WFTW Body: 

"తీర్పుతీర్చుట" అను మాటను తప్పుగా అర్థం చేసుకొనుట వలన ఇతరులను తీర్పుతీర్చుట సరియైనదా కాదా అనే దానిపై క్రైస్తవులలో చాలా అపార్థం ఉంది.

విశ్వాసులముగా ప్రజల గురించి వివేచన కలిగియుండుటకు మనం ఇతరులను విమర్శించవచ్చు. మనం ఒక వర్తమానం వినినప్పుడు మనం దానిని వివేచించవలెనని వాక్యం చెప్పుచున్నది (1కొరింథీ 14:29). కాబట్టి ప్రతి ఒక్కరి వర్తమానం మనం పరీక్షించవలసిందని పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించుచున్నాడు. ఈనాడు క్రైస్తవ్యంలో అనేకమంది అబద్ధ బోధకులు ఉన్నారు గనుక ఈ విధముగా మాత్రమే వారి మోసమునుండి తప్పించుకొనగలము.

దేవుని వాక్యం ఈవిధముగా చెప్పుచున్నది, "ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి" (1యోహాను 4:1).

ఇతరులను తీర్పుతీర్చే విధానమును గూర్చి యేసుప్రభువు ఇట్లన్నారు, "మీరు చూచిన దానిని బట్టి వెంటనే తీర్పుతీర్చక, యథార్థముగా తీర్పుతీర్చుచు మరియు న్యాయముగాను, నీతిగాను తీర్పుతీర్చుడి" (యోహాను 7:24 ఆంగ్ల ఆంప్లిఫైడ్)

"తీర్పుతీర్చకుడి" అని యేసుప్రభువు చెప్పినప్పుడు ఆయన భావము ఏమైయున్నది? (మత్తయి 7:1).

గ్రీకు భాషలో తీర్పుతీర్చుట అనగా ఖండించుట అని కూడా అర్థం. ఆంప్లిఫైడ్ బైబిలులో ఈ వచనం ఈ విధంగా తర్జుమా చేయబడింది, "మీరు ఖడింపబడకుండునట్లు మీరు ఇతరులను ఖండించకుడి" (మత్తయి 7:1 ఆంగ్ల ఆంప్లిఫైడ్).

తన గురించి యేసుప్రభువు ఇట్లన్నారు, "నేను ఎవరిని ఖండించను లేక తీర్పుతీర్చను" (యోహాను 8:15 ఆంప్లిఫైడ్).

కాబట్టి (మాటలతోకాని మనస్సులోకాని) ఖండించుటయు మరియు ఇతరులను తీర్పుతీర్చుటయు నిషేధించబడింది. దానిని చేయుటకు దేవునికి మాత్రమే అధికారం ఉన్నది.

కాని మనం పరీక్షించి, వివేచించాలి.

యేసుప్రభువు గూర్చి, "కంటిచూపును బట్టి అతడు తీర్పుతీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శచేయడు. నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును" (యెషయా 11:3,4) అని ప్రవచించబడింది. మనం కూడా ఆయన మాదిరిని అనుసరించి, మనం చూచిన దానినిబట్టియు లేక వినినదానిని బట్టియు తీర్పుతీర్చకూడదు. మనం ఒక విషయమును క్షుణ్ణముగా పరిశీలనచేసిన తరువాతే నీతిగాను మరియు పక్షపాతము లేకుండా తీర్పుతీర్చాలి.

దేవుని కుటుంబ సభ్యులుగా, ముందుగా మనల్ని మనం తీర్పుతీర్చుకోవాలని కూడా చెప్పబడింది(1పేతురు 4:17). అయితే మనలోనికి మనం చూచుకొని తీర్పుతీర్చుకొనకూడదు. అలా కాదు. మనం యేసుయొక్క మాదిరిని ఆయన జీవితపు వెలుగులో చూచి, మన స్వంత లోపాలను చూచుకోవాలి, ఆపై మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. "ప్రభువా, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము" (కీర్తన 36:9).

దేవుని వెలుగులో మనలను మనం తీర్పుతీర్చుకొనుటను నేర్చుకొనుట క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైయున్నది. చాలామంది దీనిని నేర్చుకొననందువలన ఆత్మీయ అభివృద్ధిని పొందుటలేదు.

ఇక్కడ ఒక అధ్బుతమైన వాగ్ధానమున్నది. ఎవరైతే తమ్మును తాము నమ్మకముగా తీర్పుతీర్చుకొంటారో అటువంటి వారిని అంత్యదినమందు దేవుడు తీర్పుతీర్చడు. "మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పుపొందకపోవుదము" (1కొరింథీ 11:31).

మనం ఇతరులను తీర్పుతీర్చక పోయినప్పటికీ, పాపమునకు వ్యతిరేకంగా మనం గట్టిగా బోధించాలి. యేసుప్రభువు కొన్ని నిర్దిష్ట పాపాలకు వ్యతిరేకముగా ఎంతో గట్టిగా చెప్పారు. అవేవనగా కోపము, మోహపు చూపులు చూచుట, ధనాపేక్ష, చింతించుట, భయము, చెడ్డతలంపులు, అబద్ధములు చెప్పుట, మనుష్యుల ఘనతను కోరుట, శత్రువులను ద్వేషించుట మొదలగునవి (మత్తయి 5,6,7అధ్యాయములు). ఈ కాలంలోని పాపాలైన ఇంటర్నెట్లో బూతుబొమ్మలను చూచుటపై కూడా వ్యతిరేఖంగా మాట్లాడాలి - కాని ఇతరులను ఖండించకూడదు. యేసుప్రభువు లోకమును తీర్పుతీర్చుటకు రాలేదు కాని లోకమును రక్షించుటకు మాత్రమే వచ్చియున్నాడు (యోహాను 3:17). దేవుడు మాత్రమే తీర్పుతీర్చువాడు మరియు మనుష్యులందరికి న్యాయాధిపతి (యాకోబు 4:12).