WFTW Body: 

ప్రభువు సిలువవేయబడకముందు ప్రభువును ఎరుగనని పేతురు మూడుసార్లు బొంకాడు. ఇది గత మూడు సంవత్సరాలుగా తనలో ఉన్న గర్వము, స్వీయధృడమైన వైఖరి, ప్రార్థనలేమిని బయలుపరచింది. అయినప్పటికిని ప్రభువు తన గొఱ్ఱెలను మేపమని పేతురుతో చెప్పినప్పుడు, ఈ బలహీనత గురించి ప్రభువు మాట్లాడలేదు. భవిష్యత్తులో దీనుడవైయుండి ప్రార్థనపరుడవైయుండి మరియు ప్రభువు నిమిత్తము వచ్చె శ్రమలను ఎదుర్కొనమని కూడా ప్రభువు చెప్పలేదు. దేవుని ప్రజలను నడిపించవలసిన నాయకునికి మరియు ఒక ఆత్మీయ వ్యక్తికి ఈ అర్హతలు ఉండవలసినప్పటికిని ప్రభువు వాటిని గూర్చి అడగలేదు.

ఒక సామాన్య ప్రశ్న సరిపోతుందని ప్రభువైన యేసునకు తెలియును. ఆ ప్రశ్నకు సరియైన జవాబు వచ్చినట్లయితే సహజముగానే మిగతా వాటికి కూడా సరియైన జవాబు వస్తుంది. "అన్నిటికంటే మరియు అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా?" (యోహాను 21:15-17). ఒక మనుష్యుని యెక్క ఆత్మీయత క్రీస్తుయెడల అతనికున్న ప్రేమను బట్టి తెలుస్తుంది. ఒక మనుష్యుడు సంఘములో హెచ్చించబడి అధ్యక్షుడు(బిషపు) అయినట్లయితే సహజముగా అతను ఆత్మీయుడని అనుకుంటాము. అది నిజము కాకపోవచ్చు. కొత్తగా జన్మించుట మరియు ప్రభువును ప్రేమించుట ఒక వ్యక్తిని ఆత్మీయముగా చేస్తుంది. ఈనాడు ఒక సంఘముయెక్క అధ్యక్షుడు కూడా కొత్తగా జన్మించి ఉండకపోవచ్చు. వేదాంత కళాశాలలో చదివి వేదాంతంలో డిగ్రీ ఉన్నప్పటికిని కొత్తగా జన్మించాడని చెప్పలేము. ఒక మంచి సువార్త కళాశాలలో ఒక వ్యక్తి చదివినప్పటికిని అది అతని ఆత్మీయముగా చేయలేదు. నీవు పూర్తి కాలపు క్రైస్తవ పరిచారకుడవు అయినప్పటికిని లేక ఒక సమాజానికి కాపరివై ఉన్నప్పటికిని అవి నిన్ను దైవజనుడిగా చేయలేవు. నీవు సంఘకూటములకు క్రమంగా వచ్చినప్పటికిని లేక నీకు బైబిలు జ్ఞానం చాలా ఉన్నప్పటికిని లేక సువార్త పరిచర్య చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికినీ అవి ఆత్మీయతకు గుర్తులు కావు.

ప్రత్యేకవస్త్రధారణ లేక పైపై భక్తి మనలను మోసం చేయును. వీటి వలన ప్రయోజనం లేదు. ఆయన యెడల నీకున్న ప్రేమ మాత్రమే దేవుని దృష్టిలో నిజమైన ఆత్మీయత. అది నీకు మరియు ప్రభువుకు మధ్యలో ఉన్న విషయం మాత్రమే. ఆయన ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. "నీవు నన్ను ప్రేమిస్తున్నావా?". దీనికి జవాబు నీవే కనుగొనాలి.

ఇస్సాకు రిబ్కాను ప్రేమించినప్పుడు అతడు ఆమెనుండి పరిచర్యను కోరలేదు కాని ఆమెనుండి ప్రేమను కోరాడు. అలాగే ప్రభువు మనయెద్దనుండి పరిచర్యను కాదు కాని ప్రేమను కోరుచున్నాడు. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ పరిచర్య కూడా ఉంటుంది. రిబ్కా మెసొపొతమియ నుండి కానానుకు అబ్రహాముయొక్క దాసునితో 600మైళ్ళు ప్రయాణము చేసి వచ్చింది. ఆ ప్రయాణములో వారు దేనిని గూర్చి మాట్లాడియుంటారని నీవు అనుకొనుచున్నావు? ఆమె నిజముగా ఇస్సాకును ప్రేమించినట్లయితే మార్గమంతటిలో ఇస్సాకును గురించి అడిగి తెలుసుకొని ఉండెడిది. ఆమె తనతో ఉన్న వారిని ఇస్సాకును గూర్చి అనేక ప్రశ్నలడిగియుంటుంది. అటువంటి దప్పికతో ప్రభువైన యేసును ప్రేమించే విశ్వాసి బైబిలు చదువుతాడు. రోజురోజుకు ప్రభువైన యేసుయొక్క అందమును చూపించమని పరిశుద్ధాత్మను అడుగుచూ ఉంటాడు.

మన యొక్క ఆత్మీయత క్రీస్తుయెడల మనకున్న ప్రేమను బట్టియేనని ప్రభువు మనకు చూపించును గాక. లేని యెడల మనలను మనమే మోసం చేసుకుంటాము. మన ప్రేమకు ఋజువు మన విధేయతయే (యోహాను 14:15, 21:23,24).

బైబిలులోని చివరి పుస్తకములో కూడా ఈ సత్యం స్థిరపరచబడింది. మొదటి ప్రేమను కోల్పోయినందుకు అక్కడ ప్రభువు ఎఫెసి సంఘాన్ని గద్దించియున్నాడు (ప్రకటక 2:1-5). వేరే విషయాలలో ఆ సంఘము మంచి సంఘముగా ఉన్నది. వారు సహనముతో పరిచర్య చేశారు. వారు దుష్టుని సహించలేదు, అపోస్తలులుకాకయే తాము అపోస్తలులని చెప్పుకొనే వారిని వారు అబద్ధికులని కనుగొన్నారు. మరియు సహనము నిమిత్తము భారము భరించి అలయలేదు. వారెంతో ప్రభువు పరిచర్య చేసియున్నారు. వారు వీటిని విడిచిపెట్టలేదు. అయినప్పటికినీ ప్రభువు వారికి వ్యతిరేఖముగా మాట్లాడియున్నాడు. వారికున్నటువంటి సాక్షమును దీపస్తంభమును కోల్పోయే పరిస్థితి వచ్చింది. వారు పడిపోయిన స్థితిని జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు పొందనియెడల ఆ దీపస్తంభమును అభిషేకమును తీసివేసెదనని ప్రభువు చెప్పాడు. ప్రభువు యెడల తమకున్న మొదటి ప్రేమను కోల్పోవుటయే కాక దానిని విడిచి మరొక దానిలోనికి వెళ్ళారు. వారు కూటము పెట్టుట, ఉపవాస ప్రార్థనలు బహిరంగ కూటములు మరియు అనేక క్రైస్తవ పరిచర్యలు కలిగియుండి, ఎవరికొరకైతే దీనిని చేయుచున్నారో ఆయన యెడల మొదటి ప్రేమను కోల్పోయారు. మనం చేసే పరిచర్య కంటే ఎక్కువగా ప్రభువు మన హృదయములలో ప్రేమను కోరుచున్నాడు. అపవాది దీనిని ఎరిగిన వాడై మనం ఆయా పరిచర్యలలో తీరిక లేకుండా ఉండేటట్లు చేసి మరియు ప్రభువుతో మనం గడుపుటకు సమయం లేకుండా చేస్తాడు. ఆ విధంగా వ్యక్తిగతంగా మనం ప్రభువుతో ఎక్కువ సహవాసం చేయకుండునట్లు చేస్తాడు.

అంత్య దినములలో ఆయనయెడల అనేకులకున్న ప్రేమ పాపము విస్తరించుట వలన చల్లారిపోతుందని ప్రభువైన యేసు హెచ్చరించారు (మత్తయి 24:12). ఇప్పుడు మనం అటువంటి దినములలో నివసిస్తున్నాము. ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకునే వారి ఆత్మీయ స్థితి చల్లబడిపోయింది. మనం కూడా ఎల్లప్పుడు జాగ్రత్త వహించనట్లయితే అటువంటి వాతావరణం మనలో కూడా రావచ్చును. క్రీస్తులో నా సహోదరసహోదరిలారా! నీవు అంతయు పోగొట్టుకొనినప్పటికిని ప్రభువు యెడల నీకున్న ప్రేమను పోగొట్టుకొనవద్దు. నీ జీవితకాలమంతయు ప్రతిరోజు నీ హృదయములో ఈ విషయం భద్రపరచుకొనుము.

ప్రేమయే అన్నిటికంటే శ్రేష్టమైనది. ప్రేమను కలిగియుండుటకు ప్రయాసపడుడి (1కొరంథి 13:1, 14:1).