WFTW Body: 

ఈ భూమిపై జరిగిన గొప్ప యుద్ధము గూర్చి ప్రపంచములో ఏ చరిత్ర పుస్తకములో కూడా వ్రాయబడలేదు. అది కల్వరిపై, ఈ లోక అధికారియైన సాతానును యేసు ప్రభువు తన మరణము ద్వారా ఓడించినప్పుడు జరిగింది.

నీ జీవితమంతటిలో ఒక వచనాన్ని నీవు మరచిపోకూడదు. అది హెబ్రీ 2:14,15. ఈ వచనము నీకు తెలియుట సాతానుకు ఇష్టముండదని నేను తప్పక చెప్పగలను. ఎవ్వరు కూడా తన యొక్క ఓటమిని లేక తప్పిపోవుటను వినుటకు ఇష్టపడరు, మరి సాతాను కూడా అంతే. ఆ వచనము ఇలా చెప్తుంది. "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా(సిలువ మరణము ద్వారా) నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను". ప్రభువైనయేసు చనిపోయినప్పుడు ఆయన అపవాదికి శక్తి లేకుండా చేసెను. ఎందుకు? మనము సాతాను నుండియు మరియు మన జీవితకాలమంతా అతడు కల్పించు భయముయొక్క బంధకముల నుండి విడుదల పొందుటకొరకు ఆయన చనిపోయెను. లోకములో ప్రజలకు రోగముల గూర్చిన భయము, బీదతనము గూర్చిన భయము, ప్రజలను గూర్చిన భయము, భవిష్యత్తును గూర్చిన భయము మొదలగు ఎన్నో విధములైన భయములు కలవు. అయితే ఈ భయాలన్నిటికంటె గొప్పదైన భయము మరణము గూర్చిన భయమైయున్నది. మిగిలిన ప్రతి భయము మరణభయము కంటె తక్కువైనదే. ఈ మరణము గూర్చిన భయము మరణము తరువాత ఏమిటవుతుంది అనే భయానికి దారి తీస్తుంది. పాపములో జీవించు వారందరు చివరకు నరకములోనికి వెళ్ళుదురని బైబిలు చాలా తేటగా చెప్తుంది. అది పశ్చాత్తాపము చెందని వారందరి కొరకు దేవుడు ఏర్పరచిన ఒక స్థలము. అపవాది కూడా నిత్యత్వమంతా అగ్ని గుండములో, అతడు ఈ భూమిపై మోసము చేసి పాపములోనికి నడిపించిన వారితో కలసి గడుపును. యేసుక్రీస్తు మన పాపముల యొక్క శిక్షను భరించి, మనలను ఆ నిత్యనరకములో నుండి రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చెను. సాతాను మనకెప్పుడు హాని చేయకుండునట్లు మనపై సాతానుకుండిన శక్తిని కూడా నాశనము చేసెను.

మీరందరు ఈ ఒక్క సత్యాన్ని మీ జీవితమంతా జ్ఞాపకముంచుకోవాలని కోరుతున్నాను: దేవుడు సాతానుకు వ్యతిరేకముగా ఎల్లప్పుడు మీ పక్షమున ఉన్నాడు . ఈ గొప్ప సత్యము నాకు ఎంతో ప్రోత్సాహన్ని, ఆదరణను మరియు విజయాన్ని తెచ్చినది. ప్రపంచంలో ప్రతిచోట ఉన్న ప్రతి విశ్వాసి దగ్గరకు వెళ్ళి దీనిగూర్చి చెప్పాలని నా ఆశ. బైబిలు "దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును" (యాకోబు 4:7) అని చెప్తుంది. యేసు నామము పేరిట అపవాది ఎప్పుడు పారిపోవును. అనేకమంది క్రైస్తవుల మనసుల్లో దృశ్యం సాతాను వారిని తరుముతున్నట్లును వారు వారి జీవితాలను కాపాడుకొనుటకు అతడి యొద్దనుండి పారిపోతున్నట్లును ఉంటుంది. కాని అది బైబిలు చెప్తున్న దానికి సరిగ్గా వ్యతిరేకమైనది. మీరేమనుకుంటున్నారు? సాతాను యేసునకు భయపడునా లేదా? మన రక్షకుని ముందు నిలచుటకు సాతాను భయపడతాడని మనకు తెలియును. యేసు ఈ లోకానికి వైలుగై ఉండెను. ఆయన యెదుట నుండి చీకటి అధికారి అదృశ్యమై పోవలెను.

యౌవనస్థులారా, ఎప్పుడైనా మీ జీవితములో నీవు ఏదైనా కష్టపరిస్థితిలో ఉంటే లేక ఏదో దారిలేని సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే యేసు ప్రభువు నామమున ప్రార్థించు. ఆయనతో ఇలాగు చెప్పు, "ప్రభువైనయేసూ, అపవాదికి వ్యతిరేకముగా నీవు నా పక్షమున ఉన్నావు. నాకిప్పుడు సహాయము చెయ్యి". మరియు అప్పుడు సాతాను వైపు తిరిగి అతడితో ఇలా చెప్పుము, "సాతానా, యేసు నామములో నిన్ను ఎదురిస్తున్నాను". నేను నీకు చెప్పదలచినదేమంటే యేసు ప్రభువు సాతానును సిలువపై జయించెను. కాబట్టి, సాతాను వెంటనే నీ యొద్దనుండి పారిపోవును. నీవు ఎప్పుడైతే దేవుని వెలుగులో నడుస్తావో, అప్పుడు నీవు యేసు నామములో సాతానును ఎదురించినప్పుడు సాతాను నీయెదుట శక్తిహీనుడవును.

సాతానుయొక్క ఓటమి గూర్చి నీకు తెలియుట అతడికి ఇష్టం లేదు. కావున ఈ విషయం నీవు వినకుండా అతడు ఇంతకాలం నిన్ను ఆటంకపరిచాడు. ఇందుచేతనే అతడు తన ఓటమిగూర్చి బోధించకుండునట్లు అనేక బోధకులను కూడా ఆటంకపరిచాడు.

సిలువపై సాతాను యేసుక్రీస్తుచేత ఎప్పటికిని ఓడింపబడినాడని నీవు ఖచ్చితంగా తెలుసుకొనాలని నేను ఆశిస్తున్నాను. అప్పుడు నీవు ఎప్పుడును సాతాను గూర్చి భయపడనక్కర్లేదు. అతడు నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేడు. అతడు నీకు హానిచేయలేడు. అతడు నిన్ను శోధింపవచ్చు. అతడు నీపై దాడి చేయవచ్చును. కాని నిన్ను నీవు తగ్గించుకొని, దేవునికి లోబడి, అన్నివేళలలో ఆయన వెలుగులో నడచినట్లయితే క్రీస్తులో దేవుని కృప సాతానుపై ఎప్పుడును నిన్ను జయించువానిగా చేయును. వెలుగులో గొప్ప శక్తియున్నది. చీకటికి అధికారియైన సాతాను, వెలుగు ఉన్న ప్రదేశములోనికి ఎప్పుడును ప్రవేశించలేడు. ఈనాడు అనేక విశ్వాసులపై సాతానుకు అధికారమున్నదంటే దానికి కారణం, వారు చీకటిలో నడుస్తున్నారు. ఏదో ఒక రహస్యపాపములో జీవిస్తున్నారు. ఇతరులను క్షమించలేకపోవుట, ఎవరిపైనో అసూయ కలిగియుండుట లేక వారి జీవితాల్లో ఏదో స్వార్థపూరితమైన అభిలాషను నెరవేర్చుకొనుటకు ప్రయత్నములో ఉండుట మొదలైనవి ఏవో ఉన్నవి. అందుచేత సాతాను వారిని ఏలుచుండెను. అలాకానట్లయితే అతడు వారిని తాకలేడు.

యేసుప్రభువు ఈ లోకానికి తిరిగి వచ్చి, సాతానును అగాధములో బంధించి, ఈ భూమిపై వెయ్యి సంవత్సరములు పరిపాలన చేయుదురని ప్రకటన గ్రంథములో మనకు చెప్పబడినది. ఆ కాలమయిన తరువాత, అంత కాలము కారాగారములో బంధింపబడిన తరువాత కూడా అతడు మారలేదని అందరికి తెలియునట్లు అతడు కొద్ది కాలము విడుదల చేయబడును. అతడు అప్పుడు భూమిపై ఉన్న ప్రజలను ఆఖరి సారిగా మోసపుచ్చుటకు బయలు వెళ్ళును. మరియు అప్పుడు యేసుప్రభువు చేత పరిపాలించబడిన వెయ్యేళ్ళ సమాధానకరమైన పరిపాలనను అనుభవించి కూడా ఆదాము యొక్క సంతతి మారలేదనే విషయం కనబడును. అప్పుడు దేవుడు దిగి వచ్చి సాతానుకు తీర్పు తీర్చి శాశ్వతకాలము అగ్ని గుండములో ఉండునట్లు అతడిని అందులో పడవేయును. అప్పుడు పాపములో జీవించిన వారందరును, సాతానుకు మోకరిల్లిన వారందరును దేవుని మాటను కాదని అతడికి లోబడిన వారందరును అగ్నిగుండములో అతడితో పాటుగా చేరుదురు.

అందుచేతనే సాతాను యొక్క ఓటమి గూర్చిన ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాము. ఈ సమయములో విశ్వాసులు వినాల్సిన ముఖ్యమైన సత్యము బహుశా యిదేనేమో?. కాని ఒకటి గుర్తుంచుకోండి - నీవు పవిత్రతలో నడువక పోయినట్లయితే సాతానుపై నీకు శక్తి ఏమీ ఉండదు.