WFTW Body: 

"మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి" (రోమా 12:2).

"మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని (ప్రభువైనయేసు) మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడచు అట్టివాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను" (యెషయా 50:10 లివింగ్ బైబిల్).

పాతనిబంధనలో దేవుడు తరచుగా తన చిత్తమును ఆకాశమునుండి ఒక స్వరం ద్వారా తన సేవకులకు తెలియజేసాడు. కాని కొత్తనిబంధనలో, దేవుడు మన హృదయాలలోని పరిశుద్ధాత్మయొక్క అంతరంగ సాక్ష్యం ద్వారా మనలను నడిపిస్తాడు. ఇది విశ్వాస మార్గము మరియు చూచి నడిచే పాతనిబంధన మార్గంకన్న ఎంతో శ్రేష్ఠమైనది.

కాబట్టి, ఒక విషయములో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు మనం కలవరపడవచ్చు. మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు దీన్ని అనుమతిస్తాడు. మనం ఆయనకు సన్నిహితంగా ఉండాలని మరియు ఆయనను బాగా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి అనిశ్చితి సమయాలను దేవుడు మన ఉద్దేశాలను జల్లెడ పట్టడానికి కూడా ఉపయోగిస్తాడు.

కాబట్టి అటువంటి సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనము ఆశ్చర్యపోకూడదు లేక నిరుత్సాహపడకూడదు. చివరకు అపోస్తలుడైన పౌలు కూడా ఈవిధమైన పరిస్థితులలో వెళ్ళాడు గాని, ఆయన ఎప్పుడు నిరాశపడలేదు మరియు వదిలిపెట్టలేదు (2కొరంథీ 4:8). దేవుడు కొన్నిసార్లు తన చిత్తమును, మనము నిర్ణయము తీసుకోవలసి వచ్చినప్పుడు మాత్రమే తెలియజేస్తాడు. దానికంటే ముందు ఎంతో సమయము మనము వేచియుండేటట్లు ఆయన చేస్తాడు.

ఏదేమైనా, ప్రతి దశలో మనము తరువాత చేయవలసిన మెట్టు మాత్రమే ఆయన మనకు చూపిస్తాడు. మనము అనుదినము ఆయన మీద ఆధారపడవలెనని, వెలిచూపును బట్టిగాక విశ్వాసము ద్వారా నడచుకోవాలని ఆయన మనలను ఒక్కొక్కడుగు నడిపిస్తాడు. ఆయన మనకు ఒక్క అడుగు మాత్రమే చూపించినప్పుడు మనము ఆయన మీద తప్పక ఆనుకొనవలసివస్తుంది. మన జీవితమునకు సంబంధించి దేవుని చిత్తమును కనుగొనుటకు ఎప్పుడైనా మనము చేయవలసినదేమిటంటే ఆయన మనకు తరువాత చూపించే అడుగు వేయటమే. ఆవిధముగా మనము చేస్తున్నకొలదీ, నెమ్మదిగా దేవునియొక్క ప్రణాళికను కనుగొనగలము.

"నీవు వెళుతున్నప్పుడు, అడుగు తరువాత అడుగు, నేను నీ ముందు మార్గం తెరుస్తాను" అనునది ప్రభువు వాగ్ధానం (సామెతలు 4:12 వివరణ).

ఏదైనా ఒక విషయములో దేవుని చిత్తమును గూర్చి సందేహములో ఉన్నప్పుడు మనలను మనము ఈ 12 ప్రశ్నలు అడుగుకొనుట ఎంతో మంచిది. మనం నిజాయితిగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్తున్నప్పుడు, దేవుని చిత్తం అంతకంతకు మనకు స్పష్టమవుతుంది.

1. నాకు తెలిసినంతవరకు ఇది యేసుప్రభువుయొక్క బోధకు, అపొస్తలులయొక్క బోధకు, క్రొత్తనిబంధన ఆత్మకు విరుద్ధంగా ఉందా?

2. దాన్ని నేను నిర్మలమైన మనసాక్షితో చేయగలనా?

3. దాన్ని నేను దేవుని మహిమార్థమై చేయగలనా?

4. దాన్ని నేను యేసుప్రభువుతో సహవాసం చేస్తూ చేయగలనా?

5. నేను దాన్ని చేస్తుండగా, నన్ను దీవించమని దేవున్ని అడగగలనా?

6. దాన్ని చేయడం నా ఆత్మీయ పదునును ఏ విధంగానైనా పోగొడుతుందా?

7. నాకు తెలిసినంతవరకు అది ఆత్మీయంగా లాభకరమైనది క్షేమాభివృద్ధి కలుగజేసేదా?

8. యేసుప్రభువు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు, నేను దాన్ని చేస్తూ ఉంటే, సంతోషిస్తానా?

9. జ్ఞానవంతులైన, పరిణితి చెందిన సహోదరులు దానిని గూర్చి ఏమనుకుంటున్నారు?

10. నేను చేయాలనుకొంటున్న ఈ పనిని నేను చేయడం ఇతరులకు తెలిస్తే అది దేవుని నామానికి అవమానం తెస్తుందా? లేక నా సాక్ష్యాన్ని పాడుచేస్తుందా?

11. దాన్ని నేను చేయడం ఇతరులకు తెలిస్తే, వారు అభ్యంతరపడతారా(తొట్రిల్లుతారా)?

12. దాన్ని చేయడానికి నా ఆత్మలో నాకు స్వేచ్ఛ ఉన్నదా?

అనేకసార్లు మనకు దేవుని చిత్తము స్పష్టముగా తెలియకపోయినప్పటికీ మనము ముందంజ వేయవలసి ఉంటుంది. మనము విశ్వాసమును బట్టి నడచుటకు కావలసిన క్రమశిక్షణలో ఇది కూడా ఒక భాగమే. నిశ్చయత అనేది కొన్నిసార్లు 'చూచి నడచుటకు' సమానముగా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు స్పష్టమైన నిశ్చయతనిస్తాడు. కాని మరికొన్నిసార్లు మనకు ఆయన ఆమోదము అంత స్పష్టముగా తెలియకపోయినా మనము ముందుకు సాగిపోవాలని ఆయన ఆశిస్తాడు. మనకు తెలిసినంతవరకు, ప్రార్థనలో ప్రభువుకొరకు ఎదురుచూచి మరియు పరిశుద్ధాత్ముని యొక్క మనస్సుని అర్థం చేసుకొని, అనిశ్చితముగా ఎదురుచూడకుండా మనము ముందుకు సాగిపోవాలి.

ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. "దేవుడు మనలను నడిపించునని మనము ప్రణాళికలు వేసుకోవాలి" (సామెతలు 16:9 లివింగ్ బైబిల్). తరువాత, ఆ నిర్ణయములను మనము వెనుకకు తిరిగి చూచుకొన్నట్లయితే, మనకు అంత స్పష్టముగా తెలియకపోయినప్పటికీ దేవుడు మనలను తప్పుదారిలోనికి పోనీయలేదని కనుగొంటాము. మరొక విధముగా చెప్పాలంటే నేననుకొనుచున్న అంశములో మొదట ఎంతో అనిశ్చితి ఉన్నప్పటికీ, చివరకు ఎంతో నిశ్చయత మరియు సంతోషము కలుగుతుంది.

మనం చిత్తశుద్ధితో, అనిశ్చితి పరిస్థితిలో మనం ఒక నిర్ణయం తీసుకొని దేవుని సంపూర్ణ చిత్తము నుండి మనము తొలగిపోయినట్లయితే, మనలను మరలా సరియైన మార్గములోని తీసుకొనివచ్చుటకు దేవుని నమ్మవచ్చు. "దేవుని మార్గమును విడచి తప్పు దారిలో వెళ్ళినట్లయితే, నీ వెనుక ఒక స్వరము విందువు, అది కాదు, ఇది మార్గము; దీనిలో నడువుము" అని యెషయా గ్రంథములో మనకొక వాగ్ధానమున్నది(యెషయా 30:21 లివింగ్ బైబిల్).

మనము ఆయన చిత్తము తప్పిపోయినప్పుడు దేవుడు మన ప్రణాళికను మార్చుటకు పరిస్థితులను ఆదేశిస్తాడు. కాని ప్రతిదానికి ఏదో ఒక వింతైన నడిపింపు కలిగియుండాలని మనము అనిశ్చితంగా కూర్చొనకూడాదు. నడుస్తున్న ఓడ దిశ మార్చడం సులభంగాని నిలబడియున్న దాని దిశను మార్చడం అతి కష్టం. మన విషయంలో కూడా అంతే.

అపో.కా. 16:6-10లో ప్రభువుయొద్ద నుండి స్పష్టమైన నడిపింపు రావడం వల్ల కాదు గాని ఆయన చిత్తమును చేద్దామనే ఉద్దేశ్యముతో పౌలు మరియు సీలలు ఆసియాకు వెళ్ళుటకు ప్రయత్నించారు. బహుశా దేవుడనుమతించిన పరిస్థితులను బట్టి వారు ఆటంకపరచబడ్డారు. తరువాత వారు బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించారు. మరలా వారి మర్గము మూసివేయబడినది. కాని వారు దేవుని చిత్తము కొరకు క్రియాపూర్వకముగా చూస్తూ మరియు ఆయన నడిపింపుకొరకు ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి ఎదురు చూచుటలేదు గనుక చివరకు తన చిత్తములో ఉన్న ప్రదేశమైన మాసిదోనియకు దేవుడు వారిని నడిపించాడు.

జీవితములోని చిన్నచిన్న విషయములలో, నడిపింపు అనేది ఎల్లప్పుడు గ్రహింపు కలిగి విచారణ చేయవలసిన విషయము కాదు. ఇది ఆత్మలో నడకకు సంబంధించిన విషయము. దేవునితో ఉన్న సరియైన సంబంధం, సరియైన పనులు చేయుటకు దారితీస్తుంది. ఇటువంటి చిన్న విషయములలో, దేవుని నడిపింపు అనేది మనము ఎల్లప్పుడు గ్రహింపు కలిగియుండవలసిన విషయము కాదు. మనము దీని గురించి గ్రహింపు కలిగియుండకపోవచ్చు. నడిపింపు కొరకు మనకు దేవునితో ఉన్న ప్రాధమిక సంబంధమే ప్రాముఖ్యమైనది. నడిపింపు అనేది ఒక ఆత్మీయమైన సంగతే కాని యాంత్రికమైనది కాదు.