తమ భార్యలను ప్రేమించే విషయంలో భర్తలందరూ, సంఘం పట్ల యేసు కలిగి ఉన్న ప్రేమను మాదిరిగా తీసుకోవాలని దేవుని వాక్యము బోధిస్తుంది (ఎఫెసీ 5:25). పదిశాతం చిత్తశుద్ధి ఉన్న ఏ భర్త అయినా ఆ వచనానికి విధేయత చూపించడానికి జీవితకాలం పడుతుందని ఒప్పుకుంటాడు. దానిని పూర్తిగా నెరవేర్చిన మనిషి ఒక్కరు కూడా లేరు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే విశ్వాసులలో అత్యధికులు కనీసం దానిని నెరవేర్చడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. మనం ప్రయత్నించకపోతే ఎప్పటికీ దానికి లోబడలేము. పరిపూర్ణులగుటకు సాగిపోవుడి అని బైబిలు చెప్పిన దాని అర్థం ఇదే. భర్తలకు ఉన్న ఒకే విధి: క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్తలు తమ భార్యలను ప్రేమించాలి. ఈ విషయంలో వారు పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఆమెను పరిశుద్ధపరచుటకు తన్నుతాను ఏవిధంగా ఇచ్చుకున్నాడో, అదేవిధంగా భర్తలు ప్రతి సంవత్సరం వారి భార్యలను మరింత పరిపూర్ణంగా ప్రేమించుటకు సాగిపోవాలి.
సంఘంలో వైఫల్యాన్ని క్రీస్తు చూసినప్పుడు, ఆయన ఆ వైఫల్యాన్ని ఎలా సరిదిద్దుతారు? అనేకమంది భర్తలు చేసినట్లుగా కాదు. చాలామంది భర్తలు తమ భార్యల వైఫల్యాలను, ‘నువ్వు సరిగ్గా ప్రవర్తించడం లేదు’ అని లేదా అలాంటి ఇతర దుష్టమైన మాటల వంటి కఠినమైన, కఠోరమైన మాటలతో సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. యేసు ఆ విధంగా చేయలేదు. ఆయన తన సంఘమును కళంకమైనను ముడతయైనను లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా చేయుటకు ఏం చేశారు? ఆమెను పరిశుద్ధపరచుటకు ఆయన తన జీవితాన్ని అప్పగించాడు. నీవు ఎప్పుడైనా దానిని నీ భార్య కొరకు చేయుటకు ఆలోచించావా? అది దేవుని మార్గం. మానవజాతి అంతా తలక్రిందులుగా ఉండి, వ్యతిరేకమైన దిశలో పోతూ ఉంది. నీవు దేవుని మార్గమును వెంబడించినట్లయితే నీ వివాహ జీవితము మెరుగైన స్థితినుండి అత్యుత్తమ స్థితికి మారుతుంది. ఒక భర్తగా నీ భార్యలో ఒక లోపాన్ని చూసినప్పుడు నీవు యేసుని వెంబడించాలి. నీ చుట్టూ ఉన్న మనుష్యులు చేసే విధంగా నీవు చేయకూడదు.
అత్యంత కష్టమైన విషయం గర్వాన్ని విడిచిపెట్టడం - సింహాసనంపై కూర్చున్న అత్యంత ప్రాముఖ్యమైన ‘నేను’ అనే అహంకారాన్ని విడిచిపెట్టడం. సింహాసనంపై కూర్చున్న రాజు కోరుకున్నట్లుగా తన భార్య చేయనప్పుడు అతను ఎంతో అభ్యంతరపడతాడు మరియు బాధపడతాడు. ఆమెను పరిశుద్ధపరచుటకు నీవు విడిచి పెట్టవలసిన నీ స్వయం ఇది. దురదృష్టవశాత్తు ఈ మార్గంలో వెళ్ళుటకు కొద్దిమంది భర్తలు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు. నీవు ఈ మార్గంలో వెళ్ళనట్లయితే నీ వివాహం క్రిందికి దిగజారిపోతుంది. అయితే ఈ మార్గంలో వెళ్ళుటకు నీవు నిజంగా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నీ భార్యను ప్రేమించుటకు తప్పక వెతకాలి మరియు దానిని తీవ్రంగా తీసుకోవాలి. నిఘంటువులో ప్రేమ యొక్క అర్ధాన్ని వెదకవద్దు. దానికి బదులుగా క్రీస్తు యొక్క మాదిరిలో ప్రేమ యొక్క అర్ధాన్ని వెదకు - మీ సంబంధంలో క్రీస్తు చనిపోవుటకు సిద్ధపడినట్లుగా సిద్ధపడు. భర్తలుగా మన యొక్క పిలుపు ఇదే.
యేసు మన నాయకుడు. అయితే ఇది లోకం అర్థం చేసుకునే నాయకత్వం కాదు. తన చివరి రోజులలో యేసును ఎక్కడ కనుగొంటామో తెలుసా? తన పెండ్లి కుమార్తె పాదములు కడుగుతూ ఆమె పాదాల చెంత కనుగొంటాము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక భర్త పరిపూర్ణతకు చేరినప్పుడు తన భార్యను పరిశుద్ధపరచుటకు ఆమె యొక్క పాదాలను కడుగుతూ, ఆమెకు సహాయం చేస్తూ, ఆమెను పవిత్రపరుస్తూ ఆమె పాదాలయొద్ద కనుగొంటాము. ఆమె పాదాలు కడగడం అంటే అర్థమేమిటి? మురికి పనులు చేయడం. అవును కొంతమంది బుద్ధిహీనమైన భార్యలు దానిని అలుసుగా తీసుకొని వారి భర్తలపై పెత్తనాన్ని చలాయిస్తారు. యేసు, ప్రజలు కాళ్ల తుడుచుకునే చాపగా లేడు, ఆయన అలా ఉన్నాడా? కొంతమంది స్త్రీలు, భర్త తమ పాదాలు కడిగి మురికి పనులు చేయాలి అనే దాన్ని అపార్థం చేసుకుంటారు. వారి భర్తలు చివరకు చిన్నాచితకా మరియు మురికి పనులను చేసే సేవకులవలె తయారవుతారు. నేను చెప్పేది అది కాదు. యేసు ఒక కాలు తుడుచుకునే చాపలాగా ఉండలేదు. నీవు యేసును తన శిష్యులతో కూడా కూర్చుండడం చూసినప్పుడు ఆ గుంపులో నాయకుడిని సందేహం లేకుండా గుర్తుపట్టగలవు. నాయకత్వం ఎంతో తేటగా స్పష్టమవుతుంది. పేతురును లేక మత్తయిని వారి నాయకుడని పొరపడవు. భర్తలు కూడా అటువంటి స్థానాన్నే కలిగి ఉండాలి. సేవకునిగా మరియు నాయకునిగా ఉండే సున్నితమైన ఈ సమతూల్యతను యేసు నుండి మనం నేర్చుకోవాలి. అటువంటి నాయకత్వం కొరకు నీకు జ్ఞానం అవసరం, నీవు ప్రార్థనలో దానిని అడిగినప్పుడు ప్రభువు మాత్రమే దానిని నీకు ఇవ్వగలడు.
యేసు తన మందకు ముందు నడిచే కాపరి. ఆయన వాటి వెనక ఉండి వాటిని పొడుస్తూ ఉండే వ్యక్తి కాదు. ఆయన అనేకమైన హెచ్చరికలు ఇవ్వలేదు. తన పెండ్లి కుమార్తె వెంబడించుటకు ఆయన ఒక మాదిరిగా ఉన్నారు. యేసు వలె ఒక మాదిరిగా, భార్యను నడిపించు కాపరిగా భర్త ఉండాలి. నీ భార్య తొట్రిల్లినప్పుడు, సహోదరుడా నీకు నీవు ఈ ప్రశ్న వేసుకో ‘నా గొర్రెలను, నా భార్యను దేవుడు నాకు అప్పగించిన వారిని నేను సరైన మార్గంలో నడిపిస్తున్నానా?’. నీ భార్య వెనక గొర్రెపిల్లలు, మీ పిల్లలు కూడా వెంబడిస్తున్నారు. వారందరూ కూడా కాపరిపై ఆధారపడ్డారు. భర్తకు స్వీయ నియంత్రణ లేనట్లయితే గొర్రెలు మరియు గొర్రె పిల్లలు సరిగా ప్రవర్తిస్తాయని ఏ విధంగా ఆశిస్తాము? భయంతోనూ వణుకుతోను తన సొంత రక్షణను అతడు కొనసాగించక పోయినట్లయితే, అతడు యేసును వెంబడించనట్లయితే, ఆ కుటుంబం ఏ దిశలో వెళ్తుంది? దేవుడు ఉద్దేశించిన దానికి వ్యతిరేకమైన దిశలో, మిగతా లోకం ఎటు వెళుతుందో అటే కొట్టుకుపోతుంది.
కాబట్టి నీ వివాహ జీవితము మెరుగైన స్థితినుండి శ్రేష్టమైన స్థితిలోనికి ఎదగాలనుకున్నట్లయితే యేసును వెంబడించుటను భర్తలందరూ తీవ్రంగా తీసుకోవాలి. అది అతని అలవాటుగా, తన జీవితం యొక్క తీవ్రమైన ఆశగా, అతని పూర్తికాల పనిగా ఉండాలి. అది కేవలం సంఘ కూటములలో అప్పుడప్పుడు చేసే విషయంగా మాత్రమే ఉండకూడదు. ఈ విధమైన వివాహం శిష్యుల కొరకు మాత్రమే, కేవలం వారు చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళాలనుకొనే వ్యక్తుల కోసం కాదు.