WFTW Body: 

2కొరింథీ 11:23-33లో ప్రభువు పరిచర్యలో తాను పొందిన శ్రమల గూర్చి చెప్పాడు - చెఱసాలలో వేయబడుట, కొరడాలతోను రాడ్లతోను దెబ్బలుతినుట, నిద్రలేని రాత్రులు, ఆకలి దప్పులు, ప్రతికూల వాతవరణం, దొంగల వలన భయం మొదలగునవి. వెచ్చగా కప్పుకోవడానికి తగిన దుప్పటి, తినుటకు తగిన ఆహారం లేని పరిస్థితిలో వెళ్ళాడు; ఆ సమయంలో దుస్తులు, ఆహారం కొనుటకు తగిన డబ్బు అతని దగ్గర లేదు. శ్రమపడే క్రైస్తవులకు ఒక మాదిరిగా ఉండుటకు దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడు. ఈ పరిస్థితులన్నిటిలోను పౌలు తనను తాను తగ్గించుకున్నాడు.

"ఒకప్పుడు దమస్కులో చెరపట్టబడే సందర్భంలో కిటికీగుండా గోడమీదనుండి గంపలో దింపబడి తప్పించుకొంటిని అని చెప్పెను" (2కొరింథీ 11:32,33). నీవు అపొస్తలుడవయినట్లయితే, ఇటువంటి అవమానకరమైనది నీకు జరిగితే, దానిని ఇతరులు తెలుసుకొనుట నీకు ఇష్టముండకపోవచ్చు. తాను దేవుని దూతలచేత కాపాడబడిన గొప్ప దైవజనుడని కొరింథీ క్రైస్తవులు ఊహించుకోవాలని పౌలు కోరలేదు. అతడు సామాన్యమైన మనుష్యుడై ఉండి, ఇతరులు తనను ఘనముగా ఎంచకుండునట్లు కోరుకున్నాడు. "నేను ఉన్న దాని కంటే ఎక్కువగా ఎవరు నా గురించి తలంచకూడదని కోరుకుంటున్నాను" (2కొరింథీ 12:6 ఆంగ్ల లివింగ్ తర్జుమా). తాము ఉన్న దానికంటే ఎక్కువగా చూపించుకుంటూ ఇతరుల చేత ఎక్కువ ఘనముగా ఎంచబడాలని కోరే ఈనాటి ప్రభువు సేవకులకు పౌలు ఎంత వేరుగా ఉన్నాడు.

2కొరింథీ 12:1లో మూడవ ఆకాశమునకు తాను ఎత్తబడుటను గూర్చి పౌలు చెప్తున్నాడు. 14 సంవత్సరాలు పౌలు దీనిని ఎవరికీ చెప్పలేదు. అతడు ఎటువంటి వాడోకదా! 14 సంవత్సరాల వరకు ఈ విషయంలో మౌనముగా ఉండి, దాని గూర్చి చెప్పినప్పుడు కూడా ఎటువంటి వివరాలను చెప్పలేదు. అనేకమంది విశ్వాసులైతే అటువంటి దర్శనాలను ఆ తరువాత జరిగే సంఘ కూటములో వివరంగా చెప్తారు. అందుకే పౌలు పొందినది నిజమైన అనుభవమని నేను నమ్ముతాను. ఈనాడు కొందరు విశ్వాసులు చెప్పే పరలోక దర్శనములు మనుష్యుల మెప్పు కొరకు చెప్పే వారి ఉహాజనితాలు. నేను ఇలా ఎందుకు అంటున్నాను? ఎందుకనగా నిజమైన దర్శనము పొందినవారు పౌలు చెప్పినట్లుగా - "ఒక మనుష్యుడు వివరింపలేనంత అద్భుతముగా దర్శనము ఉండెను. ఇతరులకు ఆ మాటలు చెప్పుటకు అనుమతింపబడలేదు" (2కొరింథీ 12:4).

తరువాత పౌలు, ఎంతో ప్రార్థించినప్పటికి దేవుడు తీసివేయని ఒక పెద్ద శోధనను గూర్చి చెప్పాడు. పౌలు దానిని "శరీరములో ముల్లు" అని "సాతాను దూత" అని పిలిచాడు - కాని దేవుడే దానిని అనుమతించాడు (2కొరింథీ 12:7). ముల్లు అనే వరమును పౌలుకు దేవుడు ఇచ్చాడు. పౌలు గర్వించకుండునట్లు దేవుడు అతనికి ఆ ముల్లును ఇచ్చాడు. అహంకారులందరిని దేవుడు ఎదిరించును. గనుక దేవుడు పౌలును ఎదిరించాలని అనుకోలేదు. అతనికి చాలినంత కృప ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కాని దీనుడుగా ఉంటేనే అతనికి కృప ఇవ్వగలడు (1పేతురు 5:5). కాబట్టి పౌలును ఇబ్బంది పెట్టుటకు దేవుడు సాతాను దూతను అనుమతించి అతడు ఎల్లప్పుడు దీనుడై దేవుని మీద ఆధారపడునట్లు ఆయన చేశాడు. కాబట్టి కొన్నిసార్లు మన మేలు కొరకు మనలను ఎల్లప్పుడు విసికించుటకు దేవుడు సాతాను దూతను అనుమతించవచ్చును. ఉదాహరణకు వ్యాధి సాతాను దూతయై ఉన్నది. మనం ఎందుకు ఇలా చెప్తున్నాము? ఎందుకనగా యేసుప్రభువు ఈ విధంగా చెప్పాడు, "మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును" (మత్తయి 7:11). మంచితనములో పరిపూర్ణుడైన దేవునితో పోలిస్తే మనమందరము చెడ్డ తండ్రులమే. మనమెవరమును మన బిడ్డలకు రోగమును ఇవ్వము. అయితే ప్రేమా స్వరూపియైన మన పరలోకపు తండ్రి తన బిడ్డలకు రోగమును ఎందుకు ఇస్తాడు? భూమి శపించబడింది గనుక ఈ లోకములో అనేక రోగములున్నవి (ఆదికాండము 3:17,18). మరికొన్ని రోగాలను సాతాను కలుగజేస్తాడు (యోబు 2:7).

మనం ఆరోగ్యము కలిగి ఉండుట దేవుని పరిపూర్ణ చిత్తము. అయినప్పటికీ కొన్నిసార్లు ఒక సంకల్పము కొరకు ఆయన రోగములను అనుమతిస్తాడు. ముల్లును తీసివేయమని పౌలు ప్రార్థించినప్పటికి, అతడు ముల్లును కలిగియుండి కూడా జయించునట్లు ముల్లును తీసివేయుటకు బదులుగా దేవుడు చాలినంత కృపనిచ్చెను. అదే కృపతో మనం కూడా జయించువారిగా ఉండవచ్చు. 2కొరింథీ 13:4,5లో "బలహీనతలను బట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మీ యెడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవంగలవారము" అని చదువుతాము.

ఒక నిజమైన శిష్యుడు తనలో బలహీనుడై ఉండి దేవుని శక్తి ద్వారా జీవిస్తాడు. 2కొరింథీ పత్రికను పౌలు ఆవిధముగా ముగించియున్నాడు.