WFTW Body: 

మనమెప్పుడు బలహీనులమో అప్పుడే మనం నిజముగా బలవంతులముగా ఉందుము (2కొరింథీ 12:10).

అబ్రాహాము తన సహజమైన శక్తితో ఇష్మాయేలును కనెను, కాని దేవుడు ఇష్మాయేలును అంగీకరించక అతడిని పంపించి వేయమని అతడితో చెప్పెను (ఆది 17:18-21; 21:10-14). క్రీస్తు తీర్పు సింహాసనం యెదుట దేవునిపై ఆధారపడకుండా మనం మంచి ప్రయత్నముతో మానవ సామర్థ్యముల ద్వారా తయారు చేసిన వాటిని పెట్టినప్పుడు, అది కూడా అంగీకారము కాదని ఆయన చెప్పును. ఆ కర్ర, గడ్డి మరియు కొయ్యకాలులన్నియు బూడిదైపోవును.

’దేవుని ద్వారా’ చేసినది మాత్రమే నిలుచును.

అబ్రాహాము నపుంసకత్వపు స్థితికి వచ్చినప్పుడు బిడ్డలను పుట్టింపగలిగిన తన సహజ సామర్థ్యము ఇంక లేనప్పుడు, దేవునిశక్తి ద్వారా ఇస్సాకు పుట్టెను. ఆ కుమారుడు దేవునికి అంగీకారమయ్యెను.

దేవునికి సంబంధించినంత వరకు, ఒక ఇస్సాకు వేయిమంది ఇష్మాయేలుల కంటే ఎక్కువ విలువైన వాడు. అగ్నితో పరీక్షించిన తరువాత ఒక గ్రాము బంగారము ఒక కేజీ కర్ర కంటె ఎంతో విలువైనదిగా ఉండును. పరిశుద్ధాత్మ శక్తితో చేసిన కొద్దిపని మన స్వంత శక్తితో చేసిన ఎంతో గొప్పపని కంటె విలువైనది.

మనం క్రీస్తులోనికి మార్పుచెందక ముందు మార్పు చెందిన తరువాత కూడా మనం చేసిన మంచి క్రియలు మరియు ప్రభువును సేవించుటకు మనం చేసిన స్వంత ప్రయత్నములన్నీ ఎప్పటికీ మురికి గుడ్డలుగా ఉన్నవి. కాని విశ్వాసము ద్వారా పొందిన నీతి, పరిశుద్ధాత్మపై ఆధారపడుట ద్వారా చేసిన సేవ, గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవమున మనకు వివాహ వస్త్రముగా తయారగును (ప్రకటన 19:8). ఎంతటి వ్యత్యాసము - మురికి గుడ్డలు లేక సుందరమైన వివాహ వస్త్రములు. ఇదంతా మన జీవితము మానవ శక్తితో జీవించామా లేక దేవుని శక్తితో జీవించామా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

యేసు ఆయన పరిచర్య కొరకు కూడా ఆత్మ యొక్క శక్తిపై ఆధారపడెను. ఆయన మొదట పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడకుండా బోధించు పరిచర్యలోనికి వెళ్లుటకు ధైర్యము చేయలేదు. ఆయన మొదటి ముప్పది సంవత్సరములు సంపూర్ణమైన పరిశుద్ధ జీవితమును, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా జీవించెను. కనుకనే తండ్రి "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" (మత్తయి 3:17) అని సాక్ష్యమిచ్చెను. అయినప్పటికిని పరిచర్య కొరకు ఆయన అభిషేకింపబడవలసి ఉన్నది. ఆయన అభిషేకింపబడుటకు ప్రార్థించెను, మరియు ఆయన అభిషేకింపబడెను (లూకా 3:21). జీవించిన ఏ మానవుని కంటె ఆయన ఎక్కువగా నీతిని ప్రేమించి పాపమును ద్వేషించుట చేత, ఆయన ప్రతి మానవుని కంటే ఎక్కువ సమృద్ధిగా అభిషేకింపబడెను (హెబ్రీ 1:9). దాని ఫలితముగా, ఆయన పరిచర్య ద్వారా జనులు సాతాను యొక్క బంధకముల నుండి విడిపింపబడిరి. ఇది అభిషేకము యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము మరియు ప్రాథమికమైన ప్రత్యక్షత (లూకా 4:18, అపొ.కా. 10:38).

దేవుని కార్యము మానవుని ప్రతిభను బట్టి మరియు సామర్థ్యాలను బట్టి జరుగదు. సహజంగా మంచి వరములున్నవారు క్రీస్తులోనికి మారినప్పుడు, వారికుండిన తెలివితేటలు, ఉద్రేకములతో కూడిన వారి శక్తులను, ఇతరులను దేవుని యొద్దకు తెచ్చునట్లు ఉపయోగించవచ్చునని సాధారణంగా తలంచుదురు.

చాలా మంది క్రైస్తవులు వారి యొక్క వాగ్దాటి, తర్కము మరియు మంచిగా మాట్లాడే విధానము పరిశుద్ధాత్మ యొక్క శక్తి అని పొరబడుచుందురు. కాని ఇవన్నీ కేవలము మానవునిలో ఉండు మానసిక శక్తులు, వీటిపై ఏ మాత్రము ఆధారపడినా అవి దేవుని సేవకు ఆటంకముగా ఉండును. మానవుని మానసిక శక్తి ద్వారా జరిగిన పని ఎప్పుడూ శాశ్వతమైనది కాదు. అది ఇప్పుడు కాకపోతే కొంతకాలమైన తరువాత లేక క్రీస్తు న్యాయసింహాసనం యెదుట నాశనమైపోవును.

యేసు ప్రజలను దేవుని వైపు కదలించుటకు వాగ్దాటి లేక ఉద్రేకముల యొక్క శక్తిపై ఆధారపడలేదు. అటువంటి మానవ శక్తితో చేయబడిన పని, ఆయన యొద్దకు వచ్చు వారి మనస్సునే తాకును కాని వారికి ఆత్మీయముగా ఎన్నడూ మేలు చేయదని ఆయనకు తెలుసు. అందుచేతనే దేవుని యొద్దకు ప్రజలను రాబట్టుటకు ఆయన ఏ విధమైన సంగీత వినోదమును వాడుకొనలేదు.

ఆయన తన మాటలు వినుటకు వచ్చిన వారిని భావోద్వేగపరచి, ఉద్రేకముతో దేవునికి వారిని వారు అప్పగించుకొనేలా చేయలేదు. నిజానికి, ఆయన ఈనాటి సువార్తికులు మరియు బోధకులు సాధారణంగా ఉపయోగించే ఇటువంటి పద్ధతులను లేక వేరొక మానసిక పద్ధతులను ఉపయోగించలేదు. ఆయన ఉద్రేక పూరిత భావములను మరియు మానసిక తీవ్రతను ప్రజలపై ప్రభావము చూపుటకు ఉపయోగించ లేదు. ఇవి రాజకీయ నాయకుల మరియు వస్తువులను అమ్ము వారి యొక్క పద్ధతులు, ఈ రెండింటిలో ఆయన దేనికీ సంబంధించినవాడు కాదు.

యెహోవా సేవకునిగా, యేసు పూర్తిగా ఆయన ప్రయాసమంతటిలో పరిశుద్ధాత్మపై ఆధారపడెను. దాని ఫలితముగా ఆయనను వెంబడించిన వారు దేవునిలో లోతైన జీవితములోనికి వచ్చారు.

ఇతరులు తన యొక్క ఆలోచనా ధోరణిలోనికి వచ్చునట్లు యేసు మానసిక శక్తిని ఉపయోగించలేదు. యేసు ఎప్పుడూ తనను తాను ఇతరులపై రుద్దలేదు. ఆయనెప్పుడూ ఇతరులకు కావాలనుకుంటే ఆయనను తిరస్కరించు స్వేచ్ఛ నిచ్చెను. మానసికమైన క్రైస్తవనాయకులు ఎప్పుడూ వారి గుంపుపై మరియు వారి సహచరులపై తమ యొక్క బలమైన వ్యక్తిత్వముతో అధిపత్యం చెలాయించుదురు. ప్రజలు అటువంటి నాయకులకు భయముతో(ఆశ్చర్యముతో) లోబడుదురు మరియు వారిని ఆరాధించి వారి ప్రతి మాటకు విధేయత చూపుదురు.

సమూహములు ఇటువంటి నాయకుని చుట్టూ చేరవచ్చును మరియు వారందరు ఐకమత్యముగా కూడా ఉండవచ్చును. కాని అది ఒక నాయకుని యెడల ఉండిన అంకితభావము వలన కలిగిన ఐక్యత మాత్రమే. ఆత్మ సంబంధమైనదేదో ప్రకృతి సంబంధమైనదేదో తెలియక పోవుట వలన అటువంటి నాయకులు వారికుండినది పరిశుద్ధాత్మ శక్తి అని వారిని వారే భ్రమపరచుకుంటారు. వారిని అనుసరించువారు కూడా అదే విధముగా మోసపోవుదురు. కాని క్రీస్తు యొక్క తీర్పు సింహాసనపు తేటయైన వెలుగు, అదంతా మానసిక శక్తి అని, అది దేవుని కార్యమునకు ఆటంకముగా ఉన్నదని బయల్పర్చును.

యేసు అటువంటి నాయకుడు కాడు. అలాగే ఏ క్రైస్తవుడు కూడా అలా ఉండకూడదు. మనం అటువంటి మానసికశక్తిని ఉపయోగించుటకు భయపడవలెను ఎందుకంటే అది మానవుని యెడల దేవుని చట్టములను అతిక్రమించుచున్నది మరియు అది ఆయన సేవకు ఆటంకముగా ఉన్నది.

నిజమైన ఆత్మీయకార్యము మానవశక్తితో జరుగదు, కాని కేవలము పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే జరుగును. యేసుకు ఇది తెలియును; కాబట్టే ఆయన తన మానసిక శక్తిని మరణింపచేసెను. అందుచేతనే ఆయనను వెంబడించిన వారిలో చాలా తక్కువ సమయములో లోతైన మరియు నిలిచియుండే కార్యమును చేసెను.