WFTW Body: 

తన నిస్సహాయతను శూన్యత్వమును ఎరిగిన విరిగి నలిగిన హృదయమే దేవునికిష్టమైన బలి(కీర్తనలు 51:17). ఇటువంటి హృదయమును హేబెలు కలిగియున్నాడు కాని కయీను కలిగిలేడు. అందుకనే యెహోవా హేబెలును (లక్ష్యపెట్టెను కాబట్టి) అతని అర్పణను లక్ష్యపెట్టెను, కాని కయీనును (లక్ష్యపెట్టలేదు కాబట్టి) అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు (ఆదికాండము 4:4,6) అని వ్రాయబడియున్నది.

విశ్వాసము అనగా ఆత్మవిషయములో నిస్సహాయముగా దేవునిమీద ఆధారపడుట. విశ్వాసమును బట్టి హేబెలు కయీనుకంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను (హెబ్రీ 11:4). కాబట్టి హేబెలు యొక్క అర్పణలు దేవునికి అంగీకారయోగ్యముగా ఉండెను.

కయీను హేబెలు మధ్యనున్న వ్యత్యాసము, హేబెలు రక్తము నర్పించెను మరియు కయీను అర్పించలేదు అన్న బోధలో గొప్ప మోసము ఉన్నది. అటువంటి బోధయొక్క అనువర్తన ఏమిటంటే ఒక మనుష్యుడిని దేవునియెదుట అంగీకారయోగ్యముగా చేయునది అతడు దేవుని ఎదుట యేసు రక్తమును తెచ్చుట అనునది. ఆ మనుష్యుడు ఎలా జీవించుచున్నాడో మరియు అతని హృదయముయొక్క స్థితికి (అది విరిగి నలిగినదో కాదో లేక విశ్వాసమున్నదో లేదో) ఎటువంటి ప్రాముఖ్యత లేనట్టుగానున్నది. అతడు ఒక మంత్రంవలే యేసురక్తమును జపిస్తే అతడు దేవుని యెదుట అంగీకారమును పొందును. ఇది ఒక అబద్ధము. మరియు అనేకులు దానిచేత మోసగింపబడుచున్నారు.

యేసుప్రభువు రక్తము ఎవరు పడితే వారు తమకు చెందినదానిగా చెప్పుకోలేరు. యేసుయొక్క రక్తము ఎవరుపడితే వాళ్ళను తమ పాపములనుండి పరిశుద్ధపరచునని లేఖనములలో చెప్పబడలేదు. అది లేఖనములను నిగూఢముగా వక్రీకరించుట. లేఖనము ఏమి చెప్పుచున్నదంటే 'దేవుడు వెలుగులోనున్న ప్రకారము వెలుగులో నడచు వారినందరిని యేసు రక్తము పరిశుద్ధపరచును' అని చెప్పుచున్నది (1యోహాను 1:7). దేవుని వెలుగులో నడవాలంటే హేబెలుకు ఉండినట్లు ఒకడు విరిగి నలిగిన హృదయమును కలిగియుండవలెను. అప్పుడు మాత్రమే ఒకరి అర్పణ దేవునికి అంగీకారయోగ్యముగా ఉండును.

ఒక వ్యక్తి యేసుప్రభు రక్తమును నమ్ముచున్నానని చెప్పుచు ఒక గర్వించే అహంకారము కలిగిన ఆత్మను కలిగియున్నయెడల కయీనును ఎదిరించినట్లే దేవుడు అతనిని ఎదిరించి వ్యతిరేకించును (1పేతురు 5:6). దీనులు మాత్రమే దేవునియొద్దనుండి కృపను పొందెదరు (యాకోబు 4:6).

మన ఆరాధన, ప్రార్థన, పరిచర్య అను అర్పణలు ఒక విరిగినలిగిన విశ్వాసముతో కూడిన (దేవుని మీద దీనత్వముతో ఆధారపడు) హృదయము నుండి వచ్చునప్పుడు మాత్రమే అవి దేవునికి అంగీకారయోగ్యమగును. దేవుడు చూచేది మన మాటలయొక్క అనర్గళతను మరియు మన పరిచర్యయొక్క సమర్థతను కాదుగాని, మన హృదయములయొక్క వైఖరిని. ఆదికాండము 4వ అధ్యాయము నుండి మనము నేర్చుకొనగలిగిన మొదటి పాఠము ఇదే.

కయీను మరియు హేబెలు దినములనుండి అంత్యకాలము వరకు ఒక విరిగి నలిగిన ఆత్మయే దేవునికిష్టమైన బలిగానున్నది. ఆయన మారనివాడు. ఆయన నియమము అదే విధముగా నుండును.

ఒకవేళ కయీను ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి దాని రక్తమును చిందించినా కూడా, అతని హృదయము గర్వముతో హెచ్చింపబడియుండెను గనుక దేవుడు అతనిని అంగీకరించేవాడు కాదు.

దీనత్వముతోకూడిన హృదయమే రక్షణకు మొదటిమొట్టు. అప్పుడు మనము వెలుగులోకి వచ్చి మన పాపములన్నిటినుండి మనలను పవిత్రులుగా చేయుటకు యేసుప్రభువుయొక్క రక్తము కొరకు అడుగవచ్చును.

హృదయములో దీనులుగా ఉన్నవారు మాత్రమే పౌలుయొక్క విజయ ఆర్భాటమును ఆర్భాటించగలరు, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు? (రోమా 8:31). ఎందుకనగా దేవుడు దీనుల పక్షమున మాత్రమే ఉండును. గర్విష్టులు ఆ మాట చెప్పలేరు. ఎందుకనగా దేవుడు వారికి విరోధియైయున్నాడు. కయీనుకుండినట్లు తన గురించి తాను గొప్ప తలంపులను కలిగియుండువాడు యేసు రక్తము తనదిగా చెప్పుకొనినను చివరకు కయీనువలె తయారగును. మోసపొకుడి, దేవుడు వెక్కిరించబడడు (గలతీ 6:7). మరియు ఆ నియమము పక్షపాతము లేకుండా సార్వత్రికంగా అందరికీ వర్తించును.