ప్రభువైన యెహోవాయొక్క దాసుడుగా యేసు ఉన్నారు. "సేవకునికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అతడు తన యజమాని చెప్పినట్లే చేస్తాడు" (1 కొరింథీ 4:2 -ఆంగ్ల లివింగ్ తర్జుమా). ఆయన తన జీవితమంతా తన తండ్రి మాట వింటూ, ఎలాంటి అలసట గానీ, ఆందోళనతో కూడిన ‘తొందరపాటు’ గానీ లేకుండా తన తండ్రి చిత్తమంతటినీ నెరవేర్చారు. ఆయన తన స్వంత మానవ ఆశలను చంపుకున్నారు. ఆయన కేవలం శరీరానుసారిగా కాక, ఆత్మానుసారిగా ఉన్నారు.
యేసు తన జీవితంలో ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన తరచుగా అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేస్తుండేవారు (లూకా 5:16). ఒకసారి పన్నెండు మంది శిష్యులను ఎన్నుకునే విషయంలో తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపారు (లూకా 6:12,13). మానసిక సంబంధమైన ఆలోచనలు మాత్రమే కలిగిన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయాన్ని వృధాగా భావిస్తాడు, మరియు తన మనస్సాక్షిని సమాధానపరచడానికి మాత్రమే ప్రార్థిస్తాడు. అతని జీవితంలో ప్రార్థన అనేది ఒక అత్యవసరమైన అవసరత కాదు, ఎందుకంటే అతడు తన స్వయంశక్తిపై నమ్మకం కలిగి ఉంటాడు. కానీ ఆత్మీయుడైన మనుష్యుడు తన సమస్తము కొరకు నిరంతరము దేవునిపై ఆధారపడతాడు, కాబట్టి ఆ అవసరతే అతనిని బలవంతంగా ప్రార్థనకు నడిపిస్తుంది.
తన మాట వినడమే అవసరమైన ఏకైక విషయమని యేసుప్రభువు సెలవిచ్చారు (లూకా 10:42). బేతనియలోని మరియ దీనికి ఒక అద్భుతమైన మాదిరి. మరోవైపు మార్త నిస్వార్థమైన పరిచర్యలో నిమగ్నమై ఉన్నప్పటికీ, ఆమె విశ్రాంతి లేనిదిగాను మరియు మరియను విమర్శించేదిగాను ఉంది. ఆ ఇద్దరు సహోదరీలలో, మనము ఆత్మీయమైన క్రియలకు మరియు మానసిక క్రియలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడవచ్చు. ప్రభువుకు, ఆయన శిష్యులకు పరిచర్య చేయడంలో మార్త ఎలాంటి పాపమూ చేయలేదు. అయినప్పటికీ ఆమె విశ్రాంతి లేకుండా, మరియను విమర్శిస్తూ ఉండింది. ఇది మానసికమైన పరిచర్యకు స్పష్టమైన చిత్రం. కేవలం శారీరక ఆలోచనలతో జీవించే క్రైస్తవుడు విశ్రాంతి లేనివాడిగా, చిరాకుపడేవాడిగా ఉంటాడు. అతడు తన "సొంత క్రియలను" ముగించలేదు, దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదు (హెబ్రీ 4:10). అతని ఉద్దేశాలు మంచివే కావచ్చు, కానీ మారుమనస్సు పొందిన తర్వాత కూడా తన సొంత క్రియలు ఎంత మంచివిగా అనిపించినప్పటికీ, దేవుని దృష్టిలో అవి ఇంకా "మురికి గుడ్డల" వంటివేనని అతడు గ్రహించలేదు (యెషయా 64:6).
అమలేకీయుల పశువులలో (శరీరక్రియలలో) మంచివి కూడా చెడ్డవాటితో సమానంగా దేవునికి అంగీకారయోగ్యం కానివిగా ఉన్నాయి (1 సమూయేలు 15:3, 9-19). కానీ మానవ ఆలోచనలు ఈ సత్యాన్ని గ్రహించలేవు. దేవునికి అర్పించగలిగే మంచి పశువులను నాశనం చేయడం బుద్ధిహీనతగా కనిపిస్తుంది. కానీ దేవుడు విధేయతను కోరుకుంటున్నాడు, బలి అర్పణలను కాదు. "బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట" శ్రేష్ఠమైనది (1 సమూయేలు 15:22). కానీ దేవుడు ఏమి చెబుతున్నారో మనము వినకపోతే ఎలా విధేయత చూపగలము? విధేయత చూపడానికి ముందే వినడం అనేది జరగాలి. అందుకే తన స్వరమును వినడమే అత్యంత అవసరమైన విషయమని యేసుప్రభువు సెలవిచ్చారు. తక్కినవన్నీ దానిపైనే ఆధారపడి ఉన్నాయి.
మార్తవలె ‘పరిచర్య’ చేసేవారు ఎంత యథార్థవంతులైనప్పటికీ, నిజానికి వారు తమకు తామే పరిచర్య చేసుకుంటున్నారు. వారిని ప్రభువు దాసులు అని పిలవలేము, ఎందుకంటే ఒక దాసుడు పరిచర్య చేయడానికి కంటే ముందే, తన యజమానుడు తనకు ఏమి చెప్తాడో వినడానికి కనిపెడతాడు.
మనము మన స్వయం సమృద్ధిని వదులుకుని ఖాళీ చేయబడితే, సొలొమోను వలె ఇలా ప్రార్థిస్తాము: "నా దేవుడవైన యెహోవా... నీ జనులకు న్యాయము తీర్చుటకును, మంచి చెడ్డలు వివేచించుటకును నీ దాసునికి వివేకముగల హృదయము దయచేయుము" (1 రాజులు 3:7, 9). శ్రేష్ఠమైనది ఏది, మంచిది కానిది ఏది — దేవుని చిత్తము ఏది, కానిది ఏది అని వివేచించాలంటే, తాను తన తండ్రి మాట వినాలని యేసుప్రభువుకు తెలుసు.
యెరూషలేము దేవాలయము యొక్క శృంగారమనబడిన ద్వారం వద్ద ఒక కుంటివాడు బిక్షము అడుగుతుండటం యేసుప్రభువు తరచుగా చూశారు. కానీ ఆయన అతనిని స్వస్థపరచలేదు, ఎందుకంటే అలా చేయడానికి ఆయనకు తన తండ్రి నుండి ఎలాంటి నడిపింపు లేదు. ఆ తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమైన పిమ్మట, తండ్రి యొక్క సంపూర్ణమైన సమయంలో పేతురు, యోహానులు ఆ మనుష్యునికి స్వస్థత చేకూర్చారు. దాని ఫలితంగా ఎంతోమంది ప్రజలు ప్రభువు వైపు తిరిగారు (అపొ.కా. 3:1 నుండి 4:4 వరకు). ఆ మనుష్యుడిని స్వస్థపరచడానికి అది తండ్రి నియమించిన సమయం, అంతకుముందు కాదు. ఒకవేళ యేసుప్రభువు అంతకుముందే ఆ మనుష్యుడిని స్వస్థపరిచి ఉంటే, ఆయన తండ్రి చిత్తానికి ఆటంకం కలిగించి ఉండేవారు. తండ్రి నియమించిన సమయం సంపూర్ణమైనదని ఆయనకు తెలుసు, అందుకే ఆయన దేనిని చేయడానికి కూడా తొందరపడలేదు.
యేసుప్రభువు జీవితం సంపూర్ణమైన విశ్రాంతితో కూడిన జీవితం. ప్రతిరోజూ 24 గంటలలో తన తండ్రి చిత్తమంతటినీ నెరవేర్చడానికి ఆయనకు తగినంత సమయం ఉండింది. కానీ తనకు మంచిది అనిపించిన ప్రతిదీ చేయాలని ఆయన నిర్ణయించుకుని ఉంటే, ఆ 24 గంటల సమయం సరిపోయేది కాదు మరియు ఆయన ఎక్కువ రోజులను విశ్రాంతి లేకుండా ఆందోళనతో ముగించాల్సి వచ్చేది. తన అనుదిన ప్రణాళికను పరలోకమందున్న సర్వాధికారియైన తండ్రియే సిద్ధపరుస్తున్నారనే సత్యాన్ని ఆయన అంగీకరించినందున, తన పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఆయన ఆనందించగలిగారు. అందుకే అవాంతరాలు వచ్చినప్పుడు ఆయన ఏనాడూ విసుగు చెందలేదు. యేసుప్రభువు యొక్క జీవం మన అంతరంగంలో కూడా సంపూర్ణ విశ్రాంతిని తెస్తుంది. దీని అర్థం మనము ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటామని కాదు, మన జీవితాల పట్ల తండ్రి ప్రణాళికలో ఉన్నవాటిని మాత్రమే చేస్తామని అర్థం. అప్పుడు మన సొంత ప్రణాళికల కంటే తండ్రి చిత్తాన్ని ముగించడానికే మనము ఎక్కువ ఆశ కలిగి ఉంటాము.
కేవలం తమ శారీరక ఆలోచనలతో నడుచుకునే క్రైస్తవులు ‘తమ సొంత మార్గంలో పనులను’ చేయడంలో ఎంత నిమగ్నమై ఉంటారంటే, వారు తరచుగా చిరాకు పడుతూ విశ్రాంతి లేకుండా ఉంటారు. చివరికి వారిలో కొందరు మానసికంగా లేదా శారీరకంగా కృంగిపోతారు.
యేసుప్రభువు అంతరంగంలో సంపూర్ణ విశ్రాంతి కలిగి ఉన్నారు గనుక, ఆయన మానసికంగా కృంగిపోవడం అనేది అసాధ్యమైనది. ఆయన మనతో ఇలా సెలవిచ్చుచున్నారు: "నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరకును" (మత్తయి 11:29).
వాక్యములో దేవుని ఆత్మ మనకు చూపించే యేసుప్రభువు యొక్క మహిమ ఇదే, మరియు దీనినే ఆయన మనకు అనుగ్రహించి, మన ద్వారా బయలుపరచాలని ఆశిస్తున్నారు.
ప్రభువే మన కాపరి, ఆయన తన గొర్రెలను విశ్రాంతిగల పచ్చిక బయళ్ళలోనికి నడిపిస్తారు. గొర్రెలు తమ సొంత ప్రణాళికలను వేసుకోవు లేదా తర్వాత ఏ పచ్చిక బయలుకు వెళ్ళాలో నిర్ణయించుకోవు. అవి కేవలం తమ కాపరిని వెంబడిస్తాయి. కానీ కాపరిని ఆ రీతిగా వెంబడించాలంటే, ఒకరు తన స్వయంశక్తిని, స్వీయ నమ్మకాన్ని వదులుకుని ఖాళీ అవ్వాలి. యేసుప్రభువు సాత్వీకముతో తన తండ్రిని వెంబడించారు. కానీ శారీరక ఆలోచనలు గల క్రైస్తవులు గొర్రెలుగా ఉండటానికి ఇష్టపడరు, కాబట్టి తమ సొంత తెలివితేటల చేత దారితప్పిపోతారు. బుద్ధి అనేది మనకు దేవుడిచ్చిన అత్యంత అద్భుతమైన, ఉపయోగకరమైన తలాంతు, కానీ మన జీవితంలో దానిని ప్రభువుగా ఉండనిస్తే, అది దేవుడిచ్చిన తలాంతులన్నిటిలోను అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతుంది.
"మా తండ్రీ, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక" అని ప్రార్థించమని ప్రభువు తన శిష్యులకు నేర్పించారు. పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతోంది? అక్కడ ఉన్న దేవదూతలు ‘దేవుని కోసం ఏదో ఒక పని చేయడానికి’ అటూ ఇటూ పరుగులు తీయరు. వారు గనుక అలా చేస్తే పరలోకంలో అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. వారు ఏమి చేస్తారు? ఆయన ఏమి ఆజ్ఞాపిస్తాడో వినడానికి వారు దేవుని సన్నిధిలో కనిపెడతారు, ఆ తర్వాత తమకు ప్రత్యేకంగా చెప్పబడిన దాన్ని సరిగ్గా నెరవేరుస్తారు. జెకర్యాకు గాబ్రియేలు దూత చెప్పిన మాటలను గమనించండి: "నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును; నీతో మాట్లాడుటకును ఈ శుభవార్త నీకు తెలియజేయుటకును పంపబడితిని..." (లూకా 1:19). యేసుప్రభువు కూడా ఇదే స్థానం తీసుకున్నారు -తన తండ్రి సన్నిధిలో కనిపెట్టడం, ఆయన స్వరమును వినడం మరియు ఆయన చిత్తమును నెరవేర్చడం.
శారీరక క్రైస్తవులు ఎంతో కష్టపడవచ్చు, ఎంతో త్యాగం చేయవచ్చు, కానీ నిత్యత్వపు వెలుగులో "తాము రాత్రంతా ప్రయాసపడినా ఏమీ పట్టులేదని" తేలిపోతుంది. కానీ అనుదినము తమ సిలువను ఎత్తుకుని (తమ స్వీయజీవాన్ని ఉపేక్షించి దానిని చంపుకుని) ప్రభువుకు విధేయత చూపినవారు ఆ దినాన సమృద్ధిగా చేపలతో నిండిన వలలను కలిగి ఉంటారు (యోహాను 21:1-6).
యేసుప్రభువు ఇలా సెలవిచ్చారు: "నేను అతని కొరకు నిర్ణయించిన పని నుండి తన దృష్టిని మళ్లించుకునే ఎవడైనా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు" (లూకా 9:62 -ఆంగ్ల లివింగ్ తర్జుమా). "ప్రభువునందు నీవు పొందుకున్న పరిచర్యను నెరవేర్చుటకు దానినిగూర్చి జాగ్రత్తపడుము" (కొలొస్సి 4:17).
పరలోకమందున్న మన తండ్రి నాటని ప్రతి మొక్కయు పెకలింపబడును (మత్తయి 15:13).
ఆ మొక్క మంచిదా కాదా అనేది ప్రశ్న కాదు, దాన్ని నాటింది ఎవరు అనేదే ప్రాముఖ్యం. దేనికినైనా సరే దేవుడొక్కడే ఏకైక మూలకారకుడు. బైబిల్ "ఆదియందు దేవుడు" అనే మాటతో ప్రారంభమవుతుంది. మన పనులన్నీ నిరంతరం నిలిచియుండాలంటే, అవి మన మనస్సులలో నుండి కాక దేవుని నుండి ప్రారంభం కావాలి.
దేవుని చిత్తమును జరిగించువాడు ఎల్లప్పుడును నిలిచియుండును (1 యోహాను 2:17).
తక్కినవన్నీ నశించిపోతాయి.
కాబట్టి, మనలను మనము ఈ ప్రశ్న అడుగుకుందాము:
నేను దేవుని చిత్తములో జీవిస్తూ, పరిచర్య చేస్తున్నానా?