WFTW Body: 

ప్రజలను ద్వేషించే తప్పుడు వైఖరి గురించి యేసు చెప్పారు. "నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా" (మత్తయి 5:43). పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు కనానీయులను ద్వేషించారు, వారు ఫిలిష్తీయులను ద్వేషించారు, వారు అమోరీయులను, మోయాబీయులను ద్వేషించారు. వారు వారిని నాశనం చేయాలని అనుకున్నారు. కానీ యేసు ఇప్పుడు ఇలా చెప్పారు, "నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి". ఈ సంవత్సరాలలో దేవుడు మారిపోయాడా? లేదు. యేసుక్రీస్తులా జీవించడానికి ఇప్పుడు మనిషికి ఎక్కువ అవకాశం ఉంది. పాత నిబంధనలో యేసులా జీవించే సామర్థ్యం అతనికి లేదు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుడు మీరు వారిని ప్రేమించాలని కోరుకునే విధంగా మీ శత్రువులను నిజంగా ప్రేమించడం అసాధ్యం. ఎంతో దయగల వ్యక్తిగా కొంత గౌరవం పొందడానికి మీరు మీ శత్రువును ప్రేమించవచ్చు, కానీ దేవుని మహిమ కోసం మీ శత్రువును ప్రేమించడం గూర్చి ఏమిటి? పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి మాత్రమే అలా చేయగలడు. "నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి".

ప్రపంచవ్యాప్తంగా శిష్యుడిగా ఉన్న ప్రతి విశ్వాసికి మనం ఈ ఆజ్ఞలు బోధించాలని గుర్తుంచుకోండి. నేను ఒక సంఘాన్ని నిర్మించాలంటే, దానిలోని ప్రతి వ్యక్తి తన శత్రువులను ప్రేమించే సంఘంగా నేను నిర్మించాలి. అతనికి పదిమంది శత్రువులు ఉండి, తొమ్మిదిమందిని ప్రేమిస్తే, అతను యేసు చెప్పిన ఈ ఆజ్ఞను పాటించలేదు, "సమస్త జనులను శిష్యులనుగా చేయండి, నేను ఆజ్ఞాపించిన వాటికి విధేయత చూపించి, వాటిని చేయమని వారికి బోధించుడి". మరో మాటలో చెప్పాలంటే, నేను మొదట దానిని అనుభవించాలి, అందుకే దేవుని ప్రతి సేవకుడు తన జీవితంలో శత్రువులను ఎదుర్కోవడానికి దేవుడు అనుమతిస్తాడు - తద్వారా అతను వారిని ప్రేమించడం నేర్చుకోగలడు. ఆ విధంగా అతను ఇతరులకు వారి శత్రువులను ప్రేమించుటను నేర్పించగలడు.

అందుకే ప్రతి నిజమైన దేవుని సేవకుడు హింసను ఎదుర్కోవలసి ఉంటుంది - ఎందుకంటే అప్పుడే తనను హింసించే వారి కోసం ఎలా ప్రార్థించాలో నేర్చుకోగలడు, ఆపై ఇతరులకు వారిని హింసించే వారి కోసం ఎలా ప్రార్థించాలో నేర్పించగలడు. అందుకే యేసు, "మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉండునట్లు" అని చెప్పారు. ఆయన మన పరలోక తండ్రిని చూడమని మనకు ఆదేశిస్తున్నాడు, ఆయన "దుష్టులమీదను మంచివారిమీదను సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు" (మత్తయి 5:45).

ఇద్దరు రైతుల గురించి ఆలోచించండి, ఒకరు నాస్తికుడు, మరొకరు దైవభక్తిగల రైతు. వారి పొలాలు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా ప్రార్థిస్తుండగా మరొక వ్యక్తి దేవుడు లేడని మరియు ఇదంతా చెత్త అని భావిస్తాడు. అయినప్పటికీ దేవుడు వారి ఇద్దరిపైనా మరియు వారి పొలాలపైనా సూర్యుడిని ఉదయింపజేస్తాడు! దేవుడు వారి ఇద్దరి పొలాలపై సమానంగా వర్షం కురిపిస్తాడు, తద్వారా వారు మంచి పంటలు మరియు వారి చెట్లలో మంచి ఫలాలను పొందుతారు. దేవుడు ఎంత మంచివాడో మీరు చూశారా! ఆయన నాస్తికుడైన మరియు దైవభక్తిగల రైతుపై సమానంగా వర్షం కురిపిస్తాడు. ఆయన మనల్ని ఆవిధంగా ఉండమని చెప్తున్నాడు. దేవునిలా ఉండండి - మీకు మంచి చేసే వ్యక్తికి మరియు మీకు చెడు చేసే వ్యక్తికి సమానంగా మంచి చేయండి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఇదంతా అసాధ్యం - అందుకే పాత నిబంధనలో అటువంటి ఆజ్ఞలను మనం చదవము.

మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తే, దానిలో ప్రత్యేకత ఏమీ లేదని యేసు ఇంకా ముందు చెప్పారు. ఎందుకంటే పన్ను వసూలు చేసేవారు, హంతకుల వంటి దుష్ట పాపులు, తప్పుడు మతాలు మరియు గుంపులలోని వ్యక్తులు కూడా అలా చేస్తారు. కాబట్టి మీరు మీ స్నేహితులను లేదా మీ సహోదరులను మాత్రమే పలకరిస్తే, మీరు అన్యుల కంటే మెరుగైనవారు కాదు (మత్తయి 5:47).

మిమ్మల్ని పలకరించడానికి ఇష్టపడని వ్యక్తిని పలకరించడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? నేను చాలాసార్లు అలా చేశాను. ప్రభువు సేవకుడిగా, నేను ప్రకటించే సత్యం - దేవుని వాక్యంలోని సత్యం కారణంగా చాలా మంది నాపై కోపంగా ఉన్నారు. ఈ ఇరవై శతాబ్దాలుగా ప్రజలు యేసు, పౌలు మరియు దేవుని అనేక ఇతర సేవకులపై కోపంగా ఉన్నట్లే, చాలామంది నేను రోడ్డుపై కనపడితే నన్ను పలకరించరు. కొన్నిసార్లు నేను వారిని పలకరించడానికి రోడ్డు దాటుతాను ఎందుకంటే వారిపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదని చూపించడానికి, మిమ్మల్ని పలకరించడానికి ఆసక్తి లేని వారిని పలకరించమని బైబిల్ చెబుతుంది.

ఒకసారి ఎవరో నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారని అడిగారు. ప్రపంచంలో ఉన్నంత మంది నాకు స్నేహితులుగా ఉన్నారని నేను చెప్పాను, మరియు ఆ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది! నా విషయానికొస్తే, ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ఉంటే, వారందరూ నా స్నేహితులే. నాకు శత్రువులు లేరు; నేను వారందరినీ ప్రేమిస్తున్నాను. వారు నన్ను వారి శత్రువుగా భావించవచ్చు, కానీ నేను వారిని నా శత్రువుగా పరిగణించను. నాకు హాని చేసిన, నన్ను హింసించిన వ్యక్తుల కోసం ప్రార్థించాలనుకుంటున్నాను. నన్ను శపించిన వ్యక్తులను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. "నిన్ను శపించే వారిని ఆశీర్వదించు" (మత్తయి 5:44). మీరు అలా చేస్తారా?

ఏ శాపమూ మీకు ఎప్పుడూ హాని చేయదని మీకు తెలుసు. మనం దేవుని ఆశీర్వాదం క్రింద ఉన్నందున అది అసాధ్యం. క్రీస్తు సిలువపై ప్రతి శాపాన్ని తీసుకున్నాడు మరియు ఇప్పుడు మనం దేవుని ఆశీర్వాదంలో ఉన్నాము, కాబట్టి నన్ను శపించే ఏ వ్యక్తి కూడా నన్ను ఏ విధంగానూ బాధించడు. అతనికి అది తెలియదు మరియు నేను ప్రతిస్పందనగా, "దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక" అని చెప్పడం ద్వారా అతన్ని ఆశీర్వదించగలను. నేను ప్రపంచంలోని ప్రతి మానవుని వైపు తిరిగి, "దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక" అని చెప్పగలను. ప్రతి ఒక్కరి యెడల నేను నిజంగా కోరుకునేది అదే. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడా లేదా అనేది అతని వైఖరి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది, కానీ దేవుడు అతన్ని ఆశీర్వదించాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను.