యాకోబు రెండుసార్లు దేవునిని కలుసుకొనియున్నాడు - ఒకసారి బేతేలు దగ్గర (ఆదికాండము 28 ) మరియు రెండవసారి పెనూయేలు దగ్గర (ఆదికాండము 32 ).
బేతేలు అనగా "దేవుని మందిరము" (సంఘానికి సాదృశ్యము) మరియు పెనూయేలు అనగా "దేవుని ముఖము". మనమందరము సంఘముద్వారా దేవుని ముఖమును చూడవలసిన అవసరమున్నది. బేతేలు దగ్గర "ప్రొద్దు గ్రుంకుంగెను" (ఆదికాండము 28:11 )- అనగా యాకోబు రాబోయే 20 సంవత్సరములలో పొందబోయే చీకటి అనుభవమును చూపించుచున్నది. తరువాత పెనూయేలు దగ్గర, "సూర్యోదయమును" (ఆదికాండము 32:31) - అనగా యాకోబు చివరకు దేవుని వెలుగులోనికి వచ్చుటను చూపించుచున్నది.
బేతేలు దగ్గర యాకోబు భూమిమీద నుండి ఆకాశమునంటుచున్న నిచ్చెనను గూర్చిన కల కనెను (యోహాను 1:51), భూమి మీద నుండి పరలోకము వెళ్ళుటకు, తానే ఆ నిచ్చెనగా ఉన్నాడని ప్రభువైనయేసే పరలోకానికి మార్గమైయున్నాడని, ప్రవచనాత్మకమైన దర్శనములో యాకోబు చూచెను. ఆ కలలో ప్రభువు అనేక విషయములను యాకోబుకు వాగ్దానము చేశాడు. కాని భూసంబంధమైనవి కలిగియుండి, భూమిమీద భద్రతను, ఆరోగ్యమును మరియు ఆర్థికముగా వర్ధిల్లుటను గురించే అతడు ఆలోచించెను. కాబట్టి దేవునితో ఇట్లన్నాడు, "ప్రభువా నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల, నాకు వచ్చు రాబడిలో 10% నీకిచ్చెదను". దేవుడు కేవలం తనను కాపాడే కాపరి మాత్రమేనని యాకోబు భావించాడు. దేవుడు దానిని చేసిన యెడల యాకోబు తనయొక్క రాబడిలో నుండి 10% దేవునికి వేతనముగా ఇచ్చును!!
ఈనాడు అనేకమంది విశ్వాసులు కూడా ఆవిధముగానే ఉన్నారు. వారు కేవలం వస్తువాహనములనే దేవుని యొద్దనుండి కోరుచున్నారు. మరియు ప్రభువు వాటిని వారికి దయచేసిన యెడల, వారు నమ్మకముగా సంఘకూటములకు వెళ్ళుచు మరియు దేవుని పనికి కొంత డబ్బు ఇచ్చెదరు. అటువంటి విశ్వాసులు లోకసంబంధమైన వ్యాపారస్థులవలె వారి సౌఖ్యమును మరియు లాభమును కోరుచూ దేవునితో వ్యాపారము చేయుచున్నారు.
భూసంబంధమైన వాటిని లాగుకొనుటకు(పట్టుకొనుటకు) యాకోబు 20 సంవత్సరములు జీవించాడు. లాబాను కుటుంబము నుండి భార్యను పొందుకొనుటకు ప్రయత్నించి, ఇద్దరు భార్యలను పట్టుకొనియున్నాడు. అతడు ఇద్దరిని కోరలేదు కాని ఇద్దరిని పొందికొనియున్నాడు. అప్పుడు అతడు లాబానును మోసగించి, అతని గొఱ్ఱెలను పట్టుకొని మరియు ధనవంతుడైయున్నాడు. అతడు వట్టి చేతులతో లాబాను ఇంటికి వెళ్ళి, అక్కడ ధనవంతుడైయున్నాడు. ఈనాటి అనేక విశ్వాసులవలెనే, అతడు దేవుని ఆశీర్వాదము వలననే ధనవంతుడనయ్యాని అనుకున్నాడు. కానీ "దేవుని ఆశీర్వాదానికి" నిజమైన గుర్తు ఏమిటి? ధనవంతులగుటయేనా? కాదు. క్రీస్తువలె రూపాంతరము పొందుటయే నిజమైన ఆశీర్వాదము. దేవునికిగాని లేక మానవునికిగాని నీవు ఉపయోగపడకుండా, నీవు మంచి ఉద్యోగము, ఒక మంచి ఇల్లు మరియు ఇతర సౌఖ్యములు కలిగియున్నయెడల ఏమి ప్రయోజనము? కాని దేవుడు యాకోబులో పనిచేయుట ఆపలేదు. పెనూయేలు దగ్గర ఆయన మరలా అతనిని కలిసియున్నాడు.
సహోదర,సహోదరీలారా! మీలో అనేకులకు దేవుడు రెండవసారి మిమ్ములను ఎదుర్కొనవలసియున్నదని మీకు చెప్పాలని కోరుచున్నాను. ఎందుకనగా, అప్పుడు మీరు మీ జీవితములో అట్టడుగునకు వెళ్ళుటయు మరియు దేవుడు మిమ్ములను తీర్పుతీర్చి, నరకానికి పంపుటకు బదులుగా పరిశుద్ధాత్మతో మిమ్ములను నింపును.
యాకోబు ఏశావు తనను కలుసుకొనుటకు వచ్చుచున్నాడని అతనికి భయపడెను (ఎందుకనగా 20 సంవత్సరముల క్రితము అతని జేష్టత్వపుహక్కును మోసగించి యాకోబు పొందుకొనియున్నాడు). ఏశావు తనను తప్పక చంపుతాడని తనకు తెలియును. మనము భయపడే పరిస్థితులను దేవుడు అనుమతించుట మనకు మంచిది. ఎందుకనగా మనము మనుష్యులకు భయపడినప్పుడు, దేవుని దగ్గరకు చేరెదము. పెనూయేలు దగ్గర యాకోబు ఒంటరివాడైయున్నాడు (ఆదికాండము 32:24). మనము ఒంటరిగా ఉన్నప్పుడే, నిజముగా దేవునిని కలుసుకొనగలము. అందువలననే సాతాను, మనుష్యులందరికి (ప్రత్యేకముగా పట్టణములలో ఉండువారికి) దేవునితో ఒంటరిగా గడిపే సమయము లేకుండునట్లు, వారికి తీరిక లేకుండ చేయును. వారు ఎల్లప్పుడు సమయములేకుండా, తీరిక లేకుండా చేసి, దేవునితో ఒంటరిగా కలిసే అవకాశము లేకుండా చేయును. ఈనాటి క్రైస్తవ్యములో ఇది బాధకరమైన విషయము.
దేవుడు యాకోబుతో ఆ రాత్రి అనేక గంటలు పెనుగులాడినను, అతడు ఆయనను పోనియ్యలేదు. గత 20 సంవత్సరములుగా యాకోబు జీవితములో జరుగుచున్న దానికి, ఈ పెనుగులాట సాదృశ్యముగా ఉన్నది. దేవుడు యాకోబు యొక్క మొండితనాన్ని చూచి, చివరకు అతని తొడగూటి మీద కొట్టగా, అతని తొడ గూడువసిలెను. అప్పటికి యాకోబు వయస్సు 90 సంవత్సరములు మాత్రమే మరియు అతడు బలవంతుడుగా ఉండెను. అతని తాత అబ్రాహాము 175 సంవత్సరములు జీవించాడు. కాబట్టి ఇంక అతనికి 85 సంవత్సరాల ఆయుష్షు ఉన్నది గనుక అతడు యౌవ్వన దశలో ఉన్నాడు. ఆ వయస్సులోనే అతని తొడ గూడువసిలెను. కాబట్టి భవిష్యత్తులోని అతని ప్రణాళికలన్నియు తారుమారయ్యెను. ఈ దినములలో దానిని మనము అర్ధము చేసుకొనగోరినయెడల, 20 సంవత్సరాల వయస్సులో చేతికఱ్ఱతో నడిచినట్లుండును. అది విరుగగొట్టబడిన అనుభవము. తరువాత అతడు జీవితాంతము చేతికఱ్ఱ సహాయముతోనే నడిచెను. యాకోబును విరుగగొట్టుటకు దేవుడు అనేక మార్గములలో ప్రయత్నించినప్పటికీ అది జరుగలేదు కాబట్టి చివరకు జీవితాంతము చేతికఱ్ఱతో నడిచేటట్లు అనుమతించాడు. ఆ విధముగా యాకోబు విరుగగొట్టబడియున్నాడు.
దేవుడు యాకోబు తొడమీద కొట్టిన తరువాత ఇట్లన్నాడు, "నేను నా పనిచేసి ముగించాను. ఇప్పుడు నన్ను పోనిమ్మనెను. నీవు నన్ను కోరలేదు. నీవు స్త్రీలను మరియు డబ్బును మాత్రమే కోరియున్నావు". కాని ఇప్పుడు యాకోబు దేవుని పోనిచ్చుటలేదు. చివరకు అతనిలో మార్పు కలిగినది. స్త్రీలకొరకు మరియు ఆస్తిపాస్తులకొరకే ఇప్పటివరకు జీవించిన వ్యక్తి, ఇప్పుడు దేవునిని కోరుచూ అతడిట్లనెను, "నీవు నన్ను ఆశీర్వాదించితేనే గాని నిన్ను పోనియ్యననెను". అతడు దేవునిని మాత్రమే కోరుకొనునట్లు, దేవుడు అతనిలో ఎంత గొప్ప కార్యము చేశాడో గదా! "మనకు దేవుడు తప్ప మరేమియు లేనప్పుడు, ఆయన మన అవసరమంతటికీ చాలినవాడని తెలుసుకొందుమని" ఒక పాత సామెత ఉన్నది. ఇది నిజము. చివరకు అతడు దేవునిని అక్కడ కలుసుకొనినందున దానికి పెనూయేలు అను పేరుపెట్టాడు. బేతేలు దగ్గర, దేవుని మందిరానికి అతడు తీసుకొనిపోబడియున్నాడు. అనేక సంవత్సరములు నీవు దేవుని మందిరములో ఉన్నప్పటికినీ, నీకు దేవుని ముఖ దర్శనము లేకపోవచ్చును. నీవు దేవుని ముఖ దర్శనమును చూచునట్లు, మరియొక సారి నీవు దేవుని కలుసుకొనవలసియున్నది. సంతోషముతో యాకోబు ఇట్లనుచున్నాడు, "ఓ దేవా నీ ముఖాన్ని చూచుచున్నాను కాబట్టి నా జీవితము కాపాడబడును".