వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

కొన్నిసార్లు మన జీవితంలో ఒక విషయంలో దేవుని చిత్తము కొరకు వెదుకుతాము కాని వేరే విషయంలో దేవుని చిత్తము కొరకు వెదకము. ఉదాహరణకు వివాహ విషయంలో దేవుని చిత్తమును ఎంతో వెదకుతాము కాని ఉద్యోగవిషయంలో ఆ విధంగా వెదకము. లేక కొన్నిసార్లు ఉద్యోగ విషయంలోవెదకి వివాహవిషయంలో వెదకము. మనకున్నటువంటి సెలవు దినాలు ఎలా గడపాలో దేవుని చిత్తమును వెదకుతాము కాని మన డబ్బు ఖర్చుపెట్టె విషయంలో ఆయన చిత్తమును వెదకము.

ఎందుకనగా మనకనుకూలంగావున్న విషయాలలో మాత్రమే దేవుని చిత్తమును వెదుకుతాము. మన హృదయములో స్వార్థముతో కూడిన ఉద్దేశములు కలిగియుంటాము. కాని వాటిని ఎరుగము. కొన్ని విషయాలలో మనం పొరపాట్లు చేయుటవలన మనకు నష్టంకాని లేక శ్రమలుకాని రాకుండునట్లు ఆ విషయములలో దేవుని చిత్తమును వెదకుతాము. ఇక్కడ మన ఉద్దేశం దేవుని సంతోషపెట్టుట కాదు కాని మనం సంతోషముగాను సమృద్ధిలో జీవించుటకు కోరెదము. కాని మన జీవితములలో అన్ని విషయములలో దేవుని చిత్తమును వెదకినప్పుడు మాత్రమే మరియు అన్ని మార్గములలో ఆయన చిత్తమును ఒప్పుకొనినప్పుడు మాత్రమే దేవుడు మనలను నడిపిస్తానని వాగ్దానము చేశాడు. అందువలన మనం దేవుని యెక్క చిత్తమును తెలుసుకొనలేము.

కొన్ని విషయములలో దేవుని చిత్తము ఇప్పటికే లేఖనములలో వ్రాయబడియున్నది. ఉదాహరణకు మనం పరిశుద్ధులమును కృతజ్ఞత కలిగిన వారమైయుండవలెనని దేవుడు కోరుచున్నాడని బైబిలు చెప్పుచున్నది.

"మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే-పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము", "ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము" (1 థెస్సలోనీకయులకు 4:3-5, 5:17,18).

అదే విధముగా మనలను మనం ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు (రోమా 13:9). మనం దేవుని యొక్క క్షమాపణను మరియు ప్రేమను పొందుకొనినట్లయితే ఇతరుల విషయంలో కూడా అదే కోరుకోవాలి. కొత్త నిబంధనలో దేవుని చిత్తము స్పష్టముగా బయలుపరచబడింది. మనం ఆయన యొక్క సాక్షులమైయుండాలి (అపో.కా. 1:8). మనం ఇతరులను ప్రేమించినయెడల వారి ఇతర అవసరాలతో పాటు ప్రత్యేకముగా వారి ఆత్మీయ అవసరముల గూర్చి శ్రద్ధ వహిస్తాము. దేవుడు ఈ విధంగా చెప్పాడు, "నీ ఆహరము ఆకలిగొనినవానికి పెట్టుము నీ రక్తసంబంధికి ముఖము తప్పింపకుండుము, వస్త్రహీనుని కనుగొనినప్పుడు వారికి వస్త్రములను ఇవ్వుము. అలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును... అప్పుడు నీవు పిలవగా ఆయన ఉత్తరమిచ్చును. నీవు ఆయనను పిలువగా ఆయన ... వెంటనే నేను ఉన్నాను అనును. నీవు ఇతరులను బాధించినట్లయితే వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి నీవు మాట్లాడుటయు నీవు మానాలి. మరియు ఆకలిగొనిన వారికి ఆహరమిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును" (యెషయా 58:7-11 -లివింగ్ బైబిలు). ఇతరుల అవసరాల విషయంలో స్వార్థములేని వారై శ్రద్ధ కలిగియున్న యెడల దేవుడు తన మనసుని నీకు బయలుపరచును.

దేవుడు బయలుపరచిన విషయంలో ఆయన చిత్తమునకు లోబడనట్లయితే వేరే విషయంలో దేవుడు ఆయన చిత్తమును బయలుపరుస్తాడని నీవు కోరకూడదు. తాను పొందిన వెలుగును నిర్లక్ష్యం చేయువారు, ఇతరవిషయాలలో దేవుని వెలుగును పొందరనునది ఒక నియమమైయున్నది. మనం మొదటి మెట్టుని వేయనియెడల రెండవ మెట్టుని దేవుడు మనకు చూపించడు. "నీవు ఒక్కొక్క మెట్టు నడచుచున్న కొలది, నీకు మార్గమును తెలియచేయుదును" అనునది దేవునియెక్క వాగ్ధానము (సామెతలు 4:4 వివరణ). మనం వేసే ప్రతి అడుగు విషయంలో ఆయన ఆసక్తి కలిగియున్నాడు. "ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును" (కీర్తనలు 37:23).

ఇక్కడ విధేయులగుటకు మరొక వాగ్ధానమున్నది. "నీకు ఉపదేశము చెసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱములవలెనైనను కంచరగాడిదలవలెనైనను మీరు ఉండకుడి" (కీర్తనలు 32:8, 9) (గుఱ్ఱము ఎల్లప్పుడు సహనము లేనిదై తొందరపడుతుంటుంది, కంచర గాడిద ముందుకు వెళ్ళుటకు ఇష్టపడదు. ఈ రెండు లక్షణాలను మనం విసర్జిస్తూ ఉండాలి).

మనం అవిధేయత చూపించినప్పుడు మన మనసాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడును. కాబట్టి నీవు ఎల్లప్పుడు మనసాక్షి యొక్క స్వరం వినుటకు జాగ్రత్తపడాలి. ప్రభువైన యేసు ఇట్లన్నారు- "నీ దేహమునకు దీపము కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును" (లూకా 11:34). ఇక్కడ కన్ను విషయంలో ప్రభువు యొక్క అర్థమేమిటి? మత్తయి 5:8లో హృదయశుద్ధిగల వారు ఆత్మీయ మేలు పొందుతారని ప్రభువు చెప్పారు. కాబట్టి ఇక్కడ మనసాక్షి కన్నుగా చెప్పబడింది. నీవు మనసాక్షికి లోబడుతున్నట్లయితే అంతకంతకు శుద్ధ హృదయాన్ని పొందుతావు.

మనసాక్షి తనకుతానే దేవుని స్వరముగా పనిచేయదు, కాని ఒక వ్యక్తి పొందిన జ్ఞానమును బట్టిగాని తీర్మానమును బట్టిగాని పనిచేస్తుంది. ఎల్లప్పుడు విధేయులగుచు మరియు బైబిలు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నట్లయితే, అది అంతకంతకూ దేవుని అంతస్తుకు నడిపిస్తుంది. లూకా 11:34లో ఉన్న వాగ్ధానం ఏమనగా మన మనసాక్షిని మనం నిర్మలముగా ఉంచుకొనినట్లయితే దేవుని వెలుగు మన జీవితాలలో అంతకంతకు ప్రకాశించి మరియు ఆయన చిత్తమును తెలుసుకొనెదము. మన అనుదిన జీవితములలో మన మనసాక్షి స్వరమును వినకుండా ఉన్నట్లయితే మనం దేవుని చిత్తమును ఎరుగుచుండినప్పుడు ఆత్మ స్వరాన్ని వినలేము. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడుట, దేవుని చిత్తమును తెలుసుకొనుటయొక్క రహస్యమైయున్నది.

ఈ మధ్య కాలంలో పుట్టు గుడ్డివాడైన 15 సంవత్సరాల అబ్బాయి విమానం నడిపించి క్షేమంగా తిరిగివచ్చాడు. విమానం నడిపే పైలెట్ యొక్క ఆజ్ఞలకు అతడు వెంటనే విధేయత చూపుట వలన ఈ మహత్కార్యం అతడు చేయగలిగాడు. మన జీవితములో అనేక సమస్యలు ఎదుర్కొనుచున్నప్పుడు, గుడ్డివారు తెలియని స్థలంలో విమానం దింపుచున్నట్లుగా అనిపిస్తుంది. కాని దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే అలవాటును మనం చేసుకున్నట్లయితే, మనం సురక్షితంగా గమ్యం చేరెదమని కనుగొంటాము.