WFTW Body: 

"సమస్తమును ఆయన మూలమున జరుగుచున్నవి" (రోమా 11:36). ఆత్మవిషయమై దీనులైనవారికే పరలోకరాజ్యము చెందుతుందని యేసు చెప్పారు (మత్తయి 5:3). పరలోకమందున్న తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ఆ రాజ్యములో ప్రవేశించునని కూడా ఆయన చెప్పారు (మత్తయి 7:21). పరలోకరాజ్యము నిత్యమైనది, మరియు దేవుని చిత్తప్రకారము చేయబడినవి మాత్రమే అక్కడ కనిపిస్తాయి. ఆత్మవిషయమై దీనులైన వారెవరంటే -తమ మానవ బలహీనతను ఎరిగి, సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడేవారు. ఈ దృక్కోణంలో చూచినట్లయితే, యేసు ఎల్లప్పుడూ ఆత్మవిషయమై దీనునిగా జీవించారు.

మనిషి ఏ విధంగా జీవించాలని దేవుడు ఉద్దేశించాడో యేసు అలాగే జీవించారు — అనగా నిరంతరము దేవునిపై ఆధారపడుతూ, దేవునికి వేరుగా తన సొంత జ్ఞానాన్ని వాడటానికి నిరాకరిస్తూ జీవించారు. ఆయన చెప్పిన మాటలను ఒక్కసారి ఆలోచించండి: "కుమారుడు తనంతట తాను ఏదియు చేయనేరడు... నా అంతట నేనే ఏదియు చేయను; తండ్రి నాకు నేర్పించినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను... నేను నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను... నేను నా అంతట నేనే మాట్లాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు... నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నిలిచియుండి తన క్రియలు చేయుచున్నాడు" (యోహాను 5:19,30; 8:28,42; 12:49; 14:10).

యేసు కేవలం ఒక అవసరాన్ని చూసి ఏనాడూ పనిచేయలేదు. ఆయన ఒక అవసరాన్ని చూసినప్పుడు దానిని గూర్చి పట్టింపు కలిగి ఉన్నారు, కానీ తన తండ్రి చెప్పినప్పుడు మాత్రమే ఆయన దాని విషయమై పని చేశారు. లోకం ఒక రక్షకుని కొరకు తీవ్రమైన అవసరతలో ఉన్నప్పటికీ, ఆయన పరలోకంలో కనీసం నాలుగు వేల సంవత్సరాలు వేచియుండి, తండ్రి తనను పంపినప్పుడే ఈ లోకానికి వచ్చారు (యోహాను 8:42). "దేవుడు నిర్ణయించిన సరియైన సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను" (గలతీ 4:4 ఆంగ్ల లివింగ్ తర్జుమా). దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నియమించారు (ప్రసంగి 3:1). ఆ సమయం దేవునికి మాత్రమే తెలుసు, కాబట్టి యేసువలె మనము కూడా ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని వెదికితే ఏనాడూ తప్పుటడుగు వేయము. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు, తాను మంచిదని అనుకున్నదల్లా చేసుకుంటూ పోలేదు. ఆయన మనస్సు అత్యంత పవిత్రమైనది అయినప్పటికీ, తన మనస్సులో వచ్చిన ఏ ఒక్క మంచి ఆలోచన ప్రకారం కూడా ఆయన స్వయంగా ప్రవర్తించలేదు. ఆయన తన మనస్సును పరిశుద్ధాత్మకు దాసుడిగా చేశారు.

పన్నెండేండ్ల వయస్సులోనే లేఖనములన్నిటినీ సంపూర్ణంగా ఎరిగియున్నప్పటికీ, ఆయన తదుపరి పద్దెనిమిది సంవత్సరాలు ఒక వడ్రంగిగా తన తల్లి దగ్గరే ఉంటూ బల్లలు, కుర్చీలు మొదలైనవి తయారుచేశారు. తన చుట్టూ నశించిపోతున్న మనుష్యులకు కావలసిన వర్తమానం ఆయన యొద్ద ఉన్నప్పటికీ, ఆయన పరిచర్య చేయుటకు వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే తండ్రి నియమించిన సమయం ఇంకా రాలేదు గనుక.

యేసుప్రభువు వేచియుండటానికి భయపడలేదు. "విశ్వసించువాడు కలవరపడడు (తొందరపడడు)" (యెషయా 28:16). తన తండ్రి నియమించిన సమయం రాగానే, ఆయన ఆ వడ్రంగి వృత్తి నుండి బయటకు వచ్చి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాలలో కొన్ని పరిస్థితుల విషయమై, "నా సమయమింకా రాలేదు" అని ఆయన చెప్తుండేవారు (యోహాను 2:4; 7:6). యేసు జీవితంలో ప్రతిదీ తండ్రి యొక్క సమయము మరియు తండ్రి యొక్క చిత్తము ద్వారానే క్రమపరచబడింది. కేవలం మనుష్యుల అవసరత మాత్రమే యేసును ఒక పని చేయడానికి పురికొల్పలేదు, ఎందుకంటే అది తన సొంత ఆలోచన ప్రకారం చేయడం అవుతుంది. మనుష్యుల అవసరతను పరిగణనలోనికి తీసుకోవాలి, కానీ దేవుని చిత్తము మాత్రమే జరిగించాలి. యోహాను 4:34,35లో యేసు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశారు. అక్కడ ఉన్న అవసరత (35వ వచనము): "మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి యిప్పుడే కోతకు తెల్లపడియున్నవి". పని చేయు సూత్రము (34వ వచనము): "నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదిముట్టించుటయునే నాకు ఆహారమై యున్నది". యేసు తన స్నేహితులు సూచించిన అనేక మంచి పనులను చేయలేదు, ఎందుకంటే మనుష్యుల మాట విని పైకి మంచిగా కనిపించే పనులు చేస్తే, తన తండ్రి తన కొరకు ఉంచిన అత్యుత్తమమైన దాన్ని కోల్పోతానని ఆయనకు తెలుసు.

ఒకసారి, ఒకానొక స్థలంలోనే ఉండిపొమ్మని ప్రజలు ఆయనను బ్రతిమాలుకున్నప్పుడు, తండ్రి స్వరము తనను వేరొక చోటికి వెళ్ళమని పిలుస్తుందని చెబుతూ ఆయన అక్కడ ఉండటానికి నిరాకరించారు. మానవ కోణంలో చూస్తే, ఆయన చెప్పిన వర్తమానానికి ప్రజల నుండి అంతటి మంచి స్పందన వచ్చినందున ఆయన అక్కడే ఉండటానికి ఎంతో బలమైన కారణాలు ఉన్నాయి. కానీ దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు, దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు (యెషయా 55:8). పేతురు మరియు ఇతరులు తమ సలహాలను చెప్పడానికి ముందే, యేసు వేకువజామునే ఏకాంతముగా అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించి, తండ్రి స్వరమును విన్నారు (మార్కు 1:35-39). యేసుప్రభువు మానవ తర్కంపై ఆధారపడలేదు. "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును" (సామెతలు 3:5,6) అనే వాక్యానికి ఆయన విధేయత చూపారు. ప్రతి విషయంలోనూ నడిపింపు కొరకు ఆయన తన తండ్రిపైనే ఆధారపడ్డారు. యెషయా 50:4లో ప్రవచనపూర్వకంగా యేసు గురించి మనము ఇలా చదువుతాము: "శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు". యేసు అలవాటు అదే. ఆయన వేకువజాము మొదలుకొని రోజంతా తండ్రి స్వరమును వింటూ, తండ్రి తనకు ఏమి చెప్పారో సరిగ్గా అదే చేసేవారు. ఏమి చేయాలో నిర్ణయించుకోవడానికి ఆయన మనుష్యులతో చర్చలు జరపలేదు కానీ తన తండ్రితో ప్రార్థనా సమయాన్ని గడిపారు. మానసిన సంబంధులైన క్రైస్తవులు మనుష్యులతో చర్చించి ప్రణాళికలు వేస్తారు. ఆత్మీయ క్రైస్తవులు దేవుని నుండి వినుటకు వేచియుంటారు.

యేసు తన తండ్రి మూలముగా జీవించారు (యోహాను 6:57). యేసుకు ఆహారము కంటే దేవుని వాక్యము ప్రాముఖ్యమైనదిగా ఉండింది (మత్తయి 4:4). ఆయన దాన్ని ప్రతిరోజూ నేరుగా తండ్రి యొద్ద నుండి పొందుకోవాల్సి ఉంది. పొందుకున్న తర్వాత, ఆయన దానికి విధేయత చూపేవారు. ఆ విధేయత కూడా ఆయన అనుదిన ఆహారము కంటే ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది (యోహాను 4:34). యేసు తండ్రిపై ఆధారపడి జీవించారు. రోజంతా ఆయన వైఖరి ఎలా ఉండేదంటే — "తండ్రీ, మాట్లాడుము, నీ దాసుడు వినుచున్నాడు". దేవాలయములో నుండి వ్యాపారస్తులను ఆయన వెళ్లగొట్టిన సందర్భాన్ని ఆలోచించండి. వ్యాపారస్తులు దేవాలయంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారిని తరిమివేయని సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. తండ్రి నడిపించినప్పుడు మాత్రమే ఆయన వారిని వెళ్లగొట్టారు. మానవ ఆలోచనల ప్రకారం జీవించే క్రైస్తవుడైతే ఎల్లప్పుడూ వెళ్లగొడుతూనైనా ఉంటాడు లేదా అసలు ఏమీ చేయకుండానైనా ఉంటాడు. అయితే దేవుని చేత నడిపించబడేవాడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో ఎరిగియుంటాడు. యేసు చేయగలిగిన మంచి పనులు ఎన్నో ఉన్నప్పటికీ, అవి తనయెడల తండ్రి చిత్తంలో భాగం కానందున ఆయన వాటిని ఏనాడూ చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ అత్యుత్తమమైన పనులు చేయడంలోనే నిమగ్నుడై ఉండేవారు. అవి ఆయనకు సరిపోయేవి. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం మంచి పనులు చేయడానికి కాదు, తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి!

పన్నెండేండ్ల వయస్సులో యోసేపు, మరియలతో ఆయన, "నేను నా తండ్రి పనులమీద ఉండవలెనని మీరెరుగరా?" అని అడిగారు (లూకా 2:49). ఆయన నెరవేర్చడానికి ఆసక్తి చూపిన విషయాలు అవి మాత్రమే. ఈ భూమి మీద 33.5 సంవత్సరాల ముగింపుకు వచ్చినప్పుడు, ఆయన ఎంతో తృప్తితో, "చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరిచితిని" అని చెప్పగలిగారు (యోహాను 17:4). ఆయన లోకమంతటా ప్రయాణించలేదు, ఎలాంటి పుస్తకము రాయలేదు, ఆయనను వెంబడించినవారు కొద్దిమందే, లోకంలో అనేక ప్రాంతాలలో ఇంకా ఎన్నో నెరవేరని అవసరతలు ఉండిపోయాయి, కానీ తండ్రి తనకు నియమించిన పనిని ఆయన సంపూర్ణముగా ముగించారు. చివరికి దేవుని దృష్టిలో లెక్కించబడేది అది ఒక్కటే, అది మాత్రమే!

(రెండవ భాగం వచ్చేవారం)