WFTW Body: 

రోమా 8వ అధ్యాయం పరిశుద్ధాత్మలో ఉన్న జీవితాన్ని గూర్చి చెప్తుంది. మనం పరిశుద్ధాత్మ ఆధీనములో ఉన్న జీవితములోనికి వచ్చినప్పుడు, మన తండ్రి ప్రతి పరిస్థితిని సమకూర్చి మనకు నిత్యమైన మేలు కలుగునట్లు మనలో ఆయన పనిచేయును. ఇతరులు మనకు కీడు చేయవలెనని కోరినప్పటికీ దేవుడు దానిని మనకు మేలుగా మార్చును. "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగించుచున్నాడని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను" (రోమా 8:28,29). నిజానికి ఇది ఎంతో అద్భుతమైన సువార్త. రోమా 8:28 క్రొత్త నిబంధనలోని అత్యంత అద్భుతమైన వాగ్ధానములలో ఒకటి. మరియు ఈ వాగ్ధానము మన జీవితములో జరిగే ప్రతి ఒక్క విషయము గూర్చి మనము ఎదుర్కోనే ప్రతి పరిస్థితిని గూర్చి చెప్తుంది. కాబట్టి ప్రభువుతో ఈ విధంగా చెప్పుము, "ఈ లోకములో నీవు జీవించినట్లు నేను కూడా నీ చిత్తము నెరవేర్చుటకు మాత్రమే ఈ లోకంలో జీవించాలని కోరుచున్నాను. సిరినిగాని ఘనతనుగాని, పేరుప్రతిష్టలుగాని సుఖభోగములు నేను కోరను. ఈ లోకంలో నా కొరకు నేను ఏదియు కోరను. ప్రతిరోజు నిన్ను మాత్రమే సంతోషపెట్టాలని నేను కోరుచున్నాను మరియు ఈ విషయంలో ఎల్లప్పుడు నన్ను నేను తీర్పుతీర్చుకుంటాను". అప్పుడు సమస్త విషయములు సమకూడి నీ మేలు కొరకే జరుగును. మరియు ఆ "మేలు" గురించి తరువాత వచనంలో అనగా రోమా 8:29లో చెప్పబడింది. అదేమనగా ఆయన నీలో క్రీస్తు సారూప్యమును కలుగజేయును. సర్వశక్తిగల దేవుడు నీకొరకు చేయగలిగిన అతి శ్రేష్టమైన మేలు ఇది.

మనము ఎఫెసీ 1:4,5లో ఇలాగు చదువుతాము "ప్రేమచేత ఆయన మనలను తన కొరకు ముందుగానే నిర్ణయించుకొనియున్నాడు". "ముందుగానే నిర్ణయించుకొనెను" అను మాటను అనేకులు అపార్థము చేసికొనియున్నారు. ఆయన దేనికొరకు మనలను ముందుగానే నిర్ణయించుకొన్నాడు? పరలోకానికి వెళ్ళుటకొరకా లేక నరకానికి వెళ్ళుటకొరకా? ఆవిధముగా కాదు. ఎవరైననూ పరలోకమునకు వెళ్ళాలి అనిగాని, నరకానికి వెళ్ళాలి అనిగాని ఆయన నిర్ణయించలేదు. ఇక్కడ ఇట్లు చెప్పబడింది, "తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను". క్రీస్తులో మనము పరిణితి చెందిన కుమారులుగా ఉండుట కొరకే గాని పసిబిడ్డలుగా ఉండుటకు ఆయన మనలను ముందుగా నిర్ణయించుకోలేదు. మన పరలోక తండ్రి యొక్క వ్యాపారములో ఆసక్తిగల, బాధ్యత కలిగిన కుమారుడుగా నీవు ఉండాలి. తన తండ్రియొక్క వ్యాపారములో ఆసక్తి కలిగిన కుమారుని వలె నీవు ప్రవర్తించాలి.

కొలస్సీ 1:28లో పౌలు "ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము". ఇదియే సమస్త జ్ఞానముతో కూడిన ప్రవచనము మరియు బోధ. ప్రతి మనిషిని క్రీస్తులో సంపూర్ణునిగా చేయుటయే పౌలుయొక్క గురి. 100 మంది గల సంఘము పౌలు కలిగియుండినట్లయితే అందులోని ప్రతి సహోదరుడు మరియు సహోదరిని క్రీస్తులో సంపూర్ణులుగా చేయుటకు తాను చేయగలిగినదంతయు చేయుటకు ప్రయత్నించాడు. ఒకరోజు దేవునియెదుట వారిని నిలువబెట్టుటకు అతడు వారిని ప్రోత్సహించి, హెచ్చరించి మరియు సమస్త జ్ఞానముతో బోధించాడు. అటువంటి భారమును కలిగిన పాస్టర్లు మరియు కాపరులు చాలా కొద్దిమందే ఉన్నారు. వారు కేవలము బోధిస్తారు అంతే. కాని ప్రతి ఒక్కరు ఆత్మీయ పరిణితి చెందాలని పౌలు భారము కలిగియున్నాడు. సంఘపెద్దగా ఉండే బాధ్యతను నీవు చులకనగా తీసుకొనలేవు. 25 సంవత్సరముల క్రితము బెంగుళూరు సంఘములో నేను పెద్దగా ఉన్నప్పుడు సంఘములోని సహోదర, సహోదరీల యొక్క ఆత్మీయ స్థితిని తెలుసుకొని వారిని ఒకరోజు క్రీస్తు యెదుట నిలువబెట్టుటకు వారిని సరిదిద్దేవాడను, గద్దించేవాడను, వారికి జ్ఞానము ఇచ్చెడివాడను మరియు మాటలతో ప్రోత్సహించేవాడను. వారి యొద్దనుండి నాకొరకు నేను ఏమియు కోరెడివాడను కాను. వారి క్షేమాభివృద్ధి కొరకును, క్రీస్తు శరీరము యొక్క క్షేమము కొరకును నా వ్యక్తిగత జీవితములో నేను ఎంతో నలుగగొట్టబడ్డాను. క్రీస్తుయొక్క సువాసన నాలో నుండి వచ్చి అనేకులు ఆశీర్వదించబడునట్లు దేవుడు నాతో అనేక విధములుగా వ్యవరించాడు. ఇది నిజమైన క్రైస్తవ పరిచర్య. కొలస్సీ 1:29లో పౌలు ఇలా కొనసాగాడు, "అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను". అతడు ఏవిధముగా పోరాడాడు? తనలో పనిచేయుచున్న దేవుని యొక్క పునరుత్థాన శక్తితో అనగా పరిశుద్ధాత్మ శక్తితో అతడు పోరాడాడు. దేవుడు మొదటగా పరిశుద్ధాత్మ ద్వారా మనలో పనిచేస్తాడు. అప్పుడు ఇతరులు ఆశీర్వదించబడునట్లు మనద్వారా పనిచేస్తాడు. సంఘములో పరిచర్య చేసేవారు ఈ రెండు వచనముల ప్రకారము ప్రతి ఒక్కరిని క్రీస్తులో సంపూర్ణముగా చేయుటయే గురిగా పెట్టుకోవాలి (కొలస్సీ 1:28). మరియు ఈ గురిని చేరుటకు నిరంతరము పరిశుద్ధాత్మతో నింపబడాలి (కొలస్సీ 1:29).

ఎఫెసీ 4:12లో అపొస్తలుడైన పౌలు "మనము సంపూర్ణులమగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు" మనము అంతకంతకు క్రీస్తులో వృద్ధిపొంది ఎదగాలి అని చెప్తున్నాడు. మనమును మరియు ఇతరులు సంపూర్ణపురుషులు అగుటయే మన గురి అయియుండాలి. "అందువలన మనమికమీదట పసిపిల్లలమై ఉండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగుర గొట్టబడిన వారమైనట్లుండక, మనము ఆత్మీయముగా అంతకంతకు ఎదగాలి" (ఎఫెసీ 4:14).

ఎఫెసీ 4:15లో క్రీస్తువలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగు నిమిత్తము ప్రేమ కలిగి సత్యము చెప్పాలని కోరబడుచున్నాము. ఇక్కడ సత్యముకు మరియు ప్రేమకు మధ్య ఉన్న సమతుల్యతను చూస్తాము. మనము ఎల్లప్పుడు సత్యమే చెప్పాలా? అవును చెప్పాలి. కాని ఏవిధముగా చెప్పాలి. మనము ఎల్లప్పుడు ప్రేమతోనే సత్యము చెప్పాలి. నీవు ప్రేమతో సత్యమును చెప్పాలి. నీవు ప్రేమతో సత్యమును చెప్పనట్లయితే, ప్రజల యెడల నీకు ప్రేమ కలిగే వరకు వేచియుండాలి. ప్రేమ అనే పలకమీద సత్యము అనే పెన్నుతో వ్రాయవచ్చును. నీవు పలక లేకుండా సత్యమును వ్రాసినట్లయితే, అది గాలిలో వ్రాసినట్లుండును. నీవు వ్రాసినదేమిటో ఎవరికి అర్థము కాదు. సమాజముతో గాని లేక వ్యక్తిగతముగా గాని ఎల్లప్పుడు ప్రేమతో మాట్లాడాలి. ఆ విధముగా మనము మనకు శిరస్సైయున్న క్రీస్తుమూలముగా అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొంది శరీరముగా అభివృద్ధి పొందెదము.

హెబ్రీ 6:1-2 వచనాలలో సంపూర్ణులగుటకు సాగిపోవుట గురించి హెచ్చరిక ఉన్నది. 5వ అధ్యాయములో అతడు పాలు త్రాగడం మరియు బలమైన ఆహారము తినడం అనే దృష్టాంతములను అతడు ఉపయోగించెను. ఇప్పుడు మరొ రెండు దృష్టాంతములను వాడుతున్నాడు. మొదటిగా మూలోపదేశము మరియు ఉన్నత స్థాయికి చెందిన ఉపదేశము అను దృష్టాంతము. ఆ తరువాత ఒక భవనము యొక్క పునాది మరియు పైకట్టడము అను దృష్టాంతము. ఇవన్నియు కూడా శిశువులకు, పరిణితి గల క్రైస్తవులకు దృష్టాంతము. పరిణితిగలవాడు శోధనకు క్రీస్తువలె స్పందిస్తాడు, అయితే శిశువులు మనుష్యరీతిగా స్పందిస్తారు. మరొక దృష్టాంతము చూద్దాము: సంపూర్ణులగుటకు సాగిపోవడాన్ని 10,000మీటర్ల ఎత్తున్న ఒక పర్వతాన్ని ఎక్కడంతో పోల్చవచ్చు. యేసు శిఖరంపై ఉన్నాడు. మనము తిరిగి జన్మించినప్పుడు ఈ పర్వతము యొక్క అడుగు భాగమున ఆరంభిస్తాము. ఎంత సమయం పట్టినా మన గమ్యము యేసును వెంబడిస్తూ శిఖరమును చేరుకోవడమే. అప్పుడు మనము 100మీటర్లు ఎక్కినాసరే మన తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో, "నేను క్రీస్తును వెంబడించినట్లే నన్ను వెంబడించుడి" అని చెప్పవచ్చును (1 కొరింథీ 11:1).