WFTW Body: 

దేవునిపై ఆధారపడి జీవించు వాని జీవితము నీటి ఊటల నుండి పోషణను పొందు చెట్టువలె ఉండునని బైబిలు చెప్పుచున్నది (యిర్మీయా 17:5-8). యేసు ఆ విధముగా ఒక మానవునిగా ఆత్మీయ వనరులను పరిశుద్ధాత్మ నుండి (దేవుని నది నుండి) నిరంతరం పొందుకుంటూ జీవించెను.

శోధనపై యేసు విజయము, మానవ సంకల్పంతో కాక, క్షణక్షణము ఆయన తన తండ్రి నుండి శక్తిని పొందుకొనుట ద్వారా పొందెను. యేసు మాదిరి చూపిన మరియు బోధించిన తన్ను తాను ఉపేక్షించుకొను మార్గము మానవ జీవము(ప్రాణము) సాధించినది కాదు. అది బౌద్ధమతంలో మరియు యోగాలో ఉండినది, దానికిని, లేఖనములలో చెప్పబడిన విషయములకును పరలోకమునకు భూమికి ఎంత వ్యత్యాసము ఉన్నదో అంత వ్యత్యాసము ఉన్నది.

మానవ మాత్రులముగా దేవునిలో జీవించుట మరియు ఆయనకు చేయవలసిన విధముగా పరిచర్య చేయుటకు మనకు శక్తి లేదని యేసు బోధించారు. మనము ఫలములిచ్చు చెట్టుపై పూర్తిగా ఆధారపడిన స్వంత శక్తి లేని కొమ్మలవంటి వారమని ఆయన చెప్పారు. "నాకు వేరుగా నుండి మీరేమియు చేయలేరు" అని ఆయన చెప్పారు (యోహాను 15:5). కనుక పరిశుద్ధాత్ముని సహాయము లేకుండా మనకు మనము ఏదొక విధముగా చేసినది ఎందుకూ పనికి రానిదిగా ఎంచబడును. ఇక్కడే "ఎల్లప్పుడు ఆత్మతో నింపబడి యుండుడి" (ఎఫెసీ 5:18) అను ముఖ్యమైన అవసరత ఉన్నది.

యేసు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడెను (లూకా 4:1,18). ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో తన తండ్రి పని గూర్చి జీవించెను మరియు ప్రయాసపడెను. ఆయన ఒక మానవునిగా ఆత్మలో దీనుడుగా ఉన్న కారణమును బట్టి ఇది సాధ్యమైనది.

యేసు తాను తీసుకొనిన మానవశరీరము యొక్క బలహీనతను ఎరిగియుండెను. అందువలన ఆయన నిరంతరం ఒంటరిగా ప్రార్థించుటకు అవకాశముల కొరకు వెదుకుచుండెను. ఒక విహార యాత్రికుడు ఒక పట్టణములో ప్రవేశించినప్పుడు చూడవలసిన ప్రాముఖ్య స్థలముల గూర్చి, మంచి వసతి గృహముల గూర్చి ఎలా వెదుకునో అలాగే యేసు, ప్రార్థించుటకు అనువైన ఒంటరి ప్రదేశముల గూర్చి వెదికే వారని ఒకరు చెప్పారు.

ఆయన తన మానవపరమైన శక్తిని మరణింప చేయుటకును, శోధనను జయించుటకును శక్తిని వెదకేవారు. యేసువలె, ఏ మానవుడు కూడా తన శరీరము యొక్క బలహీనతను ఎరిగి యుండలేదు కనుక సహాయం కొరకు తండ్రిని ఏ మానవుడు ఎప్పుడు వేడుకొననంతగా ఆయన ప్రార్థనలో వేడుకొనెను. ఆయన శరీరధారియై ఉన్నప్పుడు "మహా రోదనతోను మరియు కన్నీళ్ళతోను" ప్రార్థించెను. దాని ఫలితముగా ఆయన తన తండ్రి చేత ఏ మానవుని కంటే ఎక్కువగా బహుగా బలపరచబడెను. ఆ విధముగా, యేసు ఎప్పుడూ ఒక్కసారి కూడా పాపము చేయలేదు మరియు ప్రకృతి సంబంధిగా ఎప్పుడు జీవించలేదు (హెబ్రీ 4:15; 5:7-9).

సువార్తలలో యేసు ప్రభువునకు సంబంధించి 25 మార్లు "ప్రార్థన" లేక "ప్రార్థించెను" అను మాటలు వచ్చుట చెప్పుకోదగిన విషయం కాదా? అక్కడనే ఆయన జీవితము మరియు ప్రయాసల యొక్క రహస్యమున్నది.

యేసు ఆయన జీవితములో జరిగిన గొప్ప సంఘటనలకు ముందుగా మాత్రమే కాకుండా, కొన్ని గొప్ప కార్యములు జరిగిన తర్వాత కూడా ప్రార్థించెను. ఐదు వేల మందికి అద్భుతముగా ఆహారము పెట్టిన తరువాత, ఆయన కొండలలోనికి ప్రార్థించుటకు వెళ్లెను. అది అనుమానమేమి లేకుండా గర్వములో పడే శోధన నుండి తప్పించుకొనుటకు లేక జరిగిన పనిని బట్టి ఉదాసీనముగా ఉండకుండునట్లు మరియు అక్కడ జరిగిన పనిని గూర్చి స్తుతులు చెల్లించుటకు మరియు తండ్రి యొద్ద వేచి యుండుట ద్వారా ఆయన శక్తిని పొందుకొనుటకు అయ్యుండును (యెషయా 40:31). మనము సాధారణముగా దేవుని కొరకు ఏదైనా ప్రాముఖ్యమైనది చేయుటకు ముందు ప్రార్థించుదుము కాని మనము యేసు ప్రభువు కుండిన అలవాటు వలె, మనము ఏదైనా పని సాధించిన తరువాత తండ్రి యెదుట వేచియుండుటను నేర్చుకొనినట్లయితే, మనకు మనము గర్వము నుండి కాపాడబడి దేవుని కొరకు ఇంకా గొప్ప పనులు చేయుటకు సిద్ధపర్చబడుటకు మనలను మనము భద్రపరచుకొనెదము.

యేసుయొక్క జీవితము ఎంతగా తీరికలేని పనులతో నిండియుంటే అంత ఎక్కువగా ప్రార్థించేవారు. ఆయనకు కొన్ని సమయములలో భోజనము చేయుటకు లేక విశ్రమించుటకు కూడా సమయముండేది కాదు (మార్కు 3:20; 6:31,33,48). కాని ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించుటకు సమయము చేసుకొనేవారు. ఆయన ఆత్మ చెప్పే మాటలు వినేవారు కావున ఎప్పుడు నిద్రించాలి మరియు ఎప్పుడు ప్రార్థించాలి అనేది తెలిసియుండెను.

ఫలవంతమైన ప్రార్థనకు ఆత్మలో దీనులుగా ఉండుట అవసరమై ఉన్నది. ప్రార్థన మానవ నిస్సహాయతను చెప్పుకొనుటైయున్నది మరియు అది కేవలం ఆచారముగా కాకుండా, అర్థవంతముగా నుండవలెననంటే, క్రైస్తవ జీవితము జీవించుటకు గాని లేక దేవుని సేవించుటకు గాని మానవుని యొక్క వనరులు సరిపోవనే తలంపు ఎప్పుడూ ఉండవలెను.

యేసుప్రభువు ఎడతెగకుండా ప్రార్థనలో దేవుని శక్తిని కోరుకుంటూ ఉండేవారు మరియు ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఆ విధముగా ఆయన ఇంకే విధముగాను సాధించలేని విషయములను ప్రార్థన ద్వారా సాధించారు.