"ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు" అని మత్తయి 5:17 చెప్తుంది. ఆయన జీవమే దేవుని ధర్మశాస్త్రము వెనుకనున్న ప్రాథమికమైన సూత్రము. ధర్మశాస్త్రములో ఆయన తన స్వభావాన్ని పరిమితిగా వ్రాశాడు. విగ్రహారాధన చేయకపోవడం, దేవునికి మొదటి స్థానము ఇవ్వడం, తండ్రిని తల్లిని గౌరవించడం, హత్య, వ్యభిచారం లేదా అలాంటి వాటితో ఇతరులను ఎప్పుడూ బాధపెట్టకపోవడం మొదలైనవి, మానవునిలో దేవుని జీవానికి నిదర్శనం. యేసు ఆ జీవితాన్ని వ్యక్తపరిచాడు. ఆయన, "నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు" అని అన్నాడు. ధర్మశాస్త్రము వెనుకనున్న ప్రాథమికమైన సూత్రము ఎన్నడూ రద్దు చేయబడలేదు. కొంతమంది ఆ వచనమును తప్పుగా అర్థం చేసుకుని మనం విశ్రాంతిదినం కూడా పాటించాలి అని అర్థం చేసుకుంటారు.
కొలొస్సి 2:16 ఇలా చెబుతోంది, "తినుట త్రాగుట లేదా పండుగ అమావాస్య లేదా విశ్రాంతిదినము విషయంలో ఎవరూ మిమ్మల్ని తీర్పు తీర్చే అవకాశం ఇవ్వవద్దు, ఎందుకంటే ఇవన్నీ నీడ వంటివి". అతను నాల్గవ ఆజ్ఞ విశ్రాంతిదినమును పాటించుటను చేర్చాడని మీరు గమనించారా? అది కేవలం నీడ మాత్రమే అని అతను చెప్తున్నాడు. అది క్రీస్తులో నెరవేరింది. నేటి భాషలో, అది ఒక ఫోటో లాంటిదని మీరు చెప్పవచ్చు. క్రీస్తు వచ్చే వరకు ఫోటోయొక్క అవసరం ఉంది. నేను నా భార్యతో కలిసి ప్రయాణించకపోతే, నేను ఆమె ఫోటో నాతో తీసుకెళ్లి చూస్తుండవచ్చు, కానీ నేను నా భార్యతో ప్రయాణిస్తుంటే, నేను ఫోటో ఎందుకు చూడాలి? తన భార్యతో ప్రయాణిస్తున్న వ్యక్తి, ఆమె ఫోటోనే చూస్తునట్లయితే అతనిలో ఏదో తప్పు ఉంది!
ఇప్పుడు క్రీస్తు వచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రం ముగిసిపోయింది. అది కేవలం నీడ వంటిదని ఆయన చెప్పారు. అది క్రీస్తు యొక్క ఖచ్చితమైన చిత్రం - పాత నిబంధనలో చాలా విషయాలు క్రీస్తును ఖచ్చితంగా చిత్రీకరించాయి - కానీ అది ఒక ఫోటో మాత్రమే. వాస్తవికత క్రీస్తులో ఉంది. యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం గురించి మాట్లాడేటప్పుడు మనం దానిని గుర్తుంచుకోవాలి. విశ్రాంతిదినము క్రీస్తులో నెరవేరింది. ఇప్పుడు ప్రభువు మన హృదయాలలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది అంతర్గత విశ్రాంతిదినము. "నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను" (మత్తయి 11:28). మనం ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు ఆ అంతరంగ విశ్రాంతి వస్తుంది. కొంతమంది విశ్రాంతిదినమును పాటించడం అనేది ఎప్పటికీ రద్దు చేయకూడని ఏకైక ఆజ్ఞ అని భావిస్తారు. అది సరికాదు, ధర్మశాస్త్ర నెరవేర్పు ఇప్పుడు మన హృదయాలలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది.
రోమా 8:4లో ఇలా వివరించబడింది: "శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకునే మనయందు ధర్మశాస్త్రము యొక్క నీతియుక్తమైన నిబంధన ఇప్పుడు మనలో నెరవేరుతోంది". ఈ విధంగా ధర్మశాస్త్రము నెరవేరుతుంది. మనం లేఖనాలను లేఖనాలతో పోల్చాలి. ధర్మశాస్త్రం గతించిపోదు. యేసు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, దానిని నెరవేర్చడానికి వచ్చాడు, అది మనలో కూడా నెరవేరాలి. అది మనలో ఎలా నెరవేరుతుంది? మనం ప్రతిరోజూ శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ధర్మశాస్త్రము యొక్క నీతియుక్తమైన నిబంధన మనలో నెరవేరుతుంది (రోమా 8:4). విశ్రాంతిదినము లేదా ఇతర ఆజ్ఞలను పాటించడం ద్వారా నెరవేరదు.
మత్తయి 5:20 లో, మనం ధర్మశాస్త్రాన్ని ఎంత పూర్తిగా నెరవేర్చాలో యేసు వివరించాడు: "మీ నీతి శాస్త్రుల మరియు పరిసయ్యుల నీతిని మించకపోతే, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు". యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, మరియు మన జీవితాల్లో కూడా, దేవుని ధర్మశాస్త్రం మన హృదయాల్లో నెరవేరాలి. పాత నిబంధనలో, వారు దానిని బాహ్యంగా వివిధ మార్గాల్లో నెరవేర్చారు - వారు "గిన్నె వెలుపల" శుభ్రంగా ఉంచారు. కానీ ఇప్పుడు దేవుడు గిన్నె లోపలి భాగంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండాలి మరియు ఆ జీవం పరిశుద్ధాత్మ నుండి అంతరంగం నుండి రావాలి.
ఫిలిప్పీ 2:12,13 ఇలా చెబుతోంది, "భయంతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించండి ఎందుకంటే తన దయాసంకల్పాన్ని మీరు కోరుకోవడానికి మరియు దానిని నెరవేర్చడానికి దేవుడు మీలో పని చేస్తున్నాడు".
ఈ వచనానికి సంబంధించి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి:
(i) రక్షణ (భూతకాలంలో) అనేది మొదటగా దేవుని ఉగ్రత మరియు తీర్పు నుండి రక్షించబడటం. ఈ రక్షణ దేవుని నుండి ఉచితంగా లభించిన బహుమతి మరియు దానిని మనం ఎప్పటికీ పనిచేసి పొందలేము. యేసు దానిని సిలువపై మన కోసం "పూర్తి చేసాడు". అయితే రక్షణ(వర్తమాన కాలంలో), ఆదాము స్వభావం(శరీరం) నుండి, మన పాపభరితమైన ప్రాపంచిక ప్రవర్తన (మాటతీరు, చికాకు, అపరిశుద్ధత, భౌతికవాదం మొదలైనవి) నుండి రక్షించబడటాన్ని కూడా సూచిస్తుంది. పై వచనంలో ఈ రక్షణ గురించే చెప్పబడింది. మూడు కాలాల్లో జరిగే మన రక్షణ క్రింది విధంగా ఉంటుంది:
మనం పాప శిక్ష నుండి రక్షించబడ్డాము.
మనం పాప శక్తి నుండి రక్షించబడుతున్నాము.
ఒక రోజు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం పాపం యొక్క ఉనికి నుండి రక్షించబడతాము.
(ii) దేవుడు మనలో పనిచేస్తున్నాడని దేవుని వాక్యం చెప్పినప్పుడెల్లా, అది ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పరిచర్యను సూచిస్తుంది. పాపం మరియు లోకం నుండి మనల్ని వేరు చేయడం ద్వారా మనలను పవిత్రపరచి పరిశుద్ధులను చేయటం ఆయన చేసే ప్రాథమికమైన పని. కాబట్టి దేవుడు మనలోపల "చేసిన పనిని" మనం "కొనసాగించాలి". మనలోని మారవలసిన వైఖరి లేదా ఆలోచన లేదా ప్రవర్తనను ఎత్తి చూపుతూ దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది దేవుడు "మనలో పనిచేయడం". మనం ఆ దిద్దుబాటును అంగీకరించి, "ఆయన ఎత్తి చూపిన ఆ నిర్ధిష్టమైన శరీర కల్మషము లేదా ఆత్మ కల్మషము నుండి మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు" (2 కొరింథీ 7:1 చూడండి) - మన జీవితంలోని ఆ నిర్ధిష్టమైన అలవాటును నుండి శుద్ధి చేసుకున్నప్పుడు - అప్పుడు మనం "మన రక్షణను కొనసాగిస్తున్నాము".