WFTW Body: 

ప్రభువును సేవించే ఎవరైనా కూడా సాతాను యొక్క దాడులకు కేంద్రముగా ఉంటారు. దేవునికి మనము ఎంత ప్రయోజకులముగా ఉంటామో అంత ఎక్కువగా శత్రువు యొక్క దాడికి గురవుతాము. దానిని మనము తొలగించలేము. అపనింద, తప్పుడు ఆరోపణలు, కల్పిత కథల ద్వారా సాతాను మనపై దాడి చేస్తాడు. మన భార్యలు మరియు పిల్లలపై కూడా దాడి చేస్తాడు.

తన జీవిత కాలములో మాత్రమే గాక ఈనాటికి కూడా యేసును గూర్చి ప్రజలు పలికిన చెడు విషయములను (మాటలను) గూర్చి ఆలోచించండి. తిండిబోతు మరియు త్రాగుబోతు (లూకా 7:34), ఒక పిచ్చివాడు (మార్కు 3:21), దయ్యము పట్టినవాడు (యోహాను 8:48) మరియు దయ్యములకు అధిపతి (మత్తయి 12:24) అనే అనేకమైన దుర్మార్గపు పేర్లతో ఆనాటి ప్రజలు యేసును పిలిచారు. పరిశుద్ధగ్రంధము మరియు మోషే నేర్పించిన వాటికి విరుద్ధమైన దైవదూషక బోధ చేస్తున్నాడని కూడా నిందించారు (యోహాను 9:29). అలా వారు ప్రభుని మాటలు వినకుండా ప్రజల్ని దూరంగా పారద్రోలారు. కానీ అటువంటి వారికి జవాబు చెప్పుటకు ఆయనకు చింతలేదు. ఒక్క వ్యక్తిగత నిందకుకూడా ఆయన సమాధానము చెప్పలేదు. మనము కూడా అలాగే ఉండాలి. సిద్ధాంత పరమైన ప్రశ్నలకే యేసు జవాబు చెప్పాడు. ఈనాడు ప్రజలు యేసును గూర్చి అనైతిక విషయాలు కూడా కల్పించి చెబుతున్నారు. అయితే దేవుడు వారిపై తీర్పు పంపటంలేదు.

వారు పౌలును మోసగాడని, ప్రతిచోటా చెడుకు పేరుమోసిన ఒక గుంపుకు చెందిన అబద్దప్రవక్త అనీ పిలిచారు (అపొ.కా. 24:14; 28:22). ఆవిధముగా వారు పౌలు మాటలు వినకుండా ప్రజల్ని దూరంగా పెట్టారు.

సంఘ చరిత్రలో గొప్ప దైవజనులైన ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇదే విధముగా జరిగింది- జాన్‌ వెస్లీ, చార్లెస్‌ ఫిన్నీ, విలియం బూత్‌, వాచ్‌మెన్‌ నీ లతో పాటు ఇతర యదార్థమైన దేవుని ప్రవక్తలందరికీ ఈ పరిస్థితి ఎదురైంది.

యేసువలే మార్చబడాలంటే అటువంటి వెల చెల్లించుటకు మనము ఇష్టపడుచున్నామా? లేక మనమింకా మానవులనుండి గౌరవము లేక ఘనత కోరుకుంటున్నామా?

అపార్థము, అన్యాయము, తప్పుడు నేరారోపణ, బహిరంగ అవమానముల గుండా మనలను అనుమతించి దేవుడు మనలను విరుగగొట్టును. అటువంటి పరిస్థితులు అన్నింటిలోనూ మనల్ని వేధిస్తున్న మనుష్యుల్ని చూడకూడదు. వారు మన సహోదరులు కావచ్చు లేక శత్రువులు కూడా కావచ్చు. ఎవరైనా పరవాలేదు. ప్రతి ఇస్కరియోతు యూద హస్తము వెనుక, పరలోకపు తండ్రి మనకు తాగడానికి ఒక గిన్నెను అందిస్తున్నాడు. ఆ పరిస్థితులలో మనము తండ్రి హస్తము చూస్తే ఆ గిన్నెలోనిది కటిక చేదైనా, బాధాకరమైనా ఆనందముగా త్రాగుతాము; అయితే యూదా హస్తాన్ని మాత్రమే చూస్తే పేతురు వలె ఖడ్గము తీసి ప్రజలయొక్క చెవులు (లేదా కీర్తి ప్రతిష్టలు) లేదా మరేదైనా నరికివేస్తాము.

మనము దాడిచేయబడిప్పుడు, నిష్కారణముగా నిందించబడిప్పుడు దేవుని బలమైన హస్తము క్రింద మనల్ని మనము తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అది మానవ హస్తము కాదనీ, అది దేవుని హస్తమని మనము చూచినప్పుడు ఇలా చేయుట సులభమే.

గత సంవత్సరాలలో అనేక మంది "విశ్వాసులు" నాగురించి నా బోధ గురించి అన్ని రకాల చెడ్డమాటలు చెప్పటం నేను విన్నాను. నాకు, నా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా తప్పుడు నేరాలు మోపారు, నాకు వ్యతిరేకముగా వ్యాసాలు, పుస్తకాలు వ్రాశారు. అటువంటి వారికి నేనెన్నడూ జవాబు చెప్పవద్దని ప్రభువు నాకు నిరంతరము చెబుతూ వచ్చాడు. అందుచేత నేను మౌనంగా ఉండిపోయాను. ఫలితంగా నాలో, నా కుటుంబ సభ్యులలో ప్రభువు గొప్ప ప్రక్షాళన కార్యము జరిగించాడు (పరిశుద్ధ పరిచాడు). దేవుడు కీడును మాకు మేలుగా మార్చగలడు.

ప్రభువు తన స్వంత సమయములో అడ్డుగా ఉన్న మేఘాలన్నింటిని తొలగించి సూర్యుడు వెలిగేలా చేస్తాడని నాకు తెలుసు. అయితే ఆ సమయాన్ని నిర్ణయించే వాడు ఆయనే కాని నేనుకాదు (అపొ. కా. 1:7). అంతవరకు నేను చేయవలసిందల్లా ఆయన బలిష్టమైన చేతిక్రింద నన్ను నేను తగ్గించుకోవడమే; ఎవరి ముందైనా నన్ను నేను సమర్థించుకోవడం నాపని కాదు. అలా చేయుట నేను ఆరంభిస్తే మరో పని చేసేందుకు నాకు సమయమే ఉండదు.

అలెక్సండ్రు అను కంచరవాడిని(రాగి పనివాడు) గూర్చి పౌలు చెప్పినట్లుగా ఒకానొక దినమున ప్రభువే మన శత్రువులకు వారి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును (2 తిమోతి 4:14). కాబట్టి పగ తీర్చుకొనుటకు సంబంధించిన విషయములను మనము ప్రభువు చేతికి అప్పగించవచ్చు (రోమా 12:19).

సమస్త విషయాలను దేవునికి విడిచిపెట్టుటే శ్రేష్టము. ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. సమస్తమును ఆయన స్వాధీనములో ఉన్నది. మనలోని రాతిని చెక్కివేస్తూ క్రీస్తు రూపములోనికి మనల్ని ఆయన రూపుదిద్దుతున్నారు. ఆ శిలలోని కొన్ని భాగాలు అతి కఠినంగా ఉన్నాయి. వాటిని చెక్కుటకు ఆయన తప్పుడు నేరారోపణలు, శ్రమలు అనువాటిని వినియోగిస్తాడు. మనలను మనము దేవుని పనితనానికి అప్పగించుకుంటే చిట్టచివరకు మనము క్రీస్తు స్వరూపము గలవారిగా, ఆత్మీయ అధికారముతో బయటపడతాము.

యూదా యేసును అప్పగించినప్పుడు, యేసు యూదాను "స్నేహితుడా" అని పిలువగలిగాడు, ఎందుచేత నంటే ఆయన దేవుని హస్తాన్ని స్పష్టంగా చూచాడు. అన్ని పరిస్థితుల్లోనూ, మనము దేవుని సార్వభౌమత్వాన్ని చూచినట్లయితే, మనల్నిమనము తగ్గించుకొనుట సులభమవుతుంది. సరియైన సమయములో మనల్ని హెచ్చించుటకు దేవునికి కూడా సులభమవుతుంది. మన భుజాల మీద నుండి భారము తొలగించి తన అధికారాన్ని మనకు అప్పగించుటకు సరియైన సమయము ఎప్పుడో దేవునికి బాగా తెలుసు. అందుచేత మనము ఆయన కోసం వేచియుందాము. ఆయన కోసం ఎదురుచూచువారు ఎన్నడునూ నిరుత్సాహపడరు లేక అవమానానికి గురికారు (యెషయా 49:23).