WFTW Body: 

"సాత్వికులు (లేదా దీనులుగా మరియు సౌమ్యులుగా ఉన్నవారు) ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు" (మత్తయి 5:5). ఇది తమ హక్కుల కోసం పోరాడని, చెడ్డగా చూడబడినప్పుడు ప్రతీకారం తీర్చుకోని వారిని సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. యేసు తన హక్కులు తీసివేయబడినప్పుడు సాత్వికత ఏమిటో చూపించాడు, ఆయన తిరిగి పోరాడలేదు. తనను శపించిన వారిని ఆయన శపించలేదు. తనను సిలువ వేసిన వారిపై దేవుని తీర్పు కోసం ఆయన ప్రార్థించలేదు. ఆయన మత్తయి 11:29లో మనతో ఇలా చెప్పాడు, "నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక.. నాయొద్ద నేర్చుకోండి - నేను దీనుడను మరియు సున్నితమైన హృదయాన్ని కలిగి ఉన్నాను." దీనిని పూర్తిగా ఆంగ్లంలో అనువదించుటకు అంత తేలికైన పదం కాదు, అందుకే ప్రజలు "మృదువైన" అనే మాటకు అనేక విభిన్న అనువాదాలను ఉపయోగిస్తున్నారు (నా బైబిల్ మార్జిన్‍లో "వినయమైన, సాత్వికమైన" అని ఉంది). సాధారణ చిత్రం ఏమిటంటే భూమిపై తన హక్కుల కోసం పోరాడని వ్యక్తి, ఎందుకంటే అతను ఒక రోజు భూమిని స్వతంత్రించుకుంటాడని అది చెప్తుంది. దేవుడు భూమిని దాని కోసం పోరాడని వారికి ఇస్తాడు. ఇది దేవుని మార్గం.

దేవుడు తన గొప్ప ఆశీర్వాదాలను, వారి హక్కుల కోసం పోరాడేవారికి కాదు, వారి హక్కులను వదులుకునే వారికి ఇస్తాడు. యేసు సిలువ వేయబడుటకు దిగి వెళ్ళాడు; ఆయన తన హక్కులన్నింటినీ వదులుకున్నాడు. ఆయన మరణానికి, అవమానకరమైన సిలువపై మరణానికి కూడా వెళ్ళుటకు తనను తాను తగ్గించుకొనుటలో ఆయన వినయం మరియు సాత్వికత కనిపిస్తుంది (ఫిలిప్పీ 2:8). ఆయన ఆ స్థాయికి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, ఆయన అవమానించబడ్డాడు మరియు సిగ్గుపరచబడ్డాడు. ఫిలిప్పీ 2:9లో ఇలా చెప్పబడింది, "దేవుడు ఆయనను హెచ్చించి, ప్రతి నామానికి పైన ఉన్న నామాన్ని ఇచ్చాడు." క్రీస్తు నేడు తండ్రి కుడి పార్శ్వానికి ఎందుకు హెచ్చించబడ్డాడంటే, ఆయన ఎల్లప్పుడూ నిత్యత్వం అక్కడే ఉన్నాడు కాబట్టి కాదు. ఆయన ఎల్లప్పుడూ దేవుడిగా అక్కడే ఉన్నాడు. కానీ ఆయన మానవుడిగా భూమికి వచ్చినప్పుడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చునే హక్కును సంపాదించాడు. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆయన తన భూసంబంధమైన జీవితంలో, అన్ని రకాల శోధనలను ఎదుర్కొనే వ్యక్తిగా దేవుని స్వభావాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించాడు మరియు మరణం వరకు, సిలువ మరణం వరకు కూడా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన తండ్రి కుడి వైపుకు తిరిగి వచ్చే హక్కును సంపాదించాడు. ఆయన తన హక్కుల కోసం పోరాడలేదు కాబట్టి, ఒక రోజు భూమి మొత్తం ఆయనకు ఇవ్వబడుతుంది.

ప్రస్తుతం ఆయనకు ప్రతి నామానికి పైన ఉన్న నామం ఇవ్వబడింది, అంటే పరలోకంలో, భూమిపై, భూమి కింద ఉన్న ప్రతి మోకాలు యేసు నామానికి వంగి ఉంటుంది. అది ఇంకా జరగలేదు. చాలా మంది యేసు నామాన్ని తృణీకరిస్తున్నారు, నేడు ఆయన నామానికి నమస్కరించడం లేదు. దయ్యాలు మరియు భూమిపై ఉన్న చాలా మంది ప్రజలు అలా చేయరు. కానీ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, ప్రతి మోకాలు యేసు నామానికి వంగి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటుంది మరియు భూమి మొత్తం ఆయనకు ఇవ్వబడుతుంది. ఆయన సాత్వికుడు కాబట్టి అది ఆయనకు చెందుతుంది. కాబట్టి, ఆ సాత్విక మార్గంలో ఆయనను అనుసరించే వారికి కూడా చెందుతుంది. యేసు, "నా నుండి నేర్చుకోండి" (మత్తయి 11:29) అన్నాడు. ఆయన నుండి నేర్చుకోవాలని ఆయన మనకు చెప్పిన ఏకైక విషయం ఈ దీనత్వం మరియు సాత్వికత. "నా నుండి నేర్చుకోండి, ఎందుకంటే నేను సౌమ్యుడిని, దీనుడను సాత్వికుడను మరియు వినయపూర్వకమైన హృదయం గలవాడిని." ఇది మనం యేసు నుండే నేర్చుకోవాలి. ఆయన ఒక పుస్తకం నుండి నేర్చుకోవాలని మనకు చెప్పలేదు. ఆయన ఇలా అంటున్నాడు, "నన్ను చూడండి మరియు నేను నా హక్కుల కోసం ఎలా పోరాడలేదో, నేను నా హక్కులను ఎలా వదులుకున్నానో మరియు నేను సౌమ్యంగా మరియు వినయంగా ఉన్నానో చూడండి, మీరు మీ ఆత్మలకు విశ్రాంతి పొందుతారు." చాలా మంది క్రైస్తవులు అశాంతిలో, ఉద్రిక్తతలో ఉండటానికి మరియు కొంతమంది కృంగిపోవుటకు ఒకే ఒక కారణం ఉందని నేను నమ్ముతున్నాను: వారు సాత్వికులు కాదు. వారు అంతర్గతంగా ఏదో ఒక దానికోసం పోరాడుతున్నారు. వారు తమ హక్కుల కోసం చూస్తున్నారు, అందువల్ల వారు అశాంతిలో ఉన్నారు.

వినయం అనేది చాలా సులభంగా నకిలీ చేయబడే సద్గుణాలలో ఒకటి. నిజమైన వినయం ఇతరులు మనలో చూసేది కాదు. అది దేవుడు మనలో చూసేది - అది అంతర్గతంగా ఉంటుంది. ఇది యేసు జీవితంలో ఉదహరించబడింది. ఫిలిప్పీ 2:5-8, యేసు దేవునిగా తన అధికారాలను మరియు హక్కులను త్యజించి సేవకుడయ్యాడని మరియు మనుష్యుల చేతులలో సిలువ వేయబడటానికి కూడా సిద్ధపడ్డాడని మనకు చెబుతుంది. ఆ వినయ మార్గంలో మనం ఆయనను అనుసరించాలి.

యేసు 3 దశల్లో తనను తాను తగ్గించుకున్నాడు.

  1. ఆయన మానవుడయ్యాడు.
  2. ఆయన సేవకుడయ్యాడు.
  3. ఆయన, సిలువపై నేరస్థుడిలా చూడబడటానికి ఇష్టపడ్డాడు.

అక్కడ మనం క్రైస్తవ జీవితంయొక్క మూడు రహస్యాలను చూస్తాము: దీనత్వం, దీనత్వం మరియు దీనత్వం.

యేసు భూమిపై 33 సంవత్సరాలు జీవించినప్పుడు మరియు ఆయన ఇతరులకు చాలా వినయంగా సేవ చేయడం చూసినప్పుడు, బాధలు, అవమానాలు మరియు గాయాలను ఓపికగా భరించినప్పుడు దేవదూతలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వారు పరలోకంలో సంవత్సరాలుగా ఆయనను ఆరాధించడం అలవాటు చేసుకున్నారు. కానీ వారు భూమిపై ఆయన ప్రవర్తనను చూసినప్పుడు, యేసు పరలోకంలో ఉన్నంత కాలం వారు ఎప్పుడూ చూడని లేదా అర్థం చేసుకోని దేవుని స్వభావంలోని ఆయన వినయం మరియు తగ్గింపు గురించి మరింత నేర్చుకున్నారు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్న దేవదూతలకు, సంఘంలో మన ద్వారా క్రీస్తు యొక్క అదే ఆత్మను చూపించాలనుకుంటున్నాడు (ఎఫెసీ 3:10 లో చెప్పినట్లుగా). దేవదూతలు మనలో మరియు మన ప్రవర్తనలో ఇప్పుడు ఏమి చూస్తున్నారు? మన ప్రవర్తన దేవునికి మహిమ తెస్తుందా?

వినయం(దీనత్వం) అన్నింటికంటే గొప్ప గుణం అని గుర్తుంచుకోండి. మనం ఏమై ఉన్నామో మరియు మనం కలిగి ఉన్నవన్నీ దేవుని బహుమతులే అని వినయం అంగీకరిస్తుంది. వినయం మనల్ని మానవులందరిని, ముఖ్యంగా బలహీనులను, సంస్కృతి లేనివారిని, వెనుకబడినవారిని మరియు పేదలను విలువైనవారిగా మరియు గౌరవించేలా చేస్తుంది. ఆ వినయపు నేలపై మాత్రమే ఆత్మ ఫలం మరియు క్రీస్తు సద్గుణాలు పెరుగుతాయి. కాబట్టి ఉన్నతమైన ఆలోచనలు లేదా గౌరవాన్ని కోరుకోవడం లేదా దేవునికి ఇవ్వవలసిన మహిమను తీసుకోవడం అనే విషం మీ హృదయంలోకి ఎప్పుడైనా ప్రవేశించకుండా చూసుకోవడానికి మిమ్మల్ని మీరు నిరంతరం తీర్పు తీర్చుకుంటూ జీవించాలి. యేసు వినయం(దీనత్వం) గురించి ఎక్కువగా ధ్యానించండి. అదే మీకు నా అతి ముఖ్యమైన ఉపదేశం.