WFTW Body: 

రక్షణను గూర్చి దేవుని వాక్యము మూడు కాలములలో చెప్తుంది -రక్షణపొందుట (ఎఫెసీ 2:8), రక్షణలో ఎదుగుట (ఫిలిప్పీ 2:12), మరియు భవిష్యత్తులో సంపూర్ణ రక్షణపొందుట(రోమా 13:11). ఇంకోమాటలో చెప్పాలంటే నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట.

1. నీతిమంతులుగా తీర్చబడుట

రక్షణకు పునాది మరియు దానిపై గొప్ప నిర్మాణం ఉన్నవి. రక్షణకు పునాది, పాపములు క్షమించబడుట మరియు నీతిమంతులుగా తీర్చబడుట. నీతిమంతులుగా తీర్చబడుట అనునది పాపములు క్షమించబడుటకంటే కూడా ఎక్కువైనది. దేవుని యెదుట క్రీస్తు మరణ, పునరుత్థాన, ఆరోహణముల ఆధారంగా మనము నీతిమంతులముగా ప్రకటింపబడుతున్నాము. ఇది మన క్రియలవలన కలిగినది కాదు (ఎఫెసీ 2:8,9). ఎందుకంటే మన నీతిక్రియలు దేవుని దృష్టికి మురికిగుడ్డలవలె ఉన్నవి(యెషయా 64:6). మనము క్రీస్తుయొక్క నీతితో ధరింపజేయబడియున్నాము(గలతీ 3:27). పాపములు క్షమింపబడుటకు మరియు నీతిమంతులుగా తీర్చబడుటకు, మారుమనస్సు పొందుట మరియు విశ్వాసము అనే రెండు షరతులు ఉన్నవి (అపొ.కార్యములు. 20:21). నిజమైన మారుమనస్సు మనలో పరిహారము చెల్లించుట(తిరిగి ఇచ్చివేయుట) అనే ఫలమును కలిగించాలి - అనగా మనకు సాధ్యమైనంతవరకు అన్యాయముగా మన ఆధీనంలో (వేరే వారికి చెందిన) ఉన్న డబ్బునుగాని, వస్తువులనుగాని, పన్నులనుగాని తిరిగి ఇచ్చివేయుట, అన్యాయం చేసిన వారికి క్షమాపణ చెప్పుట (లూకా 19:8,9). దేవుడు మనలను క్షమించినప్పుడు, మనము అదే విధముగా ఇతరులను క్షమించాలని దేవుడు కోరుతున్నాడు. మనము ఇతరులను క్షమించకపోతే దేవుడు మన క్షమాపణను కూడా ఉపసంహరిస్తాడు(మత్తయి 18:23-35). నీటిలో పూర్తిగా ముంచబడే బాప్తిస్మము, మారుమనస్సు మరియు విశ్వాసమును అనుసరించాలి. బాప్తిస్మము ద్వారా మనము దేవునికి, మనుష్యులకు మరియు దయ్యములకు, మన ప్రాచీన పురుషుడు పాతిపెట్టబడెనని బహిరంగముగా సాక్ష్యమిస్తున్నాము (రోమా 6:4,6). తరువాత మన జీవితము ద్వారా మన పెదవుల ద్వారా దేవుని సాక్ష్యముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మనము శక్తి నొందుతాము (అపొ.కార్యములు. 1:8). దేవుని పిల్లలందరు విశ్వాసముద్వారా పరిశుద్ధాత్మ అనే వాగ్ధానమును పొందుదురు(మత్తయి 3:11; లూకా 11:13). ప్రతి శిష్యుడు తాను దేవుని బిడ్డయై ఉన్నాడని ఆత్మ సాక్షమివ్వడం ఎంతో ధన్యతయై ఉన్నది(రోమా 8:16). మరియు అతడు పరిశుద్ధాత్మను పొందియున్నాడని దీని ద్వారా తెలుసుకోవచ్చును (అపొ.కార్యములు. 19:2).

2. పరిశుద్ధపరచబడుట

పరిశుద్ధపరచబడుట అనునది భవనములో పునాది మీద కట్టబడిన గొప్ప నిర్మాణమైయున్నది. రక్షణపొందిన తరువాత పరిశుద్ధపరచబడుట(అనగా పాపమునుండి, లోకమునుండి ప్రత్యేకించబడుట) ఆరంభమవుతుంది (1 కొరంథీ 1:2) మరియు మనము ఈ భూమిపై ఉన్నంతవరకు కొనసాగుతుంది (1 థెస్స 5:23, 24). దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో మన మనస్సులలో తన ఆజ్ఞలను వ్రాయటం ద్వారా ఈ పని ప్రారంభించబడుతుంది. కాని భయముతోను, వణుకుతోను మన రక్షణను కొనసాగించడం మన వంతు (ఫిలిప్పీ 2:12,13). మనకివ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా శరీరక్రియలను చంపవలసినది మనమే(రోమా 8:13). దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయుటకు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మశమును కడుగుకొనవలసినది మనమే(2 కొరంథీ 7:1). ఎక్కడైతే ఒక శిష్యుడు పరిశుద్ధాత్మకు పూర్ణహృదయముతో వెనువెంటనే సహకరిస్తాడో పరిశుద్ధపరచబడే ప్రక్రియ అతని జీవితంలో వేగంగా జరుగుతుంది. ఆలస్యంగా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడే వ్యక్తిలో పరిశుద్ధపరచబడటం ఆగిపోవడంకాని లేక నెమ్మదిగాకాని జరుగుతుంది. పరిశుద్ధతను మనం పూర్ణహృదయముతో కోరుచున్నామా లేదా అనునది మనం శోధింపబడినప్పుడు నిజముగా పరీక్షింపబడుతుంది. ధర్మశాస్త్రం యొక్క నీతి పాతనిబంధనలో వలె బాహ్యముగా కాక మన హృదయములలో నేరవేర్చబడుటయే పరిశుద్ధపరచబడుట (రోమా 8:4). దీనినే ప్రభువైనయేసు మత్తయి 5:17-48 నొక్కిచెప్పారు. పూర్ణహృదయముతో దేవుని ప్రేమించుట, మనలను మనం ప్రేమించుకున్నటే మన పొరుగువారిని ప్రేమించుటలో ధర్మశాస్త్రం కోరునదంతయు ఉన్నదని యేసు చెప్పారు (మత్తయి 22:36-40). ఈ ప్రేమ విధులనే మన హృదయముల మీద దేవుడు వ్రాయాలని కోరుతున్నాడు. ఎందుకంటే అదే ఆయన స్వభావమై ఉన్నది (హెబ్రీ 8:10; 2 పేతురు 1:4). తెలిసిన ప్రతి పాపముపై జయము పొందుట, యేసుయొక్క ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించుటతో ఇది బాహ్యముగా వ్యక్తపరచబడుతుంది(యోహాను 14:15). యేసు చెప్పిన శిష్యత్వపు షరతులను నెరవేర్చకుండా ఇటువంటి జీవితములోనికి ప్రవేశించుట అసాధ్యం (లూకా 14:26-33). ప్రాధమికముగా ఆ షరతులేవనగా -మన బంధువులందరికంటే, మనకంటే ప్రభువుకు మొదటి స్థానమివ్వటం, తనకు కలిగియున్నదానంతటినుండి వేరుపడటం. మనము మొదటిగా ఈ ఇరుకు ద్వారం గుండా వెళ్ళాలి. అప్పుడు పరిశుద్ధపరచబడుట అనే ఇరుకు మార్గం వస్తుంది. పరిశుద్ధపరచబడుటను వెంబడించని వారు ఎప్పటికీ ప్రభువును చూడలేరు (హెబ్రీ 12:14).

3. మహిమపరచబడుట

మనం ఇప్పుడు మనసాక్షిలో పరిపూర్ణముగా ఉండుట సాధ్యమే(హెబ్రీ 7:19;9:9,14). యేసు రెండవ రాకడలో మహిమ శరీరమును పొందేవరకు(1 యోహాను 3:2) పాపములేని పరిపూర్ణతను కలిగియుండుట అసాధ్యం. ఆయన వచ్చినప్పుడు ఆయనవలె ఉండెదము. కాని మనము ఇప్పుడే ఆయన నడిచినట్లుగా నడచుటకు కోరుకొనవలెను (1 యోహాను 2:6). మనము ఎంతగా పరిశుద్ధపరచబడినను ఈ చెడిపోయిన దేహములో ఉన్నంతవరకు మనకు తెలియని పాపమును మనలో కనుగొనగలము(1యోహాను 1:8). కాని మనము పూర్ణహృదయులైనయెడల మనకు తెలిసిన పాపమునుండి విడిపించబడి పరిపూర్ణముగా ఉండవచ్చును(1కొరంథీ 4:4). మన రక్షణలో చివరి భాగమైన మహిమపరచబడటం కొరకు మరియు పాపములేని పరిపూర్ణులుగా మారుట కొరకు క్రీస్తుయొక్క రెండవ రాకడకొరకు మనము ఎదురుచూస్తున్నాము (రోమా 8:23; ఫిలిప్పీ 3:21).