వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము సంఘము తెలిసికొనుట
WFTW Body: 

"ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడి వానిని లేవనెత్తును; అయితే ఒంటిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును; ఒంటిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరియెకడు పడిన యెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?" (ప్రసంగి 4:9-12). ఒక ముసలి రైతు ఎప్పుడూ తమలో తాము దెబ్బలాడుకొనే తన ముగ్గురు కుమారులకు ఐక్యమత్యము గూర్చి చెప్పిన కథ మీకు జ్ఞాపకముండి ఉంటుంది. అతడు సన్నగా ఉండిన కొన్ని పుల్లలను తీసుకొని అవి ఒక్కొక్కటిగా ఎంత సుళువుగా విరుగునో, కాని వాటిని ఒక కట్టగా కట్టినప్పుడు వాటిని అట్లు విరుచుట దాదాపు అసాధ్యముగా ఉండునో చూపించెను. ఈ లోక సంబంధులు కూడా ఐక్యమత్యములోను మరియు సహవాసములో బలమున్నదని గ్రహించియుండిరి. "మిడుతలకు రాజు లేకపోయినా అవి కలిసియుండి పంక్తులు తీరి సాగిపోవును" అని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 30:27). ఆ విధముగా వాటికి భద్రత మరియు శక్తి కలుగుచున్నది. యేసుక్రీస్తు యొక్క సంఘములో, ఈ పాఠమును మనము మరల నేర్చుకొనవలసియున్నది.

క్రొత్త నిబంధన చెప్పే ఐక్యత క్రీస్తు శిరస్సుగా ఉండి, క్రీస్తు యొక్క శరీరములో సభ్యులు ఒకరితో ఒకరు ఐక్యమత్యముగా ఉండే సేంద్రియ(దేవుని యొక్క జీవమును కలిగియుండుట ద్వారా కలిగే) ఐక్యమత్యము తప్ప సంస్థాగతమైన ఐక్యమత్యము కాదు. అది చివరకు 'క్రైస్తవుడు' అనిపించుకొనినా క్రీస్తు శరీరమునకు బయట ఉన్నవారిని మినహాయించును. సజీవమైన వాటికిని మృతమైన వాటికిని మధ్య సంఘీభావము ఉండదు. క్రీస్తు ద్వారా నూతన జన్మను బట్టి బ్రతికింపబడిన వారు, వారివలె దేవునియొక్క నూతన జీవమును పొందిన వారితో ఐక్యమత్యము కలిగియుందురు. క్రైస్తవ ఐక్యత క్రీస్తు శరీరములో మనలను సభ్యులుగా చేయు పరిశుద్ధాత్మ చేత కలిగింపబడును. "ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారు"గా ఉండవలెనని బైబిలు మనలను హెచ్చరించుచున్నది (ఎఫెసీ 4:2,3). మానవునిచే ఏర్పరచబడిన ఎటువంటి ఐక్యతయైనా విలువలేనిదే.

సాతాను కపటమైన శత్రువు. క్రీస్తుకు మరియు ఆయన వాక్యము యొక్క అధికారము క్రింద ఐక్యతతో జీవించుచుండిన క్రైస్తవ సహవాసమును జయించలేడని అతడికి తెలియును. అందువలన ఈ యుద్ధములో అతడి వ్యూహముగా ఒక సహవాసములో సభ్యుల మధ్య అసమ్మతి, అనుమానము మరియు అపార్థములను విత్తుట ద్వారా అందులోని వ్యక్తులను ఒక్కొక్కరిగా పనికి రాకుండా చేయును. పాతాళలోకపుశక్తి ఆయన సంఘమును జయించలేదని యేసు ప్రభువు చెప్పారు (మత్తయి 16:18). సాతానుకు వ్యతిరేకముగా పోరాటమందు విజయము క్రీస్తు శరీరమైన సంఘమునకు వాగ్ధానము చేయబడినది. ఇతర విశ్వాసులకు వేరుగా ఒంటరిగా ఉండే విశ్వాసి ఓడిపోవచ్చును. క్రీస్తుయొక్క జీవిత కాలమంతటిలో సాతాను నిరంతరము క్రీస్తుపై దాడి చేశాడు. కాని గెలవలేకపోయెను. చివరిగా సిలువ నొద్ద మానవునిపై సాతాను యొక్క అధికారము క్రీస్తు చేత పడద్రోయబడెను(నశింపజేయబడింది) (హెబ్రీ 2:14; కొలస్సీ 2:15). ఈనాడు మరణము గెలిచి లేచిన క్రీస్తుపై సాతాను దాడి చేయలేడు. అందువలన ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమైన ఆయన సంఘముపైకి అతడి దాడులను కేంద్రీకరించును. మనయొక్క ప్రభువు శిరస్సుగా ఆయనలో మనము ఒక శరీరముగా సాతానుకు వ్యతిరేకముగా ఒక్కటిగా నిలిచినప్పుడు మాత్రమే మనము సాతానుపై విజయము పొందగలము. క్రైస్తవులయొక్క సహవాసములో, ఏ ఒక్క సభ్యుడు తన యొక్క బాధ్యతను ఎంతమట్టుకు నిర్వర్తించలేకపోవునో, శరీరముయొక్క శక్తి అంతమట్టుకు బలహీనపడును. సాతానుకు ఇది తెలియుట చేత, ఒక గుంపులో నుండిన వారిని ఎవరికి వారుగా ఉండునట్లు విడదీసి లేక ఆ గుంపును(లేక సంఘమును) చిన్న చిన్న ప్రత్యేక గుంపులుగా చేయుటకు నిరంతరము చూచును. ఈ కారణము చేతనే మనము సాతానుయొక్క యుక్తికరమైన ఉచ్చులకు వ్యతిరేకముగా నిరంతరము జాగ్రత్త కలిగియుండవలెను. లేనట్లయితే మనకును క్రీస్తు శరీరములో నుండిన ఏ ఇతర సభ్యునికి మధ్య ఉండిన సంబంధములను అతడు బలహీనపరుచును.

వ్యక్తిగతముగా విశ్వాసులు దేవునికి ప్రార్థించుట గూర్చి యేసు ప్రభువు ఎన్నో వాగ్ధానాలు చేసారు. కాని మత్తయి 18:18,19లో క్రీస్తుయొక్క శరీరములో ఒక విభాగము ఏకత్వముతో ప్రార్థించుట గూర్చిన వాగ్ధానము ఇవ్వబడియున్నది. "భూమిమీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడును... మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నాతండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను" అని యేసు చెప్పెను. ఇక్కడ 19వ వచనములో నుండిన "ఏకీభవించిన" అనుమాట వాయిద్యములు వాయించునప్పుడు వాటి మధ్యనుండిన మేళవింపుకు సంబంధించిన గ్రీకు పదము "సింఫొనియో" నుండి వచ్చింది. యేసు ప్రభువు ఇక్కడ తన బిడ్డలలో ఏ యిద్దరు మధ్యన నుండిన వాయిద్యముల మధ్యనుండు మేళవింపు వంటి ఐక్యతను గూర్చి చెప్పుచున్నారు. ఇది ఒకరు చేసిన ప్రార్థనకు చివరన వేరోకరు 'ఆమేన్' చెప్పుట కంటె ఎక్కువైనది. ఈ మేళవింపు అనునది కలసి ప్రార్థించే యిద్దరి మధ్య ఆత్మలో లోతైన సమైఖ్య భావముండుట గూర్చి తెలియజేయును. చిన్న గుంపుగా నుండిన క్రైస్తవుల మధ్యనైనను, ఒక మంచి వాద్యబృందము మధ్యనుండిన మేళవింపువంటిది ఉండినట్లయితే అప్పుడు, వారి ప్రార్థనలకు ఏది అడిగినా పొందుకొనగలిగే అధికారముండును(అని యేసు చెప్పారు). అటువంటి క్రైస్తవులుండిన గుంపునకు సాతాను యొక్క శక్తిని బంధించుటకు మరియు సాతాను యొక్క బంధీలను విడిపించుటకు అధికారముండును. అటువంటి అధికారమును ఒక సహవాసము ప్రయోగించుటకు గల కారణమును యేసుప్రభువు వివరించారు. "ఎందుకనగా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్యను నేను ఉందును" (మత్తయి 18:20) అని చెప్పారు. క్రీస్తు అటువంటి సహవాసములో శిరస్సుగా ఆయన అధికారమంతటిలో ఉండును. అందువలన పాతాళపు శక్తులు అటువంటి సహవాసమునకు వ్యతిరేకముగా నిలువనేరవు. అపొస్తలుల కార్యములలో చెప్పబడిన సంఘము ఇటువంటి అధికారములో యదార్థముగా ఎదుగుటకు ఒక కారణము వారి మధ్య నుండిన సహవాసములో ఇటువంటి సమైక్యత ఉండుటైయున్నది. "వారందరు(11మంది అపొస్తలులు) ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి"... "విశ్వసించిన వారందరు ఏకముగా కూడి.. వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు"... "వారు(11మంది అపొస్తలులు మరియు ఇతర విశ్వాసులు) యేక మనస్సుతో దేవునికిట్లు మొఱ్ఱపెట్టిరి"(అపొ.కా. 1:14; 2:44, 46; 4:24). వారు క్రీస్తుయొక్క అధికారము క్రింద ఒక ఆత్మీయ శరీరముగా సమైఖ్యముగా ఉండుటచేత వారు ప్రార్థనలో ప్రభువుయొక్క అధికారమును ప్రయోగించగలిగిరి. వారు ఎక్కువగా చదువుకొన్నవారు కాదు, వారు సాంఘీకముగా పలుకుబడి కాని ఆర్థిక సామర్థ్యముగాని ఉన్నవారు కాదు, అయినప్పటికీ వారికి తెలిసియున్న లోకమును తలక్రిందులు చేసిరి. పేతురు ఖైదులో బంధించబడినప్పుడు, హేరోదుయొక్క బలగాలు అన్నియు ఆ ఆది సంఘము దేవునియెదుట మోకాళ్ళూనినప్పుడు వచ్చిన శక్తి ముందు నిలువలేకపోయినవి (అపొ.కా. 12:5-11). ఆ సంఘము ఒక శరీరముగా బయలు వెళ్ళినప్పుడు అది రోమా సామ్రాజ్యమంతట నుండిన మానవ జీవితాలపై క్రీస్తుయొక్క విజయమును మరియు అధికారమును స్థిరపరుస్తూ సాతానుయొక్క రాజ్యమును పునాదుల మట్టుకు కదిలించి వేసేను (అపొ.కా. 19:11-20 లో ఒక ఉదహారణ).

ఈనాడు ఐక్యతలేని సంఘము బయటకు కనబడే విన్యాసాలతో, క్రొత్త పరికాలతో, సమావేశములతో, వేదాంత పరిజ్ఞానముతో, వాగ్దాటితో మరియు తర్ఫీదు పొందిన గాయక బృందముతో సాతానును తన బలమైన దుర్గములో నుండి బయటకు త్రోసి వేయాలని చూచుచున్నప్పుడు ఆ ప్రయత్నములను సాతాను ఎగతాళి చేయుచున్నాడు. ఇవేవి కూడా సాతానుకు వ్యతిరేకముగా పని చేయలేవు. క్రీస్తుయొక్క నాయకత్వములో ఒక శరీరముగా ఐక్యమగుటయొక్క యదార్థతను సంఘము తిరిగి తెలుసుకొను అవసరము వచ్చియున్నది. ఒకరితో ఒకరు సరియైన విధముగా సంబంధము కలిగి, ఒకరి యెడల ఒకరిపై ప్రేమలో ఎదుగుచు మరియు క్రీస్తుకును మరియు ఆయన వాక్యమునకును విధేయతతో జీవించు క్రైస్తవుల సహవాసము ఈ భూమిపై అపవాదియొక్క రాజ్యమునకు గొప్ప బెదరింపుగా ఉండును. దానికి భయపడినట్లుగా సాతాను మరి దేనికి భయపడడు. 'క్రీస్తులో ఒక్క శరీరము'ను గూర్చిన మహిమగల సత్యముయొక్క వెలుగులో ప్రతి దినము జీవించగలుగుటకు ప్రభువు సహాయము చేయునట్లు మనము ప్రార్థన చేయుదుము. ప్రపంచమంతా క్రైస్తవులు ఇంకా ఇంకా ఈ సత్యమును అర్థము చేసికొనుటకు దానిని బట్టి జీవించుట మొదలుపెట్టుచుండగా మనము తప్పక సంఘము, సంఖ్యలో చిన్నదిగా నుండినను, తనయొక్క పాతకాలపు వైభవమును పొంది, చీకటి శక్తులను తరిమి వేయుటకు మరియు అవసరతలో నుండిన లోకముకు ఆశీర్వాదములు తెచ్చే ఒక కాలువగా దేవుని చేతిలో ఒక పనిముట్టువలె వాడబడుటను మనము తప్పక చూచెదము.