వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
WFTW Body: 

మీకు కలిగిన ప్రఖ్యాతిని బట్టి మీ పరిచర్య విజయాన్ని ఎన్నడూ అంచనా వేయవద్దు. ప్రజల్లో "ప్రఖ్యాతి"గాంచిన వారికి శ్రమ అని యేసు ప్రకటించాడు. ఎందుకంటే అది అబద్ధ ప్రవక్తను గుర్తించే గుర్తు (లూకా 6:26). అందుచేత ఒకవేళ నీవు ఒక అత్యంత సుప్రసిద్ధ బోధకుడివైతే అబద్ధ ప్రవక్తవై యుండొచ్చు. అయితే దీనికి విరుద్ధముగా యేసు తన శిష్యులతో ఈ విధముగా చెప్పాడు - అందరూ మీకు వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు సంతోషించండి. ఎందుకనగా అది నిజమైన ప్రవక్త యొక్క ఒక గుర్తు (లూకా 6:22,23).

ఈ సందర్భంగా యేసు చెప్పిన విషయాన్ని నిజముగా నీవు నమ్ముతావా?

ఇశ్రాయేలు చరిత్రలో గానీ, సంఘచరిత్రలోగానీ జీవించిన ప్రతి నిజమైన ప్రవక్త వివాదాస్పదమైన వ్యక్తిగా, ఆ నాటి మత నాయకులచేత దూషణ, ద్వేషములకు, నిష్కారణ నేరారోపణలకు గురియైనారని జ్ఞాపకముంచుకోండి.

పాతనిబంధన కాలానికి చెందిన ఏలియా, యిర్మీయాలుగానీ, మొదటి శతాబ్దానికి చెందిన బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలుగానీ, ఆధునిక భక్తులైన జాన్‌ వెస్లీ, వాచ్‌మెన్‌ నీ లాంటి వారి జీవితాల్లోగాని పై నియమము తప్పిపోలేదు.

అందుచేత మన ప్రయాసకు ఫలితమైన శాశ్వత(నిత్యత్వపు) విజయము మనకీర్తిపై ఆధారపడి‌ఉండదు!

మన ప్రయాస ఫలితమైన విజయాన్ని గణాంకాలలో కూడా చూడకూడదు. ఎంతమందికి సువార్త బోధించాము? మనం నిర్వహించిన సభల్లో ఎంతమంది చేతులెత్తారు? అని లెక్కలు కట్టి విజయాన్ని చూడకూడదు.

లెక్కలు కట్టి సంఖ్యాపరమైన అభివృద్ధిని పరిశీలిస్తే యేసు చేసిన పరిచర్య పూర్తిగా అపజయము పొందినదని మనము చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన పరిచర్య చివరిలో తండ్రికి చూపించేందుకు యేసు దగ్గర కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు (యోహాను 17). అయితే యేసు సాధించిన విజయము ఆ పదకొండు మంది శిష్యులు ఎటువంటి వారన్న విషయములో ఉన్నది! ఈనాటి అపనమ్మకమైన, ధన ప్రేమికులైన, రాజీతత్వ, లోకసంబంధమైన "విశ్వాసుల్లాంటి" పదకొండు మిలియన్ల కన్నా మించి, దేవుని దృష్టిలో ఆ పదకొండు మంది ఎంతో అమూల్యమైన వారు, దేవునికోసం అధికంగా సాధించి నెరవేర్చగలిగిన స్తోమతగలవారు.

నా జీవితమంతటిలో మొదటి అపొస్తులుల వంటి శక్తివంతమైన పదకొండుమందిని నేను తయారుచేయగలిగితే నా పరిచర్య మహిమాన్వితమైన విజయాన్ని సాధించినట్లే. కానీ అటువంటి వారిని కనీసం ఇద్దరు లేక ముగ్గుర్ని తయారు చేయటం కూడా బహుకష్టమైన పని. తమ పూర్ణ హృదయాలతో దేవుణ్ణి ప్రేమించకుండా లోకంతో రాజీపడి "యేసునందు విశ్వాసముంచు" గుంపును సమకూర్చడం ఎంతో సుళువు.

గత ఇరవై శతాబ్దాలుగా క్రైస్తవ్యంలో దేవుడు ఆరంభించిన ప్రతి ఉద్యమములో రెండవ తరానికి వచ్చేసరికి క్షీణత సోకి సంస్థాపకుడు ఆరంభించినపుడు ఉన్నంత శక్తివంతముగానూ, ఉజ్జీవపూరితముగానూ ఉద్యమము సాగిపోవుటలేదు. ఎందుకు?

రెండవతరము వారు తమ అభివృద్ధిని సంఖ్యాపరముగా పోల్చుకోవటము ఒక కారణము. వారు సంఖ్యలో అధికము కావటమే వారిని దేవుడు ఆశీర్వదించాడనుటకు ఋజువుగా భావిస్తారు.

కానీ ఇటీవల సంవత్సరాల్లో ఇతర మతాలకు చెందిన ఛాందస గుంపులు, విమత బృందాలు ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది ఏమి నిరూపిస్తున్నది? సంఖ్యాపరమైన అభివృద్ది దేవుని ఆశీర్వాదానికి రుజువుకాదు.

క్రీస్తు శరీరములో మనకు అనుగ్రహించబడిన పరిచర్యపై మనదృష్టిని లగ్నము చేయాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అదే సమయములో వేర్వేరు పరిచర్యలు జరిగిస్తున్న ఇతరులతో సహకరిస్తూ పనిలో సాగిపోవాలని కూడా ఆయన పిలుస్తున్నాడు. క్రీస్తు శరీరమనబడిన సంఘములో మనము ఒక భాగముగా ఉన్నాము గనుక మన పరిచర్య సాధిస్తున్న అభివృద్ధిని లెక్కకట్టుట అసాధ్యమైన పని.

కాబట్టి నెరవేర్చుటకు దేవుడు మనకు అప్పగించిన పనిలో మనము నమ్మకస్థులముగా ఉన్నామా? లేదా? అను విషయాన్ని ఖచ్చితముగా తెలుసుకోవటము మనకు అవసరము