WFTW Body: 

రాబోయే కాలములో దేవుడు మీ కొరకు పరిచర్య కలిగియున్నాడు. గనుక మీరు ఎల్లప్పుడు దీనత్వములో నిలచియుండి, ఏ పరిస్థితిలోనైనను మిమ్ములను మీరు సమర్థించుకొనక, ఎల్లప్పుడు దేవునిసహాయం కొరకు మొఱ్ఱపెట్టుచు మరియు మీలో ఉన్న నటనంతయు ద్వేషించుచు మీరు సిద్ధపడుడి.

నీతిని వెదకువారందరును పరిసయ్యుతత్వములోను మరియు ఆత్మీయ గర్వములోను పడిపోవు ప్రమాదమున్నది. కాబట్టి ఈ రెండు చెడ్డ విషయములు అందరిలోను ఉన్నవి. ఇవి మనకు దూరముగా లేవు. వీటిని ఇతరులలో చూచుట చాలా సులభము కాని మనలో ఉన్న వీటిని కనుగొనుట చాలా కష్టము. అనేకమంది యౌవనస్థులు కృత్రిమముగా ఉండుటద్వారా ఆత్మీయమరణమును పొందెదరు.

నీవు పోరాడుచున్న అనేక విషయములలో పాపము సంపూర్ణముగా చంపబడునట్లు నీవు పనిచేయవలెను. పైకి జయముగా కనబడే దానితో తృప్తిపడకూడదు. ప్రతి కోరిక ఒక ఉల్లిపాయవలె ఉన్నది. ఇందులో అనేకపొరలు ఉండును. నీవు పైనున్న పొరను తీవ్రముగా తీసివేయనియెడల, దాని క్రిందనున్న పొరను చూడలేవు. పరిశుద్ధత అనగా జీవితకాలమంతయు యేసువలె ఆయన చూచిన విధముగా చూచుట, సిరిసంపదలను ఆయన చూచిన విధముగా చూచుట, ఆయన తన యొక్క శత్రువులను చూచిన విధముగా మీరు మీ శత్రువులను చూచుట మొదలగునవి. ఆ గురియొద్దకు చేరుటకు జీవితకాలమంతయును పట్టును. కాని ఆ గురియొద్దకు వెళ్ళుటకు మీరు ప్రయత్నించవలెను. ఈ క్రింద వచనములలో ఉన్న అర్థము ఇదియే, "సంపూర్ణులమవుటకు సాగిపోదుము" (హెబ్రీ 6:1), మరియు "ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును" (1 యోహాను 3:3), మరియు "సహోదరులారా, నేనిది పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహూమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను" (ఫిలిప్పీ 3:13,14). నీవు ఈ పోరాటమును విడచినట్లయితే శత్రువు జయించే అవకాశము ఉన్నది. 1 పేతురు 4:1,2 చెప్పిన రీతిగా మీరు ఎల్లప్పుడు "శరీరములో శ్రమపడుచున్నయెడల" అనగా రహస్యముగా మీ స్వజీవమును ఉపేక్షించుకొనుచున్నయెడల, మీరు పాపము చేయుట మానెదరు.

ఇతరులకు రాని శోధనలు నీకు వచ్చునని నీవు ఎప్పుడైనను తలంచవద్దు. ఈ అబద్ధము ద్వారా అపవాదిచేత మోసగించబడవద్దు. ఎందుకనగా అది నిన్ను నిరాశపరచును.

1 కొరింథీ 10:13లో "సాధారణముగా మనుష్యులందరికి కలిగే శోధనలే మనకు వచ్చును. కాని దేవుడు తన వాగ్దానము నెరవేర్చును. మరియు నీ శక్తికి మించిన శోధన ఆయన నీకు అనుమతించడు. కాని శోధన వచ్చినప్పుడు దానికి జయించుటకు శక్తిని (కృప) నిచ్చును మరియు నీవు ఆ విధముగా తప్పించుకొనెదవు. తప్పించుకొనలేని శోధన రాదు" (గుడ్‍న్యూస్ బైబిలు మరియు లివింగు బైబిలు).

సాధారణముగా మనుష్యులందరు తమ స్వచిత్తమును చేయవలెని శోధించబడెదరు. పాపములో అనేక విషయములు ఉండును. అబద్ధము చెప్పుటగాని లేక కోపించుటగాని ఇతరులను ద్వేషించుటగాని సణుగుటగాని, వ్యభిచరించుటగాని లేక ఏ పాపమైనను దేవుని చిత్తము కాక తమ స్వచిత్తమును చేయుటకు శోధించబడెదరు. కాని ఆయన దేవుని సహాయము కొరకు ప్రార్థించి శోధనను ఎదిరించాడు (హెబ్రీ 5:7). కాబట్టి ఆయన ఒక్కసారి కూడా పాపము చేయలేదు (యోహాను 6:38). ఆయన మాదిరిని మనము వెంబడించవచ్చును.

కాబట్టి పాపములన్నియు వేరువేరుగా ఉన్నవని చూడవద్దు. కొందరు ఒక విషయంలో శోధించబడుదురు మరియు ఇతరులు వేరొక విషయములో శోధింపబడురు. కాని ప్రతిసారి, తమ స్వంత చిత్తముచేయుట ద్వారానే పాపము చేయుదురు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శరీరేచ్ఛలను అనగా స్వచిత్తమును చంపివేయుటకు దేవునికి ప్రార్థించుము (రోమా 8:30 మరియు గలతీ 5:25).

ప్రభువైన యేసు యెడల భక్తిశ్రద్ధలు కలిగియుండుటద్వారా జయించగలము మరియు ఆ విధముగా అన్ని సమయములలో కాపాడబడుదుము. ఎల్లప్పుడు మీరిట్లు చెప్పవలెను, "నిన్ను తప్ప భూమిమీద మరిదేనిని కోరుకొనను" (కీర్తన 73:25). ప్రభువైన యేసు యెడల ఉన్న ప్రేమ నీ హృదయములోనుండి ఇతర ప్రేమలను మరియు దురాశలను వెళ్ళగొట్టును. మీరిట్లు చెప్పాలి, "నేను ఎల్లప్పుడు ప్రభువును నా యెదుట ఉంచుకొనుచున్నాను (యోసేపు చెప్పినట్లుగా అప్పుడు పాపము చేయుటకు భయపడుదుము) మరియు ఆయన ఎల్లప్పుడు నా కుడి పార్శ్యమున ఉన్నాడు (నేను పాపము చేయకుండా నాకు కృపనిచ్చుటకు)" (కీర్తన 16:8). ఎల్లప్పుడు జయించుటకు ఇదియే రహస్యము.