పాత నిబంధన ప్రవచనమునకు మరియు క్రొత్త నిబంధన ప్రవచనమునకు తేడా ఉంది. పాత నిబంధనలో ప్రజలు ప్రవక్తయొద్దకు వచ్చి వారియెడల దేవుని చిత్తమును చెప్పమని అడిగేవారు. మరియు ప్రవక్త, దేవుడు అతనికి చెప్పినదానిని వారికి చెప్పేవాడు. ఎందుకనగా ఆ ప్రజలను నడిపించుటకు వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. ప్రవక్త మాత్రమే పరిశుద్ధాత్మను కలిగియున్నాడు. కాని క్రొత్త నిబంధనలో "ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్తునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. ఎందుకనగా అందరును నన్ను గూర్చి తెలుసుకుందురు" (హెబ్రీ 8:11). ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నివసించుచున్నాడు కనుక ఏ ప్రవక్తయైనను దేవుని బిడ్డ దగ్గరకు వెళ్ళి వారు ఏమి చేయవలెనో చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పినట్లయితే ఆ ప్రవక్త పరిశుద్ధాత్మ స్థానము తీసుకొని మరియు ప్రజలను క్రీస్తుకు కాక తనకు హత్తుకునేటట్లు చేస్తాడు. మనలో నివసించే పరిశుద్ధాత్మ మనలను తీవ్రముగా కోరుచున్నాడు అని బైబిలు చెప్పుచున్నది (యాకోబు 4:5). దేని కొరకు? మన పెండ్లి కుమారుడైన క్రీస్తుతో మనము సన్నిహిత సహవాసం కలిగియుండి మరియు క్రీస్తుకు మనకు మధ్యలో ఎవరు రాకుండునట్లు చేస్తాడు. ఈ రోజులలో అనేకమంది పాస్టర్లు మరియు తమకు తామే ప్రవక్తలుగా నియమించుకున్నవారు, ప్రజలేమి చేయవలెనో ఎక్కడికి వెళ్ళవలెనో ఎవరిని పెళ్ళి చేసుకొనవలెనో మొదలగు వాటిని చెపుతుంటారు. దేవుడు వారితో సూటిగా మాట్లాడడనే అభిప్రాయము ప్రజలలో కలిగిస్తూ నిజానికి వారు పరిశుద్ధాత్మ చేసే పనికి ఆటంకముగా ఉన్నారు. అటువంటి వారు సాతాను చేత ప్రేరేపింపబడి (తెలిసికాని తెలియకకాని) ప్రభువుకు మరియు ఆయన ప్రజలకు మధ్యన వారుంటున్నారు. నీవు క్రీస్తుతో ఎల్లప్పుడు అత్యంత సన్నిహిత సంబంధం కలిగియుండాలనియు మరియు నీకును ప్రభువుకు మధ్య ఎవరు ఉండకూడదని పరిశుద్ధాత్మ కోరుచున్నాడని గుర్తుపెట్టుకొనుము.
చాలామంది కొన్ని విషయములలో దేవుని నడిపింపు కొరకు నన్ను అడిగియున్నారు. నేను దేవుణ్ణి గౌరవించెదను కనుక అటువంటి పనిని చేయను. దేవుని యెడల భయభక్తులు లేనివాడె ఇతరులలో పరిశుద్ధాత్మ స్థానాన్ని తీసుకుంటాడు. నేను ఇతరులకు సలహలిచ్చుటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాను. వాటిలో ఉన్న లాభనష్టముల గురించి చెపుతాను. కాని తరువాత వారు దేవునికి ప్రార్థించి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తెలిసికొని నిర్ణయించుకోవాలని చెపుతాను.
ఇతరుల కొరకు నీవు దేవుని చిత్తమును కనుగొనుటకు ప్రయత్నించి మరియు వారి జీవితములో దేవుని స్థానాన్ని తీసుకొనకూడదు. క్రీస్తువిరోధి, "తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండునని" చెప్పబడింది (2థెస్స 2:4). క్రీస్తువిరోధి ఆత్మను కలిగిన కొందరు ప్రవక్తలు ఈనాడు సంఘములో ఉన్నారు. వారు దేవుని స్థానాన్ని తీసుకొని ఇతరులకు దేవుని చిత్తమును గూర్చి చెపుతుంటారు. ఒక డాక్టరు ఒక రోగి నుంచి డబ్బు తీసుకున్నట్లే వీరు కూడా ప్రవచనములు చెప్పిన తరువాత డబ్బును ఆశించుట వీరిలో ఉన్న ఒక ముఖ్య లక్షణము. ఇటువంటి ప్రవక్తల దగ్గరకు వెళ్ళువారు ప్రభువులో ఎదుగరు. ఎందుకనగా వారికి పరిశుద్ధాత్మతో సరియైన సంబంధం ఉండదు. వారు మరలా దేవుని చిత్తమును తెలిసికోవాలంటే వారు మరలా ప్రవక్త యొద్దకు వెళ్ళెదరు. కాని పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తాన్ని తానే నీకు తెలియజేయాలని కోరుచున్నాడు. ఇతరుల ద్వారా కాదు.
అగబు అనే నిజమైన ప్రవక్త ఏమి చేసాడు (అ.కా. 11:27-30). అతడు కరువు వస్తుందని ప్రవచించాడు. కాబట్టి కానుకలు పట్టి బీద విశ్వాసులకు పంపమని అతడు చెప్పలేదు. ఎందుకనగా కొత్త నిబంధనలో ఒక విశ్వాసి మరొక విశ్వాసికి ఏమి చేయవలెనో చెప్పవలసిన అవసరం లేదు. అతడు అబద్ధప్రవక్తవలె లేడు కనుక ఎక్కడ ఆపవలెనో తనకు తెలియును. ఒక నిజమైన ప్రవక్త దేవుడు తనకు బయలు పరచిన దానిని మాత్రమే చెప్పిముగిస్తాడు. అప్పుడు అంతియెకలోని విశ్వాసులు దేవుని ప్రార్థించినప్పుడు వారు ఏమి చెయవలెనో పరిశుద్ధాత్ముడు బయలుపరిచియున్నాడు. వారు కొంత డబ్బును సమకూర్చి మరియు బీదవారైన సహోదరులకు పంపియున్నారు. పాత నిబంధనలో ప్రజలు పరిశుద్ధాత్మను కలిగిలేరు కనుక ప్రవక్తలచేత నడిపింపబడ్డారు. కాని క్రొత్త నిబంధనలో ఆ విధముగా లేదు.