నిజాయితీగా ఉండండి
మత్తయి 5:28లో యేసు ఇలా చెప్పారు, "ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా డగును". దీని నుండి విడుదల పొందుటకు మనం దేవుని వద్దకు వెళ్ళాలి. మొదటి అడుగు నిజాయితీగా ఉండుట. మీరు కోపపడినప్పుడు, నిజాయితీగా ఉండండి. మీరు తప్పు చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి, "సోదరుడా, నన్ను క్షమించండి. నేను మీతో మాట్లాడిన విధానానికి చింతిస్తున్నాను" అని చెప్పండి. మీరు కోపంతో రోజుకు పదిసార్లు పాపం చేస్తే, ఆ వ్యక్తి వద్దకు పదిసార్లు వెళ్లి క్షమించమని అడగండి. దేవుడు మీరు నిజాయితీగా మరియు వినయంగా ఉన్నారని చూసినప్పుడు, దాని నుండి విడుదల పొందే శక్తిని ఆయన మీకు ఇస్తాడు.
కానీ మీరు దాచిపెట్టి, ఒక సాకు చూపి, మీ కోపాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు ఎప్పటికీ విడుదల పొందలేరు. మీ కోపాన్ని సమర్థించుకునే ఏకైక సమయం అది దేవుని మహిమకు సంబంధించినప్పుడు మాత్రమే, మీకు సంబంధించినప్పుడు కాదు.
స్త్రీలను మోహించే విషయానికి వస్తే, మీరు ఎప్పటికీ సమర్థించబడరు. మీరు మీ భార్యను చూసి ఆమెను మెచ్చుకోవచ్చు, కానీ మరే ఇతర స్త్రీని కాదు. అది దేవుని చిత్తం కాదు. ఇక్కడ మీరు తీవ్రంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. మొదట, మీరు నిజాయితీగా ఉండి, "ప్రభువా, నేను వ్యభిచారం చేశాను" అని చెప్పాలి. "నేను అందమైన ముఖాన్ని మెచ్చుకున్నాను" అని ఎప్పుడూ చెప్పకండి. బదులుగా, "నేను వ్యభిచారం చేశాను" అని చెప్పండి.
మీరు నిజాయితీగా ఉంటే, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు.
తీవ్రంగా ఉండండి
మరో విషయం ఏమిటంటే, మీరు తీవ్రంగా ఉండాలి. "జారత్వం నుండి పారిపోండి" అని బైబిల్ చెబుతుంది (1 కొరింథీయులు 6:18). మీరు కంప్యూటర్ వద్ద ఉన్నప్పుడు మీరు శోధించబడితే, దాని నుండి పారిపోండి లేదా దాన్ని ఆపివేసి, "ప్రభువా, నేను ఏమి కోల్పోయినా నేను పట్టించుకోను, కానీ నేను ఇక్కడ పడకూడదనుకుంటున్నాను" అని చెప్పండి. "నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, దానిని పెరికి వేయమని" యేసు చెప్పినప్పుడు, ఆయన మన కుడి కన్నును భౌతికంగా పెరికివేయమని చెప్పడం లేదు. అది సుస్పష్టం, ఎందుకంటే మీరు అప్పటికీ ఎడమ కన్నుతో మోహించవచ్చు. మీరు పాపం పట్ల తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలనేదే దాని అర్థం. మీ నాలుక మరియు మీ కళ్ళ విషయంలో తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలి.
మీరు శోధించబడినప్పుడు గుడ్డి మరియు మూగ వ్యక్తిలా ఉండండి. మూగవాడు తన గొంతు ఎత్తి ఎవరిపైనైనా అరవగలడా? ఒక గుడ్డివాడు మోహించగలడా? లేదు. గుడ్డివానిలా ఉండి, "ప్రభువా, స్త్రీలను మోహించడానికి నువ్వు నాకు కళ్ళు ఇవ్వలేదు. నీ మహిమను చూడటానికి నువ్వు నాకు కళ్ళు ఇచ్చావు" అని చెప్పు. అలా చేయకపోతే, నువ్వు నీ శరీర భాగాలను కాపాడుకోవచ్చు కానీ నరకంలో పడవేయబడతావని యేసు చెప్పారు. నీ శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయి (అంటే, నీ భౌతిక శరీరం కోరుకునే పాపపు ఆనందాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించడం) దేవుని రాజ్యంలోకి వెళ్లడం మంచిది.
అదే విధంగా, యేసు ఇలా చెప్పారు, "నీ కుడి చేతితో లైంగికంగా పాపం చేసి, అది నిన్ను అభ్యంతరపరుస్తుంటే, దానిని నరికివేయి" (మత్తయి 5:30). నీ కుడి చేతితో లేదా ఎడమ చేతితో పాపం చేయకుండా నీకు రెండు చేతులు లేవని ఊహించుకో. యేసు చాలా నిక్కచ్చిగా సామాన్యంగా మరియు ఆచరణాత్మకంగా ఉన్నాడు. పాపం చాలా తీవ్రమైనది కాబట్టి, నువ్వు గుడ్డివాడిగా, చేతులులేని వానిగా ప్రవర్తించమని యేసు నీకు చెప్తున్నాడు. మనం అలాంటి తీవ్రమైన వైఖరిని కలిగి ఉంటే, దేవుడు మనం పూర్తిగా విడుదల పొందుటకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను మరియు మనం శ్రేష్ఠమైన వివాహాలు కలిగి ఉంటాము. వివాహం, మోహం అనే సమస్యను పరిష్కరిస్తుందని అనుకోకండి. వారి ఆలోచనలలో ఎల్లప్పుడూ వ్యభిచారంలో పడే వివాహితులు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను చూసే వివాహితులు చాలా మంది ఉన్నారు. వివాహం ఆ సమస్యను పరిష్కరించదు ఎందుకంటే అది అంతర్గత కోరిక. మీరు పరిశుద్ధాత్మ శక్తితో దానితో పోరాడకపోతే, మీరు ఓడిపోతారు మరియు మీరు మీ జీవితమంతా ఒక ఆత్మీయమైన క్రైస్తవుడనని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు.
యేసు మాట్లాడుతున్నది, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయి క్రైస్తవ్యమా? కాదు, ఆయన నరకం నుండి ఎలా తప్పించుకోవాలో చెప్తున్నాడు. నరకం నుండి తప్పించుకోవడం పోస్ట్‌గ్రాడ్యుయేట్ క్రైస్తవ్యం కాదు. అది ప్రాథమికమైనది. మీ మొత్తం శరీరం నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక భాగం నశించడం మంచిదని యేసు చెప్పారు. నరకం నుండి రక్షింపబడటం అనేది కనీస అవసరం, మరియు ప్రతి దేశంలోని ప్రతి శిష్యుడికి దీనిని మనం బోధించాలని యేసు కోరుకుంటున్నాడు. ఇది ఎంతగా బోధించబడుతోంది? చాలా తక్కువగా. అందుకే నా స్వంత పరిచర్యలో దానిని నొక్కి చెప్పమని ప్రభువుచేత వ్యక్తిగతంగా ఆదేశించబడ్డాను.