WFTW Body: 

దానియేలు గ్రంథములో, బబులోను నుండి యెరూషలేముకు వెళ్ళే గమనము యొక్క ఆరంభాన్ని చూస్తాము - ఇది సాదృశ్యరూపముగా పాడైపోయిన, రాజీపడే క్రైస్తవత్వమునుండి దేవుని క్రొత్తనిబంధన సంఘమునకు వెళ్లే గమనమును సూచిస్తుంది. ఇది దేవుని ఉద్దేశ్యాలను పట్టించుకొని వాటి నెరవేర్పుకొరకు ఉపవసించి ప్రార్ధించిన ఒక యదార్ధవంతుడును మరియు రాజీపడని వ్యక్తితో ఆరంభమైనది.

అతడు యౌవస్తుడిగా నమ్మకముగా ఉండుట ప్రారంభించినప్పుడు అతనికి ఎంత గొప్ప పరిచర్య ఉండబోతుందో దానియేలుకు తెలియదు. అతడు చిన్న విషయాలలోను పెద్ద విషయాలలోను దేవునికి నమ్మకముగా ఉండెను, దేవుడు అతని ద్వారా ఒక గొప్ప పరిచర్యను నెరవేర్చెను. ఈ గ్రంథము మొదలైనప్పుడు అతనికి 17 ఏళ్లు ఉండియుండవచ్చును, ఈ గ్రంథము ముగిసే సరికి అతనికి 90 ఏళ్లు ఉండియుండవచ్చును. అతడు చెర పట్టబడి 70 సంవత్సరములు జీవించెను మరియు చివరివరకు నమ్మకముగా నుండెను. అందుకనే బబులోను నుండి యెరూషలేముకు వెళ్లే గమనమును ప్రారంభించడానికి దేవుడతనిని వాడుకోగలిగెను.

ఏ స్థలములోనైనా దేవుని కొరకు ఒక పవిత్రమైన సంఘము కట్టబడుట ఎల్లప్పుడు ప్రార్ధనా భారము గల ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. అతడు ఆ భారమును దేవునియొద్ద తరచుగా పెట్టి, "ప్రభువా, ఈ స్థలములో నీ కొరకు ఒక పవిత్రమైన సంఘాన్ని కోరుకొనుచున్నాను దానికి ఎటువంటి వెల చెల్లించడానికైనా నేను సిద్ధమే" అని చెప్తాడు. ఆ భారమును దేవునియొద్దకు మరల మరల ప్రార్ధనలో తీసుకువెళ్లడానికి నీవు సిద్ధంగా ఉండాలి. నీవు ఆ భారాన్ని చాలా కాలము మోయవలసిరావచ్చును. నేను ఒక క్రొత్తనిబంధన సంఘము ఆరంభమగుట చూచేముందు ఆ భారాన్ని పది సంవత్సరాల పాటు మోయవలసి వచ్చింది. దేవుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ఒక తల్లి తన గర్భమందు ఒక శిశువును మోసినట్లే మనము ఈ భారాన్ని మన హృదయాలలో మోయాలి. దానియేలు ఆ విధంగానే ఒక భారాన్ని తన హృదయంలో మోసాడు. దీని ఫలితంగా తరువాత సంవత్సరాలలో హగ్గయి, జెరుబ్బాబేలు, యెహోషువా, జెకర్యా, ఎజ్రా, నెహెమ్యా వంటి ఇతరులు కూడా ఆ భారాన్ని పంచుకోవడం ప్రారంభించారు. నీలో ఉన్న భారాన్ని పంచుకొనుటకు దేవుడే నీతో ఇతరులను కలుపును మరియు వారితో కలిసి నీవు దేవునియొక్క క్రొత్తనిబంధన సంఘమును నిర్మించగలవు. 90 ఏళ్లవయస్సులో యెరూషలేముకు తిరిగి వెళ్లి మందిరాన్ని కట్టడానికి దానియేలు చాలా ముసలివాడైపోయెను. కాని అతడు తెరవెనుక నిలబడి ప్రార్ధించి ఈ గమనమును ప్రేరేపించాడు.

దానియేలు ఒక అన్యదేశములో జీవించాడు. మన క్రైస్తవనియమాల విషయంలో రాజీపడకుండా క్రైస్తవేతర దేశములో ఎలా దేవుని కొరకు నిలబడగలమన్న విషయంలో అతడు మనకు మాదిరిగా ఉన్నాడు. అతడు హనన్యా, మిషాయేలు, అజర్యా అను ముగ్గురు పూర్ణహృదయులైన వారినే చేర్చుకోగలిగెను. (వీరు మనకు షడ్రకు, మెషకు, అబెద్నెగో అను పేర్లతో పరిచయము). కాని ఆ యౌవస్థులు ప్రపంచములో అగ్రరాజ్యమైన బబులోను మధ్యలో దేవుని కొరకు ఒక శక్తివంతమైన సాక్ష్యముగా నుండిరి - ఇది నలుగురితో కూడియున్న చిన్న సంఘము. ఆ నలుగురు బబులోనులో ఉన్న ఇతర వేలాది మంది యూదుల కంటే ఎక్కువగా ఆ దేశమును ప్రభావితము చేసిరి. దానికి కారణమొక్కటే: ఇతర యూదులు రాజీపడినప్పుడు వీరు రాజీపడలేదు.

క్రైస్తవులు పెద్ద సంఖ్యలలో ఉంటే ఒక గ్రామమును లేక పట్టణమును ప్రభావితము చేయవచ్చని అనుకోవద్దు. దేవుని కొరకు నిలబడిన నలుగురు లోకములో అతిశక్తివంతమైన దేశమును దాని అధికారులను ప్రభావితము చేసిరి. దాని నుండి వచ్చే సందేశమేమిటంటే: "దేవుడు తన పనిని మానవశక్తి చేత లేక మానవ సంఖ్య చేత కాక తన ఆత్మ ద్వారా చేయును". యధార్ధముగా ఉండి ఎప్పుడు రాజీపడని వారి కొరకు దేవుడు చూస్తున్నాడు.

దానియేలు 1:8లో మనం ఒక ముఖ్యమైన మాటను చదువుతాము, "తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించెను". తన్నుతాను అపవిత్రపరచుకొననని దానియేలు ఉద్దేశించిన తరువాత అతని మొదటి పరీక్ష ఆహారము విషయములో వచ్చింది. ఆదాము హవ్వలకు వచ్చిన మొదటి పరీక్ష కూడా ఆహారమునకు సంబంధించినదే. మరియు అరణ్యములో ప్రభువైన యేసుకు ఆహారము గురించియే మొదటిగా శోధన వచ్చింది. దేవుని నియమాల విషయంలో రాజీపడవలసి వస్తే రుచికరమైన ఆహారముపట్ల నీ వైఖరి ఏమిటి? ఆహారము కొరకు ఏశావు తన జేష్టత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఏశావు తన కొరకు తీసుకురాగల రుచికరమైన ఆహారమును ప్రేమించడం వలన ఇస్సాకు తన ఆత్మీయ కనుదృష్టిని పోగొట్టుకొనెను. కాని దానియేలు వైఖరి ఇలా ఉండెను: "దేవుడు తన వాక్యములో ఇటువంటి ఆహారమును తినకూడదన్నాడు గనుక నేను దానిని తినను". దానియేలు యౌవనస్తుడిగా లేఖనాలను అధ్యయనము చేశాడు గనుక మోషే ధర్మశాస్త్రము కొన్ని రకాలైన మాంసమును నిషేధించినదనియు సామెతల గ్రంథము మత్తు కలిగించే ద్రాక్షారసమును నిషేధించినదనియు యెరిగియుండెను. ఎంత వెల చెల్లించవలసి వచ్చినా సరే దేవునికి లోబడాలని అతడు నిర్ణయించుకొనెను.

ఆరంభములో ఇతర యూదులందరు రాజీపడగా అతడు ఒంటరిగా నిలబడవలసివచ్చెను. కాని ఒక యౌవస్తుడు దేవునికొరకు నిలబడుట హనన్యా, మిషాయేలు, అజర్యాలు చూచినప్పుడు అతనితో చేరుటకు వారు ధైర్యము పొందిరి (దానియేలు 1:11). దానియేలు ప్రభువు కొరకు నిలబడకపోతే మనము హనన్యా, మిషాయేలు మరియు అజర్యాల గురించి ఎప్పుడు వినకపోదుము.

తాము నివసిస్తున్న ప్రదేశములో ప్రభువు కొరకు ఒక పవిత్రమైన సాక్షము కలిగియుండుటకై దేవుని కొరకు నిలబడాలనే హనన్యా, మిషాయేలు మరియు అజర్యా వంటివారు అనేకులున్నారని నేను నమ్ముతాను. కాని వీరికి స్వంతంగా నిలబడటానికి ధైర్యము లేదు. తమకు నాయకుడిగా ఉండడానికి వీరు ఒక దానియేలు కొరకు చూస్తున్నారు. ఒక దానియేలు ఆ గ్రామమునకు లేక ఆ పట్టణమునకు వచ్చినప్పుడు ఈ క్రైస్తవులు వచ్చి అతనితో చేరుతారు. కాని ఒక దానియేలు వారున్న స్థలానికి రాకపోతే ప్రభువు కొరకు ఒక సాక్ష్యముగా ఉండకుండానే వీరు జీవించి మరణిస్తారు.

గనుక మనకు ఈ రోజు దానియేలులు ఎంతో అవసరము. తమ్మునుతాము ఎప్పుడూ అపవిత్రపరచుకోకూడదని తమ హృదయములో తీర్మానించుకున్న దానియేలు కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈ దానియేలులు ప్రభువుకొరకు నిలబడినప్పుడు వారు హనన్యాలను, మిషాయేలులను, అజర్యాలను ఆకర్షించుకుంటారు. ఇది అనేక స్థలాలలో జరగడం నేను చూచాను. దేవుడు మొదట ఒక దానియేలు కొరకు చూస్తాడు. ఆయన ఒక దానియేలును కనుగొనలేకపోతే ఏమియు జరుగదు. స్వార్ధపరులు కానివారి కొరకు, తమ కొరకు దేనిని ఆశించని వారికొరకు, అవసరమైతే ఆయన కొరకు తమ జీవితాలను నష్టపోవడానికి సిద్ధముగా ఉన్నవారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దానియేలుకు 17 సంవత్సరాల వయస్సే. ఈ రోజున కూడా, దేవుడు ఒక 17 ఏళ్ల యువకుని ఏర్పరచుకొని అతనిని ప్రవక్తగా చేసి ఆయన కొరకు నిలబడటానికి శక్తినివ్వగలడు. మిగతా ముగ్గురు దానియేలు కంటే పెద్దవారైయుండవచ్చును. కాని దానియేలును దేవుడు నియమించిన నాయకునిగా గుర్తించి అతనికి లోబడిరి.

ఈ రోజున అటువంటి ధైర్యము మరియు యదార్థత గల శిష్యులు మనకవసరము. దానియేలు అలా ఉండెను, మరియు షడ్రకు, మెషాకు, అబేద్నగోలు అలా ఉండుటకు వారికి నేర్పించెను. రాజు వారికి పెట్టింది తిని, అతని విగ్రహాలకు మ్రొక్కి, యెహోవాయందు విశ్వసిస్తున్నామని చెప్పుకునే 400 మంది రాజీపడే వారి కంటే ఇటువంటి వారు బబులోనులో నలుగురుండుట ఉత్తమము. ఈ రోజున విచారకరమైన విషయమేమిటంటే అలా రాజీపడే క్రైస్తవులు కోకొల్లలమంది ఉన్నారు. సర్దుబాటు చేసుకునే ఈ కాలములో ఆయన కొరకు రాజీపడకుండా నిలబడే దానియేలులు, షడ్రకు, మెషాకు, అబేద్నగోల కొరకు దేవుడు చూస్తున్నాడు.