోసగించుకొనుచున్నారు. ఆయన నిజముగా వారి మధ్య ఉంటే ఆ కూటములు ఎందుకు విసుగు పుట్టించేవిగా ఉండును? ఎందుకు జీవితాలలో పరివర్తన లేదు? ఒక నిజమైన భక్తి పరుని యొక్క సహవాసములో గడిపిన కొద్దిసమయము కూడా మనపైన ఎంత లోతైన ప్రభావమును చూపునంటే అది మన జీవితాల యొక్క దిశను కూడా మార్చివేయును. మనము స్వయంగా యేసుతోనే కొద్ది సమయము గడిపితే మన జీవితాలపైన ఇంకెంత ప్రభావము ఉండవలెను. కాబట్టి సంఘ కూడికల ద్వారా జీవితాలు పరివర్తన చెందకపోయినయెడల, మన కూడికలలో ప్రభువు యొక్క సన్నిధిలేదని మనము ఒప్పుకొనవలెను. అప్పుడు మనము ఒక క్రొత్త నిబంధన సంఘముగా లేము.

ఈ భూమి మీద ఒక పరిపూర్ణ సంఘమును మనమెప్పుడు కట్టలేము. యేసు పండ్రెండు మంది అపొస్తలులతో కట్టిన మొదటి సంఘములో కూడా ఒక ద్రోహియుండెను. కాబట్టి మనము ఇంకా మెరుగైనదాని కొరకు ఆశపడలేము. కాని ఈ రోజున యేసు తన సంఘమును ఎక్కడ కట్టునో అక్కడ, ఆయన మహిమను చూచి దానితో పట్టబడిన కొందరు ఆ సంఘములో కేంద్రముగా ఉంటారు. వారి హృదయములు అపవాది ఆర్పలేని ఒక మంటతో మండుచుండును. వారి ద్వారా ప్రభువు దేవుని మహిమార్థమై ఒక క్రొత్త నిబంధన సంఘమును కట్టును.