వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

దేవుడు ఒక స్థలములో తన కొరకు నిలబడే వ్యక్తి కొరకు ఎల్లప్పుడు చూచుచున్నాడు (యెహెజ్కేలు 22:30). ఒక సమయములో ఆయన హనోకును, తరువాత నోవహును, తరువాత అబ్రహామును మరియు తరువాత ఏలీయాను మరియు బాప్తిస్మమిచ్చు యోహానును కనుగొన్నాడు.

బబులోనులో ఆయన దానియేలును కనుగొన్నాడు. దానియేలు స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యా (తరువాత వీరు షడ్రకు, మేషాకు, అబెద్నెగోలు అని పిలువబడ్డారు) అను వారి గురించి దానియేలు 1:7లో చెప్పినప్పటికిని దానియేలు 1:8లో దానియేలు ఒక్కడే "తన్నుతాను అపవిత్రపరచు కొనకూడదని ఉద్దేశించనని" వ్రాయబడియున్నది. తరువాత మాత్రమే మిగిలిన ముగ్గురు ధైర్యము తెచ్చుకొనియున్నారు. ఈనాటి విశ్వాసులలో, తమకు తామే ప్రభువుకొరకు నిలచుటకు ధైర్యములేని హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారు అనేకులు ఉన్నారు. కాని వారి మధ్యలో దానియేలు లాంటివారు ప్రభువుకొరకు నిలచినయెడల, వారుకూడా ధైర్యము తెచ్చుకొని నిలచెదరు. కాబట్టి నీవు ఎక్కడున్నప్పటికిని ప్రభువు కొరకు దానియేలువలె ఉండుటకు నిర్ణయించుకొనుము.

మరొక వైపున కీడు విషయములో కూడా అలాగే చూచెదము. పరలోకములో ఏదొక విషయములో కొంత అసంతృప్తితో ఉన్న దూతలు ఉండిరి. కాని లూసిఫర్ తిరుగుబాటు చేయువరకు, వారు తిరుగుబాటు చేయుటకు ధైర్యము చేయలేక పోయిరి. లూసిఫర్ తన తిరుగుబాటును వ్యక్తపరచినప్పుడు, వెంటనే మూడవవంతు దేవదూతలు అతనితో కలసిరి(ప్రకటన 12:4). అప్పుడు లూసిఫర్‍తో పాటు అనేక లక్షల మంది దూతలు దేవునిచేత వెళ్ళగొట్టబడి మరియు దయ్యములుగా మారి అనేకమందిని పట్టుచున్నారు. దేవునియొక్క నిత్యనియమము ఏమనగా "ఆయన గర్విష్టులను వెళ్ళగొట్టి మరియు దుఃఖితులను దీనులను నీ మధ్య నుండనిత్తును" (జెఫన్యా 3:11,12). ఆ విధముగా ఆయన గతములో పరలోకమును శుద్ధిచేసెను. మరియు ఈనాడు సంఘమును కూడా ఆయన ఆ విధముగానే పవిత్రపరచుచున్నాడు.

ఇప్పుడు ప్రపంచములో రెండు ఉధ్యమములు నడుచుచున్నవి: ప్రభువుకొరకు ఇద్దరు లేక ముగ్గురిని సమకూర్చే దానియేలులు; మరియు అపవిత్రలోనికి, అధికారమునకు తిరుగుబాటు చేయుటకును, దేవునియొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపుటకును అనేక లక్షలమందిని సమకూర్చే లూసిఫరులు. కాని దానియేలుతో ఉండే ఒకరిద్దరు చివరకు జయించెదరు. ఎందుకనగా దేవునితో ఒక వ్యక్తి ఉన్నప్పటికిని అది ఎంతో మంది ప్రజలకంటే అధికము. ఒక ప్రాంతములో దేవుడు దానియేలును కనుగొనని యెడల, అప్పుడు అపవాది తన మార్గములో నడిపించుటకు ఎవరొకరిని కనుగొనును. కాబట్టి నీవున్న స్థలములో దేవుని కొరకు ఒక దానియేలు వలె ఉండుము. అతనివలె దేవునియొక్క ప్రతి ఆజ్ఞకు లోబడవలెనని నిర్ణయించుకొని మరియు సింహాల గుహలో వేయబడినప్పటికిని, దేవుని కొరకు నిలబడుము.

దేవుడు మీకు కృపను, బలమును, జ్ఞానమును ఇచ్చునట్లు మేము ప్రార్థించెదము. ఇక్కడ నేను ఒక ప్రార్థనము చెప్పుచున్నాను, "ప్రభువా, నేను తృణీకరించవలసిన విషయములకు నేను కాదు అని చెప్పే ధైర్యమును నాకు దయచేయుము. నేను చేయవలెనని నీవు కోరుచున్నవాటిని చేయుటకు శక్తినిమ్ము మరియు వీటి మధ్య ఉన్న తేడాను తెలుసుకొనుటకు జ్ఞానము నిమ్ము".