వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   Struggling పునాది సత్యము శిష్యులు
WFTW Body: 

ఈ ముఖ్యమైన సత్యమును ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొనవలెను: పాతనిబంధనలోని వచనాలను భర్తీ చేసే ఏదైనా కొత్తనిబంధన సత్యం ఉందో లేదో అని తనిఖీ చేయాలి. ఉదాహరణకు, గొఱ్ఱెలను చంపుటను దేవుని గొఱ్ఱెపిల్ల మనకొరకు చంపబడుట భర్తీ చేసింది. అదే విధముగా, సాతాను మరియు అతని దూతలు కల్వరిలో ఓడించబడని సమయములో దానియేలు ప్రార్థించాడు. అందుకే మూడు వారములు (ఉన్నత స్థలములలో) సాతానుతో పోరాటం జరిగింది (దానియేలు 10:12,13). కాని మనం సాతాను సిలువమీద ఓడించబడిన తరువాత జీవించుచున్నాము. కాబట్టి ఇప్పుడు మనం అతనితో మూడువారములు పోరాడవలసిన అవసరము లేదు. క్రీస్తు జయములో మనం నిలబడాలి. ఈ సత్యాన్ని చాలా కొద్దిమంది మాత్రమే బోధించుచున్నారు.

సిలువ మీద సాతాను ఓడింపబడెనని (నశింపచేయబడలేదు గాని నిరాయుధుడుగా చేయబడెను) కొలస్సి 2:14,15, హెబ్రీ 2:14లో స్పష్టముగా చదువుచున్నాము. కాబట్టి మనము ఈనాడు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని, క్రీస్తుయొక్క జయములో నిలిచియుండి, యేసు నామములో సాతానును ఎదిరించినయెడల సాతాను ఒక్కసారిగా మనవద్ద నుండి పారిపోవును (యాకోబు 4:7). సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడెనని ప్రభువు చెప్పిన రీతిగా అతడు ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగముతో పారిపోవును (లూకా 10:18) (యాకోబు 4:7 ప్రకారము, "మనం ఎదిరించినయెడల సాతాను ఎంత వేగముతో పారిపోవును?" అనే ప్రశ్న బైబిల్ క్విజ్‍లో అడుగుటకు మంచి ప్రశ్న).

కాని ఎల్లప్పుడు మీ పాపములను ఒప్పుకొనుచు (ఎప్పుడైతే మీ మనస్సాక్షి నొచ్చుకొంటుదో) క్రీస్తుయొక్క రక్తములో పవిత్రపరచబడని యెడల, అప్పుడు సాతాను మీద మీకు అధికారముండదు. కాబట్టి ప్రభువు యెదుట మీ పాపములను ఒప్పుకొనుచు పవిత్రమైన మనస్సాక్షి కలిగియుండండి.

దేవుడు ప్రేమించే తండ్రియైయున్నాడు. ఆయనలో ఎల్లప్పుడు మీరు భద్రతను కలిగియుండవలెను. భూసంబంధమైన శ్రేష్టమైన తండ్రి దేవునికి ఒక ఛాయవంటివాడు మాత్రమే. కాబట్టి దేవుడు ఎంత ఎక్కువగా మిమ్మును ప్రేమించుచున్నాడో ఊహించుకొనవచ్చు. ఆయన ప్రేమలో మీరు భద్రత కలిగియుండి మీరు ఆయనను లోతుగా ప్రేమించవలెను. ఆయనకు బాధ కలిగించేవి ఎప్పుడుకూడా చేయవద్దు. అప్పుడప్పుడు మీరు పడిపోయిన యెడల వెంటనే మారుమనస్సు పొంది దుఃఖముతో ఆయన యొద్దకు వచ్చి, ఆయన రక్తం ద్వారా ఎల్లప్పుడు హృదయములను పవిత్రముగా ఉంచుకోవాలి.

అనేకమంది కరిస్మాటిక్ బోధకులు భూసంబంధమైన వాటికొరకు, స్వస్థతకొరకు, మరియు దయ్యములు వెళ్ళగొట్టుటకు కావలసిన విశ్వాసము కలిగియుండమని బోధించిన తరువాత వారికి డబ్బును ఇవ్వమని ఒత్తిడిచేయుదురు. మరికొంత మంది బోధకులు క్రైస్తవులను కేవలం మానసికముగా ఆదరించెదరు గాని దేవునియొక్క వాగ్ధానములను స్వతంత్రించుకొనే విశ్వాసమును కలిగియుండుటను బోధించరు. కాబట్టి ఈ దినములలో "అంతరంగ స్వస్థత", "అనుకూలముగా ఆలోచించుట" మరియు "పితృపారంపర్యమైన పాపములు" మొదలగువాటిని గూర్చిన అనేక తప్పుడు బోధల నుండి జాగ్రత్తగా ఉండి వాటిని తప్పించుకొండి. ఆత్మీయ విషయములలో ఎక్కువగా క్రొత్త నిబంధన పదాలపై ఆధారపడుట మంచిది. దేవుని వాక్యమును ధ్యానించండి అప్పుడు మీరు మోసగింపబడరు.

"భయం" అనేది సాతాను ఉపయోగించే ప్రధాన ఆయుధం. అతడు ఎల్లప్పుడూ దానిని ఉపయోగించును. విశ్వాసులు ఇతరులను భయపెట్టినప్పుడు, బెదిరించినప్పుడు, వారికి తెలియకుండానే వారు సాతానుతో సహవాసం కలిగియున్నారు. ఎందుకంటే వారు సాతాను ఆయుధం వాడుతున్నారు. "దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు"(2తిమోతి 1:7). భయం ఎల్లప్పుడు సాతాను ఆయుధమైయుంది. కావున మనం మనుష్యుల బెదిరింపులకు గాని, మనను భయపెట్టడానికి ఉపయోగించే కుయుక్తులకుగాని భయపడకూడదు. అటువంటివారు విశ్వాసులమని పిలుచుకొనినను, సాతాను అనుచరులైయున్నారు. మన జీవితకాలమంతా నేర్చుకొనవలసిన పాఠం ఇది.