వ్రాసిన వారు :   Sunil Poonen విభాగములు :   గృహము సంఘము తెలిసికొనుట
WFTW Body: 

"మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి" (ఎఫెసీ 6:11).

మనలో అనేకమంది ఈ వచనాన్ని వినే ఉంటారు. ‘రక్షణయను శిరస్త్రాణము’ మరియు ‘నీతియను మైమరువు’ గూర్చి చదివే ఉంటారు. అయితే వీటిని ధరించుకున్న మొట్టమొదటి వ్యక్తి యేసు అనే విషయం మీకు తెలియకపోవచ్చు, "సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తిలేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను" (యెషయా 59:16-17).

ఇది యేసును గూర్చిన పాత నిబంధన ప్రవచనం, దీనినే పౌలు ఎఫెసీ 6వ అధ్యాయంలో ప్రస్తావించాడు.

అయితే అద్భుతమైన విషయమేంటంటే యేసు మనకోసం విజ్ఞాపన చేయుటకు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. విజ్ఞాపన చేయుటలో ఆయన మాదిరిని వెంబడించమని ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు.

అనుదిన జీవితంలో ఆయుధములను మోయవారు

పాత నిబంధన లేఖనాలలో మరియు పురాతన కాలంలో ఒక పోరాట యోధునికి ఆయుధములు మోసేవాడు ఉండేవాడు. అతడు నిశ్శబ్ధంగా, ఎటువంటి పేరులేని సహాయకుడిగా ఆయుధములను మోస్తూ ప్రమాదంలో కూడా దగ్గరగా ఉంటూ ఆ పోరాట యోధుడు యుద్ధమునకు అన్ని ఆయుధములతో సిద్ధంగా ఉండునట్లు చూసేవాడు. ఈ దృశ్యం, మన భాగస్వాముల కొరకు పిల్లల కొరకు సంఘ కుటుంబము కొరకు విజ్ఞాపన చేసే మన పిలుపుకు సరిగ్గా సరిపోతుంది. మన కొరకు ఆయుధాలు మోయువాడుగా, మనకొరకు విజ్ఞాపన చేయుటకు జీవించుచున్న యేసు యొక్క పరిపూర్ణ మాదిరిని వెంబడించుటయే ఈ పిలుపు.

మన జీవితంలో ఇటువంటి పోరాటాలను ప్రతిరోజు చూస్తూ ఉంటాం:

  • - నిరుత్సాహంతో, తనపై తాను జాలిపడుతూ, ఆందోళనతో లేక కష్టతరమైన పనితో, ఆర్థిక పరిస్థితిలో కృంగిన జీవిత భాగస్వామి.
  • - అభద్రతతో లేక రహస్యమైన పాపంతో లేక బడిలో ఒక సవాలుకరమైన పరిస్థితులతో పోరాడుతున్న బిడ్డ.
  • - పాపంలో ఓడిపోతున్న లేక కొన్నిసార్లు పాపము వారిని విషపూరితం చేస్తోందని గ్రహించని సహోదరుడు లేక సహోదరీ.

వీటికి మన యొక్క స్పందన, వారికి దూరంగా ఉండి వారిని నిందించేదిగా ఉండకూడదు. అలా కాకుండా మనం ఆయుధాలు మోయువారుగా ఉండి "నీ పోరాటం నా పోరాటమే. నీ బలహీనత నా బలహీనతే. యేసు నాతో నిలిచినట్లు నేను నీతో నిలబడతాను" అని చెప్పాలి.

విజ్ఞాపన చేయు ప్రేమకు మొదటి గుర్తు: నేను 100% నీతోనే ఉంటాను

1సమూయేలు 14లో యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారిని హతము చేయుటకు తన ఆయుధములు మోయువానితో కలిసి విశ్వాసంతో రెండు పదునైన కొండల మధ్య ఎక్కి వెళ్ళాడు. అతను ఈ విధంగా చెప్పాడు, "యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా" (1సమూయేలు 14:6). అతని ఆయుధములు మోయు వాని సమాధానం ఎంతో అద్భుతమైనది: "నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నాను" (1సమూయేలు 14:7).

  • - భార్యలారా: మీ భర్తలు ఆత్మీయంగా పోరాడుతున్నప్పుడు, "పూర్తిగా నేను నీతో ఉన్నాను" అనేది మీ యొక్క సమాధానమా? లేక మీరు అనుమానాన్ని భయాన్ని విత్తుతున్నారా?
  • - భర్తలారా: నీ భార్య కష్టపడుతున్నప్పుడు మీరు విమర్శిస్తూ దూరంగా ఉంటున్నారా? లేక ఆమె బలహీనత మీ బలహీనత అయినట్లుగా మీరు జోక్యం చేసుకుంటున్నారా?
  • - సహోదర సహోదరీలారా: మీ సంఘ పెద్దలు ఒక శ్రమ గుండా వెళ్తూ ప్రభువుపై నమ్మకంతో కష్టతరమైన నిర్ణయాలను తీసుకున్నట్లయితే మీరు వారికి ఆయుధాలు మోయవానివలె మద్దతుగా నిలుస్తున్నారా? లేక దూరంగా నిలిచి విమర్శిస్తున్నారా?

నిందారోపణ చేసే ఆత్మ గురించి యేసు మనల్ని హెచ్చరించారు. మన కంటిలో తీర్పు తీర్చుట అనే పెద్ద దూలాన్ని ఉంచుకొని, మన సహోదరుని కంటిలో ఒక నలుసును మనం గుర్తిస్తాము. అయితే నిందారోపణ దూలమును తీసివేయుటతో ఆ కథ ముగిసిపోదు, నిందారోపణ చేసే ఆత్మను తీసివేసుకున్న తర్వాత సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటతో అది ముగుస్తుంది. మన సహోదరుని కంటిలో ఉన్న నలుసు, మన కంటిలో ఉన్న నలుసుగా పరిగణించినప్పుడే అది సాధ్యమవుతుంది. మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి... యేసువైపు చూచుచు పరుగెత్తుదము (హెబ్రీ 12:1). నీ భారం కేవలం నీది మాత్రమే కాదు, ఇప్పుడు అది మన భారం.

యాకోబు 5:20 ఈ విధంగా చెప్తుంది, "పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును". ఈవిధంగా ప్రేమ అనేక పాపములను కప్పుతుంది (1పేతురు 4:8). ప్రేమ పాపమును పట్టించుకోకుండా ఉండదు; అది మారుమనస్సు పొందుటకు మరియు తిరిగి సమకూర్చబడుటకు పోరాడుతుంది.

యూదా 22,23 ఈ విధంగా చెప్తుంది, "సందేహపడు వారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి". విజ్ఞాపన చేయు ప్రేమ, పాపం చేత చెడిపోవుటను గూర్చి జాగ్రత్తగా ఉంటుంది, అయినప్పటికీ పూర్తి కనికరంతో మన ప్రియులను వారిని దహించే పాపము నుంచి బయటకు తీసుకుని రావడానికి పట్టుదలతో ప్రయత్నిస్తుంది.

విజ్ఞాపన చేయు ప్రేమకు రెండవ గుర్తు: నేను తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రార్థిస్తాను

లేఖనం మనకు ఆజ్ఞాపించే ‘నిశ్శబ్దమైన సువార్తీకరణ’ ఒకటి ఉంది. 1పేతురు 3:1-2 ఈ విధంగా చెప్తుంది, "అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యములేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును". ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఒక ఆత్మను గెలవగలరనే విషయం మీకు తెలుసా?

అక్కడ ‘అటువలె’ అని చెప్పబడినప్పుడు కొన్ని వచనాలకు ముందు 1పేతురు 2:23లో చెప్పబడిన మాదిరిని వెంబడించమని అర్థం. అక్కడ యేసు గూర్చి ఈ విధంగా చెప్పబడింది, "ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను".

అక్కడ మాదిరిగా చెప్పబడిన వ్యక్తి యేసు కాబట్టి ఇది కేవలం భార్యలకు మాత్రమే కాదు మనమందరం వెంబడించవలసిన మాదిరి. విజ్ఞాపన చేయు ప్రేమ అనగా ‘ప్రజలతో తక్కువ మాటలు దేవునితో ఎక్కువ మాటలు’ అని కూడా అర్థం వస్తుంది.

దేవుని సర్వాంగ కవచం గురించి వివరించిన తర్వాత పౌలు చెప్పిన మాటలను చూడటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అవి మనకు సర్వాంగ కవచం యొక్క విస్తృతమైన ఉద్దేశానికి సూచనను ఇస్తాయి. దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి చెప్పబడిన వచనాల తర్వాత ఎఫెసీ 6:18లో పౌలు ఈ విధంగా చెబుతున్నాడు, "ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి". నేను దేవుని సర్వాంగ కవచం నా కొరకు నేను నిలబడుటకు మాత్రమే గాక ఇతరుల పోరాటాలలో ప్రార్థన చేయుటకు కూడా అనే విషయం ఎంతో విప్లవాత్మకమైనది. అది నా కుటుంబంతో ప్రారంభించి తర్వాత నా సంఘం నా సమాజం కొరకు చేసే ప్రార్థన.

అదేవిధంగా ఈ విధమైన విజ్ఞాపన పోరాటానికి యెషయా ఒక అందమైన చిత్రాన్ని ఇస్తున్నాడు. యెషయా 62:1, "సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను".

ఇక్కడ సీయోను మరియు యెరూషలేము అన్నచోట మీ భాగస్వామి పేరు, మీ సహోదరుని పేరు, నీ పిల్లల పేరు పెట్టండి. "నా భార్యని బట్టి నేను మౌనంగా ఉండను... నా బిడ్డనుబట్టి... నా సహోదరుని బట్టి..".

ఇది విజ్ఞాపన చేయు పరిచర్య - పట్టుదలతో, తరచుగా కనపడకుండా దేవునికి ఎంతో ప్రశస్తమైనదిగా ఉంటుంది. సమూయేలు దీనిని ఎంతో లోతుగా అనుభవించి ఈ విధంగా చెప్పాడు, "మీ కొరకు ప్రార్థించకుండా ఉండుటవలన నేను ప్రభువుకు విరోధంగా పాపము చేయకుందును గాక" (1సమూయేలు 12:23). విజ్ఞాపన చేయకపోవడం తన దృష్టిలో దేవునికి వ్యతిరేకమైన పాపం. సౌలు తప్పిపోయి తన యొక్క అభిషేకాన్ని కోల్పోయిన తర్వాత కూడా, అతన్ని మరల చూడనప్పటికీ అతని గురించి రోధించుటను మానలేదు (1సమూయేలు 15:35).

వారి సంబంధం ఎంతో కష్టతరమైనదిగా దూరమైనదిగా ఉన్నప్పటికీ కూడా, విజ్ఞాపన ప్రేమ వారి కొరకు నిరంతరం ప్రార్థిస్తునే ఉంటుంది.

విజ్ఞాపన చేయు ప్రేమకు మూడవ గుర్తు: దేవుని నీతిని నేను నీమీద ప్రకటిస్తాను

జెకర్యా 3లో ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రభువు దూత ఎదుట మురికి వస్త్రములతో సాతాను అతని నిందిస్తుండగా నిలబడినప్పుడు. జెకర్యా 3:2లో ప్రభువు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు, "సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా?".

తర్వాత ప్రభువు, అతని మలిన వస్త్రములు తీసివేయమని ఆజ్ఞాపించారు. యెహోషువాతో, "నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను" అని చెప్పారు. ఐదవ వచనంలో జెకర్యా, "అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని మనవి చేశాడు".

ఇది తప్పిపోయిన కుమారుని యెడల తండ్రి యొక్క హృదయం: మారుమనస్సుయొక్క మొదటి గుర్తులోనే, పరిగెత్తి కౌగిలించుకుని వస్త్రములు ధరింపచేసి పునరుద్ధరించి అతని గురించి సంతోషించాడు. ఆ కథలో పెద్ద కుమారుని వలె కాకుండా, మనం కూడా మారుమనస్సుయొక్క మొదటి గుర్తు కనిపించగానే అదే ఆనందాన్ని, ఉత్సవాన్ని మరియు సమర్థించుటను మనం చూపించాలి. ఆవిధంగా కాకుండా "మంచి ఆరంభం. కాని నిజంగా తీవ్రంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని చూద్దాం" అని చెప్పకూడదు. దానికి బదులుగా "ప్రభువు నీ అపరాధాన్ని తీసివేసాడు మరియు నీవు మారుమనస్సు పొందినప్పుడు నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఆయన నీపై ప్రకటించిన దానిని నేను కూడా సంతోషంతో ప్రకటిస్తున్నాను" అని చెప్పాలి.

కుటుంబములు మరియు సంఘముల కొరకైన ఒక పిలుపు

భార్యాభర్తలిద్దరు ఒకరికొకరు ఆయుధములను మోయవారుగా ఉన్నట్లయితే, తల్లితండ్రులు వారి పిల్లలను నిందించుటను తిరస్కరించి వారి పిల్లల గురించి మెలకువగా ఉండి ప్రార్థించినట్లయితే ఆ కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించండి. సహోదర సహోదరీలు నిశ్శబ్దంగా ఒకరు మరొకరి పరిశుద్ధత కొరకు పోరాడుతున్నట్లయితే ఆ సంఘం ఏ విధంగా ఉంటుందో ఊహించండి.

  • - ఒకరినొకరు ఇతరుల పోరాటాలు వారివైనట్టు మోస్తూ
  • - తక్కువగా మాట్లాడి ఎక్కువగా ప్రార్థిస్తూ
  • - మారుమనస్సుయొక్క మొదటి గుర్తులోనే దేవుని యొక్క నీతిని గూర్చిన వాగ్దానాన్ని ఒకరిపై ఒకరు ప్రకటించే కుటుంబాలు మరియు సంఘాలను ఒకసారి ఊహించండి.

ప్రభువు అటువంటి కావలివారిని మరియు ఆయుధములను మోయువారిని, విజ్ఞాపన చేయు ప్రేమ కలిగిన వారిని మన వివాహాలలో మన కుటుంబాలలో మన సంఘంలో లేవనెత్తును గాక.