వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము తెలిసికొనుట
WFTW Body: 

కొత్త నిబంధన పరిచర్య జీవితములో నుండి ప్రవహించాలి మేధస్సులో నుండి కాదు.

పాత నిబంధన కాలములో దేవుడు, రహస్య జీవితములు అపవిత్రముగా ఉన్న వారిని కూడా ఉపయోగించుకున్నాడు. పాపములో జీవిస్తున్నాకూడా సమ్సోను ఇశ్రాయేలీయులను శత్రువులనుండి విడిపించగలిగాడు. అతడు వ్యభిచారము చేసినప్పటికీ దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోలేదు. తన తల వెంట్రుకలు గొరిగించుకొని దేవుని నిబంధన అతిక్రమించినప్పుడు మాత్రమే దేవుని అభిషేకము అతణ్ణి విడిచిపెట్టింది. దావీదుకు చాలామంది భార్యలున్నారు అయినప్పటికీ దేవుని అభిషేకము అతని మీద నిలిచింది, అతడు లేఖనాలు కూడా వ్రాశాడు.

అయితే నూతన నిబంధనలో పరిచర్య పూర్తి భిన్నంగా ఉన్నది. పాత నిబంధన కాల పరిచర్యకూ నూతన నిబంధన కాల పరిచర్యకు గల వ్యత్యాసమును 2 కొరింథీ 3 వ అధ్యాయం తెలియజేస్తుంది. ప్రాథమికమైన భిన్నత్వము ఇదే: పాత నిబంధన కాలంలో యాజకులు ధర్మ శాస్త్రమును జాగ్రత్తగా పఠించి లేఖనాలలో దేవుడేమి చెప్పాడో ప్రజలకు నేర్పించారు. అయితే క్రొత్త నిబంధనలో తన అంతరంగ జీవితంనుండి దేవుని వాక్యమును మాట్లాడుతూ, తండ్రియైన దేవునితో నడచిన యేసును మనం అనుసరిస్తాము. మన జీవితము నుండి బోధించుటకు, మన సొంత జ్ఞానముతో బోధించుటకును మధ్య వ్యత్యాసం ఉంది.

ఏ బోధకుడైనా కేవలము సమాచారం మాత్రమే అందిస్తున్నట్లయితే అతడు పాత నిబంధన బోధకుడు మాత్రమే. అతడు అందించే సమస్త సమాచారం ఖచ్చితమైనది గానే ఉండొచ్చు. అయితే అతడు జీవమును అందించకపోతే ఆ బోధకుడు క్రొత్త నిబంధన పరిచారకుడు కాదు. పాతనిబంధన అక్షర నిబంధన, కానీ నూతన నిబంధన జీవ నిబంధన. అక్షరము చంపును, కాని ఆత్మ జీవింపజేయును.

దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పాటించుటకు ఆజ్ఞలను అనుగ్రహించాడు. అయితే క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అనే వ్యక్తిలో దేవుడు మనకొక మాదిరి అందించాడు. ఆయన జీవమే మనుష్యులకు వెలుగు. ఈనాడు వెలుగు అనేది ఒక సిద్ధాంతము లేక ఒక బోధకాదు కానీ మన ద్వారా ప్రభావితమయ్యే యేసు జీవమే. అది సౌవార్తీక సిద్ధాంతమైనా సరే, పైన పేర్కొన్న సత్యము కానిదేదైనా అంధకారము మాత్రమే.

పాత నిబంధనలో కీర్తనలు 119:105 ప్రకారము దేవుని లిఖిత వాక్యమే వెలుగని చూస్తున్నాము. అయితే వాక్యము శరీర ధారియై యేసే లోకానికి వెలుగయ్యాడు (యోహాను 8:12). ఆయన జీవము మనుష్యులకు వెలుగుగా ఉన్నది (యోహాను 1:4). అయితే ఈ భూలోకంలో ఉన్నంత కాలమే తాను ఈ లోకమునకు వెలుగుగా ఉంటానని యేసు తన శిష్యులతో చెప్పాడు (యోహాను 9:5). ఆయన ఇప్పుడు పరలోకమునకు వెళ్ళి ఈ లోకములో వెలుగుగా మనల్ని ఉంచాడు (మత్తయి 5:14). అందుచేత మన జీవితాలతో లోకానికి వెలుగును చూపించే గొప్ప బాధ్యత మన మీద ఉంది.

పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారము సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఆ ప్రత్యక్ష గుడారములో మీకు తెలిసిన విధంగానే మూడు భాగాలున్నాయి- ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపరిశుద్ధ స్థలము (దేవుడు నివసించు చోటు). గుడారపు ఆవరణములోని ప్రజలు అప్పుడే పాపములు క్షమించబడిన నూతన విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నారు. స్థానిక సంఘములో వారు ఎటువంటి బాధ్యత చేపట్టరు. వారు ప్రార్థనా సమావేశాలకు వస్తారు, వాక్య సందేశాలు వింటారు, కానుకలు సమర్పిస్తారు, రొట్టె విరుస్తారు, ఇంటికి వెళ్తారు. పరిశుద్ద స్థలములో ఉన్నవారు సంఘములో ఏదోవిధముగా సేవ చేయాలని ఆశించేవారు - దీప స్తంభమును వెలిగించు, బలిపీఠముమీద ధూపము వేయు లేవీయులవలె వారు ఉందురు. అయితే అతి పరిశుద్ధ స్థలములో ఉండువారు నూతన నిబంధనలో ప్రవేశించువారు. వీరు దేవునితో సహవాసము చేయాలని ఆసక్తిగల వారు మరియు ఏక శరీరముగా ఇతర విశ్వాసులతో ఐక్యత కోరుకునే వారు. వీరు తమ జీవితాలతో(జీవముతో)దేవుని పరిచర్య చేస్తూ నిజమైన సంఘాన్ని నిర్మిస్తారు, కార్యాత్మక సంఘానికి నాంది పలుకుతారు. క్రీస్తు శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచేందుకు సాతానుతో సమరం చేస్తారు కానీ అనేక సంఘాల్లో ఇటువంటి కీలక గుంపుకు చెందినవారు లేరు.

ప్రతి సంఘములోనూ-అది శ్రేష్టమైనదైనా, చెడ్డదైనా కూడా- ఆవరణములో కూర్చొనే వారు ఒకే విధముగా ఉంటారు- వారు అర్థ హృదయులు, లోకానుసారులు, వారి స్వంతమును వెదకేవారు, ధనాశపరులు, మరియు సుఖభోగాసక్తులుగా ఉంటారు. కాని శ్రేష్టమైన (మంచి) సంఘములో భక్తిపరులైన బలమైన అంతరంగిక నాయకులు కేంద్రముగా ఉంటారు. ఈ కేంద్రముగా ఉన్న కీలకమైన నాయకులే సంఘము ఏ దిశగా వెళ్ళాలో నిర్ణయిస్తారు.

సాధారణముగా ఈ కేంద్ర కూటమి పరస్పర ఐక్యతతో ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఆరంభమవుతుంది. దేవుడు వారితో ఉంటాడు. ఆ కూటమి అంతకంతకు పరిమాణంలోనూ, ఐక్యతలోనూ ఎదుగుతుంది. మానవ శరీరముకూడా తల్లి గర్భములో రెండు సూక్ష్మ విభాగముల కలయికతో ఆరంభమవుతుంది. ఆ చిన్న పిండము పెద్దగా పెరుగుతుండగా కణములన్నీ ఐక్యతలో నిలిచిపోతాయి. అయితే ఎప్పుడైనా ఆ కణములు ఒకదానినుండి మరొకటి విడిపోతే అది ఆ పసిపాపకు అంతమే!

క్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా స్థానిక సంఘ నిర్మాణము కూడా ఇదే విధానములో జరుగుతుంది. ఆ కీలక గుంపు విడిపోయినపుడు సంఘము యొక్క బాహ్యనిర్మాణము ఓ సంస్థలా అలాగే కొనసాగినప్పటికీ, నిజమైన సంఘము యొక్క అంతము అదే!

(2వ భాగం వచ్చే వారం)