వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

"దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు" (మత్తయి 5:4). "ఓదార్పు"(comfort) అనే పదానికి "బలపరచబడటం" అని అర్థం. దాని మధ్యలో "f-o-r-t" (కోట) అనే చిన్న పదం ఉంది. "కోట" అనేది ఒక పెద్ద సైనిక రక్షిత ప్రాంతాన్ని చిత్రీకరిస్తుంది - బలపరచబడిన కోట. "దుఃఖించువారు ధన్యులు, ఎందుకంటే వారు ఓదార్చబడతారు". ప్రపంచంలోని ప్రజలు అన్ని రకాల విషయాల కోసం దుఃఖిస్తారు. చాలా మంది వ్యక్తిగతంగా నష్టపోయినందున దుఃఖిస్తారు. వారు డబ్బును, లేదా ప్రియమైన వ్యక్తిని, లేదా తమ ఖ్యాతిని, లేదా ఈ భూమిలోని ఏదో ఒకటి అంటే వారి గౌరవం, స్థానం, ఉద్యోగం లేదా అలాంటి దానిని కోల్పోయారు. కానీ యేసు అలాంటి దుఃఖం గురించి మాట్లాడటం లేదు. ఎవరో నన్ను బాధపెట్టినందుకు దుఃఖించడం కాదు, నా స్వంత బాధలను బట్టి దుఃఖించడం కాదు.

యేసు ఎప్పుడూ తన స్వంత బాధలను బట్టి ఏడవలేదు, కానీ ఇతరుల కోసం ఏడ్చాడు. ఆయన యెరూషలేమును చూసి ఏడ్చాడని (లూకా 19:41) మరియు లాజరు సమాధి వద్ద ఏడ్చాడని (యోహాను 11:35) మనం చదువుతాము, కానీ ప్రజలు తన ఎడల ప్రవర్తించిన దానిని బట్టి, వారు తనను అపవాది అని పిలిచిన లేదా తనపై ఉమ్మివేసిన దానిని బట్టి ఆయన ఎప్పుడూ ఏడవలేదు. ఆయన తనకోసం ఎప్పుడూ ఏడవలేదు. అంతే కాదు, ఆయన సిలువను ఎత్తుకుని సిలువ వేయబడుటకు వెళ్ళే మార్గంలో తడబడుతున్నప్పుడు, చాలా మంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయనను కొరడాలతో కొట్టడం, ఆయన తలపై ముళ్ల కిరీటం ధరించి ఆ బరువైన సిలువను మోస్తున్నప్పుడు ఆయన తలనుండి మరియు వీపునుండి రక్తం ప్రవహించడం చూసి కొంతమంది స్త్రీలు దుఃఖిస్తూ బిగ్గరగా ఏడ్చారని మనం చదువుతాము. యేసు వారితో ఏమి చెప్పాడో మీకు తెలుసా? "యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవడం ఆపండి! నేను బాగున్నాను; అవును, నా వీపు చిరిగిపోయింది, నా తలపై ముళ్ల కిరీటం ఉంది, నేను ఒక బరువైన సిలువను మోస్తున్నాను. కొన్ని క్షణాల్లో నేను చంపబడబోతున్నాను, కానీ నేను దేవుని చిత్తం కేంద్రంలో ఉన్నందున నేను పూర్తిగా బాగున్నాను" (లూకా 23:28 వివరణ)!.

మీరు ఎక్కువగా బాధపడుతున్నప్పుడు మీరు అటువంటి వైఖరిని కలిగి ఉండగలరా? "నా కోసం ఏడవకండి, నేను బాగున్నాను, కానీ మీరు ఏడవాలనుకుంటే, మీ కోసం మరియు మీ పిల్లల కోసం ఏడవండి - వారి ఆధ్యాత్మిక స్థితిని చూడండి". వారు పరిసయ్యులు, వస్త్రాలు ధరించి చాలా గొప్పగా కనిపిస్తారు. కానీ వారి ఆధ్యాత్మిక స్థితిని చూడండి. క్రీస్తు తిరిగి వచ్చిన రోజున ఏమి జరుగుతుందో చూడండి, వారు పర్వతాలతో, "మాపై పడి మమ్మల్ని కప్పండి" అని చెప్తారు (లూకా 23:30) . అదే యేసుయొక్క వైఖరి. ఒక ఆంగ్లపాటలో చెప్పిబడినట్లుగా, ఆయన తన సొంత భాధల కోసం కన్నీళ్లు పెట్టుకోలేదు, కానీ నా కోసం రక్తం చెమట బిందువులుగా కార్చాడు.

నిజమైన యేసు శిష్యుడు క్రీస్తులా లేనందున దుఃఖిస్తాడు; తాను పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దుఃఖిస్తాడు. ప్రజలు తనతో ఎలా ప్రవర్తిస్తారో చూసి దుఃఖించడు. క్రీస్తు కోసం అవమానించబడటం, ఈ భూమిపై తనకు నియమించబడిన విధి అని అతను నమ్ముతాడు. పాపం ద్వారా లేదా వైఫల్యం ద్వారా ప్రభువును అవమానించినప్పుడల్లా అతను దుఃఖిస్తాడు. అతను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, యేసు యెరూషలేము గురించి ఏడ్చినట్లుగా ఇతరుల పాపాల కోసం, ఇతరుల వైఫల్యం కోసం కూడా దుఃఖిస్తాడు. యేసు చెప్పిన దుఃఖం ఇదే. "దుఃఖించేవారు ధన్యులు, ఎందుకంటే వారు బలపరచబడతారు." బహుశా మనలో కొందరు బలపడకపోవడానికి కారణం మనం మన పాపం కోసం దుఃఖించడం లేదేమో.

అంతకు మించి వెళ్లి ఇతరుల పాపాల కోసం దుఃఖించడం ఇంకా ఉన్నత స్థాయి. అపొస్తలుడైన పౌలు ఆ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. చాలా దారుణంగా విఫలమైన కొరింథీయులతో అతను ఇలా అంటున్నాడు, "ఒకవేళ నేను వచ్చినప్పుడు... నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని... భయపడుచున్నాను" (2 కొరింథీ 12:20,21). దేవుడు పౌలును ఎందుకు చిన్నబుచ్చుతాడు? అతను ఎంతో నీతిమంతమైన జీవితాన్ని గడిపాడు, తనకు తెలిసినంతవరకు తనకు వ్యతిరేకంగా ఏ పాపం లేదని గ్రహించాడు. కానీ అతను ఇలా అంటున్నాడు, "మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను". వారి సంఘం మధ్యలో వారికి ఉన్న కొన్ని విషయాలను జాబితా చేశాడు (21వ వచనం): అసూయ, కోపం, కోపతాపాలు, వివాదాలు, అపనిందలు, పుకార్లు, అహంకారం, అల్లర్లు మొదలైనవి. తమను తాము దేవుని ప్రజలు అని పిలిచే వారిలో ఉన్న అన్ని పాపాల గురించి ఆలోచించినప్పుడు, అతను వారి ఆత్మీయ తండ్రి కాబట్టి ఏడ్చాడు. తన కొడుకు ఎంతో అనారోగ్యంతో ఉంటే భూసంబంధమైన తండ్రి ఎలా ఏడుస్తాడో ఇది అలాగే ఉన్నది. తండ్రి ఆత్మీయ మనస్సు కలిగిన వాడైతే, తన కొడుకు మాదకద్రవ్యాలు లేదా చెడు అలవాట్లలోకి వెళ్తున్నాడని అతను చాలా బాధపడతాడు.

పౌలు కొరింథీయులకు ఆత్మీయ తండ్రి. ప్రతి నిజమైన క్రైస్తవ కాపరి లేదా పాస్టర్ తన మందకు ఆత్మీయ తండ్రిగా ఉండాలి. ఆత్మీయ తండ్రి యొక్క ఒక లక్షణం ఏమిటంటే, అతను మందను విమర్శించడు, కానీ పౌలు కొరింథీయుల గురించి ఏడ్చినట్లుగా వారి గురించి ఏడుస్తాడు. అలాంటి వ్యక్తి మాత్రమే ఆత్మీయ నాయకుడిగా ఉండటానికి అర్హుడు. యెషయా 49:10లో ఇలా చెప్పబడింది, "వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును" (యెషయా 49 ఆత్మీయ నాయకత్వం గూర్చి ఒక గొప్ప అధ్యాయం).

ఆత్మీయ నాయకుడిగా ఉండటానికి ఎవరు అర్హులు? ప్రజలపై కరుణ చూపేవాడే. కాబట్టి మత్తయి 5:4 లోని "దుఃఖం" అనేది తనకోసం, తన సొంత పాపం కోసం, క్రీస్తుతో తనకున్న అసమానత కోసం మరియు ఇతరుల కోసం దుఃఖించడాన్ని సూచిస్తుంది. మనం అలా చేస్తే మనం బలపడతాము మరియు మనం ఈ మార్గంలో వెళితే ఇతరులను కూడా బలపరచగల శక్తిని పొందుతాము.