వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట
WFTW Body: 

లూకా 15వ అధ్యాయములోనున్న మూడు ఉపమానములలో మనము నాలుగు రకాల తప్పిపోయిన వారిని చూస్తాము - తప్పిపోయిన గొఱ్ఱె, తప్పిపోయిన చిన్న కుమారుడు, తప్పిపోయిన పెద్దకుమారుడు మరియు తప్పిపోయిన నాణెము - త్రియేక దేవుని సాదృష్యముకూడా ఈ ఉపమానములలో ఉంది.

అజాగ్రత్త వలన తప్పిపోయిన విశ్వాసికి తప్పిపోయిన గొఱ్ఱె సాదృశ్యముగా ఉంది. గొఱ్ఱెల కాపరి దేవుని కుమారుడగు యేసుకు సాదృశ్యముగా ఉన్నాడు. దేవునికి సంఘమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన విశ్వాసికి తప్పిపోయిన కుమారుడు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ తండ్రి, తండ్రియైన దేవునికి సాదృశ్యముగా నున్నాడు. అతడు మొదటి ఉపమానములో వలె వెతుక్కుంటు వెళ్ళడు. కుమారుడు పందుల స్థాయికి దిగజారి తనంతట తాను తిరిగి వచ్చేవరకు అతడు వేచియుండును. అక్షరానుసారత, స్వనీతి మరియు గర్వములో తప్పిపోయినవారికి పెద్దకుమారుడు సాదృశ్యముగా ఉన్నాడు.

పోయిన నాణెము కొరకు వెదికే స్త్రీ పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘమునకు సాదృశ్యముగా ఉంది. ఆమె దీపమును వెలిగించి ఇల్లును ఊడ్చింది (లూకా 15:8). నాణెము దొరకే వరకు జాగ్రత్తగా వెదికింది. ఆమె నాణెమును పోగొట్టుకున్నప్పుడు జాగ్రత్తలేని సంఘముగా ఉండెను. దీనికారణముగా కొందరు తప్పిపోయిరి (నాణెము పోయెను). అప్పుడామె ఒక దీపమును వెలిగించి (పరిశుద్ధాత్మతో నింపబడి) తప్పిపోయిన వారికొరకు వెదకి వారిని కనుగొని వారిని తిరిగి మందలోకి తెచ్చెను. నశించుచున్న వారికొరకు తప్పిపోయిన వారికొరకు ఎటువంటి భారములేని విశ్వాసులు అనేకమంది ఉన్నారు. వారు తమను గురించి మాత్రమే ఆసక్తి కలిగియుంటారు. అటువంటి వారు తండ్రియైన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్ముడైన దేవునితో సంబంధముకలిగిలేరు. నేను అనేక సంవత్సరాలుగా చేసిన ప్రార్థన ఇదే. మా సంఘాలలో ఉన్న పెద్దలను కూడా ఇలా ప్రార్థించమని ప్రోత్సహించాను. "ప్రభువా, ఈ ప్రాంతములో భక్తిగల జీవితము కొరకు వెదకుచున్న వారెవరైనా ఉంటే వారిని మా యొద్దకు లేక మమ్మును వారి యెద్దకు నడిపించుము. నీవు అలా చేయకపోతే మాలో తప్పేమిటో మాకు చూపించుము. అప్పుడు మేము దానిని సరిచేసికొని నీతో సహవాసము కలిగి తప్పిపోయిన వారిని వెదకెదము". ఈ ప్రార్థన ప్రార్థించమని మిమ్మును ప్రోత్సహించాలనుకొనుచున్నాను.

తప్పిపోయిన గొఱ్ఱెను ఎటువంటి మందలోనికి తీసుకువస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయము. ఆ మందలో ఉన్న 99 గొఱ్ఱెలు రోగముతో ఉండి ఒకదానినొకటి చీల్చిచెండాడుతూ ఉంటే ఆ తప్పిపోయిన గొఱ్ఱె అరణ్యములో ఉండటమే మంచిది. గనుక మనకు తప్పిపోయిన గొఱ్ఱె కొరకు వెళ్ళె పరిచర్యనే కాకుండా, 99 గొఱ్ఱెలను ఆరోగ్యవంతగా సమాధానకరంగా ఉంచే పరిచర్యకూడా కావాలి. "అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును" (లూకా 15:7). మారుమనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులను కలిగిన ఈ సంఘము ఎంత అధ్బుతమైనది? ఇదెలా సాధ్యము? ఎందుకంటే వారు తమ్మును తాము తీర్పు తీర్చుకుంటూ ప్రతిదినము మారుమనస్సు పొందుచున్నారు. అనేక సంవత్సరాలుగా ఇది నా అలవాటుగా ఉన్నది. దాని ఫలితంగా నేను గత కొన్నేళ్ళుగా దాదాపు ప్రతిరోజు నా స్వభావములో క్రీస్తు పోలికలోలేని విషయాలను కనుగొని వాటి విషయంలో మారుమనస్సు పొంది నన్నునేను కడుగుకున్నాను. నీవలా ఉంటే, నిన్ను నీవు శుభ్రపరచుకొంటూ తీరికలేక ఉంటావు గనుక ఇతరులలో పొరపాట్లను కనిపెట్టడానికి నీకు సమయముండదు. అప్పుడు తప్పిపోయిన గొఱ్ఱెవచ్చి స్వస్థతపొందే "మారుమనస్సు అక్కరలేని" వారితో కూడిన సంఘాన్ని కట్టెదవు. అందుకనే మన సంఘాలలో మనము ఎల్లప్పుడు మారుమనస్సు ప్రకటించాలి. క్రమేణా, కాలం గడిచేకొలది, ఇతరులకు తీర్పు తీర్చకుండా తమ్మును తామే తీర్పు తీర్చుకునే ప్రజల సంఘాన్ని మనము కలిగియుంటాము.

గొఱ్ఱెలకాపరి ఒక గొఱ్ఱెను పోగొట్టుకున్నప్పుడు ఆ నష్టము ఆ గొఱ్ఱెలకాపరిదే. ఆ స్త్రీ ఆ నాణెమును పోగొట్టుకున్నప్పుడు ఆ నష్టము ఆ స్త్రీదే. తప్పిపోయిన కుమారుడి విషయంలో నష్టము ఆ తండ్రిదే. మనిషి పాపము చేసినప్పుడు నష్టపోయింది దేవుడేనని యేసు ఈ ఉపమానాలన్నిటి ద్వారా బోధించెను. దేవుడు పోగొట్టుకున్నదానిని తిరిగి ఆయన యొద్దకు తీసుకురావడమే సంఘములో మన పనియైయున్నది.

తన తండ్రి తనను ప్రేమించెనని తప్పిపోయిన కుమారుడు యెరిగియుండెను. అందుకనే ఇంటికి వద్దామని అతడు నిర్ణయించుకొనెను. తన కుమారుడు ఆ దినమున తిరిగి వస్తున్నాడని తండ్రికెలా తెలిసింది? ఎందుకంటే తన కుమారుడు ఇంటికి తిరిగి వస్తున్నాడేమోనని అతడు ప్రతిరోజు కిటికీ నుండి చూచెను. ఒక దినమున అతన్ని చూచి స్వాగతం చేయుటకు పరుగెత్తి వెళ్ళెను. అయితే పెద్దకుమారుడు తన తండ్రి హృదయవాంఛలను పంచుకోలేదు. అతడు తన తండ్రి కొరకు కష్టపడి పనిచెసేను మరియు ఎల్లప్పుడు లోబడెను( లూకా 15:28,29). కాని నశించుచున్న వారిపట్ల అతనికి ఆసక్తిలేకపోయెను. తన తండ్రి హృదయముతో అతనికి సహవాసము లేకపోయెను. నేను వెళ్ళి నా తమ్ముని కొరకు వెదుకుతానని అతడు తన తండ్రితో ఒక్కసారి కూడా చెప్పలేదు.

రెండు రకాలైన క్రైస్తవ పరిచారకులు మరియు పెద్దలున్నారు. ఒకరు ఈ కథలోని తండ్రివలె ప్రేమతోను కనికరముతోను నిండియుంటారు. వేరొకరు ఈ అన్నవలె కఠినంగా జీతగాళ్ళ వలె ఉంటారు. వీరిద్దరిలో ఎవరివలె ఉండాలో మనలో ప్రతియొక్కరు ఎంపిక చేసుకోవచ్చు. ఈ కథలో ఆరంభములో పెద్దకుమారుడు ఇంటిలోపల, చిన్న కుమారుడు బయటనుండిరి. కాని కథముగింపులో చిన్నకుమారుడు లోపల, పెద్దకుమారుడు బయటనున్నారు. ఇప్పుడు మొదటివారిగా నున్న అనేకులు దేవుని రాజ్యములో కడుపటివారిగా ఉంటారు. తండ్రి హృదయముతో సహవాసము లేని అనేకమంది క్రైస్తవులు రాజ్యము బయట ఉంటారు. సంఘములో నున్న ప్రతి సహోదరుడు మరియు సహోదరి ప్రభువు పరిచారకునిగా ఉండి నశించుచున్నవారికొరకు తండ్రి యొక్క హృదయముతో సహవాసము కలిగియుండాలి.