"నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు" (మత్తయి 5:6). లోకంలోని ప్రజలు అన్ని రకాల వస్తువుల కోసం ఆకలిదప్పులతో ఉన్నారు. లోకంలో ప్రజలు ఆకలిదప్పులు కలిగి ఉన్న విషయాలను మీరు పరిశీలిస్తే, అవి సంపద, డబ్బు, సౌకర్యవంతమైన జీవితం, ఇళ్ళు మరియు భూములు, సమాజంలో పురోగతి, వారి ఉద్యోగాలలో ఉన్నత స్థానం, వారి రూపాన్ని అందంగా మార్చుకోవడం, ఈ ప్రపంచంలో వారికి గౌరవం, సౌకర్యం మరియు ఆనందాన్ని తెచ్చే ఏదైనా మరియు ఇలాంటివని చూస్తారు. ఇది చాలా మంది క్రైస్తవుల విషయంలో కూడా నిజం.
తాము తిరిగి జన్మించామని చెప్పుకునే చాలా మంది క్రైస్తవులు కూడా వీటిని అనుసరిస్తున్నారు. కానీ దైవిక జీవితాన్ని గడపడానికి ఆకలిదప్పులతో ఉండటం - పాపాన్ని జయించడానికి ఆకలిదప్పులతో ఉండటం - చాలా అరుదైన లక్షణం; యేసు చెప్పినట్లుగా చాలా కొద్దిమంది మాత్రమే ఈ జీవమార్గాన్ని కనుగొంటారని నేను నమ్ముతాను. పూర్తిగా నీతిమంతులుగా ఉండాలనే సందేశంపట్ల చాలా తక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లు కనుగొన్నప్పుడు నేను ఆశ్చర్యపోను. వాస్తవానికి, ప్రజలు "అది అసాధ్యం" అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోను. కొండమీది ప్రసంగం అసాధ్యమైన ప్రమాణాలను కలిగి ఉందని మరియు ఎవరూ దాని అనుగుణంగా జీవించలేరని ప్రజలు చెప్పినప్పుడు, లోకస్తుడైన క్రైస్తవుడి నుండి లేదా లోక వైఖరులు కలిగి తిరిగి జన్మించామని చెప్పే క్రైస్తవుల నుండి నేను ఆశించే సమాధానం అదే. కొండమీది ప్రసంగంలో యేసు బోధించినవన్నీ నిర్లక్ష్యం చేస్తే అలాంటి వ్యక్తి నిజంగా తిరిగి జన్మించాడా లేదా అని నేను ప్రశ్నిస్తాను. అందుకే యేసు మత్తయి 28:20లో "నేను ఆజ్ఞాపించినవన్నీ వారికి బోధించండి" అని చెప్పే ముందు "వారిని శిష్యులనుగా చేయండి" అని చెప్పాడు.
తనను తాను క్రైస్తవుడని చెప్పుకుని, పరలోకానికి వెళ్లాలని మాత్రమే కోరుకుంటూ, యేసు ఆజ్ఞాపించినవన్నీ పాటించడంలో ఆసక్తి చూపని ప్రతివ్యక్తి దానికి ఎంతో దూరంగా ఉన్నాడు. ఒక వ్యక్తి నిజంగా శిష్యుడైతే, యేసు ఏమి ఆజ్ఞాపించాడో తెలుసుకోవడానికి అతను ఆసక్తి చూపుతాడు. యేసు నిజమైన శిష్యుడి వైఖరి ఇలా ఉంటుంది, "నేను ఆత్మలో దీనుడను కావాలని ఆయన కోరుకుంటే, దానిని పాటించుటకు దాని అర్థం ఏమిటో నేను తెలుసుకోవాలి. నా పాపాన్నిబట్టి నేను దుఃఖించాలని లేదా సౌమ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటే, దాని అర్థం ఏమిటో కూడా నేను తెలుసుకోవాలి. నేను నీతి కోసం ఆకలిదప్పులతో ఉండాలని ఆయన కోరుకుంటే, నేను నీతి కోసం ఆకలిదప్పులతో ఉండలని కోరుకుంటాను".
నీతి కొరకు ఆకలిదప్పులతో ఉండటం అంటే ఏమిటి? ఉదాహరణకు, మీరు "నాకు కొంచెం నీళ్ళు కావాలి" అని అడిగితే, ఆ గ్లాసు నీళ్ళకు మీరు ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు? ఒక గ్లాసు నీళ్ళకు లక్ష రూపాయల ఖరీదనుకుంటే? మీరు, "లేదు, ఒక గ్లాసు నీళ్ళకు లక్ష రూపాయలు చెల్లించేంత దాహం నాకు లేదు" అని అంటారు. కానీ మీరు ఏడు రోజులుగా ఎడారిలో తిరుగుతూ, మీ శరీరమంతా ఎండిపోయి, మీ నోరు ఎండిపోయి, దాహంతో చనిపోబోతున్న వ్యక్తి అయితే ఆలోచించండి, మీరు ఒక గ్లాసు నీళ్ళకు లక్ష రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు! దాహం అంటే అది. మీరు ఆకలితో చచ్చిపోతుంటే ఆహారం కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.
యేసు మాట్లాడుతున్న ఆకలిదప్పులు అవే. అనుకూలమైనప్పుడు లేదా నా ప్రణాళికలకు భంగం కలగనప్పుడు మాత్రమే నీతిమంతులుగా ఉండడంకాదు కాని ఏంత వెలైనా సరే నీతిమంతులుగా ఉండాలనే తీవ్రమైన ఆకలిదప్పులు. సంఘంలో కూర్చునే చాలా మంది, పరిశుద్ధతపై సందేశాలను వినే వారు కూడా, అది వారి ప్రణాళికలకు భంగం కలిగించకపోతే, లేదా అది వారి భవిష్యత్తు ఆశయాలను నాశనం చేయకపోతే, లేదా వారు వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకోకుండా అడ్డుకోకపోతే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. దానికి పెద్దగా వెల చెల్లించాల్సిన అవసరం లేనంత వరకు వారు నీతిని కోరుకుంటారు. కాబట్టి మీరు వారికి నీతిని అందించినప్పుడు, వారి మొదటి ప్రశ్న, "వెల ఎంత?" అయితే, వారు నిజంగా ఆకలితో లేరని మీకు తెలుస్తుంది. తీవ్రంగా దాహం వేసిన లేదా ఆకలితో ఉన్న వ్యక్తి వెల అడగడు. అతను, "నాకు ఆ నీరు ఇవ్వండి! నేను చెల్లిస్తాను! నా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇస్తాను ఎందుకంటే నేను చనిపోతున్నాను!" అని అంటాడు.
మన హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకడం అంటే అదే. చాలామంది, ఇతరులు కనుగొన్న విధంగా దేవుణ్ణి కనుగొనలేకపోవడానికి, వారికి సంతృప్తికరమైన క్రైస్తవ జీవితం లేకపోవడానికి కారణం (చాలా మంది తిరిగి జన్మించిన క్రైస్తవుల పరిస్థితి ఇదే), వారు తమ హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకకపోవడమే. నేను చాలా దేశాలు ప్రయాణించి 52 సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నాను, నిజాయితీగా ఇలా చెప్పగలిగే వారిని నా జీవితంలో చాలా తక్కువ మంది క్రైస్తవులను నేను కనుగొన్నాను, "నేను ప్రభువులో నిజంగా సంతృప్తి కలిగి ఉన్నాను, నా క్రైస్తవ జీవితంతో నేను సంతృప్తికలిగి ఉన్నాను, ఆయన నాకు ఇచ్చిన పురోగతితో నేను సంతృప్తికలిగి ఉన్నాను, ఆ పురోగతికొరకు వెళ్ళిన మార్గాన్ని బట్టి నేను కృతజ్ఞుడను. నేను ప్రతిరోజూ నా జీవితం గురించి ఉత్సాహంగా ఉన్నాను!" చాలా తక్కువ మంది నిజాయితీగా అలా చెప్పగలరు. చాలా మంది తమ క్రైస్తవ జీవితం పట్ల విసుగు చెందారని నేను కనుగొన్నాను. బహుశా వారు మార్పుచెందిన రోజున ఉత్సాహంగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారు చాలా విసుగు చెంది ఉంటారు. వారికి బైబిల్ చదవడానికి సమయం లేదు, వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి లేదు; వారు సంఘానికి వెళ్లడం, సాక్ష్యమివ్వడం మరియు పేదలను చూసుకోవడం వంటి కొన్ని కార్యకలాపాలలో పాల్గొంటుండవచ్చు, కానీ వారు యేసు అడుగుజాడలను అనుసరించడం పట్ల ఉత్సాహంగా ఉండరు.
దీని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి మనం మనిషి మరియు దేవుని గురించి ఒక నియమాన్ని అర్థం చేసుకోవాలి. యిర్మీయా 29:13 లో ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఇలా అంటున్నాడు, "మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు". మీరు ఆయనను హృదయపూర్వకంగా కాక అర్థహృదయంతో లేదా మూడు వంతుల హృదయంతో వెతుకుతుంటే పరిస్థితి ఏమిటి? అవును, మీకు ఒక మతం ఉంటుంది, మీరు చేసే ఆచారాలు మరియు వివిధ పనులతో కూడిన కేవలం మతానుసారమైన క్రైస్తవ్యం మీకు ఉంటుంది, కానీ మీరు ప్రభువును తెలుసుకోలేరు. మీరు యేసును వ్యక్తిగత స్నేహితుడిగా తెలుసుకోలేరు, మీరు క్రైస్తవ జీవితంలో ప్రతిదాన్ని కోల్పోతారు. మీకు క్రైస్తవ పేరు ఉండవచ్చు మరియు క్రైస్తవ సంఘ సభ్యుడు కావచ్చు, కానీ మీరు ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే, మీరు ప్రధాన విషయాన్ని కోల్పోయారు. కారణం మీరు మీ పూర్ణహృదయంతో దేవుణ్ణి వెతకకపోవడమే కావచ్చు. మీరు మీ పూర్ణహృదయంతో వెతుకుతున్న లోక విషయాలు చాలా ఉన్నాయి, కానీ ప్రభువును వెదకుట లేదు.