వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు Struggling శిష్యులు
WFTW Body: 

నీకేమి ఉన్నప్పటికిని, విశ్వాసము లేనట్లయితే దేవునికిష్టులై యుండుట అసాధ్యము (హెబ్రీ 11:6). హవ్వ విశ్వాసము విషయములో ఓడిపోయింది. దేవునియొక్క పరిపూర్ణమైన ప్రేమను మరియు జ్ఞానమును ఆమె విశ్వసించినయెడల, అందమైన వృక్షముచేత శోధించబడినప్పుడు, దేవుడు ఎందుకు పండును తినవద్దని నిషేధించాడో తనకు తెలియనప్పటికిని పాపము చేసేడిది కాదు. కాని దేవుని ప్రేమను ఆమె అనుమానించేటట్లు సాతాను చేసినందువలన ఆమె వెంటనే పడిపోయింది.

దేవుడు కొన్ని కార్యములు చేయకూడదని నిషేధించాడు. మరియు కొన్ని ప్రార్థనలకు కూడా ఆయన జవాబు ఇవ్వడు. అటువంటి సమయములలో దేవుని యొక్క జ్ఞానములోను పరిపూర్ణమైన ప్రేమలోను నమ్మకము ఉంచాలి. ప్రభువైనయేసు సిలువమీద విడిచిపెట్టబడినప్పటికిని తండ్రియందు విశ్వాసముంచియున్నాడు. "ఓ దేవా, నన్నేల చేయి విడిచితివి?" అని ఆయన చెప్పలేదు గాని "నా దేవా..." అని పిలిచియున్నాడు అనగా "నీవు నన్ను ఎందుకు చేయి విడిచియున్నావో నాకు తెలియనప్పటికిని, నీవే నా దేవుడవు". ప్రభువైన యేసు ప్రార్థనకు జవాబు లేదు కాని ఆయన విశ్వాసముతో మరణించాడు. "నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనుచున్నానని" చెప్పారు. చివరి వరకు విశ్వాసముతో సహించుట అనగా ఇదియే.

సాతాను పేతురును జల్లించవలెనని కోరియున్నాడని ప్రభువైన యేసు పేతురుతో చెప్పాడు. పాత నిబంధనలో యోబును జల్లించుటకు సాతాను దేవునియొక్క అనుమతినే కోరినట్లున్నది. దేవుని అనుమతి లేకుండా సాతాను మనలను ఏమి చేయలేడు. పేతురు జల్లించబడినప్పుడు అతని నమ్మిక తప్పిపోకుండా ప్రార్థించెదనని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 22:31,32). ఇదియే ముఖ్యమైయున్నది. ప్రభువైన యేసు మనము శోధించబడకూడదని, మన ఆరోగ్యము గురించిగాని, ఉద్యోగము విషయములలో తప్పిపోకుండునట్లు ప్రార్థించడు గాని నమ్మిక తప్పిపోకుండునట్లు ప్రార్థించును.

కాబట్టి ప్రభువైన యేసు దృష్టిలో విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైయున్నది. పేతురు వలె మనము అతి ఘోరముగా ఓడిపోయినప్పటికిని, మనకు విశ్వాసము ఉన్న యెడల ఎన్నటికిని నిరాశపడము. మన పాపములను దేవునియెదుట ఒప్పుకొనినప్పుడు, ప్రభువైన యేసు రక్తము చేత సమస్త దుర్నీతినుండి పవిత్రపరచబడియున్నామనే మన సాక్ష్యము ద్వారా జయించగలము (ప్రకటన 12:11). మన పాపములు అన్నియు ప్రభువైనయేసు రక్తములో పవిత్రపరచబడినవనియు మరియు మన పాపములను దేవుడు ఎన్నటికిని జ్ఞాపకముంచుకొనడనియు మనము సాతానుతో చెప్పాలి (హెబ్రీ 8:12). మనము నోరుతెరచి గట్టి శబ్దముతో సాతానుతో చెప్పాలి ఎందుకనగా అతడు మన తలంపులను వినలేడు. ఆ విధముగా మనము అతనిని జయించెదము మరియు అతడు మన యొద్దనుండి పారిపోవును.

"నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగిలేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాని చూచును - నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును. అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలె త్రొక్కబడును" (మీకా 7:8-10).

అన్ని సమయములలో ధైర్యముగా ఈ విధముగా చెప్పాలి, "కాబట్టి - ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి - నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా" (హెబ్రీ 13:6,5).