యేసు చెప్పిన మొదటి తప్పుడు వైఖరి కోపం. మన జీవితం నుండి కోపాన్ని మనం తొలగించుకోవాలి. రెండవది, ఇది అందరు క్రైస్తవులకు (మానవులందరికీ కూడా) ఉన్న మరొక ప్రధాన సమస్య, లైంగిక కామపూరిత ఆలోచనలు - ఒక పురుషుడు ఒక స్త్రీని మోహంతో చూచుట. మత్తయి 5:27-28 లో పాత నిబంధన ప్రమాణం "శారీరక వ్యభిచారం చేయవద్దు" అని చెబుతుంది. మీరు మీ భార్య కాని స్త్రీని తాకనంత వరకు మరియు మీరు ఆమెతో వ్యభిచారం చేయనంత వరకు మీరు సరిగానే ఉన్నారు. అది పాత నిబంధన ప్రమాణం.
అయితే యేసు ప్రమాణాన్ని పెంచాడు. మోషే పర్వతం ఎక్కి పది ఆజ్ఞలతో దిగి వచ్చినట్లే, యేసు పర్వతం ఎక్కి కొండపై ప్రసంగాన్ని బోధించాడు. ఆయన ఆ పది ఆజ్ఞల స్థాయిని ఆ ఆజ్ఞల స్ఫూర్తికి పెంచాడు. కోపం హత్య లాంటిదని, మీ కళ్ళతో మోహించడం వ్యభిచారం లాంటిదని ఆయన చూపించాడు - మరో మాటలో చెప్పాలంటే, మీరు ఆ స్త్రీతో మీ మనస్సులో వ్యభిచారం చేస్తున్నారు. మీ అంతర్గత జీవితం అపవిత్రంగా ఉన్నందున దేవుని దృష్టిలో అది వ్యభిచారం అని యేసు చెప్పాడు.
పరిసయ్యుల లక్షణం ఏమిటంటే వారు తమ బాహ్య జీవితాన్ని - గిన్నె వెలుపలి భాగాన్ని - పవిత్రంగా ఉంచుకున్నారు. తన బాహ్య జీవితాన్ని శుభ్రంగా ఉంచుకుని, తన అంతర్గత ఆలోచన జీవితాన్ని అపవిత్రంగా ఉంచుకునే క్రైస్తవుడు పరిసయ్యుడు, మరియు అతను తెలిసినా తెలియకపోయినా నరకానికి వెళ్తున్నాడు. మనలో చాలా మందికి దీని తీవ్రత అర్థం కాలేదు.
గత (35) సంవత్సరాలలో నేను కొన్ని పాపాలకు వ్యతిరేకంగా ఎక్కువగా బోధించాను, ముఖ్యంగా రెండు పాపాలు - కోపం మరియు లైంగిక పాపపు కామపూరితమైన ఆలోచనలు. నేను వాటికి వ్యతిరేకంగా ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాను అని ప్రజలు నన్ను అడిగారు. మన నీతి శాస్త్రులు మరియు పరిసయ్యుల నీతిని అధిగమించాలని యేసు చెప్పినప్పుడు మొదట ఈ రెండు పాపాలనే ప్రస్తావించాడని నేను వారికి చెప్పాను. మీ చుట్టూ ఉన్న పరిసయ్యులందరి నీతి కంటే (వారు చాలా మతపరమైన వ్యక్తులు) మీ నీతి ఉన్నతంగా ఉండాలని చెప్పిన వెంటనే, యేసు ప్రస్తావించిన మొదటి రెండు పాపాలు కోపం మరియు లైంగిక కామపూరిత ఆలోచనలు. నేను వాటికి వ్యతిరేకంగా ఎక్కువగా బోధించడానికి అదే మొదటి కారణం.
ఈ రెండు పాపాలకు వ్యతిరేకంగా నేను బోధించడానికి రెండవ కారణం ఏమిటంటే, యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన వాటిలో ఈ రెండు పాపాలలో మునిగిపోవడం వల్ల మాత్రమే నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉంటామని ఆయన అన్నారు. చాలా మంది దానిని నమ్మరు. కొండమీది ప్రసంగంలో యేసు నరకం గురించి మాట్లాడిన రెండు సార్లు ఈ రెండు పాపాలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి (మత్తయి 5:22b, 29-30), కాబట్టి ఈ రెండు పాపాలు చాలా తీవ్రమైనవి అని ఇది మనకు చెబుతుంది.
కొండమీది ప్రసంగంలో యేసు నరకం గురించి మాట్లాడిన రెండు సార్లు కూడా కోపం మరియు లైంగిక కామపు ఆలోచనలకు సంబంధించి మాత్రమే ఉండటం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇవి దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన పాపాలు అయి ఉండాలి మరియు నేడు వాటికి వ్యతిరేకంగా తగినంత బోధన లేదు. కోపాన్ని అధిగమించడం గురించి మీరు చివరిసారిగా ఎప్పుడు సందేశం విన్నారో మీరు గుర్తుకు తెచ్చుకోగలరా? నా మొత్తం జీవితంలో నేను దాని గురించి సందేశం వినలేదని నేను అనుకుంటున్నాను. నేను క్రైస్తవత్వంలో తిరుగుతున్న 50కి పైగా సంవత్సరాలలో, టెలివిజన్, టేపులు, CDలు మరియు అనేక చర్చిలలో చాలా మంది బోధకుల బోధలు విన్నాను. అయినప్పటికీ లైంగికంగా కామపూరితమైన ఆలోచనా విధానాన్ని అధిగమించడం గురించి నేను ఎప్పుడూ సందేశాన్ని వినలేదు. ఈ రెండు విషయాల గురించి బోధించకుండా అపవాది బోధకులను ఎందుకు నిరోధించాడు?
ప్రధాన కారణం ఏమిటంటే, బోధకులే విజయం సాధించలేదు. వారు ఇప్పటికీ తామే బానిసలుగా ఉంటే వారు దాని గురించి ఎలా మాట్లాడగలరు? రెండవది, బోధకులు తమ చర్చిలలో ప్రజలను బయట అందంగా కనిపించేలా చేయడంలో మరియు వారి నుండి డబ్బు వసూలు చేయడంలో చాలా తరచుగా ఆసక్తి చూపుతారు. కాబట్టి యేసు ఎక్కువగా మాట్లాడిన ఈ రెండు విషయాలను నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవి ఒక వ్యక్తిని చివరికి నరకానికి నడిపిస్తాయని యేసు చెప్పిన రెండు పాపాలు. అది చాలా తీవ్రమైన విషయం.
యేసు పది ఆజ్ఞలను తీసుకొని ఆ ఆజ్ఞల వెనుక ఏమున్నదో దాన్ని ప్రజలకు చూపించాడు.
మీ భార్య కాని స్త్రీని మోహించటం పాపమని అర్థం చేసుకోవడానికి మీరు మత్తయి 5వ అధ్యాయానికి రావలసిన అవసరం లేదు. ఒక స్త్రీని మోహపుచూపు చూసే ప్రతి ఒక్కరూ (ఆ వ్యక్తి విశ్వాసి లేదా అవిశ్వాసి అనే పట్టింపు లేదు) ఆమెతో ఇప్పటికే తన హృదయంలో వ్యభిచారం చేశారని యేసు చెప్పాడు. మోహం(కామం) అంటే బలమైన కోరిక. ఇది చాలా తీవ్రమైనదని ఆయన అన్నారు, మీ కుడి కన్ను ఈ విషయంలో మిమ్మల్ని అభ్యంతరపరిస్తే, మీరు దానిని పీకివేయాలి! మీరు మీ కళ్ళతో మోహానికి గురైనప్పుడు మీరు తీవ్రంగా ఉండాలి. మీరు గుడ్డివాడిలా ప్రవర్తించాలి. దానిని అధిగమించడానికి అదే ఏకైక మార్గం. మీరు దానిని తేలికగా తీసుకొని "నేను కేవలం దేవుడు సృష్టించిన అందాన్ని అభినందిస్తున్నాను" అని చెప్పకూడదు. ఈ పాపాన్ని మనం సమర్థించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి మరియు చాలా మంది అలా చేస్తారు. ఈ విషయంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పాస్టర్లు పడిపోయినట్లు కొంతకాలం తరువాత శారీరక వ్యభిచారంలో కూడా పడిపోతాడు.
మత్తయి 5లో యేసు బోధించినది దేవునికి భయపడే పురుషులకు తెలియని కొత్త విషయం కాదు. యేసు చెప్పక ముందే బాప్తిస్మమిచ్చు యోహానుకు అది తెలుసని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యోబుకు అది తెలుసు (యోబు 31:1, 4, 11). యోబులాగా బైబిల్ లేకపోయినా, దేవుణ్ణి గౌరవించే ఎవరైనా, నా భార్య కాని స్త్రీని లైంగిక కోరికతో చూస్తే అది దేవుని యెదుట పాపం అనే నిశ్చయానికి వస్తారు. మన లోపల ఉన్నటువంటిది అది తప్పు అని మనకు చెప్తుంది. అది దేవుడు మీకు ఇవ్వనిదాన్ని దొంగిలించినట్లే. మీ దగ్గర బైబిల్ లేకపోయినా, మీకు చెందనిదాన్ని మీరు దొంగిలించినప్పుడు అది పాపమని మీ మనస్సాక్షి మీకు చెబుతుంది. మీకు అలా చెప్పడానికి మీకు ఆజ్ఞ అవసరం లేదు. దేవుని పట్ల భయమే మీకు అలా చెబుతుంది. యేసు బోధించిన దానిని చూస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవలసిన అద్భుతమైన విషయమది.
నేడు చాలా మంది విశ్వాసులు తమ కళ్ళతో లైంగికంగా చూచుటను ఎందుకు తేలికగా తీసుకుంటున్నారు? ఎందుకంటే యోబువలె దేవుని పట్ల ప్రాథమికమైన భయభక్తులు లేకపోవడం వలన. నేటి క్రైస్తవులకు బైబిలు జ్ఞానం ఉంది, కానీ దేవుని పట్ల భయభక్తులు లేవు. బైబిల్ పాఠశాలలకు వెళ్లి బైబిల్ చదువుతూ వేదాంతశాస్త్రంలో డాక్టరేట్లు పొంది, అప్పటికీ స్త్రీలను మోహించే వ్యక్తులు ఉన్నారు. అది మనకు ఏమి బోధిస్తుంది? తలలో ఉన్న లేఖనాల జ్ఞానం మరియు బైబిల్ కళాశాల నుండి "డిగ్రీ పొందడం" మిమ్మల్ని పవిత్రంగా చేయదని ఇది మనకు బోధిస్తుంది. అనువాదాలు మరియు పదపట్టికల సమృద్ధితో నేడు ఎంతో బైబిల్ జ్ఞానం ఉంది. మన మొబైల్ ఫోన్‌లలో మరియు CD లలో కూడా బైబిల్ ఉంది, ప్రజలు తమ కార్లలో మరియు ప్రయాణాలలో కూడా వినవచ్చు. ఇంత సమృద్ధియైన జ్ఞానం ఉన్నప్పటికీ, దేవుని పట్ల భయభక్తులు చాలా తక్కువగా ఉన్నాయి.
మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, కొండమీది ప్రసంగం చదవకుండానే మనం తెలుసుకోగలిగే అనేక విషయాలను యేసు కొండమీది ప్రసంగంలో బోధించాడు. మనకు వీటిలో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి: కోపం అనేది పాపం, స్త్రీలను మోహించటం పాపం, మరియు ఇక్కడ వ్రాయబడిన అనేక ఇతర విషయాలు. కాబట్టి మీరు జ్ఞానం లేకపోవడం వల్ల పాపంలో కొనసాగడం లేదు, దేవుని పట్ల భయభక్తులు లేకపోవడం వల్లనే కొనసాగుతున్నారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి ప్రారంభం. ఇదే క్రైస్తవ జీవితానికి "అఆఇఈ"లు. మనకు అది లేకపోతే, ఎంత బైబిల్ అధ్యయనమైనా లేదా ఎన్ని సందేశాలను విన్నా మనల్ని పరిశుద్ధులుగా మార్చవు.