WFTW Body: 

"మా జీవితపు దినములు త్వరలో గతించిపోతాయి, మేము ఎగిరిపోతాము. కాబట్టి మీరు మాకు జ్ఞాన హృదయాన్ని అందించేలా మా రోజులను లెక్కించడానికి మాకు నేర్పండి" (కీర్తన 90:2,4,10,12 వివరణ).

మనం మరొక సంవత్సరాంతాన్ని సమీపిస్తున్నాము. ఈ భూమిపై మన సమయం ఎంత తక్కువగా ఉందో, జీవితంలోని ప్రతి క్షణం ఎంత ముఖ్యమైనదో ఈ కీర్తనలోని పదాల ద్వారా గుర్తుచేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.

మీరు కొత్త సంవత్సరంలో రాబోయే దారి గురించి ఆలోచిస్తున్నప్పుడు, జీవించడానికి నాలుగు సులభమైన రహదారి నియమాలు ఇవి:

1. రెడ్(ఎర్ర) లైట్ల వద్ద ఆగు

మనకు పచ్చని లైట్లు మాత్రమే ఉన్నాయని భావించి జీవితాన్ని హడావిడిగా గడపడం మన ధోరణి. దానికి బదులుగా, మనం నిర్ణయం తీసుకోవలసిన కూడలికి వచ్చినప్పుడల్లా, అక్కడ ఆగి దేవుణ్ణి అడగాలి. ఏ మార్గాన్ని కొనసాగించాలో చూపమని మనం ఆయనను అడిగితే, ఆయన వెళ్ళవలసిన దారులను ప్రత్యుత్తరంగా ఇస్తాడు (యెషయా 30:21 చదవండి) మరియు మన ముందున్న మార్గాన్ని తిన్నగా చేస్తాడు (సామెతలు 3:6). మరోవైపు, దేవుడు లైట్‍ను ఆకుపచ్చగా మార్చే వరకు మనం వేచి ఉండకపోతే, మనం ప్రమాదంలో పడతాము.

2. గ్రీన్(ఆకుపచ్చ) లైట్ల వద్ద ఆగవద్దు

మనల్ని మనం తిరస్కరించుకొని, మన సిలువను ఎత్తుకుని యేసును అనుసరించడానికి మనకు లభించే ప్రతి అవకాశం ఒక ఆకుపచ్చ(గ్రీన్) లైట్. మనం వేచి చూడక ఖచ్చితంగా సాగిపోవాలి. ఎవరితోనైనా సంబంధాలను సరిచేయడానికి వంతెనను నిర్మించగల ప్రతి పరిస్థితి ఒక గ్రీన్ లైట్, మనం వేచి ఉండకుండా దాని గుండా వెళ్ళాలి (రోమా 12:18). 'సమాధాన పరచువారిగా' ఉండటమే మనం క్రీస్తులో నూతనంగా తయారయ్యాము అనడానికి ఒక రుజువు (2కొరింథీ 5:17-20). ఎవరికైనా క్షమాపణ చెప్పడానికి, విషయాలను సరిదిద్దడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు, మన అహంకారం కారణంగా లేదా మనల్ని మనం సమర్థించుకోవడం ద్వారా లేదా అవతలి వ్యక్తిని నిందించటం ద్వారా ఆలస్యంచేస్తే - అది గ్రీన్ లైట్‍లో ముందుకు వెళ్ళనట్లు అవుతుంది. మనం ట్రాఫిక్‍ను అడ్డుకుంటాము, చివరకు ప్రమాదానికి గురవుతాము. దానికి బదులుగా, సమాధానపరచు వారిగా ఉండాలనే గ్రీన్ లైట్ ద్వారా మనం ఎల్లప్పుడూ త్వరగా వెళ్దాం (మత్తయి 5:9).

3. రోడ్డు నుండి పక్కకు తొలగవద్దు

మనం దేవునితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, అపవాది నిరంతరం మనల్ని రోడ్డు మీద నుండి పక్కకు తొలగించడానికి ప్రయత్నిస్తుంటాడు. మనల్ని దారి తప్పించడానికి, ఇతర వ్యక్తుల అభిప్రాయాలు అనే అనేక పూలు, చెట్లు రహదారి పక్కన ఉన్నాయి. ఇతరులను సంతోషపెట్టాలనే కోరికను లేదా వారు మన గురించి ఏమనుకుంటారో అనే భయాన్ని మన దృష్టిని మరల్చడానికి అనుమతించినట్లయితే (గలతీ 1:10), అప్పుడు మనం త్వరలోనే రహదారి నుండి పక్కకు తొలగిపోతాము. మా తండ్రి నాతో తరచు ఇలా చెప్తుండెవాడు, "నీకు ప్రజలను ఆకట్టుకోవటం లేదా వారిని ఆశీర్వదించటం అనే ఎంపికలు ఉన్నాయి. ఎల్లప్పుడు వారిని ఆశీర్వదించుటకు ఎన్నుకో". ప్రజలను ఆకట్టుకోవడానికి మీరు ప్రతిభావంతులుగా ఉండాలి - "మీరు" ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అయితే మీరు వారికి నిజంగా సహాయం చేయాలనుకుంటే, మీకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం - ఆపై "మీరు" ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది (యోహాను 3:30).

4. మీ వరుసలోనే ఉండండి

దురదృష్టవశాత్తు, చాలా మందికి రహదారిపై గుర్తించబడిన వరుసలలో ఉండకపోవడం అనే అలవాటు ఉంది, ఇది తరచుగా ప్రమాదాలకు దారి తీస్తుంది. మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు మన రక్షణ కోసం దారులు గీశాడు. మన వరసలో ఉండటం అంటే ఎల్లప్పుడు మన పని మనం చూసుకోవడం (1థెస్స 4:11-12) మరియు ఇతరుల విషయాలలో కలుగజేసుకోకపోవడం (2థెస్స 3:11; 1పేతురు 4:15). మనకు సంబంధంలేని విషయాలలో మనం జోక్యం చేసుకున్నప్పుడు, అది మన గీతను దాటి వేరకరి వరుసలోనికి ప్రవేశించినట్లే. ఇది చివరికి మన స్వంత జీవితాన్ని అలాగే మన చుట్టూ ఉన్న ఇతరుల జీవితాలను దెబ్బతీస్తుంది.

చివరగా: ఈ ప్రయాణంలో మనం నెమ్మదిగా, ఈడ్చుకుంటూ ప్రయాణించవద్దు. దానికి బదులుగా, పరలోక బహుమతిని గెలుచుకోవడానికి పూర్తి వేగంతో ప్రయాణం చేద్దాం (1కొరింథీ 9:24)!.

ప్రతిరోజు దేవుని గొప్ప ఆశీర్వాదంతో నిండిన నూతన సంవత్సరాన్ని మీ అందరి కొరకు మేము కోరుకుంటున్నాము.