WFTW Body: 

(గత వారం కొనసాగింపు)

పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కానీ ఇప్పుడు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అని హెబ్రీ పత్రికలోని మొట్టమొదటి వాక్యము చెబుతుంది. పాతనిబంధన అంతా, "నీవు ఇది చేయుము", "నీవు ఇది చేయకుము" అను హెచ్చరికలతో మిళితమైన దేవుని ఆజ్ఞల సమాచారమును తెలియజేస్తుంది. అయితే నూతన నిబంధన తన కుమారుని ద్వారా దేవుని జీవమును వ్యక్త పరుస్తుంది.

అందుచేతనే తండ్రి, యేసును ఈ లోకానికి ఒక శిశువుగా పంపాడు. యేసును ఒక సంపూర్ణముగా ఎదిగిన మనిషిగా ఈ లోకానికి పంపుట దేవునికి కష్టమైన పనికాదు. బాల్యము నుండే మనము ఎదుర్కొనే అనుభవములు, శోధనలు ఎదుర్కొని చూడాలని ఆయనను ఒక శిశువుగా పంపాడు.

చాలామంది క్రైస్తవులు యేసు చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్య, కల్వరిలో ఆయన మరణము గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. యేసు నజరేతులో 30 సంవత్సరాలు ఎలా గడిపాడు అనే విషయం గూర్చి 99 శాతము విశ్వాసులు ఎన్నడూ ఆలోచించరని నేను చెప్పటం సబబేనని నా భావన. ఆయన జన్మము గూర్చి తలంచుతారు. ప్రతి సంవత్సరము పండుగ కూడా చేస్తారు. ఆయన మరణ, పునరుత్థానాలను గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరము వాటిని పండుగలుగా జరుపుకుంటారు. ఆయన చేసిన అద్భుతాలను గూర్చి ఆలోచిస్తారు. అంత మాత్రమే చేస్తారు.

యేసు క్రీస్తు యొక్క జీవితములోని అధికభాగమును గూర్చి దాదాపుగా ఎవరూ ఆలోచించరు - ముప్పైమూడున్నర సంవత్సరాల జీవితంలో మూడున్నర సంవత్సరాల పరిచర్య కేవలం 10 శాతము మాత్రమే. ఆయన జననం, మరణం రెండు రోజుల్లో జరిగిన సంభవాలే. తన జీవిత కాలమంతటిలో ఎక్కువ భాగము 30 సంవత్సరాలు పాటు ఆయన నజరేతులో గడిపాడు. తన పరిచర్య మొత్తం 30 సంవత్సరాల మీదనే ఆధారమైవుంది. తన పరిచర్యలో ప్రసంగించిన సందేశాలన్నీ సిద్ధం చేసుకునేందుకు ఆయనకు 30 సంవత్సరాల కాలం పట్టింది. ఈనాటి బోధకులు ప్రసంగాలు తయారు చేసుకున్నట్టుగా సిద్ధపడి ఆయన కొండ మీద ప్రసంగం బోధించలేదు. గంటల తరబడి కూర్చొని, ఎంతోసేపు అధ్యయనం చేసి అనేక గ్రంథాలు తిరగవేసి ముచ్చటగా మూడు తలంపులను ఆకర్షణీయముగా కాగితంపై వ్రాసుకోలేదు!! అలాకాదు, ఆ ప్రసంగము తన జీవితము నుండి వెలువడింది. దానికి 30 సంవత్సరాలు పట్టింది. అందుకనే ఆ సందేశము శక్తివంతమైనది. అందుచేతనే ఆయన మాట్లాడిన తీరులోని అధికారమును చూచిన ప్రజలు ఆశ్చర్యపోయారు (మత్తయి 7:28,29).

దేవుడు యిర్మీయా ప్రవక్తతో, నియమితరోజుల్లో మాత్రమే మాట్లాడినట్లు మనం పాతనిబంధనలో చదువుతాము. దేవుడు మాట్లాడిన విషయాన్ని యిర్మీయా తన లేఖకుడు (శాస్త్రియైన) బారూకునకు చెప్పగా సరిగ్గా అలాగే అతడు వ్రాసి పెట్టాడు. ఇదే విధంగా దేవుడు యెహెజ్కేలుతో ఆయా సమయాల్లో మాత్రమే మాట్లాడి అతడు యూదా ప్రజలతో ఏమి చెప్పాలో తెలియజేసాడు. సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగానే దైవసందేశాన్ని యెహెజ్కేలు ప్రజలకు అందించాడు. అది మంచిది. ఈనాటి సందేశాలు ఆ విధంగానైనా వుంటే అది గొప్పే!

అయితే నూతన నిబంధన పరిచర్య ఇంకా శ్రేష్టమైనది! దేవుడు పాత నిబంధన ప్రవక్తలతో మాట్లాడినట్లు యేసుతో ఆయా రోజుల్లో మాత్రమే మాట్లాడలేదు. దేవుడు యేసుతో ప్రతిరోజూ మాట్లడగా, యేసు ప్రతిరోజు తన జీవితం నుండి ప్రజలతో మాట్లాడాడు. ఆయన పరిచర్య తన జీవితము నుండి ప్రవహించింది. "కడుపులో నుండి జీవజలనదులు పారును" (యోహాను 7:38) అను వాక్యానికి అర్థం ఇదే.

పాత నిబంధన ప్రవక్త ఒక వార్తాహరుడు(వర్తమానికుడు) మాత్రమే. ఒక సందేశం అందించేందుకు నీకు కావాల్సిందల్లా మంచి జ్ఞాపకశక్తి మాత్రమే. కానీ నూతన నిబంధనలో ఇతరులకు అందించుటకు సందేశాలను కాదుగానీ తన జీవమును అనుగ్రహిస్తున్నాడు. అందుచేత నీకు కావాల్సింది మంచి జ్ఞాపక శక్తి కాదుగానీ మంచి జీవము - దేవుని జీవము.

ఈ వ్యత్యాసాన్ని ఒక సాదృశ్యము ద్వారా వివరిస్తాను. ఒక కుళాయి నుండి ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకొని (దేవుని నుండి సందేశము పొంది) వాటిని బయట పారబోసినట్లయితే ఇది పాతనిబంధన పరిచర్యకు ప్రతీక. మళ్ళీ వెళ్ళి మరో గ్లాసు నీళ్ళు అదే కుళాయి నుండి తీసుకొని (మరో సందేశం పొంది) ఆ నీటిని కూడా పారబోయుట వంటిది.

కానీ నూతన నిబంధనలో మన కడుపులనుండి పారెడి నీటి బుగ్గగా (యేసు జీవము) అది అందించబడింది. అది మనలో నుండి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్క సందేశం పొందటానికి మనం మాటిమాటికి దేవుని దగ్గరకు వెళ్ళనవసరంలేదు. మనలనే ఒక సందేశముగా ఆయన చేస్తాడు. మన జీవితమే ఒక సందేశము మరియు అందులో నుండి మనము మాట్లాడతాము.

చాలా మంది క్రుమ్మరింపు పరిచర్య చేస్తుంటారు. కొందరు తాము పారబోసిన తరువాత అందించుటకు వారి దగ్గర మరేమి ఉండదు. మరికొందరైతే ఇచ్చేందుకు ఎంతోకొంత కలిగివుంటారు. అయితే ఈ ఇరువురు ఇంకా పారబోస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఇరువురు ఎండిపోతారు.

నిత్యజీవపు ఊటలు నిరంతరం ప్రవహించేలా నీటిబుగ్గను ఉంచుతానని యేసు సమరయ స్త్రీతో చెప్పారు (నిత్యజీవమనగా - దేవుని జీవమే).

మనలోనుండి ప్రవహించాల్సినది జీవమే కాని సందేశం కాదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇదే క్రొత్త నిబంధన పరిచర్య.