వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట పునాది సత్యము
WFTW Body: 

ప్రభువైనయేసు యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడియున్నామని బైబిలు చెప్పుచున్నది (రోమా 5:9). దేవుడు మనలను కడిగినప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా కూడా చేస్తాడు. నీతిమంతులముగా తీర్చబడుట అనగా "నా జీవితంలో ఎన్నడైనను ఒక్క పాపమైనను చేయనివానిగాను మరియు నన్ను పరిపూర్ణమైన నీతిమంతునిగా దేవుడు చూస్తున్నాడు". ఇది ఎంత అద్భుతమైన విషయం. ఒక నల్లపలక మీద మన పాపములు వ్రాయబడినట్లు మనము ఊహించుకొనవచ్చు. ఇప్పుడు తడి బట్టతో ఆ పలకను తుడిచినట్లయితే ఆ వ్రాసినదంతయు తుడిచివేయబడుతుంది. ఇప్పుడు నీవు ఆ పలకను చూచినప్పుడు దాని మీద ఏమి చూస్తావు? దాని మీద ఏమియులేదు. అనగా దాని మీద ఒక్కసారైనను ఏమియు వ్రాయనట్లు ఉంటుంది. ఆ విధంగా ప్రభువైనయేసు రక్తము మనలను సంపూర్ణముగాను మరియు పరిపూర్ణముగాను కడిగి పవిత్రపరుస్తుంది.

మనము నిజంగా మన పాపములను దేవుని ఎదుట ఒకసారి ఒప్పుకున్నట్లయితే సరిపోతుంది. వెంటనే దేవుడు వాటిని చెరిపివేస్తాడు. మరియు ఆయన వాగ్ధానమేమనగా, "మీ పాపములను ఎన్నటికి నేను జ్ఞాపకము చేసుకొనను" (హెబ్రీ 8:12). మనం నిజంగా క్షమించబడియున్నామని మరియు ప్రభువునకు మన పాపములను మరలా మరలా ఒప్పుకొనవలసిన అవసరంలేదనియు మనము తెలుసుకొనినట్లయితే మన హృదయములలోనికి ఎంత విశ్రాంతి వస్తుందో కదా!. "మా పాపములను క్షమించుము" అని స్పష్టముగా ప్రార్థించుట మంచి విధానమని నన్ను చెప్పనివ్వండి. చాలా మంది ఈ విధంగా సామాన్యముగా ప్రార్థిస్తారు, "ప్రభువా, నేను చాలా పాపం చేసియుండవచ్చును". అనగా వారు ఖచ్చితముగా చెప్పుటలేదు. ఈ విధముగా ఒప్పుకొనినయెడల ప్రయోజనముండదు. ఎందుకనగా నీవు పాపము చేయలేదనట్లుగా ఉంటుంది. స్పష్టముగా ఈ విధముగా చెప్పుట మంచిది, "ప్రభువా, ఇది నాయొక్క పాపము. ఆ వ్యక్తికి వ్యతిరేకముగా నాలో కోపమున్నది. ఆ వ్యక్తిని నేను క్షమించలేదు. ఆ వ్యక్తిమీద నేను ఆసూయపడుచున్నాను. నేను ఆ పని ఎంతో స్వార్థముతో చేసియున్నాను. నా స్వంత మహిమకొరకు చేసాను మెదలగునవి". మీరు యధార్థముగా ఉండాలి. మనకు తెలిసిన పాపములన్నియు ఒప్పుకొనిన తరువాత, దావీదువలె మనము ఇంకనూ ఇలా ప్రార్థించాలి, "నా రహస్యపాపములను నాకు బయలుపరచుము". ఎందుకనగా మనమందరము తెలియని రీతిగా కూడా పాపములను చేసియున్నాము (కీర్తన 19:12).

ప్రభువు నేర్పిన ప్రార్థనలో పాపక్షమాపణ అడుగుట చాలా ముఖ్యమైన విషయమైయున్నది. ఎందుకనగా దీనిని గూర్చి చివరలో ప్రభువు మరలా చెప్పారు. మీరు దానిని గమనించారా?. ఆయన చెప్పిన ప్రార్థనలో, ఒక దానిని గూర్చి మరలా చెప్పారు "మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు" (మత్తయి 6:14, 15). ఈ ప్రార్థనను చాలా మంది విశ్వాసులు తీవ్రముగా తీసుకొననందున వారు దేవునిలో ఆనందించి ఆయనలో సంపూర్ణ సహవాసం అనుభవించలేరు. ప్రభువైనయేసు ఒక ఉపమానములో, ఒక రాజు తన దాసుని ఒక రోజు లెక్క అడిగియున్నాడు, అతడు నాలుగు కోట్ల రుపాయలు అచ్చియున్నానని ఆ దాసుడు కనుగొన్నాడు. మరియు ఆ దాసుడు ఈ విధంగా చెప్పియున్నాడు "అయ్యా నా దగ్గర డబ్బు లేదు, దయచేసి నన్ను క్షమించండి". అప్పుడు రాజు అతనిని సంపూర్ణంగా క్షమించాడు. ఆ దాసుడు బయటకు వెళ్ళిన తరువాత మరొక దాసుడు అతనికి కేవలం నలబై రూపాయలు అచ్చియున్నందున, అతడు ఆ దాసున్ని గొంతు పట్టుకొని జైల్లోపెట్టాడు. ఆ రాజు దానిని వినినప్పుడు కనికరములేని ఆ దాసుని అతడు పిలిపించి మరియు ఇట్లన్నాడు "నేను ఉచితముగా నీవు ఇవ్వవలసిన నాలుగు కోట్ల రూపాయలను క్షమించాను, నీవు కేవలం నలబైరుపాయలు ఇవ్వలేని ఆ దాసుని క్షమించలేవా?" మరియు అతడు ఆ దాసుని బాధపరచువారికి అప్పగించెను. అప్పుడు ప్రభువైనయేసు ఇట్లన్నారు "మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయుననెను" (మత్తయి 18:35). మనము ఇతరుల మీద కనికరము చూపువరకు దురాత్మలు మనలను బాధించునట్లు అనుమతించబడినవి. దేవుడు మనలను అంత గొప్ప అప్పు క్షమించియుండగా, మరియు మనలను గాయపరచిన వారిని క్షమించకపోవుట ఎంత చెడ్డ విషయం?.

మీకు ఎవరైనా హాని చేసారా? బహుశా మీ గురించి ఎవరైనా చెడ్డకథలు చెప్పియుండవచ్చు. మీ ఇరుగుపొరుగువారుకాని, లేక మీ భార్యకాని, లేక మీ తండ్రికాని, లేక మీ అత్తకాని, మీకేదైనా హాని చేసియుండవచ్చును. కొన్ని విషయములలో వారు మీ జీవితాన్ని పాడుచేసియుండవచ్చు. మీకు అపరేషన్ చేసిన డాక్టరు చేసిన పొరపాటువలన మీరెంతో బాధపడియుండవచ్చును. మీరు దేవునికి వ్యతిరేకముగా చేసినపాపములతో పోల్చినప్పుడు ఈ పాపములన్నియు కలిపినప్పటికిని చాలా కొంచమైయున్నది. మరియు దేవుడు నిన్ను క్షమించాడు. కాబట్టి నీవు వారందరిని హృదయపూర్వకముగా క్షమించకపోవుటకు కారణమేమియులేదు. "హృదయపూర్వకముగా" అను మాట మత్తయిసువార్తలో ముఖ్యమైయున్నది. నీతోటి వారిని నీ హృదయపూర్వకముగా క్షమించుటకు ఇష్టపడని యెడల నీవు దేవుని యెద్దకు వచ్చి నా ఋణములను క్షమించమని అడిగి సమయం వృధా చేసుకొనవద్దు. ఎందుకనగా దేవుడు నీ ప్రార్థన వినడు. ఈ లోకంలో నీవు ఒక్కరిని క్షమించకపోయినను నీవు క్షమించబడలేవు. అప్పుడు నీవు నిత్యత్వానికి నష్టపోతావు. ఎందుకనగా క్షమింపని వాడు దేవుని సన్నిధిలో ప్రవేశించలేడు. ఇది మనం అనుకునే దానికంటే ఎంతో తీవ్రమైన విషయం.

ఇతరులను మేము క్షమించిన ప్రకారము మమ్మును క్షమింపుము అని ప్రార్థించాలి. "ఇతరులను మనం ఏ విధంగా క్షమించామో దేవుడు చూస్తాడు". మనం ఇతరులకు ఇచ్చిన ప్రకారమే దేవుడు మనకు ఇస్తాడని ప్రభువైనయేసు చెప్పారు. ఆయన ఇట్లన్నారు, "క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును; అణచి కుదిలించి; దిగజారునట్లు నిండు కొలతను మనుష్యలు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పెను" (లూకా 6:38). అనగా నీవు చిన్న గరిటతో ఇతరులకు ఇచ్చినట్లయితే నీవు ప్రార్థించినప్పుడు దేవుడు కూడా నీకు అదే గరిటతో ఇస్తాడు కాబట్టి మనం దేవుని యొద్దనుండి గొప్ప విషయముల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ చిన్న గరిటతీసుకొని కొంచెమే ఇస్తారు. ఎందుకనగా మనం కూడా అదే గరిటతొ ఇతరులకు ఇచ్చియున్నాము. మనం ఎంత పెద్ద గరిటతో ఇతరులకు ఇస్తామో, అంతే పరిమాణం గల గరిటతో దేవుడు మనకు ఇస్తాడు. మార్పులేని ఈ నియమం ద్వారా దేవుడు మనలో పనిచేస్తాడు.

"కనికరముగల వారు ధన్యులు; వారు కనికరము పొందుదురు" (మత్తయి 5:7). నీవు ఇతరులయెడల ఎంత కనికరము చూపిస్తావో, తీర్పు రోజున దేవుడు నీకు కూడా అంతే కనికరము చూపిస్తాడు. "కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును" (యాకోబు 2:13). కాబట్టి మీరు ఇతరులను చాలా ఇబ్బందితో క్షమించినట్లయితే దేవుడు కూడా నిన్ను అలాగే క్షమిస్తాడు. నీకు హాని చేసిన వారిని క్షమించి చిరునవ్వుతో చూసినట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించి నిన్ను అలాగే చూస్తాడు. నీవు ఇతరులను ఏ కొలతతో కొలుస్తావో దేవుడు కూడా నిన్ను అదే కొలతతో కొలుస్తాడు.

కాబట్టి నీవు బలిపీఠముయొద్ద అర్పణమును అర్పించుచుండగా, అనగా నీవు దేవుని ప్రార్థించుటకు వచ్చినప్పుడు, లేక నీవు కానుక వేయవచ్చినప్పుడు, నీవు గాయపరచిన సహోదరుడు నీకు గుర్తుకువచ్చినయెడల, "మొదటగా నీవు వెళ్ళి అతనితో సమాధానపడి అప్పుడు నీవు వెళ్ళి ప్రార్థించాలి" (మత్తయి 5:22-24). లేనట్లయితే దేవుడు నీ ప్రార్థననుగాని నీ కానుకను గాని అంగీకరించడు. నీ ప్రజల మీద నీవు కోపించకూడదు (లేవికాండము 19:18). దాన్ని నేరవేర్చుట చాలా సులభము. కాని కొత్త నిబంధన స్థాయి ఎక్కువగా ఉంది. నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలిగియున్న యెడల నీవు వెళ్ళి సమాధానపడుము. మనలో ఏ పొరపాటు లేకపోయినప్పటికి కొంతమంది సహోదరులకు మనమీద విరోధముండవచ్చును. సత్యంకొరకు నిలబడినందున ప్రభువైనయేసుకు మరియు అపోస్తలులకు అనేక మంది శత్రువులుండెను. కాని ప్రభువైనయేసు చెప్పిన సందర్భం, మనము సహోదరులతో కఠినముగా మాట్లాడినందున అతనికి విరోధముండుట (మత్తయి 5:22). మనము చేసిన పాపములను బట్టి అతనికి విరోధము కలిగింది. అటువంటి సందర్భాలలో మాత్రమే మనము వెళ్ళి క్షమాపణ అడగాలి. అప్పుడే దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు.

మనము దేవుని యెద్దకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించినట్లయితే, "ప్రభువా, నా జీవితములో కొత్త నిబంధన యొక్క పరిపూర్ణమైన శక్తి కావాలి". అప్పుడు ప్రభువు ఇట్లనును, "నేను నీకు కొత్త నిబంధన శక్తి ఇచ్చినట్లయితే, అది నీకు కొత్త నిబంధన బాధ్యతలు కూడా తెస్తుంది". చాలా మంది విశ్వాసులు పాతనిబంధన ప్రకారము జీవించుట వలన కొత్త నిబంధన శక్తిని అనుభవించలేకపోవుచున్నారు. వారు వెళ్ళి క్షమాపణ అడుగుటకు ఇష్టపడుటలేదు కనుక వారు శక్తిలేని వారుగా ఉంటారు. మనమందరము శరీరము(శరీరేచ్ఛలు) కలిగియున్నాము. మరియు శరీరము కలిగిన ఇతరులతో జీవిస్తున్నాము కాబట్టి ఎల్లప్పుడు మనకు తెలిసికాని తెలియకకాని ఒకరినొకరము గాయపరచుకుంటాము. పరలోకంలో మాత్రమే మనలను ఎవ్వరూ గాయపరచరు. కాబట్టి మనం ఈ భూమి మీద జీవించినంత కాలం ఒకరినొకరము క్షమించుకోవాలి. తప్పు చేయుట మానవ సహజం, కాని క్షమించుట దైవికమైయున్నది.

నరకములో కనికరముండదు. ఇతరులయెడల నీ హృదయములో ఎంత కనికరములేకుండా ఉంటావో అంతగా కొంచెం నరకం నీ హృదయములో ఉంటుంది. నీవు ఒకరిని క్షమించుటకు ఇష్టపడని యెడల నీలో కొంచెం నరకం ఉంటుంది. నీ మత సంబంధమైన కార్యములను బట్టి ఇతరులు నీవు మంచివాడవని అనుకొనవచ్చును కాని, నీలో ఎల్లప్పుడు కొంచెం నరకమున్నది. ఆ విధముగా నీవు పరలోకమునకు వెళ్ళలేవు. ఈ భూమిని విడచిపెట్టెముందు దానినుండి విడుదల పొందాలి. "మేము ఇతరులను క్షమించిన ప్రకారము, మమ్మును క్షమించుమని" ప్రార్థించమని ప్రభువు నేర్పించాడు. మనము ఇతరులను క్షమించని యెడల, అది మన శరీరములను కూడా ప్రభావితం చేయగలదు. దేవుని నియమాలకు అవిధేయత చూపించుట ద్వారా శారీరక శ్రమలు వచ్చును.

నీ హృదయములో నీవు ఎవరిమీదనైనను అసూయపడినయెడల నీవు దేవుని ప్రేమ నియమానికి అవిధేయత చూపించుట వలన చివరకు అది నీ శరీరమును ప్రభావితం చేస్తుంది. ఈ నామకార్ధ క్రైస్తవులకు ఇతరులమీద విరోధముండుట వలన ఆస్తమా, తీవ్రమైన తలనొప్పి, కీళ్ళనొప్పులు, కీళ్ళవాతం మెద|| స్వస్థత పొందని కొన్ని రోగములను కలిగియున్నారు. వారు క్షమించుట నేర్చుకొనేంతవరకు, ఎన్ని మందులు వాడినను స్వస్థతరాదు. ఎందుకనగా అది శరీరానికి సంబంధించినది కాదు ప్రాణానికి సంబంధించినది.

నీవు నీ సహోదరునికాని సహోదరినికాని క్షమించని యెడల దేవుడు నీ ప్రార్థన వినడు. కీర్తన 66:18 లో బైబిలు ఇలా చెప్పుచున్నది, "నా హృదయములో నేను పాపము లక్షముచేసిన యెడల, ప్రభువు నా మనవి వినకపోవును". దేవుడు జవాబివ్వకపోవడమే కాదుకాని ఆ ప్రార్థన వినడు. నిజమైన క్షమాపణలో విరిగిన హృదయం మరియు ఒప్పుకొనుట వస్తుంది మరియు మనము శరీరములో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తెలుసుకొని మరియు దేనినైనను సరిచేసుకొనుటకు ఇష్టపడి మరియు అవసరమైతే ఎవరినైనను క్షమాపణ అడుగుటకు సిద్ధముగా ఉన్నయెడల దేవునితో మన సహవాసం సరిగా ఉంటుంది.

చివరిగా, "మమ్మును క్షమించుము" అని ప్రార్థించాలని గుర్తుంచుకోవాలి. మన సహోదరులు కూడా క్షమించబడాలని కోరాలి. కొన్నిసార్లు మన సహోదరుడు మనం చూచిన విధంగా దేవుడు అతనిని తీర్పు తీర్చాలని మనం రహస్యమైన నిరీక్షణ కలిగియుండవచ్చు. ఇది సాతాను యొక్క వైఖరి. ఎందుకనగా అపవాది, ప్రజలు దేవుని చేత తీర్పుతీర్చబడాలని కోరుతున్నాడు. ప్రభువైనయేసు ఇట్లన్నాడు, "బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే" (యెహాను 13:14). అనగా నీ సహోదరుని పాదములకు ఆత్మీయమురికున్నట్లయితే అతడు కడుగబడాలని నీవు కోరుకోవాలి.

"మమ్మును క్షమింపుము" అనగా, తండ్రి, నా ఒక్కడి పాపములనే నీవు క్షమించినట్లయితే నేను తృప్తిపడను. నాతో ఉన్న సహోదర సహోదరిల పాపములు కూడా క్షమించాలని కోరుతున్నాను. ఆమెన్.